అపోలో మిషన్: చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు స్వర్ణోత్సవం

ఫొటో సోర్స్, NASA
- రచయిత, రిచర్డ్ హాలింగామ్
- హోదా, బీబీసీ
చంద్రుని మీద మనిషి తొలి అడుగు వేసి ఈ నెల 20వ తేదీకి 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా, జాబిల్లిని అందుకునే స్వప్నాన్ని సాకారం చేసిన అపోలో మిషన్‌లో పనిచేసిన వారి గురించి బీబీసీ ప్రత్యేక కథనం...
4,00,000 మంది: అపోలో కార్మిక శక్తి
1969 జులై 20వ తేదీన చంద్రుడి ఉపరితలం మీద తొలిసారి అడుగుపెట్టిన మానవుడిగా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చరిత్రకెక్కారు. అసలు అపోలో మిషన్ విజయవంతమవుతుందా, విఫలమవుతుందా అన్నది ఈ ఒక్క పైలట్ నైపుణ్యాలు, అనుభవం, ప్రతిస్పందనల మీద ఆధారపడింది.
ఎదుట పెద్ద పెద్ద రాళ్లూ రప్పలతో కూడిన ప్రదేశం... ఇంధనం అయిపోతోంది. అలారాలు అదే పనిగా మోగుతూ ఉన్నాయి.. ఇటువంటి పరిస్థితుల్లో అంతరిక్ష నౌకను చంద్రుడి మీద దించాడు నీల్.
కానీ, ఈ మిషన్ గురించి అతడు ఇచ్చిన అతికొన్ని ఇంటర్వ్యూల్లో తను సాధించిన విజయం గురించి పెద్దగా చెప్పుకోలేదు. అసలు ఈ మిషన్‌ను సాకారం చేసిన వేలాది మంది శ్రామికుల గురించి ఆయన మాట్లాడారు.
అమెరికా వ్యాప్తంగా మొత్తం 4,00,000 మంది స్త్రీ, పురుషులు అపోలో మిషన్‌లో భాగస్వాములయ్యారని నాసా అంచనా. వ్యోమగాములు మొదలుకుని కాంట్రాక్టర్లు, కేటరర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, నర్సులు, డాక్టర్లు, గణితశాస్త్ర నిపుణులు, కంప్యూటర్ ప్రోగ్రామర్లు... ఇలా ఎంతో మంది పాత్ర ఇందులో ఉంది.
ఉదాహరణకు, అపోలో-11 చంద్రుడి మీద దిగిన ఉదంతాన్ని పరిశీలిద్దాం. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కుడిభుజంగా బజ్ ఆల్డ్రిన్ ఉన్నారు.
క్షేత్రంలో ఒక గది నిండా మిషన్ కంట్రోలర్లు ఉన్నారు. ఒక్కో షిఫ్టులో 20 నుంచి 30 మంది చొప్పున పనిచేసే ఈ కీలక బృందం వెనుక హూస్టన్‌లో వందలాది మంది ఇంజనీర్లు ఉన్నారు. బోస్టన్‌లోని ఎంఐటీలో మరొక బృందం కంప్యూటర్ అలారమ్‌ల గురించి సలహాలు ఇచ్చింది.

మిషన్ కంట్రోల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్స్ గ్రౌండ్ స్టేషన్ల నుంచి మద్దతు లభించింది. అంతరిక్ష నౌకను తయారుచేసిన గ్రుమ్మన్ కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్ బృందం, ఇతర సబ్‌కాంట్రక్టర్లు కూడా ఎప్పటికప్పుడు సాయం అందించారు.
సీనియర్ మేనేజర్ల నుంచి కాఫీలు విక్రయించే వారి వరకూ వేలాది మంది సిబ్బంది అప్పటికే ఇందులో తమ వంతు పాత్ర పోషించారు. ఇదంతా ఒక్క అపోలో అంతరిక్ష నౌక కోసం పనిచేసిన వారు.
ఇక, ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని అంశాలూ రాకెట్ల నుంచి స్పేస్‌సూట్ల వరకూ, కమ్యూనికేషన్ల నుంచి ఇంధనం వరకూ, డిజైన్ నుంచి శిక్షణ వరకూ, ప్రయోగం నుంచి వెనక్కి రప్పించటం వరకూ - అన్ని దశల్లో పాలుపంచుకున్న వారి సంఖ్యను కలిపితే, 4,00,000 మంది శ్రమించారన్న లెక్క సరైనదే అనిపిస్తుంది.
ఒక్క వ్యక్తికి 4,00,000 మంది మద్దతు అందించారన్న మాట.
