ఘట్‌కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం

మహిళలు
    • రచయిత, ఓల్గా
    • హోదా, బీబీసీ కోసం

ఘట్‌కేసర్ ఘటన చాలా ఆందోళన కలిగించింది. ఆలోచించిన కొద్దీ స్థిమితంగా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని?

బీఫార్మసీ చదివే అమ్మాయి బయటకు వెళ్లిన తరువాత ఇంకా ఇంటికి రాలేదేం అని అడిగిన తల్లిదండ్రులతో తనపై ఆటోడ్రైవర్లు అత్యాచారానికి యత్నించారని చెప్పడం.. పోలీసులు నలుగురు ఆటో డ్రైవర్లను పట్టుకుని వాళ్ల మార్కు ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత ఇదంతా ఆ అమ్మాయి సృష్టించిన కట్టుకథ అని తెలియడం, ఆ అమ్మాయిపై అందరి వ్యాఖ్యానాలు, చివరకు ఆత్మహత్యతో ఆ అమ్మాయి తన కథను ముగించడం.

ఇదంతా ఒకప్పటి లాటిన్‌ అమెరికన్‌ కథలాగా ఉంది. ఈ కథను తెలుగులో రాస్తే అర్థంపర్థం లేని కథ రాశారని ఆ రచయితను విమర్శించే దానిని. కానీ ఇది వాస్తవంగా జరిగింది. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

సింపుల్‌గానైతే ఆ అమ్మాయికి మతి స్థిరత్వం లేదని సమస్యను పక్కనబెట్టవచ్చు. ఇంకొంచెం ఆలోచిస్తే ఒక సమస్యను తప్పించుకోవడం కోసమో. మీడియా అటెన్షన్‌ కోసమో, కావాలని కొందరు ఇలా చేస్తున్నారంటూ తప్పు ఆ అమ్మాయి మీద వేసి శాంతిగా ఉండొచ్చు. 

ఇంకాస్త దూరం పోయే ఓపిక ఉంటే మీడియా అన్ని విషయాలను సంచలనాత్మకంగా, గ్లామరైజ్‌చేసి చూపిస్తుంది దాని ప్రభావం అని మీడియా అతిధోరణుల మీద కోపం తెచ్చుకుని తిట్టుకుని కాసేపు టీవీ కట్టేయవచ్చు.

మరికొన్ని వివరాలలోకి, విశ్లేషణలోకి వెళ్తే.. మేజర్ అయినప్పటికీ ఆ అమ్మాయి కదలికలపై కుటుంబ నిఘా గురించి ఆలోచించవచ్చు.

నిఘా

ఫొటో సోర్స్, iStock

ఆడపిల్లలు ఎంత చదువుకున్నా, ఎన్నేళ్లొచ్చినా " రైట్‌ టు మూవ్‌మెంట్‌" అంటే తమంతట తాము వెళ్లదలుచుకున్న చోటికి వెళ్లి, తాము ఏ విధంగా సమయం గడపాలనుకుంటారో అంత సమయం గడిపి తిరిగి వచ్చే హక్కు పొందలేరు.

"ఎక్కడికి వెళుతున్నావు ? ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు ? ఎవరితో ఉన్నావు? స్నేహితురాలికి ఫోన్‌ ఇవ్వు, తొందరగా రా" వంటి ఒత్తిడులు విపరీతంగా ఉంటాయి. ఆ అమ్మాయి మానసికంగా అలసిపోయేంతగా, విపరీతమైన కోపానికి గురయ్యేంతగా ఉంటాయి ఇవి. 

ఈ అమ్మాయి కూడా అలాంటి ఒత్తిడికి గురై ఉండాలి. ఏదో ఒక అబద్ధం కాకుండా టీవీల ప్రభావమో ఇంకోటో కానీ భయానకమైన కథ అల్లి బయటపడే ప్రయత్నంలో తల్లిదండ్రులను, అందరినీ అశాంతిలోకి, అలజడిలోకి నెట్టింది.

చుట్టూ ఉన్న సమాజం, కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి అమ్మాయిలపై ఎంతగా ఉంటుందో.. ఎంతగా మానసిక క్షోభకు గురిచేస్తుందో అది అనుభవించే వారికే తెలుస్తుంది.

