పుతిన్ మాట నిజమేనా? ఉదారవాదానికి కాలం చెల్లిందా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, హీలియర్ చేయుంగ్
- హోదా, బీబీసీ న్యూస్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల మరోసారి పతాక శీర్షికల్లోకి ఎక్కారు. లిబరలిజానికి - అంటే ఉదారవాదానికి ''కాలం చెల్లిపోయింది'' అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య దీనికి కారణం.
శరణార్థులు, వలసలు, ఎల్‌జీబీటీ అంశాల మీద ఉదారవాద ఆలోచనలను ఇప్పుడు ''ప్రజల్లో అత్యధిక మంది వ్యతిరేకిస్తున్నారు'' అని ఆయన ఎఫ్‌టీతో పేర్కొన్నారు.
బహుళ సాంస్కృతికతత్వం ''ఇక ఏమాత్రం పనికిరాద''ని కొన్ని బలమైన పాశ్యాత్య దేశాలు కూడా అనధికారికంగా అంగీకరించాయని పుతిన్ చెప్పారు.
అయితే.. పుతిన్ వ్యాఖ్యలను యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనల్డ్ టస్క్ సహా పలువురు నాయకులు విమర్శించారు. ''ఉదారవాద ప్రజాస్వామ్యానికి కాలం చెల్లిందని ఎవరన్నా అన్నారంటే.. వారు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు కూడా కాలం చెల్లింది, చట్టబద్ధ పాలనకు కాలం చెల్లింది, మానవ హక్కులకు కాలం చెల్లింది అని కూడా అంటారు'' అని టస్క్ వ్యాఖ్యానించారు.
పుతిన్ ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నారు? ఆయన అంటున్నది నిజమేనా?
అసలు ఉదారవాదం అంటే ఏమిటి?
ఇదో సంక్షిష్టమైన విషయం. దీనికి వేర్వేరు జనాలకు వేర్వేరు అర్థాలు ఉంటాయి. కానీ విస్తృతంగా చూసినపుడు.. మూడు నిర్వచనాలు ఉన్నాయి.
ఒకటి ఆర్థిక ఉదారవాదం. మెరియమ్-వెబ్‌స్టర్ డిక్షనరీ ప్రకారం.. ''స్వేఛ్చాయుత పోటీ, స్వీయ నియంత్రణ మార్కెట్'' ప్రధానంగా ఉండే విధానం. ప్రపంచీకరణతోను, ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండటానికి సంబంధించిన వాదమిది.
మరొకటి రాజకీయ ఉదారవాదం. అదే డిక్షనరీ ప్రకారం.. ప్రగతి మీద, మానవ జాతికి అవసరమైన మంచితనం మీద, వ్యక్తి స్వయంప్రతిపత్తి మీద విశ్వాసం ప్రాతిపదికగా ఉండే వాదమిది. రాజకీయ, పౌర స్వాతంత్ర్యాల పరిరక్షణ కోసం నిలబడటం ఇందులో మరో ముఖ్యమైన అంశం.
సామాజిక ఉదారవదం కూడా ఉంది. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం.. మైనారిటీ గ్రూపుల పరిరక్షణకు, ఎల్‌జీబీటీ హక్కులు, స్వలింగ వివాహాలకు మద్దతునివ్వటానికి సంబంధించిన వాదమిది.
ఇక 'ఉదార' అనే పదాన్ని కొంతమంది ఒక తిట్టు లాగా కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా దీనికి వేర్వేరు అర్థాలు ఉంటాయనుకోండి.
ప్రస్తుత ఉదంతంలో.. కొన్ని పాశ్చాత్య దేశాల ప్రభుత్వాల వైఖరిని పుతిన్ విమర్శించారు. వలసలు, బహుళ సాంస్కృతికతత్వం, ఎల్‌జీబీటీ అంశాలను ప్రత్యేకించి ప్రస్తావించారు. అంటే.. ఆయన సామాజిక, రాజకీయ ఉదారవాదం గురించి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఉదారవాదం అనే మాటను ఇష్టపడని ప్రపంచ నాయకుడు ఆయన ఒక్కరే కాదు. హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బాన్ కూడా ''ఇల్లిబరల్ (ఉదారవాదం కాని) రాజ్యాన్ని'' సృష్టించాలని తాను కోరుకుంటున్నట్లు విస్పష్టంగా చెప్పారు.
ఎందుకంటే.. పాశ్చాత్య ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థల కన్నా చైనా, రష్యా వంటి దేశాల్లో ఉన్న అధికారవాద వ్యవస్థలు ఉత్తమ ఫలితాలనిస్తాయని తాను నమ్ముతానని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
అంటే.. ఉదారవాదానికి కాలం తీరిపోయిందా?