38 సంవత్సరాలు: అపోలో వ్యోమగాముల సగటు వయసు
తొలి మూన్ ల్యాండింగ్ మిషన్ పైలట్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేయలేదు. ఫ్లైట్ రొటేషన్‌లో ఆయన సిబ్బంది వంతు రెండో వరుసలో ఉంది.
ఒకవేళ అపోలో-11 చంద్రుడి మీద దిగకలేకపోతే.. అపోలో-12 కమాండర్ పీట్ కోనార్డ్ చంద్రుడి మీద అడుగుపెట్టిన తొలి మానవుడు అయివుండేవాడేమో.
నిజానికి, వీరు మొత్తం మానవాళి ప్రతినిధులుగా ఉన్నప్పటికీ, అపోలో వ్యోమగాముల మధ్య వయసు, నేపథ్యం, శిక్షణ, సామర్థ్యాల్లో ఎంతో సారూప్యం ఉంది.
''అపోలో-11 సిబ్బంది ప్రతి ఒక్కరూ 1930లో జన్మించారు. వాళ్లందరికీ సైనిక అనుభవం ఉంది. అందరూ పైలట్లు. వాళ్లందరూ క్రైస్తవులేనని నేను అనుకుంటున్నా. ఆ కాలంలో వ్యోమగామి అవటానికి అవసరమైన అర్హతల్లో వారు ఇమిడిపోయారు'' అని వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో అపోలో స్పేస్‌క్రాఫ్ట్ క్యురేటర్ టీసెల్ మూర్-హార్మనీ అన్నారు.

ఫొటో సోర్స్, NASA
అపోలో కమాండర్లలో 38 ఏళ్ల నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్... టామ్ స్టాఫోర్డ్, జీన్ సెర్నాన్‌లతో పోల్చితే అతి పిన్నవయస్కుడు. అపోలో-16 లూనార్ ల్యాండర్ పైలట్ చార్లీ డ్యూక్ (36 సంవత్సరాలు) చంద్రుడిపై అడుగుపెట్టిన వారిలో అతి పిన్నవయస్కుడు.
చంద్రుడి మీద నడిచిన వారిలో అత్యధిక వయసున్న వ్యక్తి.. అమెరికా తొలి వ్యోమగామి అలాన్ షెపర్డ్. 1971లో అపోలో-14 మిషన్‌తో చంద్రుడి మీదకు వెళ్లినపుడు ఆయన వయసు 47 సంవత్సరాలు.
ఇక అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో అత్యధిక వయస్కుడి రికార్డు.. భూమి చుట్టూ అంతరిక్ష కక్ష్యలో తిరిగివచ్చిన తొలి అమెరికన్ పేరు మీదే ఉంది. ఆయన జాన్ గ్లెన్. 1998లో డిస్కవరీ అంతరిక్ష నౌకలో తొమ్మిది రోజుల మిషన్‌లో పాల్గొనేటప్పటికి ఆయన వయసు 77 సంవత్సరాలు.
12 మంది: చంద్రుడి మీద నడిచినవారు (డ్రైవర్లు)
మొత్తం 11 అపోలో మిషన్లలో 33 మంది చంద్రుడి దగ్గరకు ప్రయాణమయ్యారు. వారిలో 27 మంది చంద్రుడి దగ్గరకు వెళ్లారు. వాళ్లలో 24 మంది చంద్రుడి చుట్టూ తిరిగారు. కానీ.. వీరిలో కేవలం 12 మంది మాత్రమే చంద్రుడి మీద నడిచారు. మానవాళికి వారు ప్రాతినిధ్యం వహించారు.
చంద్రుడి మీద తొలిసారి అడుగుపెట్టినప్పుడు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఏం చెప్పబోతున్నారో ఎవరికీ తెలియదు. ఆయన ఎవరితోనూ చర్చించలేదు. అయితే అప్పుడు ఆయన అన్న మాటలు: 'దట్స్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ ఎ మ్యాన్, వన్ జెయింట్ లీప్ ఫర్ మ్యాన్‌కైండ్ (ఒక మనిషికి ఒక చిన్న అడుగు.. మానవాళికి ఓ భారీ ముందడుగు)' అనేవి చాలా కవితాత్మకంగా, చాలా వాస్తవికంగా ఉన్నాయి.
అయితే, చంద్రుడి మీద అడుగు పెట్టిన రెండో వ్యక్తి మీరే అయితే ఏం చెప్తారు?
