బీబీసీ ప్రత్యేకం: ఉత్తర కొరియా వెళ్లలేను.. దక్షిణ కొరియాలో ఉండలేను..

- రచయిత, నితన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కొరియా నుంచి ఎలాగోలా తప్పించుకొని బయటపడాలని చాలామంది ప్రయత్నిస్తారు. కానీ కొందరికే అది సాధ్యపడుతుంది. అలాంటి వాళ్లలో కిమ్ సోక్ చోల్ ఒకరు.
చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఆయన చైనా పారిపోదామని ప్రయత్నించినా వీలు కాలేదు. ఆ తరవాత చాలా ఏళ్లకు ఆయన ఉత్తర కొరియా నుంచి బయటపడగలిగారు.
ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఉంటున్న కిమ్ సోక్.. అక్కడి ప్రజలు తనను ఆదరించట్లేదనీ, తనకు ఏం చేయాలో అర్థం కావట్లేదనీ చెబుతున్నారు.
ఆ ఆవేదన ఆయన మాటల్లోనే...
''నేను ఉత్తర కొరియాలోని సరివోన్ నగరంలో పుట్టాను. దాదాపు 30 ఏళ్లు అక్కడే ఉన్నా. మూడేళ్లుగా దక్షిణ కొరియాలో ఉంటున్నా. కానీ సరైన పత్రాలు లేవన్న కారణంతో నాకు ఇక్కడి పౌరసత్వం ఇవ్వట్లేదు.
నాకు నాలుగేళ్ల వయసప్పుడు మా నాన్న కుటుంబంతో సహా అక్రమంగా సరిహద్దు దాటి చైనాకు పారిపోయేందుకు ప్రయత్నించారు.
మా చెల్లీ, తమ్ముడితో కలిసి నాన్న తప్పించుకోగలిగారు. దురదృష్టవశాత్తూ నేనూ.. అన్నయ్యా.. అమ్మా ఉత్తర కొరియా సైనికులకు పట్టుబడ్డాం.
ఉత్తర కొరియా పోలీసు అధికారులు అమ్మను చాలా నెలలపాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు.
చిన్నప్పుడు స్కూల్లో అందరూ నన్నో ద్రోహిలా చూసేవారు. డిగ్రీ పూర్తయ్యాక ఓ రైల్వే ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలుపెట్టా. కొన్నేళ్ల తరవాత ప్రభుత్వం నన్నో మారుమూల గ్రామానికి బదిలీ చేసింది.
నాకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదు. కానీ వెళ్లకపోతే ప్రభుత్వం నా రేషన్‌ను ఆపేస్తుంది. అయినా ధైర్యం చేసి నేను వెళ్లనని చెప్పా. దాంతో నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.

మరోపక్క మా నాన్న చైనాలో మరో మహిళను పెళ్లి చేసుకొని బాగా స్థిరపడ్డారు. మా పరిస్థితి తెలిసి నాన్న చాలా బాధపడ్డారు. ఎలాగోలా కష్టపడి మా కుటుంబానికి చైనా పౌరసత్వం ఇప్పించారు.
ఎన్నో రోజుల ప్రయాణం తరవాత అతికష్టమ్మీద కొండలూ గుట్టలూ దాటి మేం చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో అడుగుపెట్టాం.
కొన్ని రోజుల తరవాత నాలాగే ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని వచ్చిన మరో యువతిని నేను పెళ్లి చేసుకన్నా.
చైనాలో జీవితం నాకు నచ్చలేదు. దాంతో ఎలాగైనా దక్షిణ కొరియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. మధ్యవర్తుల సాయంతో దక్షిణ కొరియా చేరుకున్నా. కానీ సరైన పత్రాలు లేవన్న కారణంతో నాకు దక్షిణ కొరియా పౌరసత్వం ఇవ్వడానికి అధికారులు ఒప్పుకోలేదు.
మొదట చైనా పౌరసత్వం తీసుకున్న వారికి దక్షిణ కొరియా పౌరసత్వం అంత సులువుగా రాదు.

ఉత్తర కొరియా నేపథ్యానికి సంబంధించిన అన్ని ధృవపత్రాలూ నా భార్యకు ఉన్నాయి. దాంతో తనకూ, మా అబ్బాయికీ దక్షిణ కొరియా పౌరసత్వం లభించింది. అలా వాళ్లిద్దరూ దక్షిణ కొరియాలో ఉండిపోయారు. నేను తిరిగి చైనా వెళ్లాల్సొచ్చింది.
నా కొడుకు కూడా నాలానే ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.
చాలా కాలంపాటు కష్టపడి 2015లో చైనా నుంచి దక్షిణ కొరియా వచ్చేందుకు వీసా పొందగలిగా. అప్పట్నుంచీ ఇక్కడే ఉంటున్నా.
కానీ ఇప్పటికీ స్థానికులు నన్ను బయటి వ్యక్తిలానే చూస్తారు. సరైన గౌరవం ఇవ్వరు. అది తలచుకుంటే చాలా బాధేస్తుంది.
నిబంధనల కారణంగా దక్షిణ కొరియాలో నాకు ఎలాంటి ఉపాధీ పొందే అవకాశం లేదు. పూర్తిగా నా భార్య సంపాదనపైనే ఆధారపడాల్సిన నిస్సహాయ స్థితిలో బతుకుతున్నా.

మా అబ్బాయి ఓ ట్రావెల్ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. ఆ ఏజెన్సీ కార్యకలాపాల్లో నా భార్య కూడా సహాయపడుతుంది. దానిపై ఆధారపడే మేము బతుకుతున్నాం.
ఎన్నిసార్లు అభ్యర్థించినా దక్షిణ కొరియా అధికారులు నా పౌరసత్వ దరఖాస్తును తిరస్కరిస్తూనే ఉన్నారు. దాంతో ప్రస్తుతం లాయర్ సలహా తీసుకోవాలని అనుకుంటున్నా.
నేను ఉత్తర కొరియా వెళ్లలేను. దక్షిణ కొరియాలో ఉండలేను. మరి నేను ఎక్కడికి వెళ్లాలి?'
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









