కరోనావైరస్ కొత్త రకాల మీద కూడా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సీన్ - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
మైఖేల్ రాబర్ట్స్,
హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్
బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కనిపిస్తున్న కరోనావైరస్ మహమ్మారి కొత్త రకాలు, మరింత్ర ప్రమాదకరమైన రకాల మీద కూడా మోడెర్నా సంస్థ కోవిడ్ వ్యాక్సిన్ పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ఆ సంస్థ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అమెరికా ఫర్మాస్యూటికల్ కంపెనీ మోడెర్నా తయారు చేసిన ఈ వ్యాక్సీన్ పుట్టించే యాంటీబాడీలు.. కొత్త రకాల కరోనావైరస్‌ను కూడా గుర్తించి వాటి మీద పోరాడుతున్నట్లు ప్రాధమిక లేబరేటరీ పరీక్షలు చెప్తున్నాయి.
వ్యాక్సీన్ తీసుకున్న వారిలోనూ ఇలా జరుగుతోందని నిర్ధారించటానికి మరిన్ని అధ్యయనాలు అవసరం. ఈ కొత్త రకాల కరోనావైరస్ పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి.
ఈ వైరస్‌లలో జన్యుపరమైన మార్పులు (మ్యుటేషన్లు) చోటుచేసుకోవటం వల్ల అసలు కరోనావైరస్ కన్నా మరింత సులభంగా మనుషులకు సోకుతున్నాయి.
గత ఏడాది సెప్టెంబరులో బ్రిటన్‌లో తలెత్తిన కొత్త రకం కరోనావైరస్.. అసలు వైరస్ కన్నా 70 శాతం ఎక్కువగా ఒకరి నుంచి ఒకరికి సోకుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం తయారుచేసిన వ్యాక్సీన్లు మొదటి రకాల కరోనావైరస్ చుట్టూ తయారుచేశారు. అయినప్పటికీ కొత్త రకాల వైరస్‌ల మీద కూడా అంత బలంగా కాకపోయినా ఏదో ఒక మేరకు పని చేయాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఫైజర్ వ్యాక్సీన్ కూడా బ్రిటన్‌లో తలెత్తిన కొత్త రకం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తోందని ఇప్పటికే ప్రాధమిక ఫలితాలు సూచిస్తున్నాయి.
మోడెర్నా వ్యాక్సీన్ రెండు డోసులు తీసుకున్న ఎనిమిది మంది వ్యక్తుల రక్త నమూనాలను పరిశోధకులు పరిశీలించారు. ఈ వ్యాక్సీన్ కొత్త రకాల కరోనావైరస్‌లను కూడా గుర్తిస్తోందని, వాటి నుంచి రక్షణ కల్పిస్తోందని ప్రాధమిక ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ వ్యాక్సీన్ ప్రేరణతో శరీర రోగనిరోధక శక్తి తయారు చేసే యాంటీబాడీలు.. కరోనా వైరస్ మన శరీర కణాల్లోకి చొరబడకుండా నిరోధిస్తాయి.
కొత్త రకం కరోనావైరస్ సోకిన వారి రక్త నమూనాల్లో ఈ ప్రభావాన్ని సాధించటానికి అవసరమైన యాంటీబాడీలు ఉన్నాయని పరిశోధనలు గుర్తించారు. అయితే యూకే రకం వైరస్ మీద చూపినంత ప్రభావం దక్షిణాఫ్రకా రకం వైరస్ మీద చూపుతున్నట్లు ప్రస్తుతం కనిపించలేదు.
దీని అర్థం.. దక్షిణాఫ్రికా రకం వైరస్ నుంచి ఈ వ్యాక్సీన్ ద్వారా లభించే రక్షణ మరింత త్వరగా మాయం కావచ్చునని మోడెర్నా చెప్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశమని బ్రిటన్‌లోని వార్విక్ మెడికల్ స్కూల్ వైరస్ నిపుణుడు ప్రొఫెసర్ లారెన్స్ యంగ్ పేర్కొన్నారు.
మూడో డోసు బూస్టర్ ఇవ్వటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా అనే దిశలో మోడెర్నా ప్రస్తుతం యోచిస్తోంది. ఇతర శాస్త్రవేత్తల లాగానే.. వ్యాక్సీన్‌ను రీడిజైన్ చేయటం వల్ల కొత్త రకం వైరస్‌ల మీద ప్రభావవంతంగా ఉంటుందా అనే కోణంలోనూ పరిశోధనలు సాగిస్తోంది.

తిరుపతి: శ్రీనివాసం సమీపంలో కూలిన నిర్మాణంలోని 'గరుడ వారధి' ఫ్లై ఓవర్
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కొంత భాగం కూలిపోయింది.
గరుడ వారధిగా పిలిచే ఈ ఫ్లైఓవర్‌కు చెందిన ఒక బ్లాక్ కూలిపోయింది.
