బదాయూ గ్యాంగ్ రేప్: ఆలయానికి వెళ్లిన మహిళపై అత్యాచారం, హత్య... ఆలయ పూజారే నిందితుడు

ఫొటో సోర్స్, CHITRANJAN SINGH
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం, బదాయూ నుంచి
ఉత్తర ప్రదేశ్ బదాయూ జిల్లాలోని ఉఘైతీలో 50 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. తర్వాత ఆమెను హత్య చేశారు.
ఆదివారం సాయంత్రం మహిళ ఆలయంలో పూజ చేయడానికి వెళ్లినప్పుడు ఈ ఘోరం జరిగింది. ఈ ఘటన సంబంధించి ఆలయ పూజారి, అతడి ఇద్దరు సహచరులపై ఆరోపణలు నమోదు చేశారు.
ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితుడు ఆలయ పూజారి ఇంకా పోలీసులకు దొరకలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరోవైపు జాతీయ మహిళా కమిషన్ ఈ కేసుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని యూపీ పోలీసులను కోరింది.
ఈ ఘటన గురించి బదాయూ ఎస్ఎస్‌పీ సంకల్పశర్మ బీబీసీతో మాట్లాడారు.
"ఉఘైతీ పోలీస్ స్టేషన్ పరిధిలో 50 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా ఐపీసీ సెక్షన్ 302, 376డి కింద కేసు నమోదు చేశాం. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తులో నిర్లక్ష్యం చూపిన పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేశాం" అన్నారు.

ఆలయానికి వెళ్లి, తిరిగి రాలేదు
ఆదివారం సాయంత్రం ఆలయంలో పూజ చేయడానికి వెళ్లిన మహిళ, చాలా సమయం గడిచినా తిరిగి రాలేదని, దాంతో ఇంట్లో అందరూ కంగారు పడ్డారని మహిళ కుటుంబ సభ్యులు చెప్పారు.
"రాత్రి 11 గంటలకు మహాత్మా(ఆలయ పూజారి) తీవ్రంగా గాయపడిన నా భార్యను ఇంటికి తీసుకొచ్చారు. ఆమె శరీరం నుంచి రక్తం కారుతోంది. రక్తం బాగా పోవడంతో ఆమె చనిపోయి ఉంది. ఆ సమయంలో మహాత్మా సత్యనారాయణ్‌తోపాటూ వేదరామ్, డ్రైవర్ జస్పాల్ కూడా ఉన్నారు" అని మహిళ భర్త చెప్పారు.
దాంతో, తాము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, పోలీసులు ఎలాంటి రిపోర్ట్ నమోదు చేయలేదని కుటుంబ సభ్యులు చెప్పారు.
మంగళవారం మహిళ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక, అందులో గ్యాంగ్ రేప్ చేయడంతోపాటూ, ఆమెను దారుణంగా హత్య చేశారనే విషయం బయటపడింది. పోలీసులు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బుధవారం ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఆలయ పూజారి సత్యనారాయణ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.
మీడియాతో మాట్లాడిన బదాయూ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యశ్‌పాల్ మహిళ పోస్టుమార్టం గురించి సమాచారం ఇచ్చారు.
"పోస్టుమార్టం రిపోర్టులో, బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్‌లో మైనర్ ఇంజూరీస్, ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఒక కాలికి కూడా ఫ్రాక్చర్ ఉంది. మిగతా రాడ్ గాయాలు ఉన్నాయి. అవి ఎక్కడైనా తగిలుండచ్చు. వాటి వల్లే ఆమెకు చాలా రక్తస్రావం అయ్యింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె షాక్‌లోకి వెళ్లిపోయారు. తర్వాత చనిపోయారు. మొదట చూడగానే ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనిపించింది. ప్రైవేట్ పార్ట్స్ మీద ఉన్న గాయాలను బట్టి అదే అనిపిస్తోంది. మిగతా విసరా దర్యాప్తు కోసం పంపించాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుంది" అన్నారు.
ఉఘైతీ పోలీస్ స్టేషన్లో పోలీసులు మొదట ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్పారు. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో ఘోరాలు బయటపడ్డంతో హత్య, గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారని తెలిపారు.
ఘటన జరిగిన రాత్రే పోలీసులకు సమాచారం ఇచ్చామని, కానీ, పోలీసులు తర్వాత రోజు అక్కడకు చేరుకున్నారని బాధిత మహిళ కొడుకు చెప్పాడు.