కొంచెం సమయం కూడా తన ఇష్టం వచ్చినట్లు గడిపే స్వేచ్ఛలేకపోవడం, అలా నెలల తరబడి, సంవత్సరాల తరబడి కట్టడిలో గడపడం ఓ రకమైన ఉన్మాదంలోకి నెట్టగలదూ అది ఆత్మహత్యా సదృశ్యం కూడా కాగలదు అని ఈ ఘటన మనకు చెబుతుంది. 

అదే సమయంలో కారణాలేమైనా అమ్మాయిలు కోరి సమస్యలు కొని తెచ్చుకుంటే కలిగే పర్యవసనాలకూ ఇది ఉదాహరణ.

సింబాలిక్ ఇమేజ్

ఫొటో సోర్స్, Getty Images

ఆ అమ్మాయి చెప్పిన విషయాలు మామూలు విషయం కాదు. తనమీద రేప్‌ జరగబోతోందని చెప్పడమంటే ఏంటి ? దాని పరిణామాలేమిటి? అది నిజమని అందరూ నమ్మితే తను తర్వాత జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాలి? అదేమీ ఆ అమ్మాయి ఆలోచించలేదు. తన ఆరోపణల వల్ల ఇతరులకు ఎదురయ్యే సమస్యల గురించీ ఆలోచించలేదు.

ఆలోచనలు చంపేసుకుని, జరగబోయే పరిణామాలపై నిర్లక్ష్యం ప్రదర్శించడమనేది తీవ్ర నిర్బంధంలో చివరి అంచు వరకు చేరినవారు చేసేపని. 

కుటుంబ నిర్బంధం ఆడవాళ్లను ఆత్మహత్యలకు పురిగొల్పడం చూశాం. ఇలాంటి విపరీతపు ఆలోచనలకు కూడా నెడుతుందని ఇప్పుడు తెలుస్తోంది. ఈ విషయం తల్లిదండ్రులకు, పిల్లలకు అందరికీ అర్ధమయ్యేలా చెప్పాలి. 

తమ పిల్లలు బయటకు వెళ్తే ఏ ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నారో, ఆ ప్రమాదం జరగకుండానే జరిగిందని చెప్పే తెగింపు మీవల్లే వారికి వస్తోందని చెప్పాలి. ఒక వయసు వచ్చాక ఆడపిల్లలకు కనీస స్వేచ్ఛ, ఒత్తిడి లేని వాతావరణం అవసరమని తల్లిదండ్రులకు తెలియజెప్పాలి. స్వేచ్చ కోసం చేసే ప్రయత్నంలో పాటించాల్సిన పద్ధతుల గురించి కూడా అమ్మాయిలు తెలసుకోవాలి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, JUPITER IMAGES / HEIDE BENSER

ఈ సమాజం వాస్తవంగానే చాలా హింసతో, స్త్రీల మీద బలహీనులందరి మీదా జరిగే దారుణాతి దారుణమైన దాడులతో రక్తసిక్తంగా ఉంది. ప్రతిరోజూ స్త్రీల మీద దళితుల మీదా, పేదవారి మీదా, మైనారిటీల మీదా జరిగే దారుణ హింసాకాండ మనం అలవాటు పడేంతగా పెచ్చు పెరిగింది.

ఏవో రక్షణ చట్టాలు, శిక్షా చట్టాలు తెచ్చుకున్నాం. మరి ఇప్పుడీ కట్టుకథలు, ఆ చట్టాలను బలహీనపరచవా? మొన్న ఘట్‌కేసర్‌ ఘటనలో ఆ నలుగురినో, ఒకరినో ఎన్‌కౌంటర్‌చేసి ఉంటే పౌరసమాజం పోలీసులకు జైకొట్టి పుష్పగుజ్జాలు ఇచ్చేది గదా? అంత పని జరిగి ఉంటే ఆ కట్టుకథను వాస్తవంగా చేయడానికి ఎన్ని శక్తులు పని చేసేవో కదా? తృటిలో ఆ ప్రమాదం తప్పినా ఇపుడీ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది. సమాజం వాస్తవ అవాస్తవాల మధ్య ఊగిసలాడుతోంది.