చాలా దేశాల్లో ఇటీవలి కాలం వరకూ ఉదారవాదాన్ని ఒక ఆదర్శంగా పరిగణించారు.
''రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి ప్రబలంగా ఉన్న పాశ్చాత్య సిద్ధాంతం ఉదారవాదం'' అని ఎఫ్‌టీ అభివర్ణించింది.
అయితే.. ఈ ఆలోచనా ధోరణి క్షీణిస్తుండవచ్చునని చాలా మంది నిజంగా నమ్ముతున్నారు. బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌కు లభించిన మద్దతు, అమెరికాలో డోనల్డ్ ట్రంప్, ఇటలీలో మాటియో సాల్విని వంటి ప్రజాకర్షక నాయకులకు లభించిన మద్దుతును దీనికి సాక్ష్యంగా చూపుతున్నారు.
''2008 సంవత్సరం వరకూ ఉన్న ఉదారవాద తరహా వ్యవస్థ ఇబ్బందుల్లో పడిందనేది విస్పష్టం'' అని ఎల్ఎస్‌ఈలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మైఖేల్ కాక్స్ బీబీసీతో పేర్కొన్నారు.
2008 నాటి ఆర్థిక తిరోగమనం ఓ 'ప్రధాన మలుపు' అంటారాయన. ప్రపంచీకరణతో పాటు ''ప్రతిదాన్నీ మార్కెట్ శాసించటానికి వీలుకల్పించటం వల్ల తమ దేశం ఇక తమకి కాకుండా పోయిందనే భావన ప్రజల్లో కలిగింది. దీంతో అస్తిత్వం, సంస్కృతి అనే విస్తృత ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి'' అని ఆయన పేర్కొన్నారు.
కానీ.. మొత్తంగా చూస్తే ''మనం ఇంకా ఉదారవాద ప్రపంచ ఆర్థికవ్యవస్థ''లోనే జీవిస్తున్నామని ఆయన వాదిస్తారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థలేనని, అధికారవాద వ్యవస్థలు కాదని చెప్తారు.
అయితే.. వేతన ప్రతిష్టంభన, సామూహిక భావన కోల్పోవటం వంటి సమస్యలను ఉదారవాదం పరిష్కరించాల్సిన అవసరముందని ఆయన భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters
వలసల విషయంలో పుతిన్ మాట నిజమేనా?
జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్.. పది లక్షల మందికి పైగా శరణార్థులను.. అందులోనూ ప్రధానంగా సిరియా శరణార్థులను తమ దేశంలోకి అనుమతించటం ద్వారా ''పెద్ద తప్పు'' చేశారని పుతిన్ అభిప్రాయపడ్డారు.
''ఏమీ చేయాల్సిన అవసరం లేదని ఉదారవాదం ముందస్తు విశ్వాసం. వలసదారులు చట్టాలు, శిక్షల భయం లేకుండా చంపొచ్చు, దోపిడీ చేయొచ్చు. అత్యాచారాలకు పాల్పడవచ్చు. ఎందుకంటే వలసలదారులుగా వారి హక్కులను కాపాడాల్సి ఉంటుంది. ఇది ప్రజల్లో అత్యధికుల ప్రయోజనాలకు విరుద్ధంగా మారింది'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజాభిప్రాయ సర్వేలు మరింత సూక్ష్మ చిత్రాన్ని చూపుతున్నాయి. వలసలను అత్యధికంగా ఆహ్వానిస్తున్న దేశాల్లో మెజారిటీ ప్రజలు.. ఆ వలసలను ఒక భారంగా కాకుండా ఒక బలంగా పరిగణిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్ చేపట్టిన ఒక సర్వే చెప్తోంది.
అయితే.. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయని ప్యూ రీసెర్చ్ సెంటర్‌లో ప్రపంచ వలసలు, జనాసాంఖ్యక పరిశోధన విభాగం డైరెక్టర్ మార్క్ లోపెజ్ బీబీసీతో పేర్కొన్నారు.
''ఇటీవలి శరణార్థి వెల్లువల ప్రవేశ కేంద్రాలైన యూరోపియన్ దేశాల్లో - గ్రీస్, జర్మనీ, ఇటలీల్లో - వలసల పట్ల ప్రజల వైఖరి 2014 నుంచి క్షీణించింది'' అని ఆయన చెప్పారు. అయితే వలసల పట్ల 59 శాతం మంది జర్మన్లలో ఇంకా సానుకూల దృక్పథమే ఉందన్నారు.
''దీనికి విరుద్ధంగా.. సంప్రదాయంగా వలసలు అధికంగా వెళుతుండే బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాల్లో.. దేశాన్ని బలోపేతం చేయటంలో వలసదారుల వాటా ఉందన్న అభిప్రాయం పెరిగింది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
అమెరికాలో కూడా 1990ల నుంచి ప్రజల వైఖరులు మారాయని.. వలసలు సానుకూల ప్రభావం చూపుతారని విశ్వసించే అమెరికన్లు మరింత ఎక్కువ మంది ఉన్నారని లోపెజ్ వివరించారు.
