#HisChoice: నేను పెళ్లి చేసుకోలేదు.. ఒంటరిగానే ఉంటా.. ఈ సమాజానికేంటి నష్టం?

ఒక యువకుడు
    • రచయిత, శివకుమార్ ఉలగనాథన్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నావా'' అని అడిగాడు నా స్నేహితుడు. ''మౌనంగా ఉన్నంత మాత్రాన నువ్వు తెలివైనవాడివైపోవు'' అని రెచ్చగొట్టాడు. ''నీకు తెలివే లేదు. నీ ప్రేమ వ్యవహారం ముగిసిపోయి చాలా సంవత్సరాలైంది. కానీ నువ్వు ఇంకా ఆ బాధలోనే ఉండిపోయావు. కాస్త కాలంతోపాటు మారు గురూ'' అని సలహా ఇచ్చాడు.

''నేను పెళ్లి చేసుకోకపోతే నీకేంటి? చేసుకోవాలా, వద్దా అనేది నా ఇష్టం'' అంటూ ఒక్క గుద్దు గుద్దాలని అనిపించింది. కానీ ఇలా ఎంత మందిని కొట్టగలను?

''పెళ్లి ఎందుకు చేసుకోలేదు'' అనే ప్రశ్న వేసిన ప్రతి ఒక్కర్నీ కొట్టాలనుకొంటే, నేనా పని రోజూ చేయాల్సి వస్తుంది.

అసలు నా కథేంటి? దాన్ని ఎక్కడ మొదలుపెట్టాలి?

నేను ప్రేమలో విఫలమయ్యాను. తర్వాత ఒంటరిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను.

నా ఈ నిర్ణయమే సమాజానికి పెద్ద సమస్యైపోయింది.

నా నిర్ణయంతో ఇతరులకు సంబంధం ఏమిటి? వారికొచ్చిన బాధేంటి?

నా స్నేహితులు, బంధువులు నన్నో భిన్నమైన వ్యక్తిగా చూస్తారు. ఇందుకు నా ప్రతిభాపాటవాలో, నా లక్షణాలో, నా వృత్తో కారణం కాదు. నేను 'ఒంటరి'గా ఉండడమే వారు నన్ను అలా చూడటానికి కారణం.

పెళ్లి అయ్యిందా, కాలేదా? ఒంటరిగా ఉన్నావా, లేక రిలేషన్‌షిప్‌లో ఉన్నావా?

లేదు అని సమాధానం ఇస్తే చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తారు. మిమ్మల్ని చిత్రంగా చూస్తారు. మీపై సానుభూతి చూపే అవకాశాలూ ఎక్కువే.

నేనో మెట్రోపాలిటన్ నగరానికి చెందినవాడిని. ఉద్యోగ నిమిత్తం మరో మెట్రోపాలిటన్ నగరంలో ఉంటున్నాను. బహుళ సంస్కృతుల మిశ్రమంగా ఉండే కాస్మోపాలిటన్ వాతావరణంలో పనిచేస్తున్నాను. నేను నివాసం ఉండే ప్రాంతం నగరంలోని విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ప్రతీ ఒక్కరు ఆధునికంగా ఉంటారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. నా ఇరుగుపొరుగుకు నా గురించి తెలుసుకొనేంత తీరిక ఉండదు.

line

బీబీసీ అందిస్తున్న #HisChoice సిరీస్‌లో 10మంది భారతీయ పురుషుల నిజ జీవిత గాథలు ఉంటాయి.

ఆధునిక భారతీయ పురుషుల ఆలోచనలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ల కోరికలు, ప్రాధాన్యాలు, ఆశలను ఈ కథనాలు ప్రతిబింబిస్తాయి.

line

నేను వ్యాయామం చేసే జిమ్, నాతో రోజూ మాట్లాడే చాయ్‌వాలా - తమ పని తాము చూసుకుంటారు. సాధారణ పలకరింపులు తప్ప వాళ్లతో మాట్లాడేది ఏమీ ఉండదు. నేను 'సింగిల్' అని తెలిశాక వారిలో ఏదో కుతూహలం మొదలవుతుంది.

''నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదా'' అని ఆశ్చర్యంగా అడుగుతుంటారు. ''పెళ్లెప్పుడు చేసుకుంటావు'' అని ఎవరైనా అడిగినప్పుడు, నేను ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కాబోలు, కొందరు స్నేహితులు నా తరపున ''ఈ సంవత్సరం ఆఖర్లోగా చేసుకుంటాడు(!)'' అని సమాధానం ఇస్తుంటారు.

