ఉత్తర కొరియా: విదేశీయులు ఈ దేశానికి ఎందుకు వెళతారు? ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు?

సిగ్లే

ఫొటో సోర్స్, Rex Features

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా నిర్బంధం నుంచి విడుదలైన ఆస్ట్రేలియా విద్యార్థి సిగ్లే గురువారం బీజింగ్ చేరుకున్నారు
    • రచయిత, ఫ్రాన్సెస్ మావో
    • హోదా, బీబీసీ న్యూస్

ఆస్ట్రేలియా విద్యార్థి అలెక్ సిగ్లీ వార్తా సంస్థల కోసం 'గూఢచర్యం' చేశారని ఉత్తర కొరియా అంటోంది.

జూన్ నెల చివర్లో కనిపించకుండా పోయిన 29 ఏళ్ళ అలెక్ సిగ్లీని ఉత్తర కొరియా గురువారం నాడు విడుదల చేసింది. స్వీడన్ అధికారులు, ఉత్తర కొరియా ప్రభుత్వంతో మాట్లాడిన తరువాత ఆయనను విడుదల చేశారు.

సిగ్లీ వ్యాసాలను ప్రచురించే ఎన్కే న్యూస్ అనే వెబ్ సైట్, ఆయన తమ కోసం గూఢచర్యం చేసినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఖండించారు. 'ఆయన ప్యోంగ్యాంగ్‌ జీవితాన్ని రాజకీయేతర కోణంలోనే విశ్లేషిస్తూ కాలమ్స్‌లో రాశారని ఆ వెబ్‌సైట్ తెలిపింది.

కొరియన్ భాషలో చక్కగా మాట్లాడగలిగే సిగ్లీ గత కొంత కాలంగా ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో నివసిస్తూ కిమ్ ఇల్ -సంగ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదుతుండేవారు. అక్కడ ఆయన టూరిజం వ్యాపారం కూడా చేసేవారు.

విడుదలైన వెంటనే సిగ్లీ జపాన్‌కు వెళ్ళిపోయాడు. ఆయన భార్య జపాన్‌లో ఉంటున్నారు. అయితే, ఎందుకు నిర్బంధించారనే ప్రశ్నకు సిగ్లీ బదులివ్వలేదు.

'సిగ్లీ ఒక అంతర్జాతీయ విద్యార్థి హోదాలో ప్యోగ్యాంగ్‌లోని ప్రతి మూలా తిరుగుతూ రకరకాల ఫోటోలను, విశ్లేషణలను చాలా సందర్భాలలో ఇతరులకు పంపించారు' అని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ శనివారం నాడు ప్రకటించింది.

అంతేకాకుండా, ఆయన నిజాయతీగా తన తప్పును ఒప్పుకున్నందున ప్రభుత్వ మానవతా దృక్పథంతో విడుదల చేసిందని కూడా కేసీఎన్ఏ వెల్లడి చేసింది.

ఉత్తర కొరియా ప్రభుత్వం ఇలా విదేశీయుల మీద 'గూఢచర్యానికి పాల్పడ్డారనే' ఆరోపణలు చేయడం గతంలో కూడా చాలా సార్లు జరిగింది.

ఇంతకీ, అలెక్ సిగ్లే ఆ దేశానికి ఎలా వెళ్లారు? ప్రపంచానికి తలుపులు మూసేసిన ఈ దేశంలో ఎంత మంది విదేశీయులు నివసిస్తున్నారు?

ఉత్తర కొరియాలో విదేశీయులు ఎవరు?

ఈ దేశానికి వచ్చే విదేశీయులను స్థూలంగా రెండు బృందాలుగా వర్గీకరించవచ్చు: పాశ్చాత్యులు - చైనీయులు.

ఉత్తర కొరియాకు అత్యంత సన్నిహిత మిత్ర దేశం చైనా. రెండు దేశాల మధ్య సంబంధాలు గత సంవత్సరం మరింత మెరుగయ్యాయి కూడా. అప్పటి నుంచీ ఉత్తర కొరియాను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగిందని దక్షిణ కొరియాలోని క్యున్‌గ్నామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డీన్ ఓలెట్ చెప్పారు.

గత ఏడాది కాలంలో దాదాపు 1.20 లక్షల మంది చైనా పర్యటకులు ఉత్తర కొరియాను సందర్శించారన్నది ఆయన అంచనా. వీరితో పోలిస్తే ఆ దేశానికి వచ్చే పాశ్చాత్యుల సంఖ్య చాలా స్వల్పం. ఏటా సుమారు 5,000 మంది వస్తుంటారు. ఇక ఉత్తర కొరియాలో నివసించే పశ్చిమ దేశాల ప్రజల సంఖ్య మరీ తక్కువ.

