పెరుగు ఎక్కడ పుట్టిందో తెలుసా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాధవి రమణి
- హోదా, బీబీసీ ట్రావెల్ ప్రతినిధి
పెరుగు భారతదేశ ప్రజల ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. దాని వల్ల చాలా లాభాలున్నాయని భావిస్తారు.
పెరుగును ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు. అయితే పెరుగును ఎక్కడ, ఎప్పుడు కనిపెట్టారు?
భారతదేశం విషయానికి వస్తే, మనం ఎప్పటి నుంచి పెరుగు తింటున్నామో ఖచ్చితంగా తెలీదు.
కృష్ణుడిని వెన్నదొంగ, పెరుగుదొంగ అనేవాళ్లు.
పాశ్చాత్య దేశాలలో పెరుగు ఎప్పుడు, ఎక్కడ పుట్టిందన్న దానిపైనా వివాదముంది.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగు చరిత్ర ఏంటి?
తూర్పు యూరప్ దేశమైన బల్గేరియా పెరుగును ప్రపంచానికి కానుకగా ఇచ్చిందని భావిస్తారు.
ఇక్కడ పెరుగును రకరకాల రూపాల్లో ఆహారంగా తీసుకుంటారు. పెరుగు లేనిదే ఇక్కడ ఏ ఆహారం కూడా సంపూర్ణం కాదు.
4000 ఏళ్ల క్రితం బల్గేరియాకు చెందిన సంచార జాతులు పెరుగును కనిపెట్టినట్లు చాలా మంది భావిస్తుంటారు.
ఈ సంచార జాతులు ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్లే సందర్భంలో పాలను భద్రపరిచేందుకు జంతువుల తోళ్లను ఉపయోగించేవారు.
పాలను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఉంచినపుడు బ్యాక్టీరియా ఉత్పత్తి జరిగి, పెరుగు తయారయ్యేది.
ఇదే విధంగా ప్రపంచంలోని అనేక చోట్ల కూడా పెరుగును తయారు చేయడం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగును తయారు చేసే బ్యాక్టీరియా కోసం అన్వేషణ
బల్గేరియా యూరప్‌లోని బాల్కన్ ద్వీపకల్పంలో ఉంది.
ఇక్కడ పెరుగు తయారు చేసేందుకు ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు.
అంతే కాకుండా ఇక్కడ వాతావరణం కూడా పెరుగు తయారీకి అనుకూలంగా ఉంటుంది.
వాదోపవాదాలు ఎలా ఉన్నా, పాశ్చాత్య దేశాలలో బల్గేరియాలోనే మొదటిసారిగా పెరుగును తయారు చేశారన్నది నిర్వివాదాంశం.
ఇక్కడే పెరుగు ఒక కమర్షియల్ ఉత్పత్తిగా రూపుదిద్దుకుంది.
పెరుగు తయారు చేసే విధానంపై ట్రాన్ ప్రాంతానికి చెందిన స్టామెన్ గ్రిగరోవ్ అనే బల్గేరియా సైంటిస్టు పరిశోధన చేశారు.
ఆయన పేరుతో ట్రాన్ ప్రాంతంలో ఒక మ్యూజియం కూడా ఉంది. ఈ తరహా మ్యూజియం ప్రపంచంలోనే మొదటిది.
గ్రెగరోవ్ స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్సిటీలో చదువుకున్నారు.
ఆయన తన గ్రామం నుంచి పెరుగును తీసుకెళ్లి యూనివర్సిటీలో పరిశోధనలు చేసి దానిలో ఉన్న బ్యాక్టీరియాను కనుగొన్నారు. దాని పేరు ‘ల్యాక్టోబేసిలస్ బుల్గారికస్’.

ఫొటో సోర్స్, Madhvi Ramani/BBC
సుదీర్ఘ జీవన రహస్యం
గ్రెగరోవ్ పరిశోధన ఫలితాలతో రష్యా నోబెల్ పురస్కార గ్రహీత, బయాలజిస్ట్ మెచినికాఫ్ బల్గేరియా రైతుల సుదీర్ఘ జీవన రహస్యం కనుగొన్నారు.
బల్గేరియాలోని రొడోప్ పర్వతంపై ఉండేవారు వందేళ్లకు పైగా జీవిస్తున్న విషయాన్ని ఆయన కనిపెట్టారు.
బల్గేరియా రైతులు అధికంగా పెరుగు తినడమే వారు ఎక్కువ కాలం జీవించడానికి కారణమని ఆయన కనుగొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వందేళ్లకు పైగా జీవించిన వారిలో ఎక్కువ మంది యూరప్‌లోనే కనిపిస్తారు.