ఇటీవలి దశాబ్దాల్లో అమెరికా వ్యాప్తంగా వలసలు మరింత ఎక్కువగా విస్తరించటానికి, అమెరికన్లలో సానుకూల అభిప్రాయం పెరగటానికి సంబంధం ఉంది. ''ఎవరైనా ఒక వలస వ్యక్తితో మంచి పరిచయమున్న వారికి.. వలసల పట్ల సానుకూల దృక్పథం ఉండే అవకాశలు ఇంకా ఎక్కువగా'' ఉన్నాయి.
అయితే.. శరణార్థుల విషయానికి వస్తే అదీ ఇలాగే సంక్లిష్టంగా ఉంటుంది.
యూరప్ లోపల ప్యూ సర్వే నిర్వహించిన జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, బ్రిటన్, గ్రీస్, ఇటలీ వంటి దేశాల్లో మెజారిటీ జనం.. హింస, యుద్ధాల నుంచి పారిపోయి వస్తున్న శరణార్థులను ఆహ్వానించటానికి సుముఖత వ్యక్తం చేశారు. కానీ పోలండ్, హంగరీల్లో దీనికి వ్యతిరేకమైన అభిప్రాయం వ్యక్తమైంది.
మరోవైపు.. ఇవే దేశాల్లో - జర్మనీ, స్వీడన్, గ్రీస్ సహా - వలసల వల్ల ఉగ్రవాదం, నేరాల ముప్పు పెరిగిందని అత్యధిక జనం భావిస్తున్నారు.
శరణార్థి సమస్య విషయంలో యూరోపియన్ యూనియన్ వ్యవహరించిన తీరును ప్యూ సర్వే చేసిన యూరప్ దేశాలన్నీ తప్పుపట్టాయి.
అంటే ఈయూ రాజకీయ నాయకత్వం మీద, వలసకు సంబంధించి కొన్ని వాస్తవిక అంశాల పట్ల చాలా అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు శరణార్థులను ఆహ్వానించాలన్న సూత్రానికి మద్దతు తెలిపారు.

ఫొటో సోర్స్, PACEMAKER
ఎల్‌జీబీటీ అంశాల సంగతేమిటి?
ప్రజల్లో ప్రధానభాగమైన కోట్లాది మంది వ్యతిరేకిస్తున్న ఎల్‌జీబీటీ విలువలను ''బలవంతంగా రుద్దాలని'' ఉదారవాద ప్రభుత్వాలు భావిస్తున్నాయని కూడా పుతిన్ పేర్కొన్నారు.
''ఎల్‌జీబీటీ వ్యక్తులతో మనకు సమస్య లేదు... కానీ కొన్ని విషయాలు మనకు అతిగా కనిపిస్తాయి. పిల్లలు ఇప్పుడు ఐదారు లింగాల పాత్రలు పోషించవచ్చునని వాళ్లు అంటున్నారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఏ దేశం గురించి మాట్లాడుతున్నాం అనే దానిని బట్టి.. ఎల్‌జీబీటీ అంశాలపై ప్రజాభిప్రాయంలో చాలా తేడాలున్నాయి.
ఉదాహరణకు.. పశ్చిమ యూరప్ ప్రాంతవాసుల్లో అత్యధికులు స్వలింగ వివాహాలకు అనుకూలంగా ఉంటే.. మధ్య యూరప్, తూర్పు యూరప్ ప్రాంతాల వాసుల్లో ఎక్కువ మంది దీనిని వ్యతిరేకిస్తున్నారని ప్యూ అధ్యయనంలో వెల్లడైంది.
ఇదిలావుంటే.. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, హంగరీ, పోలండ్, ఇటలీ, స్పెయిన్, అమెరికా సహా 16 దేశాలలో ఇప్సాస్ మోరి చేసిన సర్వేలో.. ఎవరైనా ఒక లింగంతో జన్మించినప్పటికీ మరొక లింగ వస్త్రధారణ చేసుకోవటానికి వీలుండాలని ఎక్కువ మంది ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.
ట్రాన్స్‌జండర్ జనానికి మద్దతు ఇవ్వటానికి, పరిరక్షించటానికి తమ దేశం ఇంకా చాలా కృషి చేయాలని ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువ మంది ప్రజలు ఆశిస్తున్నారు. కానీ హంగరీ, పోలండ్‌లు ఈ వైఖరికి మినహాయింపుగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉదారవాద పార్టీలపై ప్రజాకర్షక పార్టీల పైచేయి సాధిస్తున్నాయా?
