స్పెషల్ మ్యారేజ్ యాక్ట్: ‘ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నందుకు ఇంటికొచ్చి బెదిరించారు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మయంక్ భాగవత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం వల్ల తనకు ఫోన్లో బెదిరింపులు వస్తున్నాయని ముంబయిలో ఒక హిందూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెదిరిస్తూ వస్తున్న ఫోన్ కాల్స్ వల్ల తన కుటుంబం మానసిక ఒత్తిడికికి గురైందని ఆమె చెబుతున్నారు.
31 ఏళ్ల సునయన(పేరు మార్చాం) బీబీసీతో ఫోన్లో మాట్లాడారు. "నాకు, నా కుటుంబానికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆకాశరామన్న ఉత్తరాలు వస్తున్నాయి. వాళ్లు మా నాన్నకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు" అని చెప్పారు.
తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, కానీ కొంతమంది తన పెళ్లిని వ్యతిరేకిస్తున్నారని సునయన చెప్పారు. ఆమె దీనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సునయన ఫిర్యాదుపై ముంబయి పోలీసుల నుంచి మాకు ఇప్పటివరకూ ఎలాంటి స్పందనా రాలేదు.
కానీ, ఈ కేసు గురించి సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలైంది. ఆమ్ ఆద్ పార్టీకి చెందిన ప్రీతీ శర్మ మేనన్ దీనిపై ఒక ట్వీట్ కూడా చేశారు.
"ఇది షాకింగ్‌గా ఉంది. ఒక మహిళ మతాంతర వివాహం కోసం అప్లికేషన్ పెట్టుకున్నందుకు హిందూత్వ గూండాలు ఆమెను బెదిరిస్తున్నారు" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"అసలు వాళ్లకు ఈ యువతి సమాచారం ఎలా తెలిసిందని ప్రీతి ప్రశ్నించారు.
పెళ్లి అప్లికేషన్ తర్వాత నుంచి బెదిరింపులు
సునయన స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకోడానికి ముంబయి ఖార్ ప్రాంతంలోని మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో జూన్ 14న అఫ్లికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత రోజు నుంచే తన ఇంటికి బెదిరింపు ఫోన్ కాల్స్, లెటర్లు రావడం మొదలయ్యాయని ఆమె చెప్పారు.
"దరఖాస్తు చేసిన తర్వాత రోజే, అంటే జూన్ 15న మా నాన్నకు ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. అందులో మీ అమ్మాయి ఫలానా తేదీన ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది, కావాలంటే అడిగి తెలుసుకోండి.. అని రాసుంది" అని సునయన బీబీసీకి చెప్పారు.
ఆ లేఖ రాసిన వ్యక్తి దగ్గర తన గురించి పూర్తి సమాచారం ఉందని సునయన చెబుతున్నారు.
"ఆ లెటర్ మరాఠీలో ఉంది. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుని వాళ్లను సౌదీ అరేబియా తీసుళ్లి అమ్మేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు మీ అమ్మాయిని కాపాడుకోవచ్చు అని అందులో రాశారు" అని తెలిపారు.
తన తండ్రికి వారు హెచ్చరికలు కూడా చేశారని సునయన చెప్పారు. దాంతో, ఆమె తర్వాత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు ఫోన్ చేశారు. అక్కడి సిబ్బంది "స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇలాంటివి జరుగుతుంటాయి. వాటిని పట్టించుకోకండి" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నేను తలుపు తీయగానే..
మేం పెళ్లికి రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాని గురించి మర్చిపోయాం. నా కాబోయే భర్తను కొన్ని రోజుల క్రితం మా నాన్న కూడా కలిశారు. ఆయనకు నచ్చాడు కూడా అని సునయన తెలిపారు.
"కానీ, మంగళవారం అంటే జులై 13న నేను ఇంటి తలుపు తీయగానే ముగ్గురు కనిపించారు. వాళ్లు నాకు నచ్చజెప్పడానికి వచ్చారు. నాతో ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోకు. మేం మీ నాన్నతో మాట్లాడాలి అన్నారు. కానీ నేను వాళ్లను వెళ్లిపొమ్మని చెప్పాను. కానీ వాళ్లు అంత సులభంగా వెళ్లలేదు" అన్నారు.
"నాకు 31 ఏళ్లు. నాకు అన్నీ తెలుసు. నా గురించి నేను నిర్ణయం తీసుకోగలను. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే దాని గురించి వేరే ఎవరో వచ్చి నన్ను బెదిరించడమేంటి" అంటారు సునయన.
బంధువుల నుంచి కూడా ఫోన్లు..
"గుజరాత్, కోల్‌కతాలో ఉంటున్న బంధువుల నుంచి కూడా ఫోన్లు రావడం మొదలైంది. నా పెళ్లిని వ్యతిరేకిస్తున్న వాళ్లు మాకు తెలిసిన చాలా మందికి దాని గురించి సమాచారం అందించారు" అని ఆమె తెలిపారు.
"వాళ్లు అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వకు అని మా నాన్నకు చెప్పేవారు. మా నాన్న లౌకిక భావాలున్న వ్యక్తి. ఆయన నా పెళ్లిని వ్యతిరేకించలేదు. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన కూడా చాలా భయపడిపోయారు".
సునయనకు ఇప్పుడు తన పెళ్లి ఏమవుతుందో అనే దిగులు కూడా పట్టుకుంది. తన తల్లిదండ్రులు చాలా భయపడిపోయి ఉన్నారని, వాళ్ల ఆరోగ్యం పాడవడంతోపాటూ, చాలా ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు
ఈ బెదిరింపులపై సునయన ముంబయి ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
"నేను పోలీసులకు మొత్తం జరిగిందంతా చెప్పాను. మా ఇంటికి వచ్చిన వాళ్ల గురించి ఫిర్యాదు చేశాను. మా అమ్మనాన్నలకు నా భద్రత గురించి ఆందోళన మొదలైంది. తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీడం లేదు. నా పెళ్లి ఎలా అవుతుందో కూడా తెలీడం లేదు" అన్నారు.
ముంబయిలోని రైట్ టూ లవ్ సంస్థకు చెందిన దీప్తి నితన్‌వారే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఇచ్చిన అప్లికేషన్ల వివరాలు బయటపెట్టకూడదు అంటున్నారు.
"మతాంతర వివాహాల కోసం 30 రోజుల నోటీస్ అనేది చాలా సుదీర్ఘ కాలం. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఆ సమాచారాన్ని బహిర్గతం అయ్యేలా వెల్లడిస్తుంది. చేస్తుంది. దరఖాస్తు చేసుకున్నవారి భద్రతకు సంబంధించి ఎలాంటి నిబంధనలూ లేవు" అన్నారు.
ఇలాంటి పెళ్లిళ్ల నోటీసులను ఆన్‌లైన్లో కేవలం దరఖాస్తుదారులకు మాత్రమే పంపాలని రైట్ టూ లవ్ సంస్థ గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తోంది.
"ఈ నోటీస్ నేరుగా పెళ్లి చేసుకోబోయే దంపతులకు పంపిస్తే వ్యక్తిగత సమాచారం వేరే వారి చేతుల్లో పడదు. వారి పేరు, అడ్రస్ బహిర్గతం కావడం వల్ల కూడా వారికి ప్రమాదం పెరుగుతుంది" అని దీప్తి చెప్పారు.
రైట్ టూ లవ్ సంస్థ గత ఆరేళ్లలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఎన్నో వివాహాలు జరిపించింది.
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్...
- 1954లో పార్లమెంట్ ఈ చట్టానికి ఆమోదముద్ర వేసింది.
- రెండు వేర్వేరు మతాల వారు తమ మతం మారకుండానే పెళ్లి చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది.
- పెళ్లి చేసుకోడానికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో 30 రోజుల ముందే అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
- దేశంలో నివసించే ప్రతి వ్యక్తికీ ఈ చట్టం అమలవుతుంది.
- పెళ్లి చేసుకోడానికి అబ్బాయికి 21 ఏళ్లు, అమ్మాయికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
- నోటీసు జారీ అయిన 30 రోజుల్లో ఏదైనా అభ్యంతరాలు వస్తే మారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ఉద్యోగి వాటిపై దర్యాప్తు చేస్తారు.
- అభ్యంతరాలు సరైనవని తేలితే, వివాహానికి అనుమతి ఇవ్వరు.

ఫొటో సోర్స్, Getty Images
మతాంతర వివాహాలపై వ్యతిరేకత
భారత్‌లో మతాంతర వివాహం వివాదాస్పద అంశంగా ఉంది. సాధారణంగా దీనికి సామాజిక గుర్తింపు కూడా లభించడం లేదు.
ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి పెళ్లి చేసుకుంటే దానిని సాధారణంగా 'లవ్ జిహాద్'గా వర్ణిస్తున్నారు. ఈ మాటను రాజకీయంగా కూడా ఉపయోగిస్తున్నారు.
యూపీ సర్కార్ ఇటీవల 'ఉత్తరప్రదేశ్ లా అగైనెస్ట్ రిలిజియన్ ప్రొహిబిషన్ యాక్ట్' పాస్ చేసింది.
పెళ్లి కోసం బలవంతంగా మతం మార్చే ఘటనలు పెరుగుతుండడంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మతాంతర వివాహాల అంశంపై 'రిలిజియస్ ఫ్రీడం యాక్ట్-2021' అమలు చేసింది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










