డోనల్డ్ ట్రంప్ చంద్రుడి మీద ఖనిజాలు తవ్వాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇది ఇప్పట్లో సాధ్యమేనా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మనీష్ పాండే, మైకేల్ బాగ్స్
- హోదా, న్యూస్‌బీట్ ప్రతినిధులు
చంద్రుడి మీద ఖనిజాల తవ్వకాలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు.
విశ్వాన్ని శోధించటానికి, అక్కడి వనరులను ఉపయోగించుకోవటానికి అమెరికాకు హక్కు ఉందని ప్రకటిస్తూ ట్రంప్ ఇటీవల ఒక అధికారిక ఉత్తర్వు మీద సంతకం చేశారు.
అంతరిక్షాన్ని వనరుల విషయంలో ఉమ్మడి ప్రాంతంగా అమెరికా పరిగణించటం లేదని, అక్కడి వనరులను తాము ఉపయోగించుకోవటానికి అంతర్జాతీయ ఒప్పందాలు, అనుమతులు అవసరం లేదని కూడా ఆ ఉత్తర్వు చెప్తోంది.
అసలు.. అంతరిక్షంలో తవ్వకాలు చేపట్టాలని ట్రంప్ ఎందుకు కోరుకుంటున్నారు? దానివల్ల లాభాలేమిటి?
ఈ విషయమై రేడియో 1 న్యూస్‌బీట్ పలువురు నిపుణులతో మాట్లాడింది. ఆ వివరాలివీ...

ఫొటో సోర్స్, Getty Images
‘భూమికి ఆవల జీవ విస్తరణ’
చంద్రుడి మీద ఖనిజాల తవ్వకాలు చేపట్టటం.. మనిషి అంతరిక్షంలోకి మరింత దూరం, అంగారక గ్రహం వంటి ప్రాంతాలకు ప్రయాణించటానికి తోడ్పడుతుందని అంతరిక్ష జర్నలిస్ట్ సారా క్రడ్డాస్ అభిప్రాయపడ్డారు.
అంతరిక్ష ప్రయాణాలకు చందమామ ఒక పెట్రోల్ స్టేషన్‌గా ఉపయోగపడుతుందని.. రాకెట్ ఇంధనానికి అవసరమైన హైడ్రోజన్, ఆక్సిజన్ వంటి వనరులు అక్కడ పుష్కలంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
అంతరిక్షంలో ఒక పెట్రోల్ స్టేషన్ ఉన్నట్లయితే.. అక్కడ రాకెట్‌లో చమురు నింపుకుని విశ్వంలో మరింత దూరాలకు ప్రయాణించవచ్చునన్నారు.
‘‘విశ్వంలోకి ప్రయాణం మొదలుపెట్టినపుడు అన్నీ భూమి మీద నుంచే తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు’’ అన్నారు.
మన భూగ్రహానికి లబ్ధి కలిగించే అనేక వనరులు అంతరిక్షంలో ఉన్నాయని.. కాబట్టి అంతరిక్షంలో మరింత లోతుగా అన్వేషణ సాగించటం చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వాతావరణ మార్పు కారణంగా మన ప్రపంచం పునర్వినియోగించే ఇంధన వనరసుల వైపుగా పయనిస్తోందని.. కాబట్టి అంతరిక్షంలోని వనరులు అవసరమవుతాయని యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌లో ఎనర్జీ పాలసీ ప్రొఫెసర్ బెంజమిన్ సవాకో చెప్పారు.
‘‘ప్రస్తుతం మనకు ఉన్న వనరులు అడుగంటుతున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతరిక్షంలో మరిన్ని ఖనిజాలను తవ్వి తేవటం.. ఎలక్ట్రిక్ కార్ల వంటి వాటి తయారీకి దోహదపడుతుందని, అది దీర్ఘ కాలంలో మన పర్యావరణానికి మేలు చేస్తుందని చెప్పారు.
