అటల్ బిహారీ వాజపేయి: ప్రేమించిన అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు చాలా భిన్నమైనవి.
బ్రహ్మచర్యంపై బాహాటంగానే మహాత్మా గాంధీ ప్రయోగాలు చేసేవారు. మరోవైపు భార్య మరణానంతరం ఎడ్వినా మౌంట్‌బ్యాటన్, పద్మజా నాయుడులతో జవహర్‌లాల్ నెహ్రూ సంబంధాలపైనా ఎన్నో కథనాలు వచ్చేవి.
సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా.. రమా మిత్రతో కలిసి జీవించేవారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు.
అటల్ బిహారీ వాజ్‌పేయీ కూడా ఈ కోవలోకే వస్తారు. ఆయన జీవితంలో రాజ్‌కుమారి కౌల్‌కు ప్రత్యేక స్థానముంది.
గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీ(ప్రస్తుతం మహారాణి లక్ష్మీబాయి కాలేజీ)లో చదువుకునేటప్పుడు రాజ్‌కుమారి హక్షర్ కౌల్ పట్ల వాజ్‌పేయీ ఆకర్షితులయ్యారు.
ఇటీవల ప్రచురితమైన వాజ్‌పేయీ జీవితచరిత్ర ‘‘అటల్ బిహారీ వాజ్‌పేయీ’’ పుస్తకంలో ప్రముఖ జర్నలిస్టు సాగరికా ఘోష్ ఈ విషయాలను రాసుకొచ్చారు. ‘‘అప్పట్లో ఆ కాలేజీలో చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉండేవారు. వారిలో కౌల్ చాలా అందంగా ఉండేవారు. ఆమెను వాజ్‌పేయీ అమితంగా ఇష్టపడేవారు. కౌల్‌కు కూడా ఆయన అంటే చాలా ఇష్టం’’అని పుస్తకంలో రాశారు.
‘‘మొదట కౌల్ సోదరుడు చంద్ హక్షర్‌తో వాజ్‌పేయీకి పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే కౌల్‌ను ఆయన కలుసుకున్నారు. కానీ పెళ్లి విషయంలో కౌల్ కుటుంబం వాజ్‌పేయీని అంగీకరించలేదు. కౌల్‌ను ఆమె తల్లిదండ్రులు.. దిల్లీలోని రామ్‌జస్ కాలేజీలో ఫిలాసఫీ బోధించే బ్రజ్ నారాయణ్ కౌల్‌కు ఇచ్చి పెళ్లిచేశారు.’’

ఫొటో సోర్స్, Juggernaut
వాజ్‌పేయీతో తనకున్న అనుంబంధాన్ని కౌల్ కూడా బహిరంగంగానే అంగీకరించేవారు.
ఈ విషయాన్ని వాజ్‌పేయీ మరో జీవితచరిత్ర ‘‘అటల్ బిహారీ వాజ్‌పేయీ: ద మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్’’లో కింగ్షుక్ నాగ్ వివరించారు. ‘‘లైబ్రరీ పుస్తకంలో ప్రేమ లేఖను పెట్టి కౌల్‌కు వాజ్‌పేయీ ఇచ్చారు. కానీ ఆయనకు ఎలాంటి సమాధానం రాలేదు. నిజానికి కౌల్ దీనికి అంగీకారం తెలుపుతూ ప్రత్యుత్తరం ఇచ్చారు. కానీ, ఆ లేఖ వాజ్‌పేయీకి చేరలేదు.’’
ఎంపీగా దిల్లీకి వచ్చిన తర్వాత మళ్లీ కౌల్‌ను కలవడం వాజ్‌పేయీ మొదలుపెట్టారు.
ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్న హర్‌దీప్ సింగ్ పూరీకి బ్రజ్ నారాయణ్ కౌల్ మార్గదర్శిగా ఉండేవారు. బ్రజ్ నారాయణ్ ఇంట్లోనే వాజ్‌పేయీని పూరి తొలిసారి కలుసుకున్నారు.

