చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం

ఫొటో సోర్స్, Getty Images
చైనా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఓ ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇది వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందం. వచ్చే 25 ఏళ్లపాటు దీన్ని అమలు చేయబోతున్నారు. ఈ ఒప్పందం వల్లే ఇరాన్‌తో ప్రతిపాదిత చాబహార్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
నాలుగేళ్ల క్రితం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోని జాహెదాన్ నుంచి చాబహార్ వరకు రైలు మార్గం నిర్మాణంపై భారత్, ఇరాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టును తామే సొంతంగా చేపడతామని ఇరాన్ చెబుతోంది. భారత్ నుంచి నిధులు రావడంలో ఆలస్యం అవుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరిస్తోంది.
"400 బిలియన్ డాలర్ల విలువైన తాజా ఒప్పందంలో భాగంగా వచ్చే 25ఏళ్లపాటు అత్యంత చవకైన ధరకే చైనాకు ఇరాన్ చమురును సరఫరా చేయనుంది. ప్రతిఫలంగా ఇరాన్‌లో చైనా భారీ పెట్టుబడులు పెట్టబోతోంది"అని అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.
ప్రపంచ దేశాలు కరోనావైరస్‌తో పోరాడుతున్న తరుణంలో ఈ రెండు దేశాలు గుట్టుచప్పుడు కాకుండా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
అమెరికా ఆంక్షలు, హెచ్చరికలను తోసిరాజని చైనాతో ఇరాన్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం చాలా దేశాలపై ప్రభావం చూపనుంది.
అమెరికాతోపాటు భారత్‌పైనా ఈ ఒప్పందం ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ ఒప్పందం?
మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతికత, ఇంధన రంగాల్లో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యమని ఒప్పందంలోని ఆర్టికల్-6 చెబుతున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ తస్‌నీమ్ వెల్లడించింది.
ఈ ఉమ్మడి సహకారాన్ని వచ్చే 25ఏళ్లపాటు కొనసాగించాలని రెండు దేశాలు తీర్మానించినట్లు తస్‌నీమ్ పేర్కొంది.
అయితే, ఈ ఒప్పందానికి ఇంకా ఇరాన్ పార్లమెంటు మజ్లిస్ ఆమోదం తెలపలేదు. దీని వివరాలు కూడా బయటపెట్టలేదు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి లభించిన 18 పేజీల డాక్యుమెంట్‌పై న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ పత్రాలపై జూన్ 2020 అని తేదీ ఉంది. ఒప్పందానికి సంబంధించి దీన్ని ఫైనల్ బ్లూ ప్రింట్‌గా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
"వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయాలు, భద్రత తదితర అంశాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్న ఆసియాలోని రెండు ప్రాచీన సంస్కృతులు గల దేశాలు.. ఒకరిని మరొకరు వ్యూహాత్మక భాగస్వాములుగా పరిగణిస్తున్నాయి" అనే వాక్యంతో ఈ డ్యాక్యుమెంట్ మొదలవుతోంది.
ఒప్పందంలోని కీలక అంశాలు....
- ఇరాన్‌లోని చమురు, సహజ వాయువు పరిశ్రమల్లో చైనా 280 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతుంది.
- ఇరాన్‌లో రవాణా సదుపాయాల నిర్మాణంపై మరో 120 బిలియన్ డాలర్లను చైనా పెట్టుబడిగా పెట్టనుంది.
- వచ్చే 25 ఏళ్లపాటు అత్యంత చవకైన ధరకే చైనాకు ఇరాన్ ముడి చమురు, సహజ వాయువును సరఫరా చేస్తుంది.
- 5జీ సాంకేతికత అభివృద్ధిలో ఇరాన్‌కు చైనా సాయం చేస్తుంది.
- బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్లు, పోర్టులు, రైల్వేలతోపాటు ఇరాన్ చేపడుతున్న భారీ ప్రాజెక్టుల్లోనూ చైనా భాగస్వామ్యం పెరగనుంది.
- రెండు దేశాలు సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తాయి.
- చైనా, ఇరాన్ కలిసి ఆయుధాలను తయారుచేస్తాయి. నిఘా సమాచారాన్నీ పంచుకుంటాయి.
ఎవరికి ఏం ప్రయోజనం?