‘‘మనకు అవసరమైన లిథియం లేదా కోబాల్ట్ వంటి లోహాలు ప్రధానంగా చైనా, రష్యా, కాంగో వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని తెచ్చుకోవటం కష్టం’’ అని కూడా ప్రొఫెసర్ బెంజమిన్ పేర్కొన్నారు.
ప్రపంచంలో విభిన్న సరఫరాదారుల నుంచి సరుకులు తెచ్చుకోవటం సంక్లిష్టంగా ఉంటుందని, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నిబంధనలు ఉంటాయని ఉటంకించారు.
‘‘కాబట్టి చందమామ మీద గనులు తవ్వి తెచ్చుకోవటం సులభం కావచ్చు’’ అని అభిప్రాయపడ్డారు.
భూమి మీద కాంగో వంటి ప్రాంతాల్లో ఈ పదార్థాల తవ్వకం భయానక పరిస్థితుల్లో జరుగుతోందని సారా చెప్తున్నారు.
అయితే.. అంతరిక్షంలో గనుల తవ్వకం వల్ల భూమి మీద వాతావరణ మార్పు సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం దొరకదని ప్రొఫెసర్ బెంజమిన్ హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా – చైనాల మధ్య ఉద్రిక్తతలు
చంద్రుడి మీద గనులు తవ్వాలన్న ట్రంప్ నిర్ణయం వెనుక.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోల్చినపుడు అమెరికాకు ఖనిజాలు అంతగా అందుబాటులో లేకపోవటం కావచ్చు.
‘‘పరుగు పందెంలో అమెరికా ఓడిపోయింది. చైనా, రష్యా వంటి దేశాలు ముందున్నాయి’’ అంటారు బెంజమిన్.
చైనా వెలికితీస్తున్న ఖనిజాలను ప్రపంచమంతటా సరఫరా చేస్తోంది.
‘‘చైనా వాళ్లు తవ్వలేని చోటు.. అంటే అంతరిక్షం వంటి చోటు నుంచి ఖనిజాలు తెచ్చుకోగలగటం ట్రంప్ వంటి వారికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అంతరిక్షంలో ఖనిజాలు తవ్వటం అనేది తమ ఆధిక్యతను, నాయకత్వాన్ని నిలుపుకోవటానికి ట్రంప్‌కు ఒక అవకాశం అని ప్రొఫెసర్ బెంజమిన్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టం సంగతి ఏమిటి?
అంతరిక్షంలో ఖనిజ తవ్వకాల కోసం అమెరికా చేసే ప్రయత్నాలకు అంతర్జాతీయ చట్టాలేవీ వర్తించబోవని ట్రంప్ ఉత్తర్వు స్పష్టంగా చెప్తోంది. కానీ.. భూగోళానికి ఆవల మనషులు ఏమేం చేయవచ్చునని చెప్పే చట్టాలేవీ సంబంధిత విషయాల్లో నిర్దిష్టంగా లేవు.
‘‘అంతరిక్ష చట్టం ఇంకా అభివృద్ధి చెందుతోంది. అది కాలానుగుణంగా మారుతుంటుంది’’ అంటారు సారా.
‘‘చందమామ తమ సొంతమని ఏ దేశమూ ప్రకటించుకోజాలదు. అయితే ప్రస్తుతం ఇది సముద్ర ప్రాంత చట్టం వంటిది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్లి, అక్కడ ఖనిజాలను కనుగొని, వాటిని తవ్వుకోగలిగితే.. వాటిని మీ సొంతం చేసుకోవచ్చు’’ అని ఆమె వివరించారు.
భూమి మీద వాతావరణ మార్పు జరుగుతోంది కనుక అంతరిక్షం మీద మనం దృష్టి సారించటం అనివార్యం కావచ్చునని బెంజమిన్ పేర్కొన్నారు.
‘‘చివరికి మనం భూమిని చాలా పాడుచేస్తాం.. ఇక మన అన్వేషణకు మిగిలిన ఏకైక ప్రాంతం అంతరిక్షమేనని చాలా మంది వాదిస్తుంటారు’’ అని ఆయన చెప్పారు.
