బ్రిటన్‌లో పెరుగుతున్న మత విద్వేష నేరాలు

ముగ్గురు మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

బ్రిటన్‌లో మత విద్వేష నేరాల సంఖ్య పెరిగిందని తాజా గణాంకాల్లో వెల్లడైంది.

గత ఏడాది లెక్కలతో పోల్చితే ఈ ఏడాది అలాంటి నేరాలు 40 శాతం పెరిగాయని ఇంగ్లండ్, వేల్స్ పోలీసులు తెలిపారు.

మత విద్వేషాలకు సంబంధించిన నేరాల్లో 52 శాతం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నవే.

2016-17తో పోల్చితే 2017-18లో ద్వేషపూరిత నేరాలు 17 శాతం పెరిగాయి. 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు 94,098 కేసులు నమోదయ్యాయి. అందులో 76 శాతం "జాతి విద్వేష" నేరాలుగా పోలీసులు వర్గీకరించారు.

జాతి, మతం, లైంగికత, వైకల్యం, ట్రాన్స్ జెండర్ గుర్తింపు పట్ల ద్వేషంతో కూడిన నేరాలను ద్వేషపూరిత నేరాలుగా పరిగణిస్తున్నారు.

ద్వేషం చిత్రం

ఫొటో సోర్స్, PA

ఐదేళ్లలో రెట్టింపు

లింగ వివక్షతో 12 శాతం, మతపరమైన ద్వేషంతో 9 శాతం, దివ్యాంగుల పట్ల ద్వేషంతో 8 శాతం, ట్రాన్స్‌జెండర్లు లక్ష్యంగా 2 శాతం నేరాలు నమోదైనట్లు తాజా నివేదిక చెబుతోంది.

గతంతో పోల్చితే అన్ని రకాల ద్వేషపూరిత నేరాలూ పెరిగాయి.

అయితే, గతంలో కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చేవారు కాదు. కానీ, ప్రస్తుతం ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయగలుగుతుండటం కూడా ఆ కేసుల సంఖ్యలో పెరుగుదలకు కొంతమేర కారణం కావచ్చునని బీబీసీ కుటుంబ వ్యవహారాల ప్రతినిధి డాన్నీ షా అభిప్రాయపడ్డారు.

బ్రెగ్జిట్ రెఫరెండం, ఉగ్ర దాడుల తర్వాత ద్వేషపూరిత నేరాలు ఒక్కసారిగా పెరిగినట్లు కూడా వెల్లడైంది.

పోలీసుల లెక్కల ప్రకారం, 2012/13 నుంచి ఇప్పటి వరకు ద్వేషపూరిత నేరాల సంఖ్య రెండింతలకు పైగా పెరిగింది. 2012/13లో 42,255 కేసులు నమోదవ్వగా, 2017/18లో ఆ సంఖ్య 94,098కి పెరిగింది.

వ్యక్తుల పట్ల అసూయతో జరిగే నేరాలను కూడా ద్వేషపూరిత నేరాలుగా పరిగణించాలని యూకే హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఈ గణాంకాలు విడుదల చేశారు.

భవిష్యత్తులో వృద్ధులను ఈసడించుకోవడం, ఇతర సంస్కృతుల వారిపట్ల ద్వేషంతో వ్యవహరించడాన్ని కూడా ద్వేషపూరిత నేరాల జాబితాలో చేర్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)