కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?

ఫొటో సోర్స్, PA
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
కోవిడ్-19 చికిత్సకు ఇంకా ఎలాంటి ఔషధం అందుబాటులోకి రాలేదు.
అయితే, ప్లాస్మా థెరపీ అనే మాట తరచూ వార్తల్లో వినిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ థెరపీపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో దాదాపు 1,500కు పైగా ఆస్పత్రుల సమన్వయంతో శాస్త్రవేత్తలు లోతైన అధ్యయనం చేస్తున్నారు.
బ్రిటన్‌లోనూ శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి ట్రయల్స్ నిర్వహించే పనిలో ఉన్నారు. అందుకోసం దాతల నుంచి ప్లాస్మా సేకరిస్తున్నారు.
ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?
రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కోవిడ్-19 వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారి శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్‌ను నాశనం చేస్తాయి. అందుకే, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది.
అయితే, కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది.
అందుకు పరిష్కారంగా, కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, అదే వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పష్టమైన నిబంధనలు
“ప్లాస్మా ఇచ్చే దాత కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకోవాలి. ఒకట్రెండు సార్లు పరీక్షలు చేసి వారి శరీరంలో వైరస్ లేదని వైద్యులు నిర్ధరించాలి. ఆ తర్వాత 14 రోజులు గడిచాక, వారిలో రోగనిరోధక కణాలు సరైన మోతాదులో ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు ఎలీసా పరీక్ష చేస్తారు. అంతా బాగుందని తేలితే, అప్పుడు వారి నుంచి ప్లాస్మాను తీసుకోవాల్సి ఉంటుంది” అని కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలో సభ్యుడు, కోజికోడ్‌లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న క్రిటికల్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ అనూప్ కుమార్ బీబీసీతో చెప్పారు.
కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి ప్లాస్మాను తీసుకునే ముందు, వారి రక్తం స్వచ్ఛతను వైద్య నిపుణులు పరిశీలిస్తారు. అందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ఆ మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుదని తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ దేబాషిష్ గుప్తా చెప్పారు.
ప్లాస్మాను ఎలా తీస్తారు?
ఎలాంటి సమస్య లేదని నిర్ధరించుకున్న తర్వాత, దాత నుంచి ఆస్పెరిసిస్ అనే విధానం ద్వారా రక్తాన్ని సేకరిస్తారు. ఈ సాంకేతిక విధానంలో రక్తం నుంచి ప్లాస్మా లేదా ప్లేట్‌లెట్లను వేరు చేస్తారు. మిగతా రక్తం మళ్లీ దాత శరీరంలోకి వెళ్లిపోతుంది.
“ప్లాస్మాలో మాత్రమే రోగనిరోధక కణాలు ఉంటాయి. ఒక దాత నుంచి దాదాపు 800 మిల్లీ లీటర్ల ప్లాస్మా తీస్తాం. దానిని ఒక్కొక్కరికి 200 మి.లీ చొప్పున, నలుగురు రోగులకు ఎక్కించవచ్చు. అందుకే నాలుగు ప్యాకెట్లలో నింపుతాం” అని డాక్టర్ అనూప్ కుమార్ వివరించారు.
అలా సేకరించిన ప్లాస్మాను కోవిడ్ -19తో బాధపడుతున్న రోగులకు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, మరెవరికీ ఇవ్వకూడదని డాక్టర్ దేబాషిష్ గుప్తా చెప్పారు.

ఫొటో సోర్స్, Science Photo Library
ఎంత వేగంగా కోలుకుంటారు?
``సాధారణ జ్వరం, దగ్గు ఉన్నవారికి ప్లాస్మా ఇవ్వాల్సిన అవసరం లేదు. జ్వరం, దగ్గుతో పాటు ఆక్సిజన్ స్థాయి కాస్త తక్కువగా ఉన్నవారికి కూడా ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఆరోగ్యం బాగా క్షీణిస్తున్న వారికి, ఆక్సీజన్ స్థాయి మరీ తక్కువగా ఉండి, పరిస్థితి విషమించే స్థితిలో ఉన్నవారికి ప్లాస్మా ఎక్కించాల్సి ఉంటుంది’’ అని డాక్టర్ అనూప్ కుమార్ అన్నారు.
రోగులకు అత్యంత దగ్గరగా పనిచేసే వైద్య సిబ్బందికి కూడా ముందు జాగ్రత్తగా ప్లాస్మాను ఇవ్వొచ్చని ఆయన చెప్పారు.
“ప్లాస్మా థెరపీ ద్వారా రోగులు కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పేందుకు మా దగ్గర దీర్ఘకాలిక సమాచారం లేదు. ప్రస్తుతం మేము నిర్వహిస్తున్న పరీక్షల్లో మాత్రం ఒక రోగి కోలుకోవడం ప్రారంభమయ్యేందుకు 48 నుంచి 72 గంటల సమయం పడుతోంది” అని ఆయన తెలిపారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా

తర్వాత ఏంటి?
దాదాపు ఇలాంటి థెరపీనే చైనా, దక్షిణ కొరియాలో వినియోగించారు. భారత్‌లో ఇంకా పూర్తిస్థాయిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది.
“మేము క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలంటే ఎలీసా టెస్ట్ కిట్లు అవసరం అవుతాయి. ఇప్పటికే వాటికోసం ఆర్డర్ ఇచ్చాం. వాటికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది” అని డాక్టర్ అనూప్ చెప్పారు.
కేరళలో మొత్తం 408 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 291 మంది కోలుకున్నారు.
“కోవిడ్-19 నుంచి కోలుకుని, ఆ తర్వాత 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారిని పరీక్షించాలి. ప్లేట్‌లెట్ల కౌంట్ సరైన మోతాదులో ఉండి, పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారి నుంచి ప్లాస్మాను సేకరించవచ్చు” అని డాక్టర్ అనూప్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత ఖర్చవుతుంది?
“ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఈ చికిత్స చేస్తారు. కాబట్టి దీనికి ఖర్చు రూ.2,000 నుంచి రూ .2,500 లకు మించి కాకపోవచ్చు’’ అని ఆయన అన్నారు.
ప్లాస్మా థెరపీ ఎందుకు?
కోలుకున్న రోగుల నుంచి రక్తాన్ని సేకరించి, మిగతా రోగులకు ఎక్కించడం కొత్తేమీ కాదు.
వందేళ్ల కిందట స్పానిష్ ఫ్లూ విజృంభించినప్పుడు కూడా దీనిని వాడారు.
ఇటీవలి కాలంలో వచ్చిన ఎబోలా, సార్స్, మెర్స్ సహా, 2009లో వచ్చిన హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)కు కూడా ప్లాస్మాతో చికిత్స చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- అమెరికాలో లాక్ డౌన్ ఎత్తేయడంపై ప్రణాళిక విడుదల చేసిన డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్ లాక్ డౌన్‌తో రోడ్లపైకి వచ్చిన సింహాలు
- కరోనావైరస్ నిజాముద్దీన్: తబ్లిగీ జమాత్ అధ్యక్షుడు ముహమ్మద్ సాద్‌పై హత్య కేసు నమోదు
- కరోనావైరస్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- కరోనావైరస్: లాక్డౌన్ సమయంలో భారత్‌కు సంజీవనిగా మారిన ప్రపంచంలోని అతి పెద్ద పోస్టల్ సర్వీస్
- అంతరిక్షం నుంచి తిరిగి వస్తున్న ముగ్గురు వ్యోమగాములు... వారికి కరోనావైరస్ సోకకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









