గూగుల్ భారత్‌లో రూ. 75 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలనుకోవడం వెనుక రహస్యమేంటి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అపూర్వ కృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ గూగుల్ భారత్ కోసం ‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్’ పేరుతో ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. మరో ఐదు నుంచి ఏడేళ్లలో అది భారత్‌లో వెయ్యి కోట్ల డాలర్లు అంటే దాదాపు రూ. 75 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది.
గూగుల్ భారత కంపెనీల్లో డబ్బులు పెడుతుందా, లేక భాగస్వామిగా ఉంటుందా అనే విషయంపై కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఎకనామిక్ టైమ్స పత్రికతో మాట్లాడారు.
“మేం కచ్చితంగా ఆ రెండు అవకాశాలనూ పరిశీలిస్తాం. మేం వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెడతాం. మా గూగుల్ వాచర్స్ విభాగం ద్వారా మేం దాన్ని ఇప్పటికే చేస్తున్నాం. మేం ఇతర పెద్ద కంపెనీల్లో కూడా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మేం డేటా సెంటర్ల లాంటి పెద్ద మౌలిక సదుపాయాల్లో కూడా పెట్టుబడులు పెడతాం. మా ఫండ్‌లోని చాలా పెద్ద భాగాన్ని భారతీయ కంపెనీల్లో పెట్టుబడి పెడతాం’’ అన్నారు.
అంటే, తాము ఏం చేస్తామనే విషయం గురించి సుందర్ పిచాయ్ పూర్తిగా చెప్పడం లేదు. అలాంటప్పుడు సాధారణంగా కొన్ని ప్రశ్నలు వస్తాయి.
- గూగుల్ ఎక్కడ డబ్బులు పెట్టబోతోంది?
- పెట్టుబడులు పెడితే, వాటి రిటర్న్స్ కూడా వస్తాయి. ఎవరి వల్ల గూగుల్ పెట్టె నిండుతుంది. నష్టాలు తెచ్చిపెట్టేవారికి ఎలాంటి ప్రతిఫలం దక్కుతుంది?
- దీనివల్ల సామాన్యులపై ఏదైనా ప్రభావం ఉంటుందా, లేక ఇది కేవలం టెక్నాలజీ కంపెనీలకు పనికొచ్చే వార్తేనా?
- ఇందులో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సింది ఏదైనా ఉందా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ముందు ఇటీవలి కాలంలో భారత్‌లో పెట్టుబడులు పెడతామని ప్రకటించిన ఏకైక టెక్ దిగ్గజం గూగుల్ మాత్రమే అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి.
గూగుల్ కంటే ముందు అమెజాన్ ఇదే ఏడాది భారత్‌లో 100 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. అంతకు ముందు అది 500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడతామని చెప్పింది.
ఆ తర్వాత ఫేస్‌బుక్ రిలయన్స్ జియోలో 570 కోట్ల డాలర్లు పెడుతున్నామని ప్రకటించింది.
భారత్‌లో పెట్టుబడుల అవకాశాల కోసం ఒక ఆఫీసు తెరుస్తామని, అందులో ప్రధానంగా బిజినెస్-టు-బిజినెస్ సాఫ్ట్ వేర్ స్టార్టప్ కంపెనీలపై దృష్టి పెడతామని, ఈ ఏడాది జూన్‌లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడుల విభాగం ఎంవన్‌టూ చెప్పింది.

ఫొటో సోర్స్, AFP
ఈ కంపెనీల కళ్లన్నీ భారత్ మీదే ఎందుకు?
దీనికి సమాధానం భారత్‌లోని మార్కెట్. కానీ భారత్‌లో మార్కెట్ ముందు నుంచే ఉంది. అలాంటప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు హఠాత్తుగా ఇక్కడే ఎందుకు పెట్టుబడులు పెడుతున్నాయి.
దేశంలోని ఆ మార్కెట్ ఇప్పుడు, ముఖ్యంగా డిజిటల్ విప్లవం, స్మార్ట్ ఫోన్ విప్లవం వచ్చిన తర్వాత మారిపోతోందని నిపుణులు చెబుతున్నారు.