బజ్ ఆల్డ్రిన్ చంద్రుడి మీద నిస్తేజమైన ఉపరితలాన్ని చక్కగా రెండు ముక్కల్లో వర్ణించారు: ''అద్భుతమైన నిర్జీవప్రాంతం''

ఫొటో సోర్స్, NASA
చంద్రుడి మీద దిగిన మూడో వ్యక్తి సరదాగా వ్యాఖ్యానించాడు. పీట్ కోన్రాడ్ కొంత పొట్టిగా ఉంటారు. ''ఓహ్! మ్యాన్... నీల్‌కి అది చిన్న అడుగు కావచ్చు. కానీ, నాకైతే ఇది పెద్ద అడుగే'' అంటూ హాస్యమాడారు.
అనంతరం అపోలో 16 మిషన్‌లో చంద్రుడి మీదకు వెళ్లిన చార్లీ డ్యూక్ తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ సాధారణ జీవితంలోకి రావటానికి ఇబ్బందులు పడ్డారు. ఆయన వైవాహిక బంధం విడాకుల వరకూ వెళ్లింది.
ఇంకొందరికీ ఇటువంటి అవస్థలే ఎదురయ్యాయి. జీన్ సెర్నాన్ భార్య నుంచి విడిపోయారు. బజ్ ఆల్డ్రిన్ కుంగుబాటుకు లోనయ్యారు. మద్యపాన వ్యసనపరుడయ్యారు. ఇలా 12 మందీ ఏదో ఒక రీతిలో ప్రభావితమయ్యారు.
మానవాళి చరిత్రలో విశిష్టమైన ఈ 12 మందినీ చంద్రుడు చాలా మార్చేయటం కొంత వింతగానే అనిపిస్తుంది.
8 మంది: అపోలో ఆపరేషన్‌లో చనిపోయిన నాసా వ్యోమగాములు
మొదట ముగ్గురు సభ్యులతో అపోలో-7 మిషన్ 1968 అక్టోబర్‌లో బయలుదేరటానికి ముందు.. అప్పటికే ఎనిమిది మంది అపోలో వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు.
మొదట 1964లో థియోడోర్ ఫ్రీమాన్ చనిపోయారు. ఆయన నడుపుతున్న టీ-38 శిక్షణ విమానాన్ని ఒక పక్షి ఢీకొనటంతో అది కూలిపోయింది. కూలిపోవటానికి కొన్ని క్షణాల ముందు ఫ్రీమాన్ విమానం నుంచి ఎజెక్ట్ అయినప్పటికీ.. నేలకు చాలా దగ్గరగా ఉండటం వల్ల భూమిని తాకి చనిపోయారు.
1966 ఫిబ్రవరి 28న జెమిని-9 ప్రధాన సిబ్బంది ఎలియట్ సీ, చార్లెస్ బాసెట్‌లు తమ టీ-38 విమానాన్ని సెయింట్ లూయీలో దింపటానికి సిద్ధమవుతున్నారు. అయితే తక్కువ ఎత్తులో ఉన్న మేఘాలు రన్‌వేను కప్పివేయటంతో.. ఎలియట్ సీ అక్కడ మలుపును గుర్తించలేకపోయారు. దీంతో.. తమ అంతరిక్ష నౌకను నిర్మిస్తున్న భవనాన్ని వీరి విమానం ఢీకొట్టింది. పైలట్లు ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
1967లో నాసా తొలి అపోలో మిషన్‌ను ప్రయోగించటానికి సిద్ధమయింది. కానీ.. ఈ అంతరిక్ష నౌకలో చాలా సమస్యలున్నాయి. దాని కమాండర్ గస్ గ్రీసమ్‌కి ఆ విషయం తెలుసు. దీనికి నిరసనగా ఆయన కేప్ కార్నివాల్‌లోని అపోలో సిమ్యులేటర్ వెలుపల ఒక నిమ్మకాయను కూడా వేలాడదీశారు.

ఫొటో సోర్స్, NASA
1967 జనవరి 27వ తేదీన.. అపోలో అంతరిక్ష నౌకను పూర్తిస్థాయిలో పరీక్షించటానికి.. గ్రీసమ్, ఎడ్ వైట్ (అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికన్), రోజర్ చాఫీలు అందులో తమ స్థానాల్లో పడుకున్నారు. తలుపులు మూసివేశారు. అంతరిక్షనౌకను ఆక్సిజన్‌తో నింపారు.
అప్పటికే సమాచార వ్యవస్థలో సమస్యలు తలెత్తాయి. వాటి గురించి గ్రీసమ్ మాట్లాడుతున్నారు. అంతలో ''మంటలు.. మంటలు'' అని అరిచాడు. క్షణాల్లోనే అందులోని సిబ్బంది మంటలకు ఆహుతయ్యారు. బయటపడే అవకాశమే వారికి లేదు.
