ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు మహారాష్ట్రలో మతపరమైన ఉద్రిక్తతలకు సంబంధం ఏంటి?

త్రిపురలో మతఘర్షణలకు నిరసనగా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఫొటో సోర్స్, Nitesh Routh/BBC

ఫొటో క్యాప్షన్, త్రిపురలో మతఘర్షణలకు నిరసనగా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
    • రచయిత, దీపాలీ జగ్తాప్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

శుక్రవారంనాడు మహారాష్ట్రలోని అమరావతి, నాందేడ్, మాలేగావ్‌లలో మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కొన్ని జిల్లాలలో పోలీసులు కర్ఫ్యూ కూడా విధించారు.

మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో గస్తీని పెంచారు. అమరావతి, మాలేగావ్, నాగ్‌పూర్, పుణేలలో ఆదివారం నుంచి కర్ఫ్యూ కొనసాగుతోంది.

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఇక్కడ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వ నేతలు ఆరోపించగా, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని బీజేపీ వాదిస్తోంది.

మరి మహారాష్ట్రలో అకస్మాత్తుగా ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? మత ఉద్రిక్తత ఎందుకు పెరిగింది? దీని వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా?

అమరావతి, మాలెగావ్, పుణె తదితర ప్రాంతాలలో పోలీసులు మోహరించారు.

ఫొటో సోర్స్, Nitesh Routh/BBC

ఫొటో క్యాప్షన్, అమరావతి, మాలెగావ్, పుణె తదితర ప్రాంతాలలో పోలీసులు మోహరించారు.

ఇంతకీ ఏం జరిగింది?

నవంబర్ 12న అమరావతిలో జరిగిన హింసాకాండ తర్వాత నవంబర్ 17 వరకు కర్ఫ్యూ విధించారు. పఠాన్ చౌక్, ఇత్వారా బజార్, చిత్ర చౌక్ వంటి సున్నిత ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

నాగ్‌పూర్‌లో కర్ఫ్యూ విధించామని, అయిదుగురికి పైగా అదుపులోకి తీసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

త్రిపురలో హింసకు నిరసనగా నవంబర్ 12న మాలేగావ్‌లో కొందరు బంద్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్నాం వరకు బంద్ శాంతియుతంగా కొనసాగినప్పటికీ, ఆ తర్వాత రాళ్లదాడి ఘటనలు జరిగాయి.

త్రిపుర మత ఘర్షణలకు నిరసనగా అమరావతి జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో వేలాదిమంది ఆందోళనకారులు పాల్గొన్నారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో అమరావతి పట్టణంలో ఉద్రిక్తత పెరిగింది.

మాలేగావ్‌లో రజా అకాడమీ సహా ముస్లిం సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. త్రిపురలో జరుగుతున్న ఘటనలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో చేపట్టిన బంద్ మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా కొనసాగింది.

"కొన్ని సంస్థలు మాలేగావ్ బంద్‌కు పిలుపునిచ్చాయి, ఈ నేపథ్యంలో పోలీసులను మోహరించారు. అధికారులు, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. కొంతమంది ఆసుపత్రిని, కొన్ని దుకాణాలను ధ్వంసం చేశారు'' అని నాసిక్ రేంజ్ ఐజీ బి.జి. శేఖర్ అన్నారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించే సమయానికి, సుమారు మూడు, నాలుగు వేల మంది ప్రజలు పోగయ్యారని, వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారని శేఖర్ వెల్లడించారు.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో గత కొన్ని రోజులుగా మతపరమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాకాండకు దీనిని ప్రతిస్పందనగా భావిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి ఘటనల తర్వాత, విశ్వహిందూ పరిషత్, జమాత్-ఎ-ఉలేమా (హింద్) వంటి మత సంస్థలు త్రిపురలో ముఖాముఖి తలపడుతున్నాయి.

పోలీసులతో ఆందోళనకారుల వాగ్వాదం

ఫొటో సోర్స్, Nitesh Routh/BBC

ఫొటో క్యాప్షన్, పోలీసులతో ఆందోళనకారుల వాగ్వాదం

బీజేపీ నేత అరెస్ట్

అమరావతి హింసాకాండ కేసులో బీజేపీ నేత, మాజీ మంత్రి అనిల్ బోండేను నగర పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన్ను 12 గంటల పాటు కస్టడీలో ఉంచారు.

