సైబర్ అటాక్: అమెరికా నియంత్రణలో ఇరాన్ ఆయుధ వ్యవస్థ

ఇరాన్ ఆయుధ వ్యవస్థ సైబర్ దాడి

ఫొటో సోర్స్, EPA

ఇరాన్ ఆయుధ వ్యవస్థలపై గురువారం అమెరికా సైబర్ దాడి ప్రారంభించింది.

రాకెట్లు, క్షిపణులను నియంత్రించే కంప్యూటర్ వ్యవస్థపై సైబర్ దాడి జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

తమ డ్రోన్‌ను కూల్చడంతో పాటు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసినందుకు ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా దాడికి దిగిందని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.

ఇరాన్‌పై భారీగా ఆంక్షలు విధిస్తున్నట్లు కూడా ట్రంప్ వెల్లడించారు.

అణ్వాయుధాలను పొందకుండా నిరోధించడానికి ఆంక్షలు అవసరమయ్యాయని, టెహ్రాన్ తన తీరును మార్చుకోకపోతే ఆర్థికంగా ఒత్తిడిని కొనసాగించే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు

అణ్వస్త్ర దేశాలు, ఇరాన్ మధ్య కుదిరిన అణుఒప్పందం నుంచి 2015లో అమెరికా వైదొలగడంతో అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ తర్వాత ఇరాన్‌పై ఆంక్షలు విధించడంతో ఆ దేశ ఆర్థికవ్యవస్థ దిగజారింది.

అంతర్జాతీయ ఒప్పందాలను అతిక్రమించకుండానే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తామని గత వారం ఇరాన్ తెలిపింది.

ఇరాన్‌తో తాము యుద్ధం కోరుకోవడం లేదని, కానీ, సంక్షోభం ముదిరితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు.

ట్రంప్

ఫొటో సోర్స్, EPA

అమెరికా ఎలాంటి సైబర్ దాడి చేసింది?

ఈ దాడులకు చాలా ముందు నుంచే ప్రణాళిక వేశారని అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఒమన్‌లో ట్యాంకర్లపై దాడికి ప్రతిస్పందనగా ఈ దాడులు చేసినట్లు చెప్పాయి.

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్‌జీసీ) ఆయుధ వ్యవస్థ లక్ష్యంగా ఈ సైబర్ దాడులు జరిగినట్లు వెల్లడించాయి.

ఇరాన్ ఆయుధ వ్యవస్థను అమెరికా పూర్తిగా నియంత్రించిందని వాషింగ్టన్ పోస్ట్, ఏపీ వార్తా సంస్థ పేర్కొనగా, ఆయుధ వ్యవస్థను కొంత కాలం స్తబ్ధుగా ఉంచేలా అమెరికా సైబర్ దాడి చేసిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

ట్రంప్ ఏమన్నారు?

సైబర్ దాడి కథనాలపై ట్రంప్ స్పందించలేదు. అయితే, ఇరాన్‌పై చేయాలనుకున్న వైమానిక దాడుల ప్రణాళికను విరమించుకుంటున్నట్లు శుక్రవారం తెలిపారు.

ఇరాన్‌తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నట్లు శనివారం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)