సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్‌లో ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, ANI
సైన్యం అదుపులోకి తీసుకున్న ముగ్గురు పౌరులు మృతి చెందడంపై జమ్ముకశ్మీర్‌లోని పూంచ్, రజౌరీ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ప్రాంతాల్లో జమ్ము కశ్మీర్ అధికార యంత్రాంగం ఇంటర్నెట్‌పై నిషేధం విధించింది.
డిసెంబరు 21న కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో సైనిక వాహనాలపై తీవ్రవాదులు ఆకస్మికంగా దాడి జరపడంతో నలుగురు సైనికులు మృతి చెందారు.
దీనిపై విచారణ జరపడానికి సైన్యం ఘటనాస్థలి సమీపంలోని గ్రామం నుంచి 8 మంది పౌరులను తీసుకువెళ్ళింది. అయితే వీరిలో ముగ్గురు మరణించడంతో, ఆర్మీ అంతర్గత విచారణకు ఆదేశించింది.
సైనికులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ప్రశ్నించేందుకు ఎనిమిది మందిని డిసెంబరు 22 (శుక్రవారం) భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ముగ్గురు తోపాపీర్ ప్రాంతంలో చనిపోయి కనిపించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో ఎక్స్ (ట్విటర్)లో ఆర్మీ ఒక ప్రకటన చేసింది. ‘‘ముగ్గురు పౌరులు మృతి చెందినట్టు రిపోర్టులు అందాయి. దీనిపై విచారణ జరుగుతోంది. విచారణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం’’ అని చెప్పింది.
పూంచ్, రజౌరీలో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ము కశ్మీర్ అధికారులు ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.
రజౌరీ,పూంచ్‌లో కొనసాగుతున్న ఆర్మీ కార్యకలాపాలను సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే జమ్ము చేరుకున్నారు.
మరణించినవారిలో 48 ఏళ్ళ సఫీర్ అహ్మద్, ఆయన సమీప బంధువులు, అదే గ్రామానికి చెందిన 28 ఏళ్ళ మహమ్మద్ షౌకత్, 25 ఏళ్ళ షబీర్ అహ్మద్ ఉన్నారు.
మృతుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగం కల్పిస్తామని జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది.
అయితే వీరు ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
కశ్మీర్‌లోని సీనియర్ రాజకీయ నాయకులు మెహబూబా మఫ్తీ, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఫొటో సోర్స్, @JKPD
ఆర్మీ హింసించిందనే ఆరోపణలు
ఆర్మీ విచారణలోకి తీసుకున్న తరువాత ముగ్గురు పౌరులు మరణించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయని స్థానికులు చెప్పారని ‘ఏపీ’ న్యూస్ ఏజెన్సీ కథనం తెలుపుతోంది. దగ్గరలోని మిలిటరీ క్యాంపుకు వీరిని తీసుకువెళ్ళి, చిత్రహింసలు పెట్టారని స్థానికులు చెప్పారని పేర్కొంది.
మృతదేహాలను పోలీసులకు అప్పగించిన తరువాత మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.
మృతదేహాలపై హింసించిన గుర్తులు ఉన్నాయని కూడా స్థానికులు చెబుతున్నారు.
మిగిలిన ఐదుగురిని ఆర్మీ ఆస్పత్రిలో చేర్చారని, వారిని కూడా తీవ్రంగా హింసించారని బాధితుల కుటుంబాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, బారాముల్లాలో ఆదివారం (డిసెంబర్ 24) ఓ రిటైర్డ్ పోలీసు అధికారిని తీవ్రవాదులు కాల్చి చంపారు.

ఫొటో సోర్స్, ANI
తీవ్ర నిరసన
ముగ్గురు పౌరులు మరణించిన విషయంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముగ్గురు మృతికి సంబంధించినవని చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోలో నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నవారిపై కారం చల్లుతున్న దృశ్యాలు ఉన్నాయి. అయితే ఈ వీడియోలను ఎవరు నిర్థరించలేదు.
సైన్యం అదుపులో ఉన్న ఈ ముగ్గురిని తీవ్రంగా హింసించి చంపినట్టుగా ఉన్న వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయని ‘ది వైర్’ కథనం పేర్కొంది.
జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్ళాల్సి ఉండగా, ఆమెను గృహనిర్బంధంలో ఉంచారని పీడీపీ తెలిపింది.
దీనికి ముందు మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ ట్వీట్ చేశారు.
‘‘ఆకస్మిక దాడిలో ఐదుగురు సైనికులు చనిపోయారు. ఆర్మీ కస్టడీలో ముగ్గురు అమాయకులైన పౌరులు చిత్రహింసలకు గురై చనిపోయారు,ఇంకా చాలా మంది ఆస్పత్రిలో చావుబతుకులమధ్య పోరాడుతున్నారు. ఇప్పడో రిటైర్డ్ ఎస్పీని చంపేశారు. అంతా బావున్నట్టు, సాధారణ స్థితి కొనసాగుతోందంటూ భారత ప్రభుత్వం ఆడుతున్న నాటకం కారణంగా అమాయకులు బలవుతున్నారు’’ అని ఆమె ట్వీట్ చేశారు.