''హలో, ఆ ప్రశ్న నాకేమీ ఇబ్బంది కలిగించదు. పైగా, మీరంటున్న సంవత్సరాంతం ఎన్నడూ రాదు'' అని వాళ్లకు చెప్పాలనిపిస్తుంది.

కొందరు వయసు, స్థాయీ బేధాలతో సంబంధం లేకుండా నన్ను నాకు తెలిసిన అమ్మాయిలకు ముడిపెట్టి మాట్లాడుతుంటారు. ఇలాంటి పుకార్లు ఆ అమ్మాయిలతో నాకున్న స్నేహాన్ని దెబ్బతిస్తాయనే ఆలోచన వాళ్లకు ఉండదు.

ఇద్దరు వ్యక్తులు

ఏ నగరంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ఇలా పుకార్లు పుట్టించేవారు ఎప్పుడూ ఉంటారు.

నేను ఇప్పటివరకు శృంగారంలో పాల్గొన్నానో, లేదో కూడా తెలుసుకోవాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. సెక్స్‌ సామర్థ్యం కోణంలోనూ ప్రశ్నలు ఎదురవుతుంటాయి. ఆరోగ్యమేమైనా బాలేదా అని కొన్నిసార్లు నేరుగానే అడిగేస్తుంటారు.

నాకు స్వలింగ సంపర్కంపై ఆసక్తి ఉందేమో తెలుసుకోవాలనే రీతిలోనూ ప్రశ్నలు వస్తుంటాయి.

అలాంటిదేమీ లేదు. అదే వాస్తవమైతే నేను ఇంకో మగవాడితో సహజీవనం చేసేవాడిని కదా.

ఇలాంటి ప్రశ్నలకు నేను కోపంగా సమాధానమిస్తే, నేను అంత స్నేహశీలిని కాదనే ముద్ర వేస్తారు. ఆ పరిస్థితి రాకూడదంటే నేను మౌనంగా ఉండాలి.

నా వ్యవహారాల్లో నా చుట్టూ ఉన్న సమాజం తలదూరుస్తోందని ఎవరన్నారు?

వాళ్లకు నా పట్ల పట్టింపు ఉంది. దానికి నేను అభ్యంతరం చెప్పకూడదు.. అంతే.

కొందరైతే నన్ను ఇంకా పెళ్లి చేసుకోలేదా అని నేరుగా అడక్కుండా, ''సెటిల్ అయ్యావా'' అని అడుగుతుంటారు.

ఈ గొప్ప ప్రశ్నకు నేను చాలా ఉత్సాహంగా ''నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను. బాగానే సంపాదిస్తున్నాను. అప్పుల్లేవు. ఆరోగ్యం భేషుగ్గా ఉంది'' అని బదులిస్తుంటాను.

అప్పుడు, ''అది సరే, పెళ్లైందా'' అని దీర్ఘం తీస్తారు.

ఇది జీవితంలో 'స్థిరపడని' నాలాంటి వ్యక్తికి ఎదురయ్యే మరో ఇబ్బందికరమైన ప్రశ్న.

ఒంటరిగా ఉండడం వల్ల సమాజంలోని అందరూ మనల్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు అనుకుంటారు.

'ఒంటరిగా ఉన్నావు కదా, వీకెండ్‌లో ఆఫీసుకు రావొచ్చు.' 'రాత్రి పొద్దు పోయేవరకు ఆఫీసులో ఉన్నా అడిగే వాళ్లు ఉండరు కదా' అనేవాడు మా మాజీ బాస్.

కానీ నా కమిట్‌మెంట్లు నాకుంటాయి కదా సర్ అని అనాలనిపించేది.

'నువ్వు ఒంటరిగాడివి కదా.. నీ బట్టలు పైన ఆరేసుకో' అనేవాడు మా ఓనర్.

ఏం? నేను వాళ్లతో సమానంగా అద్దె ఇవ్వడం లేదూ?

'నీవు ఒంటరిగాడివి కదా.. నీకు ప్రత్యేకంగా ఆహ్వానపత్రిక ఇవ్వాలా? ఈ వాట్సాప్ మెసేజ్‌నే ఆహ్వానంగా భావించి మా గృహప్రవేశానికి రా' ఇదీ నా స్నేహితుడి ఆహ్వానం.

అవసరమైతే రాత్రి వరకు పని చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇంటివిషయాలకు వస్తే మా బిల్డింగ్‌లోని ఇతర ఫ్లాట్‌లలో ఉన్నవారికి సహకరించడానికి నేను సిద్ధం. నేను 'చెట్లను కొట్టేయకండి' అన్న ప్రచారానికి మద్దతుదారుణ్ని.