ఫొటో సోర్స్, penguin Viking
1980ల్లో సావి మ్యాగజైన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వాజ్‌పేయీకి తనకు మధ్య మంచి అనుబంధముందని రాజ్‌కుమారి కౌల్ అంగీకరించారు. ఆ బంధాన్ని కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలరని ఆమె చెప్పారు.
‘‘వాజ్‌పేయీతో నా అనుబంధం గురించి నా భర్తకు వివరణ ఇవ్వాల్సిన సమయం ఎప్పుడూ రాలేదు. నిజానికి వాజ్‌పేయీకి నాతోపాటు నా భర్తతోనూ మంచి అనుబంధముంది’’అని ఆ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు.
‘‘వారి మధ్య అనుబంధాన్ని ప్రేమ అని పిలవాలా లేదా స్నేహం అని పిలవాలా నాకు తెలియదు. నిజానికి దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు’’అని వాజ్‌పేయీ ఆప్త మిత్రుడు అప్పా ఘటాటే.. సాగరికా ఘోష్‌తో చెప్పారు.
‘‘వారి సంబంధాన్ని ప్రపంచం వింతగా చూడొచ్చు. దాన్ని మనం స్నేహానికి మరో మెట్టుగా చెప్పుకోవచ్చు. అది గ్వాలియర్‌లో చదువుకుంటున్నప్పుడే మొదలైంది.’’

ఫొటో సోర్స్, penguin Viking
భర్తతో కలిసి వాజ్‌పేయీ ఇంటికి
వాజ్‌పేయీకి దిల్లీలోని పెద్ద ప్రభుత్వ వసతి గృహం కేటాయించినప్పుడు, కుమార్తెలు, భర్తతోపాటు కౌల్ ఆ ఇంటికి వెళ్లిపోయారు. వీరందరికీ అక్కడ విడివిడిగా బెడ్‌రూమ్‌లు ఉండేవి.
‘‘వాజ్‌పేయీకి అత్యంత ఆప్తుల్లో బల్‌బీర్ పుంజ్ ఒకరు. తొలిసారి ఆయన దిల్లీలోని వాజ్‌పేయీ ఇంటికి వెళ్లినప్పుడు కాస్త వింతగా అనిపించిందని నాతో చెప్పారు. కానీ వారికది చాలా సాధారణంగా ఉండేదని, ఆ తర్వాత తాను కూడా వారి మధ్య సంబంధం గురించి ఆలోచించడం మానేశానని వివరించారు’’అని వాజ్‌పేయీ ఆత్మకథలో సాగరికా ఘోష్ రాసుకొచ్చారు.
‘‘వాజ్‌పేయీని తన ఆప్తమిత్రుడైన అప్పా ఘటాటే ఇంటికి రమ్మని పిలిచినప్పుడు.. భర్తతోపాటు కౌల్ కూడా వెళ్లేవారు. నారాయణ్ కౌల్‌ను వాజ్‌పేయీ చాలా గౌరవించేవారు. మరోవైపు రాజ్‌కుమారి కౌల్, వాజ్‌పేయీల మధ్య సంబంధాన్ని నారాయణ్ కౌల్ కూడా అంగీకరించేవారు. వాజ్‌పేయీ భోజనం చేశారా? లేదా? ఆయన ప్రసంగాన్ని ప్రజలు ఎలా వింటున్నారని భార్యను నారాయణ్ కౌల్ అడిగేవారు.’’

ఫొటో సోర్స్, HarperCollins
కౌల్ సిఫార్సుతో కరణ్ థాపర్‌కు వాజ్‌పేయీ ఇంటర్వ్యూ
ఒకసారి వాజ్‌పేయీని ఎలాగైనా ఇంటర్వ్యూ చేయాలని ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ ప్రయత్నించారు.