ఈ ఒప్పందం చైనా, ఇరాన్‌లకు చాలా విధాలుగా మేలు చేకూరుస్తుందని పశ్చిమాసియా వ్యవహారాల నిపుణుడు, గల్ఫ్ దేశాలకు భారత రాయబారిగా పనిచేసిన తల్మీజ్ అహ్మద్ వ్యాఖ్యానించారు.
"అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి శక్తిమంతమైన దేశాలతో విభేదిస్తున్న ఇరాన్‌కు మిత్రదేశంగా చైనా మారబోతోంది. ట్రంప్ ప్రభుత్వం విధించిన కఠినమైన ఆంక్షలు.. ఇప్పుడు చాలావరకు నిర్వీర్యం అయిపోయినట్లే"అని తల్మీజ్ వ్యాఖ్యానించారు.
అమెరికా ఆంక్షల వల్ల విదేశీ పెట్టబడులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు చైనా పెట్టుబడులు, సాంకేతికతలతో ఇరాన్ మళ్లీ అభివృద్ధి బాట పట్టే అవకాశముంది. మరోవైపు ముడిచమురు అత్యధికంగా దిగుమతి చేసేది చైనానే. తాజా ఒప్పందంతో అత్యంత చవకైన ధరకు చమురు, గ్యాస్ చైనాకు దొరకుతాయి.
రక్షణ వ్యవహారాల్లోనూ చైనా శక్తిమంతమైన దేశం. రక్షణ ఉత్పత్తులైనా, వ్యూహాత్మక అంశాలైన చైనా.. ఇరాన్‌కు సాయం చేయగలదు.
మరోవైపు వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టు విజయవంతం కావడంలో చైనాకు ఇరాన్ చాలా ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?
చైనా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్‌కు ఎదురుదెబ్బగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
అమెరికా ఆంక్షలతో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ పూర్తిగా నిలిపివేసింది. ఇదివరకు భారత్‌కు ఇరాన్ ప్రధానమైన చమురు ఎగుమతిదారు.
అంతేకాదు ఇరాన్‌లో చైనా పెట్టుబడులతో భారత్‌కు నష్టం సంభవించే అవకాశముంది. ఇరాన్‌లో చాబహార్ పోర్టును భారత్ నిర్మిస్తోంది. దీన్ని పాకిస్తాన్‌లో చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకు పోటీగా భారత్ ప్రతిపాదించింది. ఇది భారత్‌కు వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైనది. ఇరాన్‌లో చైనా పెట్టుబడులు పెరగడంతో భారత్ పెట్టుబడులకు అవరోధాలు ఏర్పడే అవకాశముంది.
ఈ ఒప్పందం వల్ల భారత్‌పై ఎలాంటి ఒత్తిడి పడుతుంది?
ఈ ప్రశ్నకు తల్మీజ్ స్పందిస్తూ.. "స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు భారత్ విదేశాంగ విధానం వ్యూహాత్మకంగా, స్వతంత్రంగా ఉంది. అంటే భారత్ ఏ దేశాల శిబిరాల్లోనూ చేరలేదు. అదే సమయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గలేదు. తమ ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే అన్ని దేశాలతోనూ స్నేహపూర్వక సంబంధాలను పెట్టుకొనేందుకు ప్రయత్నించింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారత్ విదేశాంగ విధానం కాస్త బలహీన పడినట్లు అనిపిస్తోంది. అమెరికా ప్రభావం భారత్‌పై చాలా ఉందని పొరుగునున్న దేశాలు కూడా భావిస్తున్నాయి" అని ఆయన అన్నారు.
"భారత్ ప్రయోజనాలకు ఇరాన్, రష్యా, చైనాలతో సంబంధాలు కీలకం. అమెరికా, రష్యాల మధ్య వివాదాలు తమ వివాదాలు కాబోవని భారత్ స్పష్టంచేయాలి."

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి?
ఇరాన్, చైనాలకు అమెరికాతో విభేదాలు కొత్తేమీ కాదు. "అమెరికా, పశ్చిమ దేశాల వైఖరితో ఇరాన్, చైనా సంతోషంగా లేవు. అందుకే ఈ రెండు సహజ భాగస్వాములు" అని 2012లో విడుదల చేసిన ఓ నివేదికలో ఇరాన్ మంత్రిత్వ శాఖకు చెందిన ద ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రేడ్ స్టడీస్ అండ్ రీసెర్చ్ వ్యాఖ్యానించింది.