కానీ వీటన్నిటికీ నా ఒంటరితనాన్ని సాకుగా చూపితే మాత్రం నాకు నచ్చదు. ఒంటరిగా ఉండడం పాపమా లేక అదేమైనా అనర్హతా?

పెళ్లి చేసుకుంటున్నావా లేదా? నేను కావాలనే పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు లేదా ఆలస్యంగా పెళ్లి చేసుకోవాలనుకోవచ్చు. ఏదైతే వాళ్లకేంటి?

అడగకున్నా ఉచిత సలహాలు ఇవ్వడం ఈ సమాజానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

నేను ఒంటరిగా ఉంటే ఏమేం ప్రమాదాలు జరుగుతాయో అందరూ చెప్పేవాళ్లే.

ఇద్దరు వ్యక్తులు

నా పొరుగున ఉండే వ్యక్తి 'నాలాగే' ఉండే మరొకరితో స్నేహం చేసుకొమ్మన్నాడు.

''మీరేమంటున్నారు?'' అని అడిగా.

''నీలాంటి వ్యక్తే అంటున్నా. అప్పుడు మీ ఇద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుని, జీవితాంతం కలిసి ఉండొచ్చు'' అని సలహా ఇచ్చాడు.

నేనెప్పుడైనా అతనికి తోడు కోసం వెదుకుతున్నానని చెప్పానా?

గతంలో నేను స్నేహితులు, బంధువుల పెళ్లిళ్లు, ఇతర కార్యాలన్నిటికీ వెళ్లేవాడ్ని. కానీ ఇప్పుడు నా అలవాటును మార్చుకున్నాను. వాళ్ల ప్రశ్నలు మరీ ఎక్కువైపోయాయి.

''నిన్ను చూసి దాదాపు ఐదేళ్లైపోయింది. నీ భార్య ఎక్కడ?'' నా వెనకాల చూసి, అక్కడెవరూ లేకపోతే, ''ఒహో.. ఇంకా ఒంటరివాడిగానే ఉన్నావా?'' అని పంచ్.

అందువల్ల నేను కేవలం కొన్ని ఎంపిక చేసుకున్న కార్యాలకే హాజరవుతున్నా. అలాంటి ప్రశ్నలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నా.

ఇప్పుడు నేను సెలవులకు మా ఊరికి వెళ్లి, తిరిగి ఆఫీసుకు వచ్చినపుడు ఒట్టి చేతులతోనే వస్తున్నాను. స్వీట్లు లేవు, పిండి వంటలు లేవు.

''ఏదైనా విశేషమా?'' అన్న ప్రశ్నను ఎదుర్కోలేక కావాలనే ఇలా చేస్తున్నాను.

నేను చదువుకునే రోజుల్లో క్రికెట్, హాకీ అంటే నాకిష్టం. అయితే అవే ఎందుకు ఇష్టం అని ఎవరూ అడగలేదు. అందరూ లేటెస్ట్ ట్రెండీ బైకులు కొంటుంటే నేను మాత్రం పాత మోడళ్లను కొనేవాణ్ని. నా ఒంటి రంగుకు లైట్ కలర్స్ నప్పినా, నేను మాత్రం ముదురు రంగు దుస్తులనే వేసుకునేవాణ్ని. నేను చదువుకున్నది ఒక సబ్జెక్ట్ అయితే, ఉద్యోగం చేస్తోంది దానికి సంబంధం లేనిది.

నా వ్యక్తిగత ఇష్టాలను అర్థం చేసుకున్నవాళ్లకు, వాటిని ఆమోదించేవాళ్లకు నేను చాలా కృతజ్ఞుణ్ని. నన్ను ప్రోత్సహించింది నా స్నేహితులు, ఈ సమాజమే.

అయితే ఒంటరిగా ఉండాలన్న నా ఆలోచన, అభిలాషకు మాత్రం వారి నుంచి ప్రోత్సాహం కరవవుతోంది.

నేను పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. నా జీవిత భాగస్వామి ఇంకా నాకు ఎదురు కాలేదు. నేను నా పాత ప్రేమ వైఫల్యాన్ని మరచిపోయా. ఇప్పుడు నా ఆలోచనల్లో నేను దాని నుంచి చాలా దూరంగా వచ్చేసా.

ప్రస్తుతానికి నేను ఒంటరిని.

నేను మళ్లీ ప్రేమలో పడతానా? ఏమో.. అది నాకు ఎదురైనపుడు ఆలోచిస్తా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)