అబ్‌ఖాజియా: ఇదొక అజ్ఞాత దేశం... భారత్ దీనిని ఇప్పటికీ అధికారికంగా గుర్తించలేదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్టీఫెన్ డౌలింగ్
- హోదా, బీబీసీ కోసం
కాలచక్రం తిరిగేకొద్దీ పరిస్థితులూ మారిపోతుంటాయి. కానీ, కొన్ని ప్రాంతాలు మాత్రం.. గతించిన కాలం అనే ఆ సంకెళ్లను తెంచుకోలేక అలాగే ఉండిపోతాయి. అక్కడి పరిస్థితులు చూస్తుంటే.. కాలం వెనక్కి వెళ్తోందా? అనిపిస్తుంటుంది.
ఇప్పుడు అలాంటి ఓ ప్రాంతానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. దానిపేరు అబ్‌ఖాజియా. మీలో చాలామంది ఈ పేరు విని ఉండరు.
నల్ల సముద్రం, కాకసస్ పర్వతాల నడుమ ఈ ప్రాంతం ఉంది. దీనికి ఆగ్నేయంలో జార్జియా, ఈశాన్యంలో రష్యా దేశాల సరిహద్దులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, STEFANO MAJNO
సోవియట్ యూనియన్ పాలకులకు అబ్‌ఖాజియా ప్రాంతం అత్యంత ప్రియమైన విహార స్థలంగా ఉండేది. నిత్యం సందర్శకులతో కళకళలాడుతుండేది.
కానీ, ఇప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉందో ఈ ఫొటోలు చూడగానే మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది.

ఫొటో సోర్స్, STEFANO MAJNO
1931కి ముందు అబ్‌ఖాజియా ప్రాంతం స్వతంత్ర రాజ్యంగా ఉండేది. ఆ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ సోవియట్ యూనియన్ జార్జియా ఆధీనంలోకి వెళ్లింది.
జార్జియా ఆధీనంలో ఉన్నా.. ఈ ప్రాంతం ప్రత్యేక భావనతో ఉండేది.
అయితే, 1980 ఆఖరులో సోవియట్ యూనియన్ పతనం దశకు చేరుకున్నాక, స్వాతంత్ర్యం కోసం ఇక్కడ తిరుగుబాటు ప్రారంభమైంది.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
తొలుత తిరుగుబాటుదారులను జార్జియా ఆర్మీ అణచివేసింది. కానీ, కొంతకాలానికే రెబల్స్ మళ్లీ పట్టుబిగించారు. వారికి రష్యా కూడా సహకారం అందించింది. దాంతో, 1992-93 మధ్యకాలంలో జరిగిన ఆ యుద్ధంలో జార్జియాపై విజయం సాధించింది.
ఆ అతర్యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల మందికి పైగా జార్జియా ప్రజలు అబ్‌ఖాజియా విడిచి వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, STEFANO MAJNO
1999లో అధికారికంగా స్వతంత్ర దేశంగా అబ్‌ఖాజియా ప్రకటించుకుంది.
కానీ, ఇప్పటికీ భారత్ సహా అనేక దేశాలు దీనిని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించలేదు. అందుకే, ప్రపంచంలో చాలామందికి అబ్‌ఖాజియా అనే ఒక దేశం ఉందన్న విషయమే తెలియదు.
2008లో జార్జియా- రష్యా యుద్ధం అనంతరం అబ్‌ఖాజియా ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా రష్యా గుర్తించింది. జార్జియా మాత్రం దీనిని రష్యా 'ఆక్రమిత ప్రాంతం'గా ప్రకటించింది.
ఇప్పటి వరకు రష్యాతో పాటు నికరాగ్వా, సిరియా, నౌరు, వెనెజ్వేలా దేశాలు మాత్రమే ఈ ప్రాంతాన్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించాయి.

