మీరు కరోనాసోమ్నియాతో బాధపడుతున్నారా? దీన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుసా?

నిద్ర

ఫొటో సోర్స్, iStock

    • రచయిత, బ్రైన్ లుఫ్కిన్
    • హోదా, బీబీసీ వర్క్ లైఫ్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

కొత్త సంవత్సరంతో పాటు కొత్త తీర్మానాలు పుడతాయి. అందులో ఎక్కువ నిద్రపోవాలనే లక్ష్యం కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ సంక్షోభం.. మంచి నిద్ర పట్టడాన్ని కూడా కష్టంగా మార్చేయడమే ఈ విధమైన తీర్మానానికి కారణం. దీనికి కొంత మంది నిపుణులు కరోనాసోమ్నియా లేదా కోవిడ్ సోమ్నియా అని పేరు పెట్టారు.

ఈ పరిణామం ప్రపంచ వ్యాప్తంగా కనిపించింది. కొవిడ్-19 సమయంలో కలిగిన ఒత్తిడి వలన ఈ పరిస్థితిని చాలా మంది అనుభవించారు. ఇలాంటి పరిస్థితిని చవిచూసినవారి సంఖ్య ప్రతి ఆరుగురిలో ఒకరి నుంచి ప్రతి నలుగురిలో ఒకరికి పెరిగినట్లు యూకేలోని సౌతాంప్టన్ యూనివర్సిటీలో ఆగష్టు 2020లో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది.

ఇది ముఖ్యంగా తల్లులలో, ముఖ్యావసరాల రంగాలలో పని చేసే వారిలో ఎక్కువగా కనిపించింది.

లాక్ డౌన్ ఉన్న సమయంలో చైనాలో ఇన్సోమ్నియా అనుభవిస్తున్న వారి సంఖ్య 14.6 నుంచి 20 శాతానికి పెరిగింది. ఇటలీ, గ్రీస్ దేశాలలో చికిత్స అవసరమైన స్థాయిలో ఈ సమస్య కనిపించింది. 2020లో గతంలో ఎన్నడూ లేనంతగా ఇన్సోమ్నియా అనే పదాన్ని గూగుల్ లో అత్యధికంగా వెతికినట్లు తేలింది.

మనలో చాలా మందిమి నిద్ర లేమితో బాధ పడుతున్న వారిమే . ఈ మహమ్మారి రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. మన నిత్య జీవితంలో సామాజిక దూరం పాటించడం ఒక అలవాటుగా మారిపోయింది. పనికి ఇంటికి ఉన్న సరిహద్దులు చెరిగిపోయాయి. మన జీవితాలలో ఒక అనిశ్చితి పేరుకుపోయింది. ఇవన్నీ మన నిద్ర మీద తీవ్రంగా ప్రభావం చూపించాయి.

దీని వలన మన ఆరోగ్యం, పని చేసే సామర్ధ్యం మీద కూడా ప్రభావం పడుతుంది. కానీ, ఈ నిద్ర లేమి సమస్యను మనం కొత్త కోణంలోంచి చూసి మన జీవితాలను తిరిగి పాత పద్ధతిలోకి ఎలా తెస్తామనే విషయంలో చాలా మార్పును తీసుకుని వచ్చింది.

నిద్రలేమి

ఫొటో సోర్స్, Alamy

చెదిరిన జీవితాలు

మహమ్మారి ఉన్నా లేకపోయినా నిద్రలేమితో బ్రతకడం చాలా కష్టం. అస్తమానూ నిద్రలేమి, లేదా నిద్రలో ఆటంకాలు దీర్ఘ కాలంలో ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి. దీని వలన ఊబకాయం, ఆందోళన, ఒత్తిడి, గుండె జబ్బులు, మధుమేహానికి దారి తీస్తాయి.

ఏడు గంటల కంటే తక్కువ సేపు నిద్రపోతే చేసే పనిపై కూడా ప్రభావం చూపిస్తుంది. దాని వలన ఎక్కువ తప్పులు చేయడం, ఏకాగ్రత కోల్పోవడం, ప్రతికూల ప్రవర్తన పెరగడంతో అది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది.

