కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు

చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

చైనా ఆర్థిక వ్యవస్థ కొన్ని దశాబ్దాల కాలంలో మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో కుంచించుకుపోయింది. కరోనావైరస్ మహమ్మారి విజృంభించటంతో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు మూసివేయాల్సి రావటం దీనికి కారణం.

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ఈ త్రైమాసికంలో 6.8 శాతం మేర కుంగిపోయిందని శుక్రవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.

కరోనావైరస్ ప్రభావంతో చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుండటం.. ఇతర దేశాలకు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

వస్తువులు, సేవల ఉత్పత్తిదారుగా, వినియోగదారుగా చైనా చాలా ప్రధానమైన దేశం. ఆర్థిక శక్తికి కేంద్రబిందువు.

అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న గత ఏడాది మొదటి త్రైమాసికంలో కూడా ఆరోగ్యవంతమైన 6.4 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధించింది.

చైనా ఆర్థిక గణాంకాల కచ్చితత్వాన్ని నిపుణులు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నప్పటికీ.. ఈ దేశం గత రెండు దశాబ్దాల్లో సగటున 9 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది.

చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

త్రైమాసిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేయటం చైనా 1992లో మొదటిసారి ప్రారంభించింది. అప్పటి నుంచి మొదటి మూడు నెలల కాలంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకోవటం ఇదే మొదటిసారి.

‘‘జనవరి నుంచి మార్చి వరకూ జీడీపీ కుంచించుకుపోవటం శాశ్వత ఆదాయ నష్టాలుగా పరిణమిస్తుంది. చిన్న సంస్థలు దివాలా తీయటం, ఉద్యోగాలు పోవటం జరుగుతుంది’’ అని ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన యూ సూ పేర్కొన్నారు.

చైనాలో కరోనావైరస్ విజృంభణను నిరోధించటానికి జనవరి చివరి నుంచి పెద్ద ఎత్తున లాక్‌డౌన్‌లు, క్వారంటైన్లు అమలులోకి తేవటంతో ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది.

ఫలితంగా ఆర్థిక వృద్ధి గణాంకాలు బలహీనంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనావేశారు. కానీ ఊహించిన దానికన్నా కాస్త ఎక్కువగానే పరిస్థితి దిగజారినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

విశ్లేషణ: ఆరు శాతం విస్తరణ ఆవిరైపోయింది

రాబిన్ ట్రాంట్, బీబీసీ న్యూస్, షాంఘై

ఆర్థికవ్యవస్థ భారీగా దిగజారటం.. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మీద కరోనావైరస్ మహమ్మారి, దానికి ప్రభుత్వం క్రూరమైన ప్రతిస్పందన చూపిన ప్రభావం ఏ స్థాయిలో ఉందనేది చాటుతోంది.

గత ఏడాది చివర్లో చైనా విడుదల చేసిన గణాంకాల్లో కనిపించిన ఆరు శాతం ఆర్థిక వ్యవస్థ విస్తరణ ఇప్పుడు ఆవిరైపోయింది.

ఆర్థికవ్యవస్థను స్థిరీకరించి, పునరుద్ధరించటానికి గణనీయమైన ఆర్థిక ఉద్దీపనలు అమలు చేయబోతున్నట్లు చైనా సంకేతాలిచ్చింది. దేశీయ డిమాండ్‌ను ప్రభుత్వం పెంచుతుందని అధికార కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక ‘పీపుల్స్ డైలీ’ ఈ వారం ఆరంభంలో పేర్కొంది.

చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

కానీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించటం చైనాకు పెద్ద సమస్యగానే ఉంటుంది. అందుకు కారణం.. చైనా ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర ఎగుమతులదే. ఆ ఎగుమతులు తగ్గిపోతే చైనా ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవటం సాధ్యంకాదు.

చైనా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యాన్ని తప్పించుకుంటుంది కానీ.. కేవలం 1.2 శాతం మేర మాత్రమే వృద్ధి చెందుతుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురువారం నాడు అంచనా వేసింది.

దేశంలో ఉద్యోగాలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన గణాంకాలు.. నిరుద్యోగితపై ప్రభుత్వ అధికారిక లెక్కలు భారీగా పెరిగినట్లు చూపుతున్నాయి. ఎగుమతుల వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య అత్యధికంగా పడిపోయింది.

చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

మాంద్యం ప్రభావాన్ని తగ్గించటం కోసం ఆర్థికంగా మద్దతునివ్వటానికి చైనా అనేక చర్యలు చేపట్టింది. కానీ పెద్ద ఆర్థిక వ్యవస్థలు చేపట్టేంత స్థాయిలో ఈ చర్యలు లేవు.

‘‘భారీ ఉద్దీపన చర్యలు ఉంటాయని మేం అనుకోవటం లేదు. ఎందుకంటే చైనా వాటిని ఇష్టపడదు. దానికి బదులుగా.. 2021 నాటికి మెరుగైన అవకాశాలు ఉంటాయి కాబట్టి.. ఈ ఏడాది తక్కువ వృద్ధిరేటును చైనా పాలకులు అంగీకరిస్తారని మేం భావిస్తున్నాం’’ అని ఆక్స్‌ఫర్డ్ ఎకానమిక్స్ విశ్లేషకుడు లూయీ కైజిస్ పేర్కొన్నారు.

మార్చి నెల నుంచి ఫ్యాక్టరీలు తెరవటం, వ్యాపారాలు కొనసాగటాన్ని నెమ్మదిగా అనుమతించింది. కానీ.. ఇవి లాక్‌డౌన్ ముందున్న స్థాయికి చేరాలంటే సమయం పడుతుంది.

చైనా ఆర్థిక వ్యవస్థ

ఫొటో సోర్స్, Getty Images

చైనా ఆర్థిక వృద్ధి కోసం ప్రధానంగా తన ఫ్యాక్టరీలు, తయారీ పరిశ్రమల మీద ఆధారపడుతుంది. ‘ప్రపంచ కర్మాగారం’ అని కూడా ఈ దేశాన్ని అభివర్ణిస్తారు.

ఆగ్నేయాసియా ప్రాంతం తమ వ్యాపారం కోసం, ఉత్పత్తుల వినియోగం కోసం ప్రధానంగా చైనా మీదే ఆధారపడి ఉంటుంది.

చైనా ఆర్థిక గణాంకాలు వెల్లడయ్యాక ఈ ప్రాంత స్టాక్ మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. షాంఘై కంపోసిట్ సూచీ 0.9 శాతం పెరిగింది.

జపాన్ నిక్కీ 225 శుక్రవారం నాడు 2.5 శాతం పెరిగింది. అయితే.. అమెరికాలో లాక్‌డౌన్‌లను సడలించటానికి ఆ దేశాధ్యక్షుడు ప్రణాళికలను ప్రకటించటంతో వాల్ స్ట్రీట్‌ లాభాల బాట పట్టటం జపాన్ నిక్కీ సూచీ పెరుగుదలకు కారణం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)