ఇరాన్‌ అణు శాస్త్రవేత్తలు వరుసగా ఎందుకు హత్యకు గురవుతున్నారు? ఇది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఆపరేషనా?

ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

ఇరాన్ అణు శాస్త్రవేత్త మోహసీన్ ఫఖ్రీజాదే` ఇటీవల హత్యకు గురయ్యారు. ఆయన హత్య గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, నడి రోడ్డు మీద ఉండగానే ఓ ఆటోమాటిక్ మెషీన్ గన్ సాయంతో ఆయన్ను హంతకులు అంతమొందించారని ఇరాన్ అధికారులు తాజాగా వెల్లడించారు.

ఈ హత్య వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది.

ఇరాన్‌లో ఇలాంటి దాడి చేయగల సామర్థ్యం ఉన్న అతికొద్ది దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. ఇదివరకు కూడా ఇలాంటి పనిని ఆ దేశం చేసింది. అందుకే ఇజ్రాయెల్‌ను ఇరాన్ అనుమానిస్తోంది.

2010 నుంచి 2012 వరకు ఇరాన్ అణు కార్యక్రమంతో సంబంధమున్న నలుగురు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. మరో శాస్త్రవేత్త ఓ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.

అయితే, ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఒక్కటే ఈ రహస్య ఆపరేషన్ల వెనుక ఉందన్న నిర్ణయానికి వచ్చే పరిస్థితి లేదు.

ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

మొసాద్ ఇలాంటి ఆపరేషన్లను తాము చేశామని ఎప్పటికీ చెప్పదని, అలా చేస్తే ఇరాన్ ప్రతీకార చర్యలను ఆహ్వానించినట్లవుతుందని ఇజ్రాయెల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్‌కు చెందిన రెజ్ జిమట్ బీబీసీతో అన్నారు.

''కానీ, ఇరాన్‌లో జరిగే గూఢచర్య ఆపరేషన్లు, మరీ ముఖ్యంగా అణు కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసే దేశాలు చాలా తక్కువ. సాధారణంగా మొసాద్ లేదా అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ లేదా రెండు కలిసి ఇలాంటివి చేస్తుంటాయి'' అని ఆయన అన్నారు.

ఇరాన్ అణు కార్యక్రమాలకు అవరోధం కలిగించేందుకు గూఢచర్య సంస్థల ప్రయత్నాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి.

''ఇరాన్ అణు కార్యక్రమానికి సప్లై చైన్‌ను దెబ్బతీయాలని మొదటగా ప్రయత్నించాయి. ఇరాన్ ఈ కార్యకలాపాలను రహస్యంగా చేసేది. అవసరమైన సామగ్రిని బహిరంగంగా కొనలేదు. కాబట్టి, మధ్యవర్తుల సాయం తీసుకోవాల్సి వచ్చేది. ఐరాస, అమెరికా తదితర దేశాలు ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. కొన్ని సార్లు సఫలమయ్యాయి కూడా'' అని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డబ్లిన్‌లో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల అంశంపై ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రిచర్డ్ మహెర్ చెప్పారు.

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి స్ట్రక్స్‌నెట్ అనే మాల్వేర్ అభివృద్ధి చేశాయని, దీంతో ఇరాన్ అణు కార్యక్రమాలపై దాంతో సైబర్ దాడి చేశాయని చెబుతారు.

2007 నుంచి 2010 వరకు ఇరాన్ అణు కార్యక్రమాలే లక్ష్యంగా అనేక సైబర్ దాడులు జరిగాయి.

2010లో మోటార్ సైకిల్ బాంబు దాడిలో అణు శాస్త్రవేత్త మసూద్ అలీ మహమ్మద్ ప్రాణాలు కోల్పోయారు. అణు శాస్త్రవేత్తల హత్యలు ఆయనతోనే మొదలయ్యాయి. మరుసటి రెండేళ్లలో మరో ముగ్గురు అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు.

ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఈ హత్యల వెనుక ఉన్నది ఇజ్రాయెల్ కావొచ్చని, అమెరికాకు వీటితో సంబంధం లేకపోవచ్చని చాలా మంది భావిస్తారని రిచర్డ్ మహెర్ చెప్పారు.

2015 జనవరిలో తమ శాస్త్రవేత్తను హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నాలను భగ్నం చేశామని ఇరాన్ ప్రకటించింది. అదే ఏడాది ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేయడంతో గూఢచర్య ఆపరేషన్లు తగ్గుతూవచ్చాయి.