ఫొటో సోర్స్, GOPAL SHOONYA/BBC
తప్పుదారి పట్టించిన పూజారి ప్రకటన
సోమవారమే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, పోస్టుమార్టం అయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
"మహిళ బావిలో పడడం వల్ల చనిపోయిందని ప్రధాన నిందితుడు, ఆలయ పూజారి సత్యనారాయణ్ రెండు రోజుల వరకూ మీడియాకు ప్రకటనలు ఇస్తూనే వచ్చాడు. కుటుంబ సభ్యులు గ్యాంగ్ రేప్, హత్య జరిగినట్లుందని ఆరోపించినా, పోలీసులు మాత్రం మొదట పూజారి సత్యనారాయణ్ మాటలు నమ్మి, దాని ప్రకారమే దర్యాప్తు చేశారు" అని " స్థానిక జర్నలిస్ట్ చిత్‌రంజన్ సింగ్ చెప్పారు.
ఘటన తర్వాత మీడియాతో మాట్లాడిన పూజారి మహిళ ఒక బావిలో పడిపోయారని చెప్పాడు.
"మహిళ బావిలో పడిపోయారు. నేను సాయం కోసం వేదరామ్, జస్పాల్‌ను పిలిచాను. వాళ్లతో కలిసి మేం ఆమెను బయటకు తీశాం. ఆమె అప్పటికే చనిపోయున్నారు. తర్వాత, మేం ఆమెను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాం" అన్నాడు.
పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేవరకూ స్థానిక పోలీసులు పూజారి సత్యనారాయణ్ చెప్పిందే నిజం అనుకున్నారు.
మహిళ ఏ బావిలో పడిపోయారని పూజారి చెప్పాడో, అక్కడకు చేరుకోవడం చాలా కష్టం అని స్థానికులు చెబుతున్నారు. అందుకే, ఆమె ఆ బావిలో పడిపోయారని చెప్పినప్పుడు తమకు నమ్మకం కలగలేదన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'కన్యత్వ పరీక్షలు' చేయడాన్ని నిషేధించిన పాకిస్తాన్ కోర్టు
- అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం ముస్లింలకు మేలు చేస్తోందా... కీడు చేస్తోందా?
- రుకేయా షకావత్: అమ్మాయిల జీవితాలను మార్చిన ‘మహిళా రామ్మోహన్ రాయ్’
- ఇరాన్ అణు శాస్త్రవేత్తలు వరుసగా ఎందుకు హత్యకు గురవుతున్నారు?
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- ‘ఎవరైనా నా ఇంటి తలుపు తట్టి 5 బుల్లెట్లను పేల్చవచ్చు.. నన్ను, నా కుటుంబాన్ని చంపేయొచ్చు’
- ఏపీలో కుక్కలు పెంచాలంటే లైసెన్స్ తప్పనిసరి.. ఈ జీవోపై విమర్శలకు కారణమేంటి
- "ఆమె అందగత్తె, తెలివైన అమ్మాయి. కానీ, భారతీయురాలు"
- 72,000 టన్నుల వజ్రాలు నిక్షిప్తమైన సుందర నగరం
- మీరు ఎంతటి తెలివిగలవాళ్లైనా, ప్రతిభావంతులైనా సరే లెక్కల్లో ఈ చిన్న తేడా మిమ్మల్ని ముంచేస్తుంది..
- కరోనావైరస్ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?
- లేడీ బైక్ మెకానిక్: 'అబ్బాయిల పనులు ఎందుకన్నారు... అయినా ఎందుకు చేస్తున్నానంటే...'
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