ఈ విషయాన్ని తన ఆత్మకథ ‘‘డెవిల్స్ అడ్వొకేట్’’లో కరణ్ థాపర్ వివరించారు. ‘‘రైసీనా హిల్స్‌లోని వాజ్‌పేయీ నివాసానికి చాలాసార్లు కాల్‌చేసి నేను బాగా అలసిపోయాను. చాలాసార్లు కాల్ చేసిన తర్వాత ఫోన్లో కౌల్ మాట్లాడారు. దీంతో నేను వాజ్‌పేయీ కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పాను. ఆమె సమస్యను అర్థం చేసుకున్నారు. తాను వాజ్‌పేయీతో మాట్లాడతానని చెప్పారు.’’
‘‘మరుసటి రోజు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వాజ్‌పేయీ అంగీకరించారు. అప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం చాలా ప్రయత్నించానని చెప్పారు. దీనికి స్పందనగా మీరు హైకమాండ్ సిఫార్సుతో వచ్చారు.. ఇంటర్వ్యూ ఎలా కాదని చెప్పగలనని వాజ్‌పేయీ వ్యాఖ్యానించారు’’అని కరణ్ థాపర్ గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Harper Hindi
‘‘బ్యాచ్‌లర్‌నే.. బ్రహ్మచారిని కాదు’’
1960ల్లో భర్తకు విడాకులు ఇచ్చి వాజ్‌పేయీని కౌల్ పెళ్లిచేసుకోవాలని అనుకున్నారని చాలా కథనాలు వచ్చాయి. అయితే, ఈ వివాహంతో వాజ్‌పేయీ రాజకీయ జీవితం, తమ పార్టీపై ప్రభావం పడుతుందని ఆరెస్సెస్ భావించేదని రాజకీయ ప్రముఖులు విశ్లేషించేవారు.
వాజ్‌పేయీ పెళ్లి చేసుకోలేదు. అయితే, కౌల్‌కు మాత్రం ఆయన జీవితంలో ప్రత్యేక స్థానముంది.
‘‘బ్యాచ్‌లర్‌నే.. బ్రహ్మచారిని కాదు’’అని వాజ్‌పేయీ ఓ కార్యక్రమంలో అంగీకరించారు కూడా.
వాజ్‌పేయీ మరో జీవితచరిత్ర ‘‘హర్ నహీ మానూంగా’’లోనూ ఈ ప్రేమ కథ గురించి ప్రస్తావించారు. ‘‘ఈ ప్రేమ కథ దాదాపు ఐదు దశాబ్దాలు కొనసాగింది. బహుశా మన భారత రాజకీయాల్లో ఇలాంటి పేరు లేని ప్రేమ కథ మరొకటి ఉండదు కాబోలు’’అని రచయిత విజయ్ త్రివేది రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరెస్సెస్ ఊహించలేదు
ఒక వివాహితతో వాజ్‌పేయీ సంబంధాన్ని ఆరెస్సెస్ ఎప్పటికీ ఆమోదించదు.
ఆ సమయంలో రాజకీయ పోస్టర్లలో వాజ్‌పేయీ బొమ్మలు చాలా పెద్దవిగా ఉండేవి. జనాలను తనవైపు ఆకర్షించగలిగే సామర్థ్యం ఆయనకు ఉండేది.
వాజ్‌పేయీ, కౌల్‌ల మధ్య సంబంధానికి గుల్జార్ రాసిన ఖామోషీ పాట సరిగ్గా సరిపోతుంది.
‘‘ఆ కళ్ల భాష మన అందరికీ తెలుసు.
దాన్ని చేతులతో తాకాలని చూడొద్దు.
అదొక ఫీలింగ్. మనసుకే అది తెలుస్తుంది.
ప్రేమించు.. ఆరాధించు.. దానికి పేరు పెట్టకు.’’

ఫొటో సోర్స్, Getty Images
కౌల్ మృతిపై సోనియా సంతాపం..