అమెరికాతో రెండు దేశాలకున్న విభేదాల వల్లే ఈ ఒప్పందం నేడు కార్యరూపం దాల్చింది.
"చైనా.. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇరాన్.. పశ్చిమాసియాలోని శక్తిమంతమైన దేశాల్లో ఒకటి. ఈ రెండూ కలిసి అణచివేతకు పాల్పడుతున్న శక్తుల ఒత్తిడిని జయించగలవు" అని ఇరాన్ విదేశాంగ శాఖ కూడా వ్యాఖ్యానించింది.
చైనా, ఇరాన్.. అమెరికాకు పెద్ద సవాల్‌గా మారబోతున్నాయని సీనియర్ జర్నలిస్టు, ఇరాన్ వ్యవహారాల నిపుణుడు రాకేశ్ భట్ భావిస్తున్నారు.
"ఇరాన్ దగ్గర సహజ వాయు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. రష్యా తర్వాత ఇరాన్‌లోనే అత్యధిక సహజ వాయు నిక్షేపాలున్నాయి. చమురు విషయంలో సౌదీ తర్వాత స్థానం ఇరాన్‌దే. తాజా ఒప్పందంతో సౌదీ ఆధిపత్యానికి చైనా చెక్ పెట్టాలని భావిస్తోంది. అలానే ఇరాన్ను ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకొస్తోంది"అని ఆయన బీబీసీతో చెప్పారు.
రాకేశ్ చెప్పిన విషయాలతో తల్మీజ్ కూడా ఏకీభవించారు.
"వ్యూహాత్మకంగా ఈ ఒప్పందం చాలా కీలకమైనదని భావిస్తున్నా. ఎందుకంటే ఇది గల్ఫ్ ప్రాంతంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. చైనాతో ఇరాన్ జత కట్టడటంతో ఈ ప్రాంతంలో ఒక కొత్త 'పవర్ ప్లేయర్' అవతరించినట్లు అయ్యింది. ఇప్పటివరకు పశ్చిమ ఆసియాలో అమెరికా ప్రాబల్యమే నడిచింది. కొన్నేళ్ల క్రితం రష్యా తమ ప్రభావం చూపేందుకు కొంతవరకు ప్రయత్నించింది. చైనా ఈ దిశగా అడుగు వేయడం ఇదే తొలిసారి" అని తల్మీజ్ అన్నారు.
"వాణిజ్య యుద్ధం పేరుతో చైనాపై అమెరికా దూకుడు విధానాలను అవలంబించింది. దీంతో ఇరాన్‌తో చైనాకు ఈ ఒప్పందం అనివార్యమైంది. ఇప్పుడు ఈ రెండు దేశాలు కలిసి అమెరికాకు ఎదురుగా నిలబడగలవు."
ఈ ఒప్పందం తర్వాత.. అమెరికా, పశ్చిమ దేశాల ఒత్తిడి ఇరాన్‌పై తగ్గే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
ఇరాన్ ప్రజల అసంతృప్తి
ఈ ఒప్పందంపై ఇరాన్ ప్రజలు సంతోషంగా లేరని బీబీసీ మానిటరింగ్ ఓ నివేదికలో వెల్లడించింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తమ ఆందోళనలు తెలియజేస్తున్నట్లు పేర్కొంది.
ఇరాన్ సోషల్ మీడియాలో ఇరాన్‌నాట్4సేల్‌నాట్4రెంట్ (ఇరాన్ ఈజ్ నాట్ ఫర్ రెంట్, ఇరాన్ ఈజ్ నాట్ ఫర్ సేల్) హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ పెట్టుబడులను చైనా సామ్రాజ్యవాదంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
చైనా గత చరిత్ర వల్లే ఇరాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని రాకేశ్ భట్ వ్యాఖ్యానించారు. చైనా పెట్టుబడుల వల్ల ఆఫ్రికాలోని కెన్యా, ఆసియాలోని శ్రీలంక అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇరాన్‌కు కూడా ఇదే గతి పడుతుందని ప్రజలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్‌తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