ఈ దృశ్యమంతా చాలా గందరగోళంగా కనిపిస్తోంది.
తాజా యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాకర్షక, జాతీయవాద పార్టీలు ఇటలీ, ఫ్రాన్స్, హంగరీల్లో పైచేయి సాధించాయి. కానీ డెన్మార్క్, జర్మనీ సహా ఇతర దేశాల్లో అనుకున్న దానికన్నా ఘోర ఫలితాలు చవిచూశాయి.
బ్రిటన్‌లో యూరోపియన్ యూనియన్‌ను సందేహించే బ్రెగ్జిట్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచింది. కానీ మొత్తంగా చూస్తే బ్రెగ్జిట్ అనుకూల పార్టీలకన్నా బ్రెగ్జిట్ వ్యతిరేక పార్టీలకు అధిక ఓట్లు లభించాయి.
మితవాద, ప్రజాకర్షక పార్టీలకు స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రియా, హంగరీ సహా చాలా దేశాల్లో ఓటరు మద్దతు పెరిగింది.
కానీ స్లొవేకియా సహా ఇతర దేశాలు ఈ ధోరణిని తిరస్కరించాయి. స్లొవేకియా ప్రజలు గత మార్చిలో ఉదారవాద నాయకుడైన జుజానా కాపుటోవాను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
స్కాండినేవియా కూడా భిన్నమైన తీరును అనుసరించినట్లు కనిపిస్తోంది. డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలన్నీ గత ఏడాదిలో వామపక్ష ప్రభుత్వాలను ఎన్నుకున్నాయి.
ప్రజాకర్షకవాదం పెరుగుతుండటం ''ఒక దృగ్విషయం - అందులో ఎవరికీ సందేహం లేదు'' అంటారు ప్రొఫెసర్ కాక్స్. ''కానీ ప్రజాకర్షకవాదం యూరప్‌ను, ప్రపంచాన్ని చుట్టేస్తోందన్న మాట అతి అంచనా అన్నది నా అభిప్రాయం'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
పుతిన్ ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నారు?
రష్యాలో ఒక నిర్దిష్టమైన, విభిన్నమైన తరహా నాగరికత ఉందన్నది పుతిన్ భావన. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని సార్వభౌమాధికారం తిరస్కరిస్తుంది. చట్ట నియమాలను, మానవ హక్కులను జాతీయ సమైక్యత, సుస్థిరతలు కూలదోస్తాయి'' అని ప్రొఫెసర్ కాక్స్ వ్యాఖ్యానించారు.
''పాశ్చాత్య తరహా ఉదారవాదం మీద ఆయనకు ఆసక్తి లేదు. తన తరహా ప్రభుత్వానికి అది ఒక ప్రాధమిక సవాల్ అని ఆయన భావిస్తారు. అందులో ఆశ్చర్యం అవసరంలేదు'' అని పేర్కొన్నారు.
''మరింత పరికించి చూస్తే.. ఉదారవాద తరహా, పెట్టుబడిదారీ, ప్రజాస్వామిక సమాజ నమూనాకు ఒక ప్రత్యామ్నాయం ఉందన్న సందేశం ఇవ్వటానికి ఆయన ప్రయత్నిస్తున్నారు'' అని కాక్స్ విశ్లేషించారు.
నాయకులందరూ తమ ప్రాపంచిక దృక్పథాలను బలంగా ముందుకుతేవటానికి ప్రయత్నిస్తుంటారు. జీ20 శిఖరాగ్ర సదస్సుకు ముందు.. ఉదారవాద వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో.. ఇతర నాయకుల తరహాలోనే తన అభిప్రాయాలు, వాదనలు వినిపించటానికి పుతిన్‌కు కూడా ఓ మంచి అవకాశం.
ఇవి కూడా చదవండి:
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- అంబేడ్కర్‌తో బీబీసీ అరుదైన ఇంటర్వ్యూ: 'సరైనవారు ఎన్నికైతేనే ఎన్నికలకు విలువ'
- పుతిన్ పార్టీలో పట్నా ‘ఎమ్మెల్యే’
- ట్రంప్-పుతిన్ సమర్పించు రాజకీయ డ్రామా!
- ‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడుతున్న రష్యా
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- కార్లోస్ బ్రాత్‌వైట్... ఈ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి...
- క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోనీ అవసరం ఎంత
- రష్యా ఎన్నికలు: ఉచిత భోజనం.. బంపర్ ఆఫర్లు
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- ‘స్మార్ట్ ఫోన్ వాడితే క్రీస్తు విరోధి పుట్టుకొస్తాడు జాగ్రత్త’ - రష్యా క్రైస్తవ మతాధికారి హెచ్చరిక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