ప్రాణ నష్టమేమీ జరగలేదని స్థానిక అధికారులు తెలిపారు.
నగరంలోని శ్రీనివాసం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ఫొటో సోర్స్, Hindustan Times/GettyImgaes
రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా గందరగోళం సృష్టించేందుకు పాక్ ట్విటర్ హ్యాండిల్స్ ప్రయత్నం
భారత రాజధాని దిల్లీలో మంగళవారం గణతంత్ర దినోత్సవంనాడు నిరసనగా రైతులు చేపట్టబోతున్న ట్రాక్టర్ ర్యాలీ విషయంలో గందరగోళం సృష్టించేందుకు పాకిస్తాన్‌కు చెందిన 300 ట్విటర్ హ్యాండిల్స్ పనిచేస్తున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో దిల్లీ సరిహద్దుల్లో రైతులు నెలల నుంచీ నిరసనలు చేపడుతున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు వీరు దిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టాలని ప్రణాళికలు రచించారు. దీనికి సంబంధించిన వివరాలను దిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేందర్ పాఠక్ వెల్లడించారు. గణతంత్ర వేడుకలు పూర్తయిన తర్వాత, రైతులు ర్యాలీ చేపట్టేందుకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు.
‘‘ఈ ర్యాలీ విషయంలో గందరగోళం సృష్టించేందుకు జనవరి 13 నుంచి 18 మధ్య పాకిస్తాన్‌కు చెందిన దాదాపు 300 ట్విటర్ హ్యాండిల్స్ ప్రయత్నించినట్లు సమాచారం అందింది’’అని ఆయన చెప్పారు.
‘‘గణతంత్ర దినోత్సవంనాడే రైతులు కూడా ర్యాలీ చేపట్టాలని భావిస్తున్నారు. దీంతో వారికి ప్రత్యేక సమయం కేటాయించాం. దాదాపు 170 కి.మీ. మార్గంలో ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఆ సమయంలో బ్యారికెడ్లన్నీ తీసేస్తాం. దీంతో రైతులంతా దేశ రాజధానిలోకి వస్తారు. కొంతదూరం వచ్చాక వారు వెనక్కి వెళ్లిపోతారు’’అని ఆయన పేర్కొన్నారు.
‘‘రైతులు నిరసన తెలుపుతున్న సింఘూ బోర్డర్ నుంచే ఈ ప్రదర్శన మొదలవుతుంది. కుండ్లి-మానేసార్-పల్వల్ ఎక్స్‌ప్రెస్ వే గుండా ఈ ర్యాలీ వెళ్తుంది. మళ్లీ సింఘూ బోర్డర్‌కే రైతులు వచ్చేస్తారు’’అని ఆయన వెల్లడించారు.
ర్యాలీ అనంతరం శాంతియుతంగా తమ శిబిరాలకు వెళ్లిపోతామని రైతులు హామీ ఇచ్చినట్లు పాఠక్ వివరించారు.

ఫొటో సోర్స్, NurPhoto
పంజాబ్ ప్రభుత్వంతో ఎప్పుడూ చర్చించలేదు
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్రం తమతో చర్చలు జరపలేదని, రాష్ట్రానికి చెందిన ఏ మంత్రీ ఆ చర్చల్లో పాల్గొనలేదని పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ వెల్లడించారు.
వ్యవసాయ చట్టాలపై సంప్రదింపులకు సంబంధించి కేంద్రం విడుదలచేసిన మీటింగ్ మినిట్స్‌ను ఆయన ప్రస్తావించారు.
‘‘ఈ మినిట్స్‌లోని వివరాలను చూస్తే తెలుస్తుంది. మాతో ఆ చట్టాల గురించి చర్చించలేదని స్పష్టం అవుతుంది’’అని ఆయన అన్నారు.
‘‘కావాలనే అకాలీదళ్, బీజేపీ గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. ఆప్ కూడా వారిలానే పనిచేస్తోంది. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి బదులు.. వారిని అన్నిరకాలుగా దెబ్బతీస్తున్నారు’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- BBC ISWOTY : రతన్‌బాలా దేవీ.. భారత ఫుట్‌బాల్ జట్టుకు ఊపిరి
- కోవిడ్-19: సింగిల్ డోస్ వ్యాక్సీన్ ఎంత వరకు పని చేస్తుంది ? రెండో డోస్ తీసుకోకపోతే ఏమవుతుంది ?
- ‘వాయిదా కాదు.. రద్దు చేయాలి.. ఉద్యమం అప్పుడే అయిపోలేదు’.. వ్యవసాయ చట్టాలపై రైతు నాయకులు
- సేఠ్ ఆబిద్: బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- లీసా మోంట్గోమేరీ: 67 ఏళ్ల తరువాత తొలిసారిగా ఒక మహిళకు మరణ శిక్ష అమలు చేసిన అమెరికా
- కరోనావైరస్: భారత్‌లో జనవరి 16 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్... ఎలా చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