ఉత్తర కొరియా పరిశోధకుడు ఆండ్రే అబ్రహామియన్ తరచుగా ఆ దేశానికి వెళ్లివస్తుంటారు. ఆ దేశంలో సుమారు 200 మంది మాత్రమే పాశ్చాత్యులు ఉండివుంటారన్నది ఆయన అంచనా.

వారిలో దాదాపు అందరూ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లోనే ఉంటారు. వారు ఓ గుప్పెడు దౌత్య కార్యాలయాలు, సహాయ సంస్థలకు సంబంధించిన వారో, విశ్వవిద్యాలతో సంబంధం ఉన్నవారో. ప్యాంగ్యాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో.. విదేశాల్లోని యూనివర్సిటీలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు పరస్పరం సందర్శించే ఎక్స్చేంజ్ కార్యక్రమం ఉంది.

ఉత్తర కొరియా సైనికులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాకు ఏటా పర్యాటకులుగా వచ్చే పాశ్చాత్యుల సంఖ్య సుమారు 5,000 ఉంటుందని అంచనా

ఉత్తర కొరియాలో ప్రవేశించటం కష్టమా?

ఉత్తర కొరియాలో నివసించే పాశ్చాత్యులు చాలా వరకు 'ప్రత్యేక పరిస్థితుల్లో'' అక్కడ నివసిస్తున్నారని డాక్టర్ జాన్ నిల్సన్-రైట్ పేర్కొన్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, చాతమ్ హౌస్‌లో అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు ఆయన.

''ఎవరైనా విదేశీయులు ఉత్తర కొరియాలో చాలా సుదీర్ఘ సమయం గడపటం అసాధారణం. వారు మామూలుగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా వచ్చి కొంత కాలం పాటు నివసిస్తుంటారు. వారి సంఖ్య కూడా చాలా తక్కువ'' అని ఆయన బీబీసీకి తెలిపారు.

అలాంటి పరిస్థితులు మినహా ఏదైనా ఎన్‌జీఓ కార్యకర్తకైనా సరే ఉత్తర కొరియా వీసా లభించటం చాలా కష్టం. అలా వెళ్లాలనుకునే వారికి మద్దతు తెలియజేసే ఉత్తర కొరియా భాగస్వామ్య సంస్థ కానీ, స్పాన్సర్ కానీ అవసరం.

''భద్రతా ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. దీర్ఘ కాలం ఉండాలనుకునే వారి విషయంలో దేశ భద్రతా మంత్రిత్వశాఖ కూడా జోక్యం చేసుకోవచ్చు'' అని ఆయన పేర్కొన్నారు.

అలెక్ సిగ్లే

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అలెక్ రెండు సంవత్సరాలు ప్రయత్నించి ఉత్తర కొరియా వర్సిటీలో విద్యార్థిగా చేరారు

అలెక్ సిగ్లే విషయం ఏమిటి?

అలెక్ మొదట 2012లో ఉత్తర కొరియా వెళ్లారు. ఆ తర్వాత తన సొంత పర్యాటక సంస్థను స్థాపించారు.

ఆ దేశానికి డజన్ల కొద్దీ పర్యటనలకు సారథ్యం వహించాడు. దేశంలో అగ్రస్థాయి యూనివర్సిటీ అయిన కిమ్ ఇల్-సంగ్ యూనివర్సిటీలో చదువుకోవటం కోసం దరఖాస్తు చేయటానికి అవసరమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.

''అందులో దరఖాస్తు ప్రక్రియ ఓపెన్‌గా ఉండదు. ఆ దేశంలో ఉన్న సంబంధాల మీద ఆధారపడి అందులో ప్రవేశం కల్పిస్తారు'' అని అతడు ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.

''నాకు మద్దతు ఇవ్వటానికి, దరఖాస్తు చేయటానికి సాయం చేయటానికి సంసిద్ధత తెలిపిన కొందరు స్నేహితులు దొరికారు. అయినా చివరి ఘట్టం చేరటానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది. ఈమెయిళ్లలో సంప్రదిపుంలు, వ్యక్తిగత ప్రకటన, వైద్య పరీక్ష, నాకు నేర నేపథ్యం లేదని నిర్ధారించే పోలీస్ ధ్రువపత్రం అవసరమయ్యాయి'' అని వివరించారు.