నిజానికి ఈ ఘటనలు లేదా ఇలాంటి ఘటనలు చట్టాల దుర్వినియోగమనే పరిధిని కూడా దాటిపోయాయి.

విషయం ఏమిటంటే ఈ సమాజం భౌతికంగా , భావజాలపరంగా, ఆధ్యాత్మిక పరంగా తన స్వరూప స్వభావాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. మనం మానవ సమాజం అనుకుంటున్నదిప్పుడు మానవానంతర సమాజంగా మెల్లగా మారిపోతోంది.

ప్రతీకాత్మక చిత్రం

చప్పుడు చేయకుండా మనం ఎక్కడెక్కడో చూస్తున్పడు , మన కళ్లముందరే మానవానంతర సమాజం ఆవిర్భవిస్తోంది. ఈ మానవానంతర సమాజంలో ఇంత వరకు మానవ జాతి నిర్మించుకుంటూ వచ్చిన హేతువు, కార్యకారణ సంబంధం, నేరం, శిక్ష, చట్టం, రాజ్యం, ప్రభుత్వ యంత్రాంగం, పాలన , విద్యా, జ్ఞానం వంటి భావనలన్నీ క్రమంగా మారిపోతాయి.

ఇంతవరకు మానవులు నిర్మించుకున్న పురోగామి ఆలోచనాల ధారలు మారిపోవడం మొదలు పెట్టగానే క్రమంగా మానవుల స్థానం ఆక్రమణకు గురవుతుంది. మానవుల స్థలకాలాలు దురాక్రమణకు గురవుతాయి. భౌతికంగానూ, భావనలలోనూ కూడా అతిక్రమణ జరుగుతుంది. దానికి విపరీతమైన హింస అనేక రూపాలలో జరగాలి. ఆ హింసను మానవులు ఆమోదిస్తూ పోవాలి. దానికి వాస్తవాలతోపాటు కల్పనలూ కావాలి.

అవును, ఓ రకమైన డిజిటల్‌ ప్రపంచాన్ని నేను మానవానంతర ప్రపంచం అంటున్నాను. కొన్ని డిజిటల్‌ గేమ్స్‌గురించి విన్నప్పుడు అర్థం కాలేదు గానీ ఆ ఆటలోకి వెళ్లినవాళ్లు ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్తున్నారని తెలిసి భయపడ్డాం. ఎందుకాడతారు అలాంటి ఆటలు అని ఆశ్చర్యపోయా. ఎందుకాడతారంటే ఆడకుండా ఉండలేని స్థితిలోకి కొందరు మెల్లగా నెట్టివేతకు గురవుతున్నారు.

విచక్షణను విస్మరించే విధంగా శిక్షణ మనకు తెలీకుండానే సాగుతున్నది. మనలను ఆవరిస్తున్నది.

ఇప్పుడీ అమ్మాయి తన ఆట తాను సృష్టించుకున్నది. ఆ ఆటలో అనివార్యమైన ముగింపునకు చేరుకుంది. ఆ ఆటలో తానెంత హింసకు కారణమవుతుందో ఆలోచించలేని, చెప్పినా పట్టించుకోని అజీవిగా, అప్రాణిగా ఆ అమ్మాయి మారిన క్రమాన్నిమనం చూడవచ్చునేమో.

ఇలాంటి అజీవులను, అప్రాణులను డిజిటల్‌ బ్రహ్మలు విడిగా సృష్టిస్తున్నారు. వాటికి మనల్ని అలవాటు చేయడానికి మానవులే అప్రాణులుగా తయారయ్యే సామాజిక వాతావరణమొకటి మెల్లగా మబ్బు కమ్ముకుంటున్నట్లు కమ్ముకుంటోంది. ఆ వాతావరణంలో చిక్కుకుంటున్నారు కొందరు. ఈ డిజిటల్‌ వాస్తవికతలో, వాస్తవాల పరంపరలో మనకు హేతుబద్ధత తగ్గిపోతుంది.

వీడియో క్యాప్షన్, కత్తి, సుత్తితో తండ్రిని చంపిన కూతుళ్లు.. ఎందుకు?

ఈ డిజిటల్‌ప్రపంచం గురించి నాలాగా ఆలోచించేవారికి మానవానంతర సమాజం గురించి, అంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం భయంగా ఉంది.

