పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?

- రచయిత, ఇల్యాస్ ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు ఈ వారంలో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా కలుసుకోవాల్సి ఉండింది. ఈ సమావేశం జరిగితే రెండు దేశాల మధ్య మరింత సుహృద్భావ సంబంధాలు ఏర్పడతాయని, తద్వారా మరోసారి శాంతి చర్చలు జరుగుతాయని భావించారు.
కానీ సమావేశాలు జరగడానికి కొద్ది రోజులు ముందుగా భారత్ ఆ సమావేశాన్ని రద్దు చేసుకుంది. పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా', పాకిస్తాన్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అసలు రంగు బయట పడిందని ఆ సందర్భంగా భారత ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
ఇంతకూ దీనంతటికీ కారణం.. పాకిస్తాన్ విడుదల చేసిన స్టాంపులు.
ఏమిటీ స్టాంపుల కథ?
'భారత ఆక్రమిత కశ్మీర్‌లో జరుగుతున్న దారుణాలు' అని పేర్కొంటూ పాకిస్తాన్ 20 చిత్రాలున్న ఈ స్టాంపులను విడుదల చేసింది.
వాటిలో రసాయన ఆయుధాలు, పెల్లెట్ గన్స్, నకిలీ ఎన్‌కౌంటర్లు తదితర ఆరోపణలకు సంబంధించిన చిత్రాలు, కశ్మీర్ నిరసనలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి.
వాటిలో ఒక స్టాంపుపై 2016లో కశ్మీర్ మిలిటెంట్ బుర్హాన్ వనీ చిత్రం కూడా ఉంది. వనీ 2016లో భారత సైనిక బలగాలతో జరిగిన కాల్పులలో మరణించాడు. అతని మృతిపై కశ్మీర్‌లో తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి.
మరో స్టాంపుపై ఒక మిలటరీ జీప్ ముందు భాగంలో కట్టేసి ఉన్న కశ్మీర్ నిరనసకారుడు ఫరూఖ్ అహ్మద్ దార్ చిత్రం ఉంది. భద్రతా బలగాలపై రాళ్లు విసిరే వారి నుంచి రక్షించుకోవడానికి దార్‌ను మావన కవచంగా ఉపయోగించుకున్నారని ఆ సందర్భంగా భద్రతా బలగాలపై విమర్శలు వెలువడ్డాయి.
ఈ స్టాంపులపై 'కశ్మీర్ పాకిస్తాన్‌గా మారుతుంది' అని రాసి ఉంది.
పాకిస్తాన్ 1960లోవిడుదల చేసిన ఒక స్టాంపుపై కశ్మీర్, పాకిస్తాన్‌లను వేర్వేరు రంగులలో చూపించారు. అంతే కాకుండా దానిపై 'జమ్మూకశ్మీర్: తుది పరిస్థితి ఇంకా తేలాల్సి ఉంది' అని ఉండేది.
ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్ కోసం భారత-పాకిస్తాన్‌ల మధ్య రెండు యుద్ధాలు జరిగాయి. కశ్మీర్‌లో పాకిస్తాన్ మిలిటెంట్లను ప్రోత్సహిస్తోందని భారతదేశం ఆరోపిస్తుండగా, పాకిస్తాన్ వాటిని ఖండిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
స్టాంపులపై ప్రతిస్పందన ఏంటి?
ఐక్యరాజ్య సమితి వద్ద సమావేశం రద్దు చేసుకోవడానికి గల రెండు కారణాలలో స్టాంపులు ఒక కారణమని భారత్ చెబుతోంది.
మరో కారణం.. ఒక భారత సైనికుణ్ని, ముగ్గురు కశ్మీర్ పోలీసులను మిలిటెంట్లుగా అనుమానిస్తున్న వారు హత్య చేయడం.
సమావేశం రద్దుపై భారత విదేశాంగ వ్యవహారాల శాఖ ప్రతినిధి ఒకరు, ''మా వాళ్లను దారుణంగా హత్య చేయడం, ఒక ఉగ్రవాదిని ఆకాశానికి ఎత్తివేస్తూ పాకిస్తాన్ స్టాంపులను విడుదల చేయడం బట్టి చూస్తే, పాకిస్తాన్ తన పంథాను మార్చుకోదని అర్థం అవుతోంది'' అన్నారు.
దీనికి ప్రతిగా పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం, ''ఉగ్రవాదం కారణాలు చెప్పి భారతదేశం కశ్మీర్ ప్రజలపై చేస్తున్న దారుణాలను దాచుకోలేదు. కశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయాధికారాన్ని కూడా నిరాకరించలేదు'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ స్టాంపుల రూపకల్పన వెనుక ఎవరున్నారు?
పేరు వెల్లడించడానికి ఇష్టపడని పాకిస్తాన్ పోస్ట్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు, ఎవరి స్మారక చిహ్నంగానైనా పోస్టల్ స్టాంపులు విడుదల చేయవచ్చని తెలిపారు.
''స్టాంపుల విడుదలకు పాకిస్తాన్ పోస్టు ప్రతిపాదిస్తే, ప్రసార సాధనాల మంత్రిత్వ శాఖ దానిని ఆమోదించాలి. అది పాకిస్తాన్ విదేశీ సంబంధాలకు సంబంధించినది అయితే దానికి విదేశాంగ శాఖ కూడా ఆమోదం తెలపాలి. చివరగా ప్రధాని కార్యాలయం వాటిని ఆమోదిస్తుంది'' అని తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ గెలిచినపుడు, రోజువారీ వ్యవహారాలను చూసుకోవడానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్టాంపులను విడుదల చేయాలన్న ఆలోచన వెనుక తాత్కాలిక ప్రభుత్వంలోని అధికారులు ఉన్నట్లు పాకిస్తాన్ పోస్టు అధికారులు చెబుతున్నారు.