"ఒకవేళ నిద్రలేమితో ఎవరైనా బాధపడుతున్నట్లయితే మీరు కూడా ప్రపంచంలో ఇలా బాధపడుతున్న చాలామందిలో ఒకరు. ఇదంతా కోవిడ్ వలన వచ్చిన మార్పుల వల్లే జరుగుతోంది" అని మానసిక వైద్య నిపుణుడు, న్యూరాలజిస్ట్ డాక్టర్ స్టీవెన్ ఆల్ట్చూలర్ అన్నారు.

దీనికి చాలా కారకాలు ప్రభావితం చేస్తాయి. ముందుగా మన నిత్య జీవితం, పరిసరాలకు బాగా అంతరాయం కలిగింది.

సాధారణంగా మన జీవితాలు అలార్మ్ మోతతో మొదలయి, ప్రయాణాలు, పని మధ్యలో బ్రేక్ తీసుకోవడం, నిద్రపోవడం అన్నీ ఒక క్రమబద్ధంగా సాగిపోతూ ఉంటాయి కానీ, కోవిడ్ 19 వీటినన్నిటినీ చిన్నాభిన్నం చేసి వదిలిపెట్టింది.

"ఆఫీస్ సమావేశాలు, నిర్ణీత లంచ్ బ్రేక్ లను తీసుకోవడం లాంటి వాటిని కోల్పోయాం. ఇంటి నుంచి పని చేయడం బాడీ క్లాక్ కి బాగా భంగం కలిగించింది" అని ఆల్ట్చూలర్ అన్నారు.

నిద్రలేమి

ఫొటో సోర్స్, Alamy

ఆఫీసులో ఉన్నప్పుడు పని చేయాలని, ఇంట్లో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలని బ్రెయిన్ సెట్ అయిపోయి ఉంటుంది.

‘‘ఇక్కడొక తేడా ఉంది. ఇప్పుడు మనం రోజంతా ఇంట్లోనే ఉంటున్నాం" అని కాలిఫోర్నియా యూనివర్సిటీలో హెల్త్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఏంజెలా డ్రేక్ అంటున్నారు.

ఆమె కరోనాసోమ్నియా గురించి రాశారు. ఇంటి నుంచి పని చేసేటప్పుడు మనకి తగినంత వ్యాయామం దొరకక పోవడం, తగినంత వెలుతురులో ఉండకపోవడం కూడా నిద్రలేమికి కారణమని ఆమె అంటారు.

అలాగే పనిని ఎలా నిర్వహిస్తున్నామనే అంశం కూడా ఉంది. చాలా దేశాలలో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దాంతో చాలా మంది ఉద్యోగాలు ఉన్నవారు తమ ఉద్యోగాలు నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడి పని చేయాలని అనుకున్నారు.

ఇంటి దగ్గర నుంచి పని చేయడం వలన అవసరమైన దాని కంటే ఎక్కువ పని గంటలు పని చేస్తూ పని వేళలు క్రమబద్ధంగా లేకపోవడం కూడా జరిగింది.

"ఇంటికి పనికి మధ్య విభజనలు తగ్గిపోయాయి. పనిని సమయానికి ముగించడం చాలా మందికి కష్టంగా మారింది. చేయాల్సిన పనుల నుంచి తప్పించుకోవడం కష్టంగా మారింది" అని ఆల్ట్చూలర్ అన్నారు.

వీటికి తోడు ఒత్తిడి నుంచి దూరం కావటానికి పనికొచ్చే హాబీలు, స్నేహితులను మిస్ అవ్వడం కూడా మొదలయింది. మనలో చాలా మంది మానసిక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు.

"ఈ మహమ్మారి మొదలైన కొత్తలో చాలా మంది ఒత్తిడి నుంచి దూరం కావడానికి రకరకాల ఆటలు ఆడుకుంటూ తమని తాము ప్రభావితం చేసుకున్నారు. కానీ, మహమ్మారి సమయం కొనసాగే కొలదీ ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టంగా మారింది. దీంతో నిద్రలేమి లాంటి సమస్యలు తలెత్తాయి" అని డ్రేక్ అన్నారు.