బీజేపీ నేత తుషార్ భారతీయ, మేయర్ చేతన్ గవాండేలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ప్రవీణ్ పోటే కోసం కూడా వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

సున్నిత ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తున్నామని..రూట్‌మార్చ్‌ నిర్మహిస్తున్నామని, అల్లర్లు సృష్టించే వారిని వదిలిపెట్టబోమని అమరావతి పోలీస్‌ కమిషనర్‌ ఆర్తీ సింగ్‌ హెచ్చరించారు.

ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా సంయమనంతో వ్యవహరించాలని ఆమె సూచించారు.

"మేము రాజ్‌కమల్ చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. అయితే నమూనా గలి ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు కత్తులతో వచ్చారు. అప్పుడు ఉద్రిక్తత ఏర్పడింది. అమరావతి శాంతియుతంగా ఉంది. అందరూ నోటిని అదుపులో పెట్టుకోవాలి'' అని అరెస్టయిన బీజేపీ నాయకుడు అనిల్ బోండే వ్యాఖ్యానించారు.

ఉద్రిక్తతలు ఏర్పడిన ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతాయని మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, అమరావతి డిస్ట్రిక్ట్ గార్డియన్ మినిస్టర్ యశోమతి ఠాకూర్ తెలిపారు.

"కర్ఫ్యూ తర్వాత పరిస్థితి అదుపులో ఉంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేశాం. కొన్ని ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంది. పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఆంక్షలు తొలగిస్తాం'' అని ఆమె తెలిపారు.

అల్లర్లలో ధ్వంసమైన పోలీసు వాహనం
ఫొటో క్యాప్షన్, అల్లర్లలో ధ్వంసమైన పోలీసు వాహనం

"ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర "

రాష్ట్రంలో జరుగుతున్న హింస వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలోని నేతలు, మంత్రులు బీజేపీని టార్గెట్ చేశారు.

ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. రజా అకాడమీ దగ్గర బీజేపీ నేత ఆశిష్ షెలార్ ఉన్న ఫొటోను ఆయన విడుదల చేసి, ''ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు'' అని ప్రశ్నించారు.

అయితే, ఈ ఫొటో 2016-17 నాటిదని, ప్రస్తుత అల్లర్లకు, ఈ ఫొటోకు సంబంధం ఏంటని బీజేపీ నేత ఆశిష్ షెలార్ ప్రశ్నించారు.

మరోవైపు జరుగుతున్న ఘటనల్లో తమకు ఎలాంటి సంబంధం లేదని రజా అకాడమీ స్పష్టం చేసింది. అయితే, మహారాష్ట్రలో అల్లర్లను రెచ్చగొట్టే శక్తి రజా అకాడమీకి ఎప్పుడూ లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

‘‘రజా అకాడమీ కొంతకాలంగా ప్రజలను రెచ్చగొడుతోంది, కానీ, ప్రభుత్వం వారిని ఎప్పుడూ నియంత్రించలేదని, రజా అకాడమీ బీజేపీ కీలుబొమ్మ అని, బీజేపీకి కావాల్సింది రజా అకాడమీలోని వారు చేసి పెడుతుంటారు’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ మత ఘర్షణలు సృష్టిస్తోందని మహారాష్ట్ర సంకీర్ణ కూటమి నేతలు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కోసం బీజేపీ మత ఘర్షణలు సృష్టిస్తోందని మహారాష్ట్ర సంకీర్ణ కూటమి నేతలు ఆరోపించారు.

మహారాష్ట్రలో అస్థిరత విపక్షాల ఎత్తుగడా?

జరుగుతున్న పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్, దీనికంతటికీ బీజేపీయే కారణమని, అల్లర్లను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆ పార్టీ భావిస్తోందని కాంగ్రెస్ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటోలే ఆరోపించారు.

'ఉత్తర్‌ప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. త్రిపుర ఘటన పేరుతో మహారాష్ట్రలో అల్లర్లను రెచ్చగొట్టి ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది’’ అన్నారు పటోలే.

‘‘గత రెండేళ్లుగా మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో బీజేపీ సఫలం కాలేదు. అందుకే మహారాష్ట్రలో అశాంతి కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది'' అని పటోలే విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)