ఈ విషాదంతో.. అపోలో కార్యక్రమం గురించి మొత్తం పునరాలోచించాల్సి వచ్చింది. మరింత మెరుగైన అంతరిక్ష నౌకను రూపొందించటం మీద దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. ఆ వ్యోమగాముల మరణం వృధా కాలేదు.
అదే సంవత్సరంలో క్లిఫ్టన్ విలియమ్స్ మరో టీ-38 విమానం కూలిపోయి చనిపోయారు. ఎడ్వర్డ్ గివెన్స్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఎనిమిది మంది వ్యోమగాములతో పాటు.. సోవియట్ రష్యాకు చెందిన ఆరుగురు వ్యోమగాముల స్మారకార్థం అపోలో 15 సిబ్బంది చంద్రుడి మీద ఒక ఫలకాన్ని ఉంచారు.
అయితే.. ఈ జాబితాలో ఒక వ్యోమగామి పేరు చేర్చలేదు. రాబర్ట్ లారెన్స్ తొలి ఆఫ్రికన్ అమెరికన్ వ్యోమగామి కావాల్సింది. కానీ.. ఒ రహస్య మిలటరీ స్పేస్ స్టేషన్ ప్రాజెక్టుకు ఆయనను నియమించారు. ఆయన 1967 డిసెంబర్‌లో మరో పైలట్‌కు శిక్షణనిచ్చే క్రమంలో జరిగిన ప్రమాదంలో చనిపోయారు. ఆ రహస్య ప్రాజెక్టును అనంతరం అంతరిక్ష నౌక కార్యక్రమంలో ఉపయోగించారు.
ఒక్కరు: అపోలో 11 లాంచ్ కంట్రోల్ రూంలో ఉన్న మహిళ
అపోలో కార్యక్రమాన్ని మొత్తం చూస్తే అంతా పురుషుల సారథ్యంలో నడిచిన కృషిగా అనిపించవచ్చు. వ్యోమగాములందరూ పురుషులే. మిషన్ కంట్రోలర్లు అందరూ పురుషులే. చివరికి టీవీ యాంకర్లు కూడా పురుషులే. టీవీల్లో కనిపించే మహిళలు ఎవరైనా ఉన్నారంటే.. వ్యోమగాముల భార్యలు మాత్రమే.
అయితే.. అపోలో మిషన్ విజయం సాధించటానికి తెరవెనుక వేలాది మంది మహిళలు ఉన్నారన్నది వాస్తవం. కార్యదర్శులు, నర్సులు, గణిత శాస్త్రవేత్తలు, ప్రోగ్రామర్లు చాలా మంది ఉన్నారు. వ్యోమగాములు ధరించిన స్పేస్‌సూట్లను మహిళలే తయారుచేశారు. అపోలో గైడెన్స్ కంప్యూటర్ల వైర్లను వారే అమర్చారు.

ఫొటో సోర్స్, NASA
కానీ.. కేప్ కానవరాల్‌లోని అపోలో లాంచ్ కంట్రోల్‌లో ఉన్న ఒకే ఒక్క మహిళ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోలర్ జోన్ మోర్గాన్.
ఆమె ఇంజనీర్. కమ్యూనికేషన్లకు సంబంధించి 21 చానళ్ల బాధ్యత ఆమె నిర్వహించారు. సాటర్న్ 5 రాకెట్‌కు సంబంధించి పర్యవేక్షణ వ్యవస్థల బాగోగులన్నీ ఆమె చూసుకున్నారు.
సీనియర్ హోదాలో పనిచేసిన మహిళగా ఆమె నిరంతరం వివక్షను ఎదుర్కొన్నారు. తొలి రోజుల్లో అయితే అది ఇంకా తీవ్రంగా ఉండేదని చెప్పారు.
''అసభ్యకరమైన ఫోన్ కాల్స్ వచ్చేవి. లిఫ్ట్‌లలో, క్యాంటీన్లలో అసభ్య వ్యాఖ్యానాలు వినాల్సి వచ్చేది. కొంత కాలం తర్వాత నేను పని మీద శ్రద్ధ పెడతానని జనానికి తెలిసిన తర్వాత అటువంటివి చాలా వరకూ తగ్గాయి'' అని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- 'నందాదేవి' పర్వతారోహణలో చనిపోయినవారు తీసుకున్న చివరి వీడియో
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- యూరప్, అమెరికాలో ఆశ్రయం కోసం ప్రజలు ఎందుకు వెళుతున్నారు?
- సూపర్ ఓవర్ నిబంధనలేంటి? బౌండరీలు కూడా టై అయితే గెలిచే జట్టు ఏది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