గత కొంతకాలంగా ఈ కంపెనీల పనిలో ఒక కన్వర్జెన్స్ స్థితి వస్తుండడం కనిపిస్తోందని ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, టెక్నికల్ అంశాల్లో నిపుణులు రుషి రాజ్ చెప్పారు.
“ఇప్పుడు ఒకే కంపెనీ టెలికాం సేవలను అందిస్తోంది. అదే ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఇస్తుంది. అదే కంపెనీ ఈ-కామర్స్, ఈ-పేమెంట్, సెర్చ్ ఇంజన్ పనులు కూడా చేస్తోంది. నావిగేషన్ పనులు కూడా చూస్తోంది. ఇంతకు ముందు కూడా కన్వర్జెన్స్ గురించి మాట్లాడేవారు. కానీ మొదట్లో అది చాలా భారీ స్థాయిలో ఉండేది. టీవీ, మొబైల్ కన్వర్జెన్స్ అవడంతో, ఇప్పుడు దాని పరిధి చాలా పెరిగింది” అని రుషి రాజ్ చెప్పారు.
“ఇంటర్నెట్ సూపర్ మార్కెట్ అయిపోయింది. అక్కడ సాఫ్ట్ వేర్, కంటెంట్ కూడా అమ్ముతున్నారు. అమెజాన్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయి, సినిమాలు రిలీజ్ చేస్తోంది. ఇక ఫేస్‌బుక్ విషయం వేరే. అక్కడ స్నేహం నుంచి వ్యాపారం వరకూ అంతా ఉంటోంది” అని టెక్నాలజీ, బిజినెస్ అంశాల నిపుణుడు, సీనియర్ జర్నలిస్ట్ మాధవన్ నారాయణ్ అన్నారు.
“కంటెంట్, కామర్స్, కనెక్టివిటీ, కమ్యూనిటీ- ఈ నాలుగు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ FANG.. అంటే ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ఈ నాలుగింటినీ అందిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ను కాస్త దూరం పెడితే, మిగతా మూడు కంపెనీలు చిన్న వ్యాపారులకు పనికొస్తున్నాయి. అక్కడ మనం అడ్వర్టైజ్ చేయచ్చు, వీడియో కాన్ఫరెన్స్ లాంటి వారి సాఫ్ట్ వేర్‌లు కూడా అద్దెకు తీసుకోవచ్చు. అది యూట్యూబ్ అయినా, ఓలా-ఉబెర్ అయినా, డిజిటల్ కాల్స్ అయినా ఈ మూడు కంపెనీలు ఎలాగోలా అందరినీ టచ్ చేస్తున్నాయి” అని మాధవన్ నారాయణ్ చెప్పారు.
భారత్‌లో భారీ జనాభా, మార్కెట్ కలిసిపోతున్న స్థితిపై పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపిస్తాయనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది అంటున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇంటర్నెట్ వ్యాప్తి, పెరగనున్న సంపాదన
భారత్‌లోని 130 కోట్ల జనాభాలో ఫోన్ వాడుతున్నవారిలో 40 నుంచి 50 శాతం మందికి మామూలు ఫీచర్ ఫోన్ ఉంది. అందులో ఇంటర్నెట్ ఉండదు. కానీ ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వ్యత్యాసం కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఈ సంఖ్య మరో నాలుగైదేళ్లలో రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఫోన్లు, డేటా ప్లాన్‌లు చాలా చౌకగా అవుతున్నాయి అని మాధవన్ నారాయణ్ అంటున్నారు.
“దేశంలో ఉన్న 60 కోట్ల ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, మొబైల్ ఆపరేటర్స్ దగ్గర ఉన్నారు. వారి ద్వారా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి కంపెనీలు తమ ఉత్పత్తులను వినియోగదారుల వరకూ చేరుస్తున్నాయి” అని రుషి రాజ్ చెబుతున్నారు.
