వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్‌వైట్: క్రికెట్ ప్రేమికులు ఈ పేరును ఎందుకు గుర్తుపెట్టుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అబినాష్ కంది
- హోదా, బీబీసీ ప్రతినిధి
'కార్లోస్ బ్రాత్‌వైట్. రిమెంబర్ ద నేమ్'.. 2016లో వెస్టిండీస్ వరల్డ్ టీ20 టైటిల్ గెలిచిన క్షణాల్లో కామెంటేటర్ ఇయాన్ బిషప్ పలికిన మాటలివి.
మూడేళ్ల తర్వాత, ఇప్పుడు వరల్డ్ కప్‌లో న్యూజీలాండ్, వెస్టిండీస్‌ల మధ్య ఓ హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఫలితం తేలుతున్న క్షణాల్లో మరోసారి ఇయాన్ గొంతు వినిపించింది. కానీ, ఇప్పుడు అతడి నోటి నుంచి వచ్చిన మాటలకు అర్థం.. 'బ్రాత్‌వైట్ కల చెదిరింది' అని.
ఇయాన్ అన్నట్లే బ్రాత్‌వైట్ కల చెదరిపోవచ్చు. కానీ, అతడు ఆడిన ఇన్నింగ్స్‌కు మాత్రం క్రికెట్ చరిత్ర పుటల్లో స్థానం చెక్కుచెదరదు.
292 పరుగుల లక్ష్య ఛేదనలో 164-7తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ వెస్టిండీస్‌ను అతడు గెలుపు అంచుల్లోకి తెచ్చాడు.
టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నా, బెదరకుండా కొండంత లక్ష్యాన్ని ఒక్కడే పిండిచేసుకుంటూ వచ్చాడు. 82 బంతుల్లో 101 పరుగులు బాది వెస్టిండీస్‌ను విజయానికి చేరువ చేశాడు.
ఇక విజయానికి ఏడు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. కానీ, అప్పటికే తొమ్మిది వికెట్లు పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్ట్రైకింగ్‌లో బ్రాత్‌వైటే ఉన్నాడు. ఒక పరుగు తీస్తే, చివరి ఓవర్‌లో మళ్లీ అతడే స్ర్టైకింగ్‌లోకి రావొచ్చు. కానీ, తీయలేకపోతే టెయిలెండర్ థామస్ న్యూజీలాండ్ బౌలర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
24 నిమిషాలుగా క్రీజులో ఉన్నా, థామస్ ఆడింది నాలుగు బంతులే. ఒక్క పరుగూ తీయలేదు. అతడికి స్ర్టైక్ రాకుండా, బ్రాత్‌వైటే జాగ్రత్త పడుతూ ఆడుకుంటూ వచ్చాడు. సింగిల్ తీస్తే ముప్పని భావించి, తానే కథ ముగించాలని అనుకున్నాడు బ్రాత్‌వైట్.
నీషమ్ విసిరిన బంతిని అతడు పుల్ చేశాడు. బంతి గాల్లోకి లేచింది. లాంగ్ ఆన్‌లో బౌండరీ అంచుల్లో బౌల్ట్ దాన్ని ఒడిసిపట్టుకున్నాడు.
బ్రాత్‌వైట్ క్రీజులోనే కుప్పకూలాడు. న్యూజీలాండ్ ఆటగాళ్లు అతడి వెన్నుతట్టి ఓదార్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు గుర్తు పెట్టుకోవాలి?
ఏప్రిల్ 3, 2016. మొదట చెప్పుకున్న, వరల్డ్ టీ20 ఫైనల్ జరుగుతోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక. వెస్టిండీస్‌కు ఇంగ్లాండ్ విధించిన లక్ష్యం 156 పరుగులు.
బ్రాత్‌వైట్ క్రీజులోకి వచ్చే సమయానికి వెస్టిండీస్ స్కోరు 107-6. 16వ ఓవర్ నడుస్తోంది. ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ బౌలర్లు జోర్డాన్, విల్లీ కట్టుదిట్టమైన స్పెల్ వేశారు. వారి స్పెల్‌లోని నాలుగు ఓవర్లలో విండీస్‌కు 33 పరుగులే వచ్చాయి.
ఆటలో ఆఖరి ఓవర్ మిగిలుంది. గెలవాలంటే వెస్టిండీస్‌కు 19 పరుగులు కావాలి.
విజయం ఇంగ్లాండ్‌దే అని భావించారంతా.
66 బంతుల్లో 85 పరుగులతో శామ్యూల్స్, 6 బంతుల్లో 10 పరుగులతో బ్రాత్‌వైట్ క్రీజులో ఉన్నారు.
స్ట్రైక్ బ్రాత్‌వైట్‌కే వచ్చింది. ఆ క్షణం వరకూ అతడు ఓ అనామక ఆటగాడు. అతడి మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు.

ఫొటో సోర్స్, AFP GETTY
స్టోక్స్ ఆఖరి ఓవర్ బౌలింగ్‌ను ఆరంభించాడు.
మొదటి బంతి లెగ్ స్టంప్‌కు అవతల పడింది. ఎత్తి బౌండరీ అవతల పడేశాడు బ్రాత్‌వైట్.
రెండో బంతి పడింది. ఫలితం మారలేదు. ఇప్పుడు దాని స్థానం కూడా స్టాండ్స్‌లోని జనాల నడుమే.
సమీకరణం నాలుగు బంతుల్లో ఏడు పరుగులు. చూస్తున్న అభిమానుల్లో ఒకేసారి ఆశ్చర్యం, ఉద్వేగం.

ఫొటో సోర్స్, Getty Images
స్టోక్స్ ముఖంలో నెత్తుటి చుక్క లేదు. కానీ, ధైర్యం తెచ్చుకుని, నేరుగా వికెట్లు ముందు బంతి వేశాడు.
ఈసారి బ్రాత్‌వైట్ బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయాడు. అయితే, అతడి బాదుడు ఎలా ఉందంటే.. మిస్ హిట్ చేసిన బంతి కూడా స్టాండ్స్ అవతల పడింది.
ఇక మూడు బంతుల్లో వెస్టిండీస్ ఒక పరుగు చేయాలి. బ్రాత్‌వైట్ మాత్రం శాంతించలేదు. వరుసగా నాలుగో సిక్సర్ కూడా బాదేసి, సింహనాదం చేశాడు.
అప్పుడు అన్నాడు ఇయాన్ బిషప్.. ''కార్లోస్ బ్రాత్‌వైట్.. రిమెంబర్ ద నేమ్'' అని.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