"కొన్ని నిద్రలేమి సమస్యలు తీవ్రరూపం దాల్చి దీర్ఘకాల సమస్యలుగా పరిణమించాయి" అని ఆమె అన్నారు.

నిద్రలేమి

ఫొటో సోర్స్, Alamy

కొన్ని సందర్భాలలో మహమ్మారి వలన కొంత మందికి సరైన సమయంలో చికిత్స అందలేదు. చాలా అవసరం అయితేనే వైద్య సహాయాన్ని ఆశ్రయించారు. కొన్ని వైద్య కేంద్రాలలో సిబ్బంది కరువయ్యారు. లేదా కొన్ని వైద్య కేంద్రాలు కోవిడ్ కేసులతో నిండిపోయాయి.

నిజానికి ఈ నిద్రలేమితో వైద్య రంగంలో పని చేసేవారు ఎక్కువగా బాధపడ్డారు.

1,90,000 మంది పాల్గొన్న 55 అంతర్జాతీయ అధ్యయనాలను ఒట్టావా యూనివర్సిటీ పరిశీలించింది. అందులో మహమ్మారి సమయంలో వైద్య రంగంలో పని చేసేవారిలో నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన, కోవిడ్ సోకిన తర్వాత ఒత్తిడి లాంటివి కనీసం 15 శాతం పెరిగాయని తేలింది. అందులో నిద్రలేమితో బాధపడేవారు 24 శాతం పెరిగారు.

ఇది చాలా సాధారణం అని ఆల్ట్చూలర్ అంటారు.

కోవిడ్ 19 లాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి కానీ, లేదా 9/11 లాంటి సంఘటన కానీ, లేదా ఒక కారు ప్రమాదం కానీ జరిగిన తర్వాత నిద్ర లేమి కలగడం సహజమని ఆయన అన్నారు.

దీనిని ఎదుర్కోవడం ఎలా?

నిద్రలేమి సమస్యలు ఎదురైనప్పుడు సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు.

"ఈ మహమ్మారి చాలా ఎక్కువ కాలం ఉన్నందున నిద్రలేమి సమస్య ఒక్కసారిగా తగ్గదు’’ అని యూకేలో స్లీప్ చారిటీ సిఇఓ లీసా ఆర్టిస్ చెప్పారు.

నిపుణులను సంప్రదించి తగిన సహాయం తీసుకోవడం అవసరం అని ఆమె అన్నారు.

కానీ, కోవిడ్ వలన వర్చ్యువల్ గా వైద్యులను సంప్రదించే ఒక కొత్త విధానానికి తెర లేచింది అని ఆల్ట్చూలర్ అన్నారు.

ఈ సమస్యలను నివారించాలంటే పడుకునే సమయంలో ల్యాప్ టాప్ పెట్టుకుని పని చేయడం పూర్తిగా నిషిద్ధం అని డ్రేక్ అంటారు.

అలాగే ఒత్తిడి తగ్గించుకోవడానికి వార్తలు కూడా తక్కువగా చూడాలి అని సూచిస్తున్నారు.

అలార్మ్ కోసం ఫోను వాడటాన్ని తగ్గించాలి. నీలి రంగు కాంతి నిద్రకు హాని చేస్తుందని అన్నారు. అలాగే, ఒత్తిడి రాకుండా గడియారం కనిపించకుండా పెట్టుకోవడం కూడా ఒక మార్గమని అంటారు.

అయితే, ఇవి సాధారణ పరిస్థితులు మాత్రం కాదు. ‘‘ఇలాంటి పరిస్థితి ఒక 100 సంవత్సరాల క్రితం వచ్చింది’’అని డ్రేక్ అంటారు. ఇలాంటి పరిస్థితిని మనలో ఎవరం ఎప్పుడూ అనుభవించి ఉండం అని డ్రేక్ అన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)