“నా లెక్క ప్రకారం, ఇంతకు ముందే ఉన్న సేవలను ఏదో ఒక కంపెనీతో టైప్ చేసుకుని వాటిలో పెట్టుబడి పెడితే, ఎలాగోలా వినియోగదారుడి చెంతకు చేరి, అతడి నుంచి ఎంతోకొంత సంపాదించవచ్చని గూగుల్‌కు అర్థమైంది. దానికి ఇదే మంచి సమయం అని అది తెలుసుకుంది. అలా ఇప్పటివరకూ జరగలేదు” అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
డేటా సేకరణపై ఆందోళనలు
భారత్‌లో డేటాను ఏ సమస్యా లేకుండా సేకరించవచ్చు. గూగుల్ లాంటి పెద్ద అంతర్జాతీయ కంపెనీ భారత్ వైపు చూడడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం.
“ఇక్కడ డేటా కూడా దొరుకుతుంది కాబట్టి ఈ కంపెనీలు భారత్‌లోకి రావాలనే అనుకుంటాయి. డేటా ప్రొఫైలింగ్ వల్ల కంపెనీల దగ్గర ఒక పెద్ద స్టోరేజ్ ఉంటుంది. దానిని బట్టి వాటికి వినియోగదారుల అలవాట్ల గురించి తెలిసిపోతుంది. మార్కెట్ రీసెర్చ్ కూడా చేయవచ్చు” అని రుషి అన్నారు.
కానీ, ప్రజల్లో ఈ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేస్తారేమో అనే ఆందోళన కూడా ఉంది.
“ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఈ పనుల పురోగతికి తగినట్లు డేటాపై నిఘా పెట్టడం, దానిని సురక్షితంగా ఉంచడం, దానిపై గుత్తాధిపత్యాన్ని నిరోధించడం కోసం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు” అని రుషి చెప్పారు.
“ఒక ప్రక్రియ అంటూ లేనపుడు, దానిని మనం అమోదించడం లేదా నిరాకరించడం ఎలా చేయగలం. దానిపై పని జరుగుతోంది. కానీ అది చాలా మెల్లగా జరుగుతోంది. వ్యాపార సంస్థ చాలా పెద్దదైనా, నియత్రణ ఉంటుందనేది మనం ఇంతకు ముందే మనం చూశాం” అన్నారు.
డేటా ఎక్కడ, ఎలా ఉంచాలి అనే దానిపై రాబోయే రోజుల్లో రిలయన్స్-జియో, గూగుల్-ఫేస్‌బుక్-అమెజాన్ లాంటి కంపెనీలతో వివాదాలు తలెత్తవచ్చని మాధవన్ చెప్పారు.
“గోప్యతను కాపాడే పేరుతో ముందు ముందు మార్కెట్‌లో ఆంక్షలు ఉండకూడదు. దానిని దృష్టిలో పెట్టుకునే కంపెనీలు బహుశా.. మేం ఈ డేటాను ప్రకటనలకు మాత్రమే ఉపయోగిస్తామని, వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోమని చెబుతున్నాయి” అని మాధవన్ చెప్పారు..

ఫొటో సోర్స్, AFP
ఇమేజ్ గురించి ఆందోళన
గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు భారత్‌లో జోరుగా పెట్టుబడులు పెట్టడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. అవి భారత్‌ను మార్కెట్‌గానే భావించడం లేదు,
“భారత్‌లో కేవలం డబ్బు సంపాదించడానికే వచ్చాయనే ఇమేజ్‌ను ఆ కంపెనీలు కోరుకోవడం లేదు. తాము అంతర్జాతీయ కంపెనీలైనా, భారత్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న అంశాన్ని ప్రభుత్వాలు, ప్రజల చెంతకు చేర్చాలని అనుకుంటున్నాయి. జాతీయవాదం పాదాల కింద నలిగిపోకుండా, మంచి ఉండాలని కోరుకుంటున్నాయి” అని మాధవన్ చెప్పారు.
“మా దృష్టి వినియోగదారులపై మాత్రమే ఉండదు” అని చెప్పడానికి కూడా ఈ కంపెనీలు కృషి చేస్తున్నాయి.