2014లో 86ఏళ్ల వయసులో రాజ్‌కుమారి కౌల్ మరణించారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించారని వాజ్‌పేయీ కుటుంబం నుంచి ఒక పత్రికా ప్రకటన కూడా ఇచ్చింది.
వాజ్‌పేయీలో ఆమె సగమని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆమెను అభివర్ణించింది.
అప్పట్లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో జరుగుతున్నప్పటికీ, సోనియా గాంధీ.. వాజ్‌పేయీ ఇంటికి వచ్చి సంతాపాన్ని తెలియజేశారు.
బీజేపీ అగ్ర నాయకులైన ఎల్‌కే అడ్వాణీ, అమిత్ షా, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ తదితరులు కౌల్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆరెస్సెస్ కూడా ఇద్దరు సీనియర్ ప్రతినిధులు సురేశ్ లోని, రామ్ లాల్‌లను పంపింది.
‘‘కౌల్ మృతితో భారత రాజకీయాల్లో అతిగొప్ప ప్రేమకథకు ముగింపు పడింది. ఈ ప్రేమ కథ దశాబ్దాలపాటు కొనసాగింది’’అని కింగ్షుక్ నాగ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అన్నీ ఆమె చూసుకునేది..
రాజ్‌కుమారి కౌల్‌ను కౌల్ అంటూ వాజ్‌పేయీ సంబోధించేవారు. వాజ్‌పేయీ ఇంటిలో అన్నీ ఆమె చూసుకునేవారు. ఆహారం, ఔషధాలు, ఇతర పనులు అన్నీ ఆమె దగ్గరుండి చూసుకునేవారు.
ఒకసారి రాజేంద్ర ప్రసాద్ రోడ్‌లో ఉండేటప్పుడు వాజ్‌పేయీని చూడటానికి కౌల్ వచ్చారు.
‘‘తన ఒంటిని శుభ్రం చేసుకోవడానికి వాజ్‌పేయీ బట్టల సబ్బును ఉపయోగిస్తున్నారని తెలిసి ఆమె షాక్‌కు గురయ్యారు’’అని సాగరిక ఘోష్ తన పుస్తకంలో వివరించారు.
‘‘ఒకసారి బల్బీర్ పుంజ్.. వాజ్‌పేయీ ఇంటికి వెళ్లారు. అప్పుడు కౌల్ ఇంటిలో లేరు. వాజ్‌పేయీ కోసం ఆహారం టేబుల్‌పై ఉంది. రోటీలు, కూరను చూసిన వాజ్‌పేయీ.. వంటగదిలోకి వెళ్లి నెయ్యిలో పూరీలు వేయించుకుని తెచ్చుకున్నారు.’’
‘‘కౌల్ వచ్చి చూసేసరికి టేబుల్‌పై పూరీలు చూశారు. వెంటనే మీరు మళ్లీ నెయ్యిలో పూరీలు వేయించుకొని తిన్నారా? మీరు నెయ్యి ఎలా తింటారని ఆమె కోపంగా అన్నారు.’’

ఫొటో సోర్స్, Google
ఉమా శర్మతో మైత్రి..
ప్రముఖ కథక్ నృత్యకారిణి ఉమా శర్మతోనూ వాజ్‌పేయీకి మంచి స్నేహముంది.
వాజ్‌పేయీతో తన అనుబంధం గురించి చెప్పమని సాగరికా ఘోష్ అడిగినప్పుడు.. ‘‘వాజ్‌పేయీకి నా నృత్యమంటే చాలా ఇష్టం. దాన్ని చూసేందుకు ఆయన నా షోలకు వచ్చేవారు’’అని ఆమె సమాధానం ఇచ్చారు.
‘‘మేమిద్దరమూ కళాపిపాసులమే. మేం కలిసి గ్వాలియర్‌లోని ధోల్‌పుర్‌లో షోలకు వెళ్లేవాళ్లం.’’