ఆ దృక్కోణంలో మానవాళి భవిష్యత్తు కోసం అంతరిక్ష అన్వేషణే ఏకైక ప్రత్నామ్నాయం అవుతుందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మన జీవిత కాలంలో ఇది జరుగుతుందా?
ఈ పనిచేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని, చాలా ప్రైవేటు సంస్థలు ఈ పనిలో ఉండటం వల్ల ఆ దిశగా వేగంగా పురోగమిస్తున్నామని సారా చెప్తున్నారు.
‘‘ఇంతకుముందు ఇదంతా ప్రభుత్వ ప్రమేయంతోనే జరిగేది. కానీ ఇప్పుడు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా రంగంలోకి దిగటంతో.. ఇందుకోసం మరింత ఎక్కువగా నిధులు వెచ్చిస్తున్నారు. ఆకాంక్షలు కూడా బలంగా ఉన్నాయి’’ అని ఆమె విశ్లేషించారు.
‘‘చంద్రుడి మీద ఖనిజాల తవ్వకం, ఆస్టరాయిడ్ల మీద ఖనిజాలు తవ్వటం, సముద్రంలో ఖనిజాలు తవ్వటం, అంగారకుడి మీదకు మనుషులు ప్రయాణించటం.. ఇటువంటి భారీ పరిణామాలను మనం చూడబోతున్నాం. ఇవన్నీ మన జీవిత కాలంలోనే సాధ్యం కాగలవు’’ అని చెప్పారామె.
అయితే.. ప్రస్తుతం భూమి మీద జరుగుతున్న ఖనిజ తవ్వకాల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించటం కూడా చాలా ముఖ్యమని బెంజమిన్ అంటారు.
‘‘చంద్రుడి మీద గనులు తవ్వటం అనేది.. పిరమిడ్ అగ్రభాగం లాంటిది. అక్కడికి చేరుకోవటం చాలా కష్టం’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘కాబట్టి.. ముందు ఇప్పుడున్న గ్యాస్, లోతైన జలాల్లో మైనింగ్ వంటి ప్రక్రియలను అభివృద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఉన్నత దశకు వెళ్లగలం’’ అని పేర్కొన్నారు.
చంద్రుడి మీద గనుల తవ్వకాలకు కనీసం మరో 10, 15 సంవత్సరాల సమయం పడుతుందని ఆయన భావిస్తున్నారు. అప్పుడు కూడా నిధులు, వనరులు వంటి అనేక అంశాల మీద అది ఆధారపడి ఉంటుందన్నారు.
చివరికి.. ఇదంతా మరో గొప్ప అభివృద్ధిలో భాగమని సారా అంటారు.
‘‘చంద్రుడి గురించి చూస్తున్నామంటే.. మానవాళిని భూమికి ఆవలి వైపు విస్తరించటంలో భాగమే’’ అని ఆమె అభివర్ణించారు.
ఇవి కూడా చదవండి:
- అపోలో11: ‘50 ఏళ్ల కిందట చంద్రుడిపై నడిచాను’
- అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?
- అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...
- అపోలో మిషన్: చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు స్వర్ణోత్సవం
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు
- చంద్రుడిపై కాలు పెట్టి 50 ఏళ్లు: అప్పట్నుంచి ఇప్పటి వరకూ చంద్రుడి మీదకు ఏ ఒక్క దేశం మనుషులను పంపించలేదు. ఎందుకు?
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'.. మానవ విపత్తులా మారిన ఫేస్‌బుక్ ఈవెంట్
- మానవ నివాసయోగ్యమైన ఆ గ్రహం మీద తొలిసారిగా గుర్తించిన నీటి జాడలు
- టార్డిగ్రేడ్స్: చందమామపై చిక్కుకుపోయిన వేలాది 'మొండి' జీవులు.. ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా బతికేస్తాయి
- ఐర్లండ్ తీరంలో యూఎఫ్ఓలు: విమానాలపైకి ‘చాలా ప్రకాశవంతమైన వెలుగు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