“ఈ కంపెనీలు చాలా ప్రాజెక్టులు చేస్తుంటాయి. ప్రభుత్వాలతో కూడా కొన్ని ప్రాజెక్టులు చేయాల్సి ఉంటుంది. అంటే, ఒక కంపెనీ పెట్టుబడి పెడితే, నేను కూడా వెనక్కు తగ్గలేదు అని ప్రభుత్వానికి చూపించాలి. ఎందుకంటే అవి అలా చేయకపోతే ప్రభుత్వ ప్రాజెక్టుల్లో అందే ప్రయోజనాలు వాటికి దక్కకపోవచ్చు” అంటారు రుషి

ఫొటో సోర్స్, AFP
పన్నులు ఆదా చేసే ప్రయత్నాలా
డిజిటల్ సేవలు అందించే కంపెనీలపై పన్నులు విధించడం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే ఈ కంపెనీలు సెర్చ్, ప్రకటనల ద్వారా చాలా ఎక్కువే సంపాదిస్తాయి. భారత్ లాంటి దేశంలో పెట్టుబడుల వెనుక ఆ ఆలోచన కూడా ఉండచ్చని నిపుణులు చెబుతున్నారు.
“భారత్ లాంటి పెద్ద మార్కెట్‌లోకి వస్తే, గూగుల్ తమ లాభాల్లో ఒక భాగాన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టాలని భావిస్తుంది. దాంతో వాళ్ల ఖర్చు పెరుగుతుంది. వారి పని కూడా విస్తరిస్తుంది, దాంతో అది చెల్లించే పన్నులు తగ్గిపోతాయి” అని మాధవన్ చెప్పారు.
అయితే, ఇందులో కంగారు పడాల్సిన విషయమేమీ లేదా?
ఈ ఇండస్ట్రీ ఎలా ఉంటుందనేది ఊహించి దాని గురించి అప్పుడే ఆరోపణలు చేయడం సరికాదు అని మాధవన్ చెప్పారు.
“కంగారు పడాల్సిన విషయమేం లేదు,. కానీ కచ్చితంగా ఆలోచన ఉండాలి. భారత కంపెనీల వల్ల కూడా గందరగోళాలు జరుగుతాయి. ఇక్కడ రుణాలు తీసుకుని పారిపోయినవారు, పన్ను ఎగవేతదారులు ఉన్నారు. కానీ, అంతర్జాతీయ కంపెనీలు అలా ఉండవు. అయినా, అవి సమాజానికి సేవ చేయడానికి రాలేదు. అందుకే వాటితో చేతులు కలపాలి, కానీ ఒక కన్నేసి ఉంచాలి” అన్నారు.
“భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ ఉన్న దేశం గురించి కంపెనీల చాలా అప్రమత్తంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వారు ఏదైనా విజయవంతంగా లాంచ్ చేయచ్చు. దానిద్వారా వారు వినియోగదారుల చెంతకు చేరవచ్చు. లాభాలు సంపాదించవచ్చు. తర్వాత ఇలాంటి ఇతర దేశాలకు వెళ్లి ఇదే మోడల్‌ను పునరావృతం చేయవచ్చు” అంటారు రుషి.
భారత్‌లో 10 బిలియన్ డాలర్లు పెట్టేంత ప్రేమ గూగుల్‌కు ఎందుకు వచ్చింది?
దీనికి సమాధానం మనకు మాధవన్ నారాయణ్ మాటల్లోనే దొరుకుతుంది.
“భారత్‌కు అనుకూలంగా చెబుతున్న అన్ని విషయాలనూ మనం గమనిస్తే, గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినా, ఆ నిధులు మనకు తక్కువగానే అనిపిస్తాయి. ఇంత పెద్ద ఎకానమీతో రొమాన్స్ చేస్తున్నప్పడు పువ్వులు, చాక్లెట్ల కోసం అది ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదుగా” అని ఆయన అంటున్నారు..
ఇవి కూడా చదవండి:
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- అశోక్ గెహ్లాత్: ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆరు నెలల నుంచే బీజేపీ కుట్రలు చేస్తోంది’
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