పెరుగు తినే వాళ్లు ఎక్కువ కాలం జీవిస్తున్నారన్న వార్తలతో ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, స్పెయిన్, యూకేలలో హఠాత్తుగా దాని క్రేజ్ పెరిగిపోయింది.
బల్గేరియా పెరుగుకు ఆ దేశాలలో డిమాండ్ పెరిగిపోయింది. క్రమక్రమంగా అది యూరప్ ప్రజల ఆహారపు అలవాట్లలో ఒకటిగా మారిపోయింది.
ఇవాళ పెరుగును అనేక రకాల రూపాలలో విక్రయిస్తున్నారు.
బల్గేరియాలో వాతావరణాన్ని బట్టి ఏడాది పొడవునా, వివిధ రకాల పాలతో పెరుగును తయారు చేస్తారు.
ఇక్కడ కొన్నిసార్లు ఆవుపాలు, కొన్నిసార్లు బర్రె పాలు, కొన్నిసార్లు మేక పాలతో పెరుగును తయారు చేస్తారు.
అయితే ఇవాళ పెరుగు అంటే కేవలం బర్రెపాలతో తయారయ్యేదనే చాలా మంది భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సాంప్రదాయ పెరుగు తయారీ విధానం
1949 వరకు బల్గేరియాలో పెరుగును సాంప్రదాయబద్ధంగా ఇళ్ల వద్దే తయారు చేసేవారు.
అయితే బల్గేరియా పెరుగుకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగడంతో ప్రభుత్వం డెయిరీ పరిశ్రమను జాతీయం చేసింది.
అత్యంత నాణ్యత కలిగిన పెరుగును తయారు చేసేందుకు బల్గేరియా శాస్త్రవేత్తలు ఇంటింటికీ వెళ్లి శాంపిల్స్ సేకరించారు.
తర్వాత ఆరోగ్యం, రుచిపరంగా అత్యుత్తమ బ్యాక్టీరియాను ఎంపిక చేసుకుని దానితో పెరుగును తయారు చేసి, ఆ బ్రాండ్‌ను ఎగుమతి చేయడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగును తయారు చేయడం ఒక కళ
నేడు కూడా బల్గేరియా ప్రభుత్వ కంపెనీ ఎల్.బి. బల్గేరికామ్ జపాన్, దక్షిణకొరియాలకు పెరుగు ఎగుమతి చేయడానికి లైసెన్స్ కలిగి ఉంది.
ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బల్గేరియా తరహా పెరుగును ఆసియా దేశాలలో తయారు చేయలేము. అందువల్లే కొరియా, జపాన్‌లకు ప్రతి ఏడాది ఈ బ్యాక్టీరియాను ఎగుమతి చేస్తారు.
1989లో బల్గేరియాలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయింది. బల్గేరియా పెరుగు పరిశ్రమ దెబ్బ తినడంతో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.
గతంలో సుమారు 3 వేల డెయిరీలుండగా, వాటి సంఖ్య 28కు పడిపోయింది.
ఇప్పుడిప్పుడే మళ్లీ పెరుగు బిజినెస్ పుంజుకుంటోంది. ప్రస్తుతం హార్మనీ అనే సంస్థ ఆర్గానిక్ పెరుగును తయారు చేసి ఉత్పత్తి చేస్తోంది.
బల్గేరియాలో ఇప్పటికీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు పెరుగు తయారు చేస్తే, అవి రెండూ భిన్నంగా ఉంటాయి.
ఇక్కడి ప్రజలకు పెరుగును తయారు చేయడం అనేది ఒక కళ. ఆ కళను వారు ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ!
- మనోళ్ల 'గుడ్ మార్నింగ్' బెడద ఇప్పుడు అంతర్జాతీయ సమస్యయి కూర్చుంది!
- అల్లం, తేనె.. నెక్స్ట్ కండోమ్ ఫ్లేవర్ ఏం రావొచ్చు?
- ఇంటర్వ్యూ: హెబ్బార్స్ కిచెన్ సృష్టికర్త ఈవిడే
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- ‘నన్ను ప్రేమించినందుకు నా భర్తను హత్య చేశారు’
- హైపర్‌లూప్: భవిష్యత్తా? భ్రమా?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా!
- ఇలా చేస్తే మీ భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- వారెన్ బఫెట్ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?
- పరాజయం చేసే మేలేంటో మీకు తెలుసా!
- అమ్మతనంపై విమర్శలు ఆగేదెప్పుడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