ఇది భూభ్రమణ వేగంతో వస్తున్నది. ఆ వేగాన్ని మనం ఎలా అనుభూతి చెందలేమో ఈ ప్రమాదాన్ని కూడా మానవులు కనిపెట్టలేకపోతున్నారు. తెలిసిన కొందరు ప్రత్యామ్నాయాల అన్వేషణలో ఉన్నారు. ఈ అన్వేషణ నిదానంగా జరగుతుంది.

నిజానికి ఇది నాలాంటి వారు రాయదగిన అంశం కాదు. సాంకేతిక, సామాజిక శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేసి రాయాల్సిన విషయం. ఆ బాధ్య తలకెత్తుకునే వారి కోసం ఎదురు చూస్తున్నాం నాలాంటి వారందరం. అమానవీయ మానవానంతర ప్రపంచాన్ని ఆపగలమా ? ఆపలేకపోతే జ్జాన స్వరూప స్వభావాలు మారిపోయి మనమందరంఏమవుతాం?

ఆ మారే క్రమంలో విద్యారంగం, పాలనా రంగం, మీడియాలు ఎవరి ఆటలు వారు సృష్టించుకుని ఆడుతూ, ఆ ఆటలలోకి అమాయక ప్రాణులను లాగుతూ, వారిని అప్రాణులుగా మార్చి వారి ఆటలు వారు ఆడుకునే అవకాశం కల్పిస్తుంటారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, AFP

అయితే ఈ లోతైన ఆలోచనలు చేస్తూనే చట్టాలను దుర్వినియోగం చేయడం గురించి ఆలోచించలేమా అంటే ఆలోచించవచ్చు.

కానీ ఆలోచించి ప్రయోజనమేముంది? కోట్లాదిమందికి చట్టాలను ఎలా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చో, దారి తప్పించవచ్చో అత్యంత నేర్పుతో, బిగువుతో, అందరూ చప్పట్లు కొట్టే విధంగా కొన్ని సినిమాల్లో చూపిస్తుంటే, ఆ ఆట కూడా ఆడాలనిపిస్తుంది కదా! నేరాలు చేయాలనిపిస్తుంది కదా! శిక్షలు తప్పించుకుని నవ్వుకోవాలనిపిస్తుంది కదా!

నేరమూ శిక్షలో రాస్కల్నికోవ్‌ అంతరంగ ఆధ్యాత్మిక మీమాంస వేదన కాకుండాపోయి జూదక్రీడగా మారిపోయి చాలాకాలమైనా ఇప్పుడది అందరూ ఆడుకోగలిగిన ఆట అని నమ్మించే కళాబ్రహ్మలు తయారవుతున్నారు. నమ్మేవారూ తయారవుతున్నారు.

దీన్నంతా ఎలా అర్థం చేసుకోవాలన్నది ఒక ప్రశ్నయితే, అర్థం చేసుకుని ఏం చేయాలన్నది మరో ప్రశ్న.

డిజిటల్ ప్రపంచం

ఫొటో సోర్స్, Getty Images

" అసలు విషయం ప్రపంచాన్ని మార్చడం" అని కార్ల్‌మార్క్స్‌ వంటివారు కాకుండా మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్‌ అధినేతలు చెబుతున్నారు. వారు మానవ సమాజాన్ని మానవానంతర సమాజంగా మార్చడానికి సాంకేతిక డిజిటల్ విప్లవాన్ని తీసుకురావడం కోసం సాయుధులైన సైనికులను పోగు చేస్తున్నారు. వారిని తయారు చెయ్యటం కోసం విద్యారంగమంతా పని చేస్తోంది. ఇలాంటి ప్రపంచాన్ని మానవ ప్రపంచంగా నిలబెట్టడం ఎట్టా అని ఆలోచించడం చాలా అవసరం. అతి చిన్న విషయంగా కనిపించేవాటి వెనక కూడా పెద్ద ప్రశ్నలు దాగి ఉంటాయని గ్రహించడం ఒక అడుగు ముందుకు వేసినట్లవుతుందేమో!

(వ్యాసకర్త రచయిత. అభిప్రాయాలు వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)