టీఆర్ఎస్ మేనిఫెస్టో: రైతులకు లక్ష రుణమాఫీ... నిరుద్యోగ యువతకు రూ. 3,016 భృతి

కె.చంద్రశేఖరరావు

ఫొటో సోర్స్, Telangana CMO

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన ఎన్నికల మేనిఫెస్టోను పాక్షికంగా ప్రకటించింది. పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలను పాత్రికేయులకు వివరించారు.

గతంలోని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెబుతూనే మేనిఫెస్టోలో కొత్త పథకాలను ఆయన ప్రకటించారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు 2021 జూన్ ‌లోపు సాగు నీరు అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రకటిస్తున్నది పాక్షిక మేనిఫెస్టోనేనని, పూర్తి స్థాయి మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని అన్నారు.

టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు:

  • రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూ. లక్ష రుణమాఫీ.
  • ‘ఆసరా‘ పింఛను రూ.2016 కు పెంపు. పింఛను అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు.
  • వికలాంగుల పింఛను రూ.1500 నుంచి రూ.3016కు పెంపు.
  • సంఖ్యతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ రూ.3016 నిరుద్యోగ భృతి.
  • సొంత భూమి ఉన్నవాళ్లకు అక్కడే డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అనుమతి. కొత్తగా 2.60 లక్షల డబుల్ బెడ్ రూంల నిర్మాణం.
  • రైతు బంధు పథకం కింద రైతులకు ఎకరాకు ఇచ్చే మొత్తాన్ని రూ.8 వేల నుంచి 10 వేలకు పెంపు.
  • పేద రెడ్డి, ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు.
  • సముచిత రీతిలో ఉద్యోగులకు మధ్యంతర భృతి.
  • మహిళా సంఘాలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అప్పగింత. ఐకేపీ మహిళలకు నిర్వహణ బాధ్యతలు.
  • రైతు సమన్వయ సమితులకు గౌరవ భృతి.
  • ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు.
  • రూ.2వేల కోట్లతో ధరల స్థిరీకరణ

తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి 300 వరకు విజ్ఞాపనలు వచ్చాయని, వాటిని పరిశీలించిన అనంతరం మేనిఫెస్టోకు తుదిరూపు ఇస్తామని కేసీఆర్ అన్నారు. ఓట్ల కోసం కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ పార్టీ మేనిఫెస్టోను రూపొందించిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)