పుతిన్ పార్టీలో పట్నా ‘ఎమ్మెల్యే’
బిహార్‌కు చెందిన అభయ్ సింగ్ రష్యా ఎన్నికల్లో పుతిన్ పార్టీ తరపున కూర్స్క్ ప్రావిన్స్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
పట్నా నుంచి రష్యా రాజకీయ విజయాల దాకా ఆయన ప్రయాణం ఎలా సాగింది? ఈ ప్రయత్నంలో ఆయన ఎలాంటి అవరోధాలు ఎదుర్కొన్నారు? వాటిని ఎలా అధిగమించారు? తెలుసుకునేందుకు అభయ్ సింగ్‌ను బీబీసీ హిందీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు.
ఈ సందర్భంగా అభయ్ సింగ్ చెప్పిన వివరాలు..
మా సొంత ఊరు పట్నా. నేను పట్నా లోని లయోలా హైస్కూల్ లో చదువుకున్నాను.
నేను స్కూలు చదువు పూర్తి చేసినప్పుడు రష్యా లేదు. అప్పట్లో అది సోవియట్ యూనియన్.
అది అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, లేదా సోవియట్ యూనిన్ కావచ్చు. అన్ని దేశాలూ అప్పట్లో ఒకే స్థాయిలో ఉండేవి.
నాకు ఇక్కడ చదువుకునే అవకాశం దొరికింది. అందుకే ఇక్కడికి వచ్చాను.
నాకు ఇక్కడి అతి చల్లని వాతావరణం మొదట పెద్ద సమస్యగా అనిపించింది.
ఇక్కడ చలికాలం సెప్టెంబరులో మొదలై మార్చి వరకు ఉంటుంది. ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలకు వరకూ పడిపోతుంది.
మొదట్లో ఇబ్బందిగా ఉన్నా రోజులు గడిచేకొద్దీ ఇక్కడి పరిస్ధితులకు అలవాటు పడ్డాను.
మెడిసిన్ పూర్తయ్యాక, భారత్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. కానీ, విధి నా కెరీర్ రష్యాలో ప్రారంభమయ్యేలా చేసింది.
ఆ తర్వాత ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టాను. ఇక్కడ అందరూ తెల్లవాళ్లే. వారికి నా వ్యాపార ప్రతిపాదనలు చెప్పి ఒప్పించడం చాలా కష్టంగా ఉండేది. కానీ, నేను ఎంతో కష్టపడి, మిగతా వాళ్ళ కన్నా మెరుగ్గా చేయగలనని నిరూపించాను.
నా విజయానికి కారణం ఒక్కటే. ఎప్పుడూ మనోధైర్యాన్ని కోల్పోకపోవడం. ధైర్యంగా పనిచేస్తూ ముందుకు పోవడం.
మొదట్లో మాకు ఫార్మా వ్యాపారం ఉండేది. కాలంతో పాటు వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని ఫార్మా వ్యాపారంలో వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టాను.
నాకు కొన్ని మాల్స్ ఉన్నాయి. ఈ కొత్త వ్యాపారంలో కూడా పోటీదారులున్నారు. ఇందులో, పెద్ద పెద్ద రియాల్టీ వ్యాపారస్తులు కూడా ఉత్సాహంగా లేరు. కానీ, మేం ఈ రంగంలో మాకంటూ కొంత స్థానాన్ని ఏర్పరచుకున్నాం.
నేను భారతీయుడిననే విషయం ఎప్పటికీ మరిచిపోను. కానీ, నా లోలోపల నేనొక రష్యన్ లాగే భావించుకుంటాను. నేను రష్యా వాసిని.
అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయన ప్రభావం నాపై చాలా ఉంది. అందుకే, ఆయనకు చెందిన యునైటెడ్ రష్యాలో చేరాను.
పార్టీలో చేరిన తరువాత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది.
రష్యా ప్రజలు కూడా నాకెంతో మద్దతు ఇచ్చారు. భారీ సంఖ్యలో ఓట్లు వేశారు. అలా, ఈరోజున రాజకీయ రంగంలోకి విజయవంతంగా అడుగుపెట్టాను.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