ఫొటో సోర్స్, STEFANO MAJNO
రష్యాతో సాన్నిహిత్యం
గత కొన్నేళ్లుగా అబ్‌ఖాజియా రష్యాతో సన్నిహితంగా మెలుగుతోంది. జార్జియాతో సరిహద్దులను అధికారికంగా నియంత్రణలోకి తీసుకునేందుకు 2009లో అబ్‌ఖాజియాతో రష్యా ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2014లో 'వ్యూహాత్మక ఒప్పందం' కూడా కుదిరింది.
రష్యా సహాయం మీద మాత్రమే ఈ ప్రాంతం ఆధారపడుతోంది. ఇక్కడ రష్యా కరెన్సీ రూబుల్ వాడుకలో ఉంది. ఇక్కడి ఆస్తుల్లో రష్యా ఆధీనంలో ఉన్నవే అధికం.
సరిహద్దులే కాదు, ఇక్కడి రాజకీయ, సామాజిక వ్యవస్థలు కూడా రష్యా చేతుల్లోనే ఉన్నాయి.
ఈ ప్రాంతానికి సొంత పార్లమెంటు భవనం కూడా లేదు. ఒకప్పుడు రాజధాని సుఖుమిలో ఉన్న పాత భవనం నిర్వహణ లేక శిథిలావస్థకు చేరింది. రైల్వేస్టేషన్ నిర్మానుష్యంగా ఉండిపోయింది.
ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్టెఫానో మజ్నో ఈ ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించారు. ఇక్కడికి వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదని స్టెఫానో అంటున్నారు.
"వాస్తవంగా చెప్పాలంటే, అబ్‌ఖాజియా అనేది రష్యా చేతిలో తోలుబొమ్మ లాంటిది. ఈ ప్రాంత సరిహద్దులు రష్యా సైన్యం నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రస్తుతం స్వతంత్ర దేశంగానే ఉంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, STEFANO MAJNO
ఒకప్పుడు పర్యాటక ప్రాంతం.. ఇప్పుడు?
సోవియట్ యూనియన్ కాలంలో అబ్‌ఖాజియా అత్యంత ప్రసిద్ది చెందిన పర్యాటక ప్రాంతంగా ఉండేది. కాస్త వెచ్చని, కాస్త చల్లని వాతావరణం ఉండే ఈ ప్రాంతం పర్యాటకులను బాగా ఆకర్షిస్తుండేది.
1990కి ముందు ఏటా ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు రెండు లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుండేవారు.
కానీ, 1990లలో అంతర్యుద్ధం రాజుకున్నాక, పర్యాటకులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడటంలేదు. దాంతో, ఒకప్పుడు నిత్యం సందర్శకులతో కళకళలాడిన అనేక హోటళ్లు, రెస్టారెంట్లు బూజుపట్టాయి. కొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి.
ప్రస్తుతం రష్యాకు చెందిన కొద్ది సందర్శకులు మాత్రమే ఇక్కడ కనిపిస్తుంటారు.
గతంలో ఈ ప్రాంతంలో నివసించేవారిలో దాదాపు 25 శాతం మంది జార్జియా పౌరులు ఉండేవారు. కానీ, యుద్ధం వల్ల వారంతా ఇక్కడి నుంచి తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ నడిచే బస్సుల్లో కొన్ని సోవియట్ యూనియన్ కాలం నాటివి.
ట్యాక్సీలు దొరకడం కష్టం. ఎక్కడికి వెళ్లాలన్నా ప్రభుత్వ బస్సులపైనే ఆధారపడాలి. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే, కాలం వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, STEFANO MAJNO
అబ్‌ఖాజియా విశేషాలు

- 1999లో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. కానీ, అంతర్జాతీయంగా గుర్తింపు రాలేదు.
- జనాభా: 5,50,000 (1991లో), 2,50,000 (2011లో)
- రాజధాని: సుఖుమి
- ముఖ్యమైన భాషలు: అబ్‌ఖాజ్, రష్యన్
- కరెన్సీ: రూబుల్
- ప్రధాన మతాలు: క్రిస్టియానిటీ, ఇస్లాం
- సహజ వనరులు: వ్యవసాయం, నిమ్మజాతి ఫలాలు, బాదం, తేయాకు, కలప, కొంచెం బొగ్గు, జల విద్యుత్


ఫొటో సోర్స్, STEFANO MAJNO
చరిత్ర:

756- స్వతంత్ర రాజ్యం ఏర్పాటు
985- జార్జియాలో భాగమైంది, తర్వాత విడిపోయింది
1578- టర్కీ పాలనలోకి వెళ్లింది
1810- అబ్‌ఖాజియా తన నియంత్రణలో ఉందని రష్యా ప్రకటించింది
1864- అబ్‌ఖాజియాను రష్యా స్వాధీనం చేసుకుంది
1931- సోవియన్ యూనియన్ పాలకులు అబ్‌ఖాజియాను జార్జియాలో కలిపారు
1991- జార్జియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది
1992-93లో జరిగిన యుద్ధంలో జార్జియాపై అబ్‌ఖాజియా విజయం సాధించింది
1994- కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రష్యా నుంచి శాంతి దళాలు వచ్చాయి
1999లో స్వతంత్ర దేశంగా అబ్‌ఖాజియా ప్రకటించుకుంది
2008- జార్జియా- రష్యా యుద్ధం అనంతరం అబ్‌ఖాజియా ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా రష్యా గుర్తించింది

గమనిక: ఈ కథనంలోని ఫొటోలు కాపీరైట్ చేయబడ్డాయి.
ఇవి కూడా చదవండి:
- 1983 వరల్డ్ కప్ సెమీఫైనల్: స్టంపులను ఊడపీకి ప్రేక్షకులను బెదిరించిన అంపైర్
- ఈ తిమింగలం రష్యా గూఢచారా
- మయన్మార్: ముందు చక్రాలు లేకున్నా క్షేమంగా విమాన ల్యాండింగ్
- మాస్కో విమాన ప్రమాదానికి పిడుగుపాటే కారణమా
- తుపాను సమయంలో ల్యాండింగ్ కష్టమై నదిలోకి దూసుకెళ్లిన విమానం
- ట్రంప్ - రష్యా: మొత్తం సీరియల్ 250 పదాల్లో
- ‘రాజకీయ వేత్తలకు వల వేసే రష్యా గూఢచారి’ అరెస్టు
- 'ఇథియోపియా విమానం పడిపోతుంటే పైలెట్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు'
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- వీకెండ్లో విశ్రాంతి కోసం ఓ పది విషయాలు
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- ప్రపంచంలోనే కష్టమైన ప్రయాణం!
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- వాస్కో డి గామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ..
- #HerChoice: నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