అతడు గత ఏడాది ఏప్రిల్‌లో కొరియా సాహిత్యంలో రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీ ప్రారంభించారు. యూనివర్సిటీలో ఉన్న ముగ్గురు పాశ్చాత్య విద్యార్థుల్లో తాను ఒకడినని గుర్తించారు. మిగతా ఇద్దరిలో ఒకరు కెనడా వాసి అయితే మరొకరు స్వీడన్ పౌరుడు.

చైనా ప్రభుత్వ మీడియా కథనం ప్రకారం.. ఉత్తర కొరియా యూనివర్సిటీల్లో చదువుకోవటం కోసం 60 మంది విద్యార్థులకు చైనా పూర్తి స్కాలర్‌షిప్ అందిస్తుంది. మరో 70 మంది విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించి అక్కడికి వస్తారు.

కిమ్-ఇల్-సంగ్ యూనివర్సిటీ విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్-ఇల్-సంగ్ యూనివర్సిటీలో అతి తక్కువ సంఖ్యలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది

అక్కడ జీవితం ఎలా ఉంటుంది?

ఉత్తర కొరియాలో పర్యటకులతో పోలిస్తే తనకు ఉన్న స్వేచ్ఛ గురించి సిగ్లే తన బ్లాగ్‌లలో రాశారు. పర్యటకులు తమ గైడ్‌ చెప్పినట్లే వినాలి. నిర్దేశించిన ప్రాంతాలను మాత్రమే సందర్శించాలి.

''స్టూడెంట్ వీసా మీద వచ్చి దీర్ఘ కాలం నివసించే విదేశీ విద్యార్థిగా ప్యాంగ్యాంగ్‌లో దాదాపు అనూహ్యమైన స్వేచ్ఛ ఉంది. ఎవరూ తోడు లేకుండా నగరం మొత్తం సంచరించే స్వేచ్ఛ నాకుంది'' అని పేర్కొన్నారు.

అయితే, దేశంలో నివసించే వారిగా అయినా సరే పాశ్చాత్యులకు రెస్టారెంట్లు, భవనాలు, పొరుగు ప్రాంతాలు చాలా ప్రదేశాల్లోకి ప్రవేశం ఉండదని అబ్రహామియన్ చెప్తున్నారు. రెస్టారెంట్లలో చెల్లించటం కోసం ప్రభుత్వం జారీ చేసే టోకెన్ల వంటి వస్తువులు వారికి లేకపోవటమేనన్నారు.

అంతేకాకుండా, నిర్దిష్ట నియమనిబంధనలకు లోబడి వాళ్లు నివసించాల్సి ఉంటుంది. స్థానికులతో కలవటం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఫొటోలు తీయటం ప్రమాదకరం.

''అక్కడ ఉన్నపుడు ఏదైనా సరే మామూలు విషయంగా పరిగణించలేం'' అంటారు ప్రొఫెసర్ నిల్సన్-రైట్.

ఓటో వాంబీర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఓటో వాంబీర్ (22) 2016లో ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లి అక్కడ దొంగతనం ఆరోపణతో నిర్బంధానికి గురయ్యాడు

2016లో అయిదు రోజుల ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లి ప్రచార పటాన్ని దొంగిలించాడన్న ఆరోపణతో 17 నెలల పాటు జైలు నిర్బంధానికి గురైన అమెరికా విద్యార్థి ఓటో వాంబీర్ ఉదంతాన్ని ఆయన ఉదహరించారు.

అతడిని అమెరికా తిప్పి పంపించిన కొన్ని రోజులకే కోమాలో చనిపోయాడు. ఆ ఘటన నేపథ్యంలో తన పౌరులు ఉత్తర కొరియాకు వెళ్లకుండా అమెరికా నిషేధించింది.

''సదుద్దేశంతో వెళ్లిన పాశ్చాత్యులు స్థానిక నిబంధనల విషయంలో తీవ్రమైన పరిణామాలను, కొన్నిసార్లు ప్రాణాంతకమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చునని ఓటో వాంబీర్ ఉదంతం చెప్తోంది'' అని నిల్సన్-రైట్ పేర్కొన్నారు.

ఇటువంటి ప్రమాదాల గురించి అక్కడ నివశించే పాశ్చాత్యులు చాలా మందికి బాగా తెలుసునని అబ్రహామియన్ అంటారు.

''అది కష్టమైనా సరే, అక్కడి సమాజంతో సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నం చేయటం మంచిదే. అనుమానాలను తగ్గించటానికి, ఆ దేశం తలుపులు తెరిచేలా చేయటానికి సంబంధాలు మంచి మార్గమన్నది మా విశ్వాసం'' అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)