2018 ఆరంభంలో ఇరాన్ అణు కార్యక్రమాలకు సంబంధించిన రహస్య పత్రాలు మొసాద్‌కు చిక్కాయి. 2020లో గూఢచర్య ఆపరేషన్లు బాగా పెరిగాయి.

ఈ ఏడాది వేసవిలో నైటాంజ్ అణు కేంద్రంలో ఓ పేలుడు జరిగింది. దీని వెనుక కూడా మొసాద్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపించింది.

ఇదే ఏడాది మోహసీన్ కూడా హత్యకు గురయ్యారు. ఆయన పత్రాలు రెండేళ్ల క్రితం చోరీకి గురయ్యాయి.

మోహసీన్ ఏఎమ్ఏడీ ప్రాజెక్టుకు డైరక్టర్‌గా ఉండేవారు. అణ్వాయుధాలు తయారుచేసుకునేందుకు ఇరాన్ మొదలుపెట్టిన రహస్య ప్రాజెక్ట్ ఇది. అయితే, 2003లో దీన్ని ఇరాన్ నిలిపివేసింది.

అణు కార్యక్రమాల విషయంలో ఇరాన్ వెనక్కితగ్గినట్లుగా ఆ పరిణామాన్ని చూడొచ్చని రెజ్ జిమ్మట్ బీబీసీతో అన్నారు.

ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

ఇక అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలని నిర్ణయించుకున్నాక ఇరాన్ అణు కార్యక్రమాలపై దృష్టి పెట్టింది.

''ఇరాన్ తమ అణు సామర్థ్యాలను పెంచుకునే విషయంలో చాలా విజయాలు సాధించింది. ఇరాన్‌ను ఎలా అడ్డుకోవాలో ఇజ్రాయెల్‌కు పాలుపోలేదు'' అని రెజ్ జమ్మట్ అన్నారు.

మోహసీన్ ఫఖ్రీజాదేహ్ మరణం మాత్రం ఈ పరిణామాల్లో కీలుక మలుపు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ హత్యకు గురైన ఇరాన్ అణు శాస్త్రవేత్తల్లోకెల్లా ప్రముఖుడు మోహసీన్‌యేనని అన్నారు.

''శాస్త్రవేత్తలను హత్య చేయడం ద్వారా అణు కార్యక్రమాలను ఇజ్రాయెల్‌ ఎంతవరకూ అడ్డుకోలుగుతోందన్నది అంచనా వేయలేం. సైన్స్, సాంకేతికత విషయంలో వారి అనుభవానికి ప్రత్యామ్నాయాలు దొరకవచ్చు. కానీ, అలాంటి నాయకత్వ సామర్థ్యమున్నవారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. వారి లోటును భర్తీ చేయడం కష్టమే'' అని మియిల్స్‌బరీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఫిలిప్ సీ బ్లీక్ అన్నారు.

''ఇరాన్ అణు కార్యక్రమాల్లో మోహసీన్ కీలక పాత్ర పోషించారు. వాటితో ఆయనకు లోతైన సంబంధాలున్నాయి. ఆయన లోటును పూడ్చుకోవడం అంత సులభం కాదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరాన్

ఫొటో సోర్స్, Reuters

ఇలాంటి గూఢచర్య ఆపరేషన్లు ఇరాన్ అణ్వాయుధ సంపన్న దేశంగా అవతరించకుండా అడ్డుకోలేవని, ఆలస్యం మాత్రమే చేయగలుగుతాయని రెజ్ జిమ్మట్ అన్నారు.

ఇలా జాప్యం వచ్చే లా చేయడం కూడా ఒక వ్యూహమేనని ఆయన వ్యాఖ్యానించారు.

''ఇరాన్ అణు కార్యక్రమాలను సైనికపరంగా అడ్డుకునే సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదు. వారు ఇలా గూఢచర్య ఆపరేషన్లు మాత్రమే చయగలరు. ఒకవేళ బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాక ఇరాన్‌తో చర్చలు జరపాలనుకుంటున్నట్లు సంకేతాలు ఇస్తే, ఈ ఆపరేషన్లు ఆగొచ్చు'' అని రిచర్డ్ మెహర్ అన్నారు.

''అణు ఒప్పందం నుంచి వైదొలిగేముందు అణ్వాయుధాలు అభివృద్ధి చేసే సామర్థ్యం పొందేందుకు ఇరాన్ ఓ ఏడాది దూరంలో ఉంది. ఇప్పుడు ఆ దూరం మూడు, నాలుగు నెలలకు తగ్గిపోయింది'' అని జిమ్మట్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)