‘‘జమ్ముకశ్మీర్‌లో ప్రతి ఒక్కరి జీవితం ప్రమాదంలో ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు భారత ప్రభుత్వ అబద్ధాలను బట్టబయలు చేస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ప్రతిదీ అణిచివేస్తోంది’’ అని కూడా ముఫ్తీ పేర్కొన్నారు.
తీవ్రవాదానికిమూలకారణమేమిటో కనుక్కోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా భారతప్రభుత్వాన్ని కోరారు.
ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ- ‘‘శాంతిని నెలకొల్పడానికి సాధారణ పరిస్థితులు ఉన్నట్టు చెప్పడం, పర్యటకుల రాకను ప్రోత్సహించడం వల్ల తీవ్రవాదం అంతమవదు. అదింకా సజీవంగానే ఉంది. ఆర్టికల్ 370ను రద్దుచేసి నాలుగేళ్ళు గడిచినా తీవ్రవాదం ఇంకా ఉందంటే దాని మూలకారణమేమిటో కనుక్కోకుండా అది అంతమవదు’’ అని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా- ‘‘ఆర్మీ అదుపులో ముగ్గురు పౌరులు మరణించారనే ఆరోపణలు నిజమే అయితే, భద్రతాదళాల ప్రత్యేక అధికార చట్టం దుర్వినియోగం అయినట్టే లెక్క. ఇప్పుడు మానవహక్కుల ఉల్లంఘన జరిగిన ఏ కేసులోనైనా నిష్పక్షపాత విచారణ జరపాలి’’ అన్నారు.
ఈ ఘటనపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరపాలని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి కూడా ట్వీట్ చేశారు.
‘‘ఆర్మీ కస్టడీలో ముగ్గురు పౌరులు మరణించిన విషయంపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించడం ద్వారా తగిన న్యాయం చేయాలి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి’’ అని సీతారాం ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
ప్రభుత్వం ఏం చెబుతోంది?
జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం ముగ్గురు పౌరులు మరణించిన విషయంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయితే చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయని, బాధిత కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించామని చెప్పింది.
‘‘పూంచ్ జిల్లా బుఫ్లియాజ్ ప్రాంతంలో ముగ్గురు పౌరులు మరణించారనే విషయంలో అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాం. మృతుల కుటుంబాలకు ఉద్యోగాలు కూడా కల్పిస్తాం’’ అని జమ్ము కశ్మీర్ సమాచార, పౌరసంబంధాల విభాగం సోషల్ మీడియాలో తెలిపింది.
ముగ్గురు పౌరులు ఎలా మృతి చెందారనే విషయమై ఆర్మీ కోర్టు ఆఫ్ఎంక్వైరీకి ఆదేశించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
మరోపక్క జమ్ముకశ్మీర్ పోలీసులు పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్ పోలీసు స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు హత్యకు గురయ్యారంటూ కేసు నమోదు చేశారు.
ముగ్గురు పౌరుల మృతి కేసుపై ఆర్మీ అంతర్గత విచారణ చేపట్టింది.
నిజానికి ఈ కేసును పిర్ పంజాల్ రేంజ్‌లోని దక్షిణ ప్రాంతాలకు బాధ్యత వహించే 16వ కార్ప్స్ కమాండ్ విచారణ జరపాల్సి ఉన్నప్పటికీ, ఈ కేసును అక్నూర్ కేంద్రంగా పనిచేసే కమాండ్‌కు అప్పగించారని, నిష్పక్షపాత దర్యాప్తు కోసం జమ్ము కశ్మీర్ పోలీసులు కూడా ఈ కేసు విచారణలో భాగమవుతారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలిపింది.
72 గంటలలోపు ఫాస్ట్ ట్రాక్ విచారణ పూర్తి కావాల్సి ఉంది. అలాగే సైనికులపై జరిగిన దాడి కేసును కూడా విచారణ జరుపుతారు.
16వ కార్ప్స్ కమాండ్ నుంచి కొంత మందిని తొలగించనున్నారని, మగ్గురు పౌరుల మృతి విషయంలోనూ కొందరిరికి ఉద్వాసన తప్పదని ఆర్మీ అధికారులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
దీంతోపాటుగా 16 కార్ప్ప్ కమాండ్ కమాండర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్‌ను త్వరలో డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీకి కమాండెంట్‌గా పంపనున్నట్టు, ఈయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ నవీన్ సచ్ దేవ్‌ను నియమిస్తారని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
- మొర్రాయిపల్లె స్కూల్: ‘నాగలక్ష్మి మేడమ్ స్టూడెంట్స్‌కు లెక్కలంటే భయం లేదు’
- కన్నబిడ్డలు నలుగురిని చంపింది తల్లే అన్నారు, 40 ఏళ్ళ జైలు శిక్ష వేశారు - 20 ఏళ్ల తరువాత ఈ కేసులో మిస్టరీని సైన్స్ బయటపెట్టింది
- పాకిస్తాన్: ‘భారత్‌లో ఉన్న మా ఆయన్ను కలుసుకోవాలని ఉంది’ అంటున్న పాకిస్తానీ యువతి, అసలు ఏం జరిగింది?
- క్రిస్మస్: ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు..? ఆయన అసలు చిత్రం ఏది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














