"పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం.. మీరే న్యాయం చెప్పండి" - కోర్టుకెక్కిన జంట

కోడి పుంజు మారిస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోడి పుంజు మారిస్

ఫ్రాన్స్‌లో కోడికూతపై న్యాయపోరాటం జరుగుతోంది.

ఫ్రాన్స్‌లో ఒలెరాన్ అనే సుందరమైన దీవి ఉంది. అందులోని ఓ గ్రామంలో ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంట్లో ఉద్యోగ విరమణ చేసిన ఒక జంట నివసిస్తోంది.

పొరుగింట్లో కోడిపుంజు ఉంది. పేరు మారిస్.

ఇది తెల్లవారుజామున పెట్టే కూతపై ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తోంది.

కోడితో యజమానురాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కోడితో యజమానురాలు

ఈ కోడి కూత భరించలేకపోతున్నామని, ఇది సృష్టించే శబ్ద కాలుష్యం అంతా ఇంతా కాదని, ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని తాము ఈ ఇంట్లో ఉంటుంటే, ఈ కోడి వల్ల అది లేకుండా పోయిందని ఆరోపిస్తూ జియాన్‌-లూయిస్ బైరన్, జోలె ఆండ్రియక్స్ జంట కోర్టుకు వెళ్లింది.

ఈ కోడి కూత వల్ల 2017 నుంచి తాము ప్రశాంతతకు దూరమయ్యామని ఫిర్యాదుదారులు చెప్పారు.

అన్ని కోడిపుంజుల్లాగే తన మారిస్ కూత పెడుతోందని, ఇందులో అసహజమైనదేమీ లేదని యజమానురాలు కొరినే ఫెజావు చెబుతున్నారు.

గురువారం ఈ కేసు రోషెఫోర్ట్ పట్టణంలోని న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. విచారణకు మారిస్‌ను రప్పించలేదు.

కేసు నేపథ్యంలో మారిస్ స్థానికంగా ఒక సెలబ్రిటీ అయిపోయింది. కోళ్ల యజమానులు దీనికి మద్దతు తెలుపుతున్నారు. గురువారం కోర్టు భవనం వెలుపలకు చేరుకొని మారిస్‌కు సంఘీభావం ప్రకటించారు.

ఒలెరాన్‌లోని సెయంట్-పియరే-డిఒలెరాన్ గ్రామంలో 15 సంవత్సరాల క్రితం ఆ జంట ఇల్లు కొనుక్కొంది. తర్వాత ఇక్కడే స్థిరపడింది.

మారిస్ యజమానురాలు కొరినే ఫెజావు 35 సంవత్సరాలుగా ఒలెరాన్‌లో ఉంటున్నారు.

కోడి కూతపై ఆ జంట లోగడ ఆమెకు ఫిర్యాదు చేసింది. వారి మధ్య అంగీకారం కుదరలేదు. అప్పుడు ఈ అంశం మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది.

కోళ్లు గ్రామీణ జీవితంలో భాగమని, కోడి కూతను ఆపేయాలని డిమాండ్ చేయడం నిర్హేతుకమని మారిస్ యజమానురాలికి మద్దతిస్తున్న స్థానిక ప్రజలు అంటున్నారు.

కేసుపై కోర్టు తీర్పు సెప్టెంబరులో రానుంది.

వీడియో క్యాప్షన్, వీడియో: చిన్న కర్రతో సింహాన్ని తరిమేసిన గోశాల నిర్వాహకుడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)