అమెరికాలో ‘రాజకీయ వేత్తలకు వల వేసే రష్యా గూఢచారి’ అరెస్టు

ఫొటో సోర్స్, FACEBOOK/ MARIA BUTINA
'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం లేదు' అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేసిన కొన్ని గంటలకే.. అమెరికా 29 ఏళ్ల మహిళను రష్యాకు అనుకూలంగా గూఢచర్యం చేస్తున్నారని అరెస్ట్ చేసింది.
ఈమె రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులను లోబరచుకుని వారిపై రష్యాకు అనుకూల ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఎఫ్‌బీఐ ఆరోపించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ భేటీ అయిన తరుణంలో ఈ పరిణామం వెలుగులోకి రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
మరియా బుటినా అనే మహిళ రిపబ్లికన్ పార్టీ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటున్నారు. తుపాకుల హక్కులకు సంబంధించిన అంశాల్లో ఈమె సలహాదారుగానూ పని చేస్తున్నారని అమెరికా మీడియా పేర్కొంది.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి ఈమెకు సంబంధం లేదు.

ఫొటో సోర్స్, FACEBOOK/ MARIA BUTINA
ఈమె రష్యాలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే బుటినా గూఢచారి కాదని, ఆమె కేవలం అంతర్జాతీయ వ్యవహారాలపై అధ్యయనం చేస్తున్న విద్యార్థి అని ఆమె తరపు న్యాయవాది రాబర్ట్ డ్రిస్కోల్ చెప్పారు.
ఆమె వాణిజ్యానికి సంబంధించిన కోర్సులో డిగ్రీ చేస్తున్నారని వివరించారు.
అమెరికా చట్టాలు, విధానాలకు వ్యతిరేకంగా ఆమె వ్యవహరించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని.. ఆమెపై ఆరోపణలన్నీ నిరాధారమని చెప్పారు.
ఆమె కొన్ని నెలల కింది నుంచే పలు ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేస్తున్నారనీ డ్రిస్కోల్ వివరించారు.
వాషింగ్టన్ లో ఉండే బటినాను ఆదివారం అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసుపై బుధవారం విచారణ జరుగనుంది. ఈ మేరకు అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హ్యాకింగ్‌కి పాల్పడ్డారని ఇటీవల 12 మంది రష్యా నిఘా అధికారులను అమెరికా అరెస్టు చేసిన నేపథ్యంలో బుటినా అరెస్టు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫొటో సోర్స్, FACEBOOK/ MARIA BUTINA
ఆమెపై ఉన్న ఆరోపణలేంటి?
అమెరికా నిఘా అధికారులు, ఎఫ్‌బీఐ చెబుతున్న వివరాల మేరకు..
అమెరికా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల వ్యక్తిగత సంబంధాలను తెలుసుకుని వారిని రష్యాకు అనుకూలంగా ప్రభావితం చేసేందుకు బుటినా ప్రయత్నించారు.
విదేశీ ఏజెంట్ రిజిస్ర్టేషన్ చట్టం కింద నమోదు కాకుండా.. ఆ చట్టం కిందకు వచ్చే పలు చర్యలకు పాల్పడ్డారు.
రష్యా ప్రభుత్వ ప్రతినిధుల కోసం ఆమె ''దొడ్డి మార్గాన్ని'' ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నించారు.
రష్యా కోసం ఆమె అమెరికా రాజకీయ వేత్తలతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకునేందుకు ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, FACEBOOK / MARIA BUTINA
బుటినా ఎవరు?
బుటినా సైబీరియాకు చెందిన మహిళ. ఈమె విద్యార్థి వీసా కింద అమెరికాకు వచ్చారు.
అయితే ఈమె సీక్రెట్‌గా రష్యా కోసం పని చేస్తున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి.
ఆమె అమెరికాకు వచ్చేందుకు ముందు రైట్ టు బియర్ ఆర్మ్స్ అనే గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. గతంలోనూ ఈమెకు అమెరికాలోని అత్యంత శక్తివంతమైన గన్ లాబీయింగ్ చేసే జాతీయ రైఫిల్ సంఘానికి సంబంధాలున్నట్లు అమెరికా మీడియా ఇంతకు ముందే రిపోర్ట్ చేసింది.
ఈమె గతంలో ట్రంప్ ఈవెంట్‌కి హాజరై రష్యాతో సంబంధాల గురించి ఆయన్ను ప్రశ్నించారని వార్తలు వచ్చాయి. అప్పుడు మేం పుతిన్‌తో కలిసి నడుస్తామని ట్రంప్ అన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