ఫొటో సోర్స్, Rupa Publications India
ఆయనకు ఆహారం, పానీయాలు బాగా ఇష్టం
మొదట్లో వాజ్‌పేయీకి వైన్, స్కాచ్ అంటే చాలా ఇష్టం ఉండేది. గ్వాలియర్ మిక్సర్, చాందినీ చౌక్‌లోని జిలేబీ, లఖ్‌నవూ చాట్, బాదంపాలు అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం.
రసగుల్లా, చికెన్, ఖీర్, కిచిడీ, రొయ్యలు, చేపలను కూడా ఆయన ఇష్టపడేవారు.
దిల్లీలోని షాజహాన్ రోడ్‌లోని యూపీఎస్సీ కార్యాలయం ఎదుట చాట్‌ను ఎక్కువగా తినేవారు.
జార్జ్ ఫెర్నాండేజ్ రక్షణ మంత్రిగా కొనసాగేటప్పుడు.. ఆయన వాజ్‌పేయీ కోసం బెంగళూరులోని కోశి బేకరీ నుంచి ప్రత్యేకంగా కిస్మస్ కేకులను తెప్పించేవారు. కనాట్‌ప్లేస్‌లోని ఇండియన్ కాఫీ హౌస్‌లో కాఫీ కూడా ఎక్కువగా వాజ్‌పేయీ తాగేవారు.
చైనీస్ వంటకాలను కూడా ఆయన అమితంగా ఇష్టపడేవారు. 1979లో విదేశాంగ మంత్రిగా చైనాకు వెళ్లిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆహారాన్ని ఆయన చాప్‌స్టిక్స్‌తోనే తినేవారు.
‘‘చల్లని కోకాకోలా అంటే వాజ్‌పేయీకి చాలా ఇష్టమని ఒకసారి ప్రకాశ్ జావడేకర్ నాతో చెప్పారు. ఇంత చల్లనివి తాగితే మీ గొంతుకు ఏమీకాదా అని అడిగినప్పుడు.. చల్లనివి తాగితే నా గొంతుకు హాయిగా ఉంటుందని సమాధానమిచ్చారని వివరించారు’’అని విజయ్ త్రివేది రాసుకొచ్చారు.

ఫొటో సోర్స్, Harper Hindi
దినచర్య ఇలా..
ప్రధాన మంత్రిగా అయిన తర్వాత, వాజ్‌పేయీ రోజూ ఉదయం 6.30కి లేచేవారు. నిద్రలేచిన వెంటనే ఆయన తేనె, నిమ్మరసం కలిపిన వేడి నీటిని తాగేవారు.
ఆ తర్వాత ఎనిమిది గంటల వరకు పత్రికలు చదివేవారు. ఆ తర్వాత అరగంట ట్రెడ్‌మిల్‌పై వాక్ చేసేవారు. ఆ తర్వాత పెంపెడు శునకాలతో వాకింగ్‌కు వెళ్లేవారు.
ఉదయం అల్పాహారంగా ఆమ్లెట్ టోస్ట్ లేదా ఇడ్లీ తీసుకునేవారు. బొప్పాయి, ద్రాక్ష, నారింజ లాంటి పళ్లను కూడా ఆయన ఉదయం తినేవారు.
మధ్యాహ్నం భోజనం 1.30కు తినేవారని సాగరిక వివరించారు.
‘‘ఆ తర్వాత రోజులో రెండో భాగం మొదలయ్యేది. 8.30 వరకు ఆయన పనిచేసేవారు. ఐదు గంటలకు సమోసాలు లేదా జీడిపప్పు లేదా పాపిడీ చాట్‌తో టీ తాగేవారు. రాత్రి భోజనంలో కూరగాయల సూప్ తాగేవారు. రొయ్యలు లేదా చికెన్ రాత్రి తినేవారు. చివరగా కుల్ఫీ లేదా ఐస్ క్రీమ్ తీసుకునేవారు.’’

ఫొటో సోర్స్, Harper Hindi
అందుకే మద్యం వదిలేశారు..
