కర్ణాటక: మతాంతర ప్రేమలపై ఆగ్రహం, నాలుగు వారాల్లో ఇద్దరి హత్య

రవి నింబార్గీ

ఫొటో సోర్స్, IMRAN QURESHI

ఫొటో క్యాప్షన్, మృతుడు రవి నింబార్గీ
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటకలో నాలుగు వారాల్లోపే మతాంతర ప్రేమకు సంబంధించిన రెండో హత్య కేసు వెలుగులోకి వచ్చింది.

కర్ణాటక విజయ్‌పురాలో 32 ఏళ్ల ఒక వ్యక్తి శవం దొరికింది. అతడు ప్రేమించిన ముస్లిం యువతి కుటుంబ సభ్యులే అతడిని హత్య చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

మృతుడి రవి నింబార్గీ రైతు. పోలీసులకు అతడి శవం నిందితుల బంధువులకు సంబంధించిన ఒక బావిలో దొరికింది.

రవి నింబార్గీ, అమ్రీన్ బేగమ్ ప్రేమించుకోవడం, యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదని చెబుతున్నారు.

అమ్రీన్ సోదరుడు, చిన్నాన్న మతాంతర ప్రేమకు వ్యతిరేకం.

వీడియో క్యాప్షన్, ‘లవ్ జిహాద్’ చుట్టూ ఏమిటీ వివాదం, దీనిపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?

రవిని హెచ్చరించారు

రవి హత్య ఆరోపణలపై పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కానీ, ఇది పరువుహత్య కేసు కాదని పోలీసులు చెబుతున్నారు.

వద్దని చెప్పినప్పటికీ గత ఐదేళ్లుగా రవి, అమ్రీన్ ప్రేమ కొనసాగుతుండడంతో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు.

"ఆమెకు దూరంగా ఉండాలని అమ్రీన్ కుటుంబం రవిని హెచ్చరించింది" అని విజయ్‌పురా పోలీస్ సూపరింటెండెంట్ హెచ్‌డీ ఆనంద్ కుమార్ చెప్పారు.

రవి మూడు రోజుల క్రితం సిందగీ తాలూకాలోని బాల్గానూర్ గ్రామంలో కూరగాయలు కొనుక్కుని తిరిగి వస్తున్న సమయంలో అమ్రీన్ కుటుంబంతో గొడవపడినట్లు పోలీసులు చెబుతున్నారు.

"రవి వెంటనే ఆ సమయంలో అక్కడ లేని అమ్రీన్‌కు ఫోన్ చేశారు. దాంతో, అమ్రీన్ పోలీసులకు ఫోన్ చేసి తమ ఇంట్లోవాళ్లు రవిని కొడుతున్నారని ఫిర్యాదు చేశారు" అని పేరు రాయవద్దని కోరిన ఒక పోలీస్ అధికారి బీబీసీకి చెప్పాడు.

అమ్రీన్ కుటుంబంలోని 8 మంది రవిని క్రూరంగా హత్య చేసినట్లు అధికారులు చెప్పారు. వారిలో అమ్రీన్ తమ్ముడు ఇమామ్ కూడా ఉన్నాడు.

"మాకు అమ్రీన్ బంధువుల బావిలో శవం దొరికింది. నిందితులు ఒక ప్లాస్టిక్ తాడు ఉపయోగించారు. మేం ఇద్దరిని అరెస్ట్ చేశాం, ఒకరు పరారీలో ఉన్నారు" అని ఒక అధికారి చెప్పారు.

ప్రేమించుకుంటున్న రవి, అమ్రీన్‌లను విడదీయడానికి పంచాయతీ కూడా పెట్టారు. కానీ రవి కుటుంబం, ఆయన బంధువులు అతడి ప్రేమను అంగీకరించింది. కానీ, అమ్రీన్ తమ్ముడికి అది ఇష్టం లేనట్టుంది" అని ఆ అధికారి చెప్పారు.

రవి సోదరులు ఇద్దరికీ పెళ్లయింది. ప్రస్తుతం పోలీసులు అతడి కుటుంబానికి భద్రత కల్పించారు. అమ్రీన్‌ను కూడా సురక్షితమైన ప్రాంతానికి తరలించారు.

వీడియో క్యాప్షన్, శానిటరీ ప్యాడ్స్ మీద మహిళల అభ్యంతరాలను తొలగించే ప్రయత్నం

రైల్వే ట్రాక్‌పై దొరికిన శవం

ఇది కర్ణాటకలో ఇటీవల మతాంతర ప్రేమకు సంబంధించి నమోదైన రెండో హత్య కేసు.

దాదాపు నాలుగు వారాల క్రితం బెళగావి జిల్లాలో పోలీసులకు 24 ఏళ్ల అర్బాజ్ ముల్లా శవం రైల్వే ట్రాక్ మీద దొరికింది.

అర్బాజ్ ఒక హిందూ యువతిని ప్రేమిస్తున్నాడని చెబుతున్నారు. ఆ యువతికి దూరంగా ఉండాలని చెప్పినా వినకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు అతడిని చంపడానికి కిరాయి హంతకులను ఏర్పాటుచేశారని పోలీసులు చెప్పారు.

యువతి కుటుంబం అర్బాజ్‌ను హత్య చేయించడానికి ఒక రైట్ వింగ్ సంస్థను కూడా సంప్రదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

మొదట దీనిని ఆత్మహత్య కేసుగా భావించారు. కానీ పోస్టుమార్టంలో అర్బాజ్‌ గొంతు, వీపులో కత్తిపోట్లు ఉన్నట్టు తేలింది.

అర్బాజ్‌ను హత్య చేసిన తర్వాత, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అతడి శవాన్ని రైల్వే ట్రాక్ మీద పడేశారని పోలీసులు చెబుతున్నారు.

ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్న దళిత యువకుడు సాయబన్నా

ఫొటో సోర్స్, IMRAN QURESHI

ఫొటో క్యాప్షన్, ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్న దళిత యువకుడు సాయబన్నా

ఐదేళ్ల క్రితం ఒక హత్య జరిగింది

ఐదేళ్ల క్రితం విజయపురాలో మరో గ్రామంలో రంజాన్‌బీ(తల్లి), ఆమె కుటుంబంలోని మిగతా సభ్యులు ఎనిమిదిన్నర నెలల గర్భవతి అయిన కూతురు బానో బేగమ్‌ పొట్టపై పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి, ఆమె కడుపులో బిడ్డను చంపేశారు.

వాళ్లు బానో బేగమ్‌ను కాల్చి చంపేశారని కూడా ఆరోపణలున్నాయి. ఈ ఘటన గుండక్‌నాలా గ్రామంలో జరిగింది. బానో బేగమ్ తన చిన్ననాటి స్నేహితుడు దళిత యువకుడు సాయాబన్నాను పెళ్లి చేసుకోవడం ఆమె కుటుంబానికి అది ఇష్టం లేకపోవడంతో ఇదంతా జరిగింది.

అయితే, రవి కేసు పరువు హత్యకు సంబంధించినది కాదని విజయపురా పోలీసులు చెబుతున్నారు.

"ఇది పరువు హత్య కేసు కాదు. ఇది హత్య కేసు. ఈ హత్యలో యువతి కుటుంబంలోని ఇధ్దరికి ప్రమేయం ఉంది. రవిని కొట్టారని అమ్రీన్ కూడా ఫిర్యాదు చేశారు" పోలీస్ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)