ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక

కోవిడ్ వల్ల చనిపోయిన ముస్లింల అంత్యక్రియల విషయంలో శ్రీలంక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్ వల్ల చనిపోయిన ముస్లింల అంత్యక్రియల విషయంలో శ్రీలంక ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు

శ్రీలంకలో కోవిడ్-19 కారణంగా చనిపోయిన మైనారిటీ ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన వారిని సమాధి చేయటానికి మారుమూల దీవిని ప్రభుత్వం ఎంపిక చేసింది.

ప్రభుత్వం ఇంకుముందు.. మైనారిటీ మతాలకు చెందిన వారు కూడా మృతులను.. మెజారిటీ అయిన బౌద్ధ మతస్తుల ఆచారం ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించాలంటూ గత ఏప్రిల్ నుంచి ఆదేశాలను అమలుచేసింది. కోవిడ్ మృతులను సమాధి చేయటం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతాయనేది కారణంగా చెప్పింది.

అయితే హక్కుల బృందాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో గత వారంలో ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంది.

ఇస్లాం మతంలో మృతులకు దహన సంస్కారాలు నిషిద్ధం.

కోవిడ్ మృతులను సమాధి చేయటానికి మన్నార్ సింధుశాఖలోని ఇరానాథివు దీవిని తాజాగా ఎంపిక చేసింది.

శ్రీలంక రాజధాని కొలంబోకు 300 కిలోమీటర్ల దూరంలో ఉందీ దీవి. ఇక్కడ జనాభా అతి తక్కువగా ఉండటం వల్లే కోవిడ్ మృతులను సమాధి చేయటానికి దీనిని ఎంపిక చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది.

కోవిడ్ మృతులను సమాధి చేయరాదంటూ ఏప్రిల్ నుంచి అమలు చేసిన నిషేధం మీద ముస్లింలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదికా లేదన్నారు. శ్రీలంక జనాభాలో ముస్లింలు దాదాపు 10 శాతం వరకూ ఉన్నారు.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా మానవ హక్కుల సంస్థలు, ఐక్యరాజ్య సమితి కూడా ఆ ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేశాయి.

మైనారిటీ మతస్తులు తమ సంప్రదాయాల ప్రకారం కోవిడ్ మృతులను సమాధి చేయటానికి దూరంగా ఉన్న దీవిని ఎంపిక చేశామని.. అందులో కొంత ప్రదేశాన్ని కేటాయించామని ప్రభుత్వ అధికార ప్రతినిధి కేహెలియా రాంబక్‌వెల్ల చెప్పినట్లు కొలంబో గెజిట్ ఒక కథనంలో తెలిపింది.

కోవిడ్ మృతుల శరీరాలను సురక్షితంగా ఎలా ఖననం చేయాలనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తృత మార్గదర్శకాలు ఇచ్చింది. అయితే.. కోవిడ్ వ్యాప్తిని నిరోధించటానికి మృతులను దహనం చేయాలని సూచించటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కోవిడ్ మృతుల అంత్యక్రియలకు సంబంధించి శ్రీలంక ప్రభుత్వ విధానం.. బాధితులు, వారి కుటుంబ సభ్యులు.. ప్రత్యేకించి ముస్లింలు, క్రైస్తవులతో పాటు కొందరు బౌద్ధమతస్తుల మతపరమైన భావనలను గౌరవించటంలో విఫలమైందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్ తప్పుపట్టింది.

కేవలం 20 రోజుల వయసున్న ఓ ముస్లిం బాలుడి మృతదేహాన్ని బలవంతంగా దహనం చేయించటంతో.. ప్రభుత్వ విధానంపై విమర్శలు మరింతగా తీవ్రమయ్యాయి.

అయితే.. తాజాగా మైనారిటీ మతానికి చెందిన కోవిడ్ మృతులను సమాధి చేయటానికి ఒక దీవిని ఎంపిక చేయటాన్ని శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ అధినేత రవూఫ్ హకీం తీవ్రంగా విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)