తన స్నేహితుడు జశ్వంత్ సింగ్‌లానే కెరియర్ తొలినాళ్లలో వాజ్‌పేయీ కూడా చాలా ఎక్కువగా మద్యం తాగేవారు. అయితే, ప్రధాన మంత్రి అయిన తర్వాత ఆయన ఆ అలవాటును వదులుకున్నారు.
కాళ్లనొప్పులు రావడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన ఆల్కహాల్‌ను వదిలేశారు.
‘‘సైప్రస్‌కు రాయబారిగా ఉండే పవన్ వర్మ ఒకసారి వాజ్‌పేయీకి ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో విందు ఏర్పాటుచేశారు. ఆ రోజు మీరు ఎందుకు కొంచెం ఆల్కహాల్ తీసుకోకూడదని వాజ్‌పేయీని ఆయన అడిగారు. అప్పుడు వాజ్‌పేయీకి సీపీజీ అధికారిగా ఉన్న జీటీ లేప్చా ఒక అడుగు ముందుకు వేసి.. ‘‘నో డ్రింక్స్ ప్లీజ్.. ఓన్లీ స్ప్రైట్’’అని అన్నారు. దీంతో వాజ్‌పేయీ కూడా తాగనని చెప్పారు’’అని సాగరిక తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
దేవాలయాలకు దూరం..
వాజ్‌పేయీ కార్యదర్శిగా పనిచేసిన శక్తి సిన్హాతోనూ సాగరిక మాట్లాడారు.
‘‘వాజ్‌పేయీ దేవాలయాలకు వెళ్లినట్లు నాకు ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. 1995లో గణేశ్ విగ్రహాలు పాలు తాగుతున్నాయని వార్తలు వచ్చినప్పుడు వాటిని వాజ్‌పేయీ తిరస్కరించారని శక్తి సిన్హా చెప్పారు. ఆయనకు ఏ మతంపైనా ద్వేషం లేదని ఆయన మిత్రుడు ఘటాటే చెప్పారు. వాజ్‌పేయీకి ఏళ్లపాటు డ్రైవర్‌గా పనిచేసిన ముజీబ్ ఒక ముస్లిం.’’

ఫొటో సోర్స్, penguin viking
అందరినీ కలుపుకుంటూ పోతారు..
కమ్యూనిస్టు నాయకులు హిరెన్ ముఖర్జీ, భూపేశ్ గుప్తా, ఇంద్రజిత్ గుప్తా తదితరులు కూడా వాజ్‌పేయీకి ఆప్తమిత్రులే. భావసారూప్యత లేనప్పటికీ వీరి మధ్య స్నేహం ఉండేది.
సీఎన్ అన్నాదురై, కరుణానిధి, మాజీ కాంగ్రెస్ ప్రధాని పీవీ నరసింహారావులతోనూ ఆయనకు మంచి సంబంధాలున్నాయి.
‘‘నాకు చాలా మంది రాజకీయ నాయకులు నచ్చరు. కానీ వాజ్‌పేయీ అలా కాదు. ఈ విషయంపై ప్రముఖ న్యాయ కోవిదుడు ఫాలి నారీమన్‌తో నేను మాట్లాడాను. వాజ్‌పేయీ జీవితంలో కొన్ని ఎత్తుపల్లాలున్నప్పటికీ ఆయన్ను అందరూ ఇష్టపడతారని ఆయన అన్నారు’’అంటూ లఖ్‌నవూ బాయ్ పుస్తకంలో ప్రముఖ జర్నలిస్టు వినోద్ మెహ్తా వివరించారు.
‘‘వాజ్‌పేయీ జీవితంలో కొన్ని వైరుధ్యాలున్న మాట వాస్తవమే. కానీ భారత రాజకీయాలపై ఆయన తనదైన ముద్ర వేశారు’’అని సాగరికా ఘోష్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












