వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని మోదీ ప్రసంగం చరిత్రాత్మకమైనదేనా?

ప్రధానమంత్రి మోదీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ పర్యావరణ మార్పు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు

దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో భారత ప్రధానమంత్రి మోదీ మంగళవారం మాట్లాడుతూ.. పర్యావరణ మార్పులు, ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు అన్నారు.

ఇంతకీ ఆయన మాటల్లో ప్రాధాన్యత ఏమిటి?

ప్రధానమంత్రి ప్రసంగాన్ని విశ్లేషించడానికి ఇండియా టుడే పత్రిక సంపాదకులు అన్షుమన్ తివారీ‌తో బీబీసీ ప్రతినిధి మొహమ్మద్ షాహిద్ మాట్లాడారు.

ముఖ్యాంశాలు

1991 ప్రపంచీకరణ తరువాత ఏర్పడిన అతి పెద్ద సంస్థ.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వేదికపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని చాలా రకాలుగా విశ్లేషించవచ్చు.

భారత్ అన్ని రకాల సంస్కృతులను తనలో ఇముడ్చుకుంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లే దేశం. ఈ అంశం ప్రాతిపదికగా మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

పర్యావరణ మార్పు ఆయనకి ఇష్టమైన అంశాల్లో ఒకటి. ప్రపంచీకరణ, ప్రపంచ వాణిజ్యంపై మాట్లాడాల్సిన అవసరం ఉంది. డాటా మేనేజ్మెంట్, తన ప్రభుత్వ విధివిధానాలపై కూడా ఆయన మాట్లాడారు.

భారత్ గొంతు గట్టిగా వినిపించడానికి మోదీకి ఇది ఒక మంచి అవకాశం.

2008లో వచ్చిన ఆర్థికమాంద్యం పూర్తై ఇప్పటికి పదేళ్లు కావొస్తోంది. కానీ, కిందటి ఏడాది నుంచే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవడం ప్రారంభించింది.

ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోంది. చాలా దేశాలు భారత్‌తో సంబంధాలు పెంపొందించుకోడానికి తహతహలాడుతున్నాయి.

అమోరికా, కెనడా, యూరోపియన్ యూనియన్, ఇజ్రాయిల్, బ్రిటన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌టిఐ) పైప్‌లైన్‌లో ఉన్నాయి.

వీటిని దృష్టిలో పెట్టుకుని లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ విషయాల్లో భారత్ తన సంసిద్ధతను గట్టిగా చెప్పడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ భావించారు.

ఈ విషయాలనే ఆయన తన ప్రసంగంలో స్థూలంగా ప్రస్తావించారు. కానీ, ప్రపంచీకరణ విషయంలో భారత్ పాటించబోయే కొత్త పద్ధతుల గురించి ఆయన స్పష్టంగా చర్చిస్తారని చాలామంది ఆశించారు.

ప్రధానమంత్రి మోదీ

ఫొటో సోర్స్, AFP

1991 ప్రపంచీకరణ తరువాత భారత్ ప్రాధాన్యత పెరిగింది. భారత్‌ను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేనేలేదు. ప్రతి వేదిక మీద భారత్ ప్రాతినిథ్యం తప్పకుండా ఉంటోంది.

1991 తరువాత భారత్ బలమైన దేశంగా ఎదిగింది. లిబరలైజేషన్ విషయంలో భారత్ సుముఖత గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు, ప్రపంచీకరణ దిశగా మొదలైన కొత్త అధ్యాయంలో భారత్ పాటించే నూతన విధానాలేమిటి? ఎటువంటి ప్రణాళికలు అనుసరించబోతోంది వంటి విషయాలు తెలుసుకోవాలని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.

ప్రపంచంలో ఎటువంటి ఆర్థిక ధ్రువీకరణ జరగబోతోంది. ఈ విషయంలో భారత్ ఎవరికి మద్దతిస్తుంది? అమెరికాకా లేక చైనాకా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఈ విషయాల ప్రస్తావన ఉంటుందని ఆశించినవారికి నిరాశే కలిగింది.

వీటికి మోదీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదు.

ప్రధానమంత్రి మోదీ

ఫొటో సోర్స్, AFP

వరల్డ్ ఎకనామిక్ ఫోరం మరింత ప్రాధాన్యత సంతరించుకుంటుందా?

ఎటువంటి ఫోరంలలోనైనా కంపెనీల పెట్టుబడి ఒప్పందాలు లేదా ఎఫ్‌టిఐల గురించి చర్చలు జరగవు.

ఇలాంటి వేదికలపై ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఏమిటి? దశ, దిశ ఎలా ఉంది? ఏ విషయాలపై సామూహికంగా దృష్టి సారించాల్సి ఉంటుంది, ఎటువంటి చేయూత అవసరం లాంటి విషయాలు చర్చకు వస్తాయి.

2008కి ముందు ఈ ఫోరంలో ఆర్థికంగా బలమైన దేశాలు, పెట్టుబడిదారి దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉండేది. కానీ, ఆ తరువాత పరిస్థితి మారిపోయింది. సామ్యవాద దేశాలకు చోటు లభించింది. 2008 తరువాత ఈ సంస్థ విధివిధానాల్లో ఎంతో వ్యత్యాసం కనిపించింది.

ఇలాంటి వేదికపై భారత్ పట్ల ఉత్సుకతను పెంపొందించాలనే ఆలోచనతో ప్రధానమంత్రి ప్రసంగించారు.

ఇప్పుడు, ఈ ప్రపంచీకరణ కొత్త అధ్యాయంలో సరికొత్త ఆర్థిక సంబంధాలు ఏర్పడవచ్చు. సరికొత్త ఒప్పందాలకు తెరతీసే అవకాశం రావొచ్చు.

ఈ పరిస్థితుల్లో, ప్రపంచం ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేయడంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ముఖ్యపాత్ర పోషించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)