మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయాలున్నాయి? ప్యూ రీసెర్చ్ ఏం చెబుతోంది

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
సమాజాలను ‘మెల్టింగ్ పాట్’, ‘సలాడ్ బౌల్’గా(‘భిన్నత్వంలో ఏకత్వం’, ‘ఏకత్వంలో భిన్నత్వం’) చూడడమనేది చాలాకాలంగా ఉంది.
ఒకటి వలసదారులను ఆధిపత్య సంస్కృతిలో కలిసేలా ప్రోత్సహిస్తే.. ఇంకొకటి వలసదారులు కొత్త సమాజంలో కలిసిపోతూనే తమ సొంత పద్ధతులను కొనసాగిస్తూ అస్తిత్వాలను కాపాడుకునేలా ప్రోత్సహిస్తుంది.
అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనం ప్రకారం భారతదేశం ఈ రెండు కేటగిరీలలోనూ లేదట.
భారత్‌లో మతంపై 17 భాషలకు చెందిన 30 వేల మందితో సర్వే చేసి విడుదల చేసిన నివేదికలో 'ప్యూ రీసెర్చ్' ఈ మేరకు వెల్లడించింది.
భారత జనాభాలో 80 శాతం మంది హిందువులు కాగా 14 శాతం మంది ముస్లింలు.
మతం విషయానికొచ్చేసరికి.. భారత్‌లోని అన్ని మతాలవారు పరమత సహనం కలిగి ఉన్నారని ఈ నివేదిక తెలిపింది.
నిజమైన భారతీయులుగా ఇతర మతాలను గౌరవించడం తమ విధి అని సర్వేలో పాల్గొన్నవారిలో 84శాతం మంది చెప్పారు.
ఇతర మతాలను గౌరవిస్తామని చెప్పినప్పటికీ కొద్దిమంది మాత్రం ఇతర మతాలవారిని తమ పొరుగువారిగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. అలాగే మతాంతర వివాహాలకు అనుకూలంగా లేరు. తమ మతస్థులతోనే వారు స్నేహం చేయడానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు.
''భారత సమాజంలోని బహుళత్వాన్ని ఇది సూచిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రకరకాల కూరలతో పెట్టే మంచి భోజనంలా ఉంటుందీ సమాజం'' అన్నారు నివేదిక రూపకర్తలలో ఒకరైన నేహా సెహగల్.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయుల మత జీవితంపై 'ప్యూ రీసెర్చ్' సర్వే చెప్పిన కీలక అంశాలు
* 64 శాతం మంది హిందువులు నిజమైన భారతీయులుగా ఉండేందుకు తాము హిందువులై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
* మూడింట రెండొంతుల మంది హిందువులు మతాంతర వివాహాలను వ్యతిరేకిస్తున్నారు.
* ముస్లింలలోనూ చాలామంది మతాంతర వివాహాలపై ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.
* సర్వేలో పాల్గొన్నవారిలో 36 శాతం మంది హిందువులు తమ పొరుగువారిగా ముస్లింలు ఉండడాన్ని కోరుకోవడం లేదని చెప్పారు.
* భారత్‌లో భిన్న మతాలకు చెందిన ప్రజలు ఉండడం లాభిస్తుందని 53 శాతం మంది చెప్పారు.
* 97 శాతం మంది భారతీయులు తాము దేవుడిని నమ్ముతున్నట్లు చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ప్రతి మతం నుంచి సుమారు 80 శాతం మంది దేవుడు ఖచ్చితంగా ఉన్నాడన్నది తమ నమ్మకమని చెప్పారు.
భిన్న సమూహాలకు చెందినవారితో జాతీయ గుర్తింపు గల దేశాన్ని పూర్వీకులు కోరుకున్నారన్నది చాలామంది మేధావుల మాట.
కానీ, ఈ కల నెరవేరలేదు. భారత్ ఒక సంక్లిష్టమైన గణతంత్ర దేశంగా మారిపోయింది.
భిన్న మతాలు, సంస్కృతులకు చెందిన మనుషులు కలసిమెలసి నివసిస్తూనే ఎవరికి వారు ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అతుకుల బొంతలా.
77 శాతం ముస్లింలు, 77 శాతం హిందువులు కర్మను బట్టే ఫలితం ఉంటుందని నమ్ముతున్నారు.
54 శాతం మంది క్రిస్టియన్లదీ అదే నమ్మకం.
''ప్రజల అభిప్రాయాలలో పరస్పర భిన్నమైన దృక్కోణాలు అసాధారణమేమీ కాదు'' అని ఈ నివేదిక సహ రచయిత జోనాథన్ ఇవాన్స్ అన్నారు.
''2019లో ప్యూ రీసెర్చ్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. పశ్చిమ యూరప్ దేశాలకు చెందిన క్రిస్టియన్లు అక్కడ మతం పరంగా మైనారిటీలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారి పట్ల ప్రతికూల భావనలతో ఉన్నారని తేలింది'' అంటూ ఉదాహరణ చెప్పారు జొనాథన్.
''తోటి మనుషులను ప్రేమించాలి'' అనే క్రైస్తవ సిద్ధాంతానికి ఇది పూర్తిగా విరుద్ధం.
క్రైస్తవ మతం చెప్పే సిద్ధాంతాలకు ఆచరణకు మధ్య వ్యత్యాసం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.

ఫొటో సోర్స్, AFP
అయితే, భారత్‌లో కొంత భిన్నమైన వైఖరులు కనిపించాయి.
తమ పొరుగున ముస్లింలు ఉన్నా ఇబ్బందేమీ లేదని 58 శాతం మంది భారతీయులు ఈ సర్వేలో చెప్పారు.
ఇటలీ(65 శాతం), యూకే(78), ఫ్రాన్స్(85), అమెరికా(89) కంటే ఇది తక్కువే. అయితే, ఈ దేశాలేవీ యాంటీ ముస్లిం సెంటిమెంట్లు లేని దేశాలేం కాదు.
నిజమైన భారతీయులుగా ఉండాలంటే హిందువుగా ఉండడం, హిందీ మాట్లాడడం ముఖ్యమని బీజేపీకి ఓటు వేసిన హిందువులు చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
తాము వివక్షకు గురయ్యామని అన్ని ప్రధాన మతాలకు చెందినవారూ చెప్పారని ఈ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రతి అయిదుగురు ముస్లింలలో ఒకరు వివక్షకు గురైనట్లు చెప్పారు.
హిందువులు, ముస్లింలలో కూడా 65 శాతం మంది మత హింస ఈ దేశంలో చాలా పెద్ద సమస్య అని చెప్పారు.
అయితే, దేశంలో కుల వివక్ష తీవ్రంగా ఉందని నమ్ముతున్న వారి సంఖ్య మాత్రం 20 శాతమే.
ప్యూ రీసెర్చ్ చేసిన ఈ సర్వే ఆధారంగా విశ్లేషకులు భారత్‌ను సరికొత్తగా నిర్వచిస్తున్నారు. ''భారత్ భిన్నత్వానికి కట్టుబడి ఉన్న మత దేశం'' అని ప్రొఫెసర్ ప్రతాప్ భాను మెహతా అన్నారు. హిందూ రాజకీయాలకు మద్దతు పెరగడం, వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతు తగ్గుతుండడాన్ని ఆయన ప్రస్తావించారు.
''భారత్ ఒక ప్రజాస్వామ్య చట్రంలోని సంప్రదాయ సమాజం'' అని ఈ సర్వే మరోసారి రుజువు చేసిందని ఇస్లాం రాజకీయ మేధావి హిలాల్ అహ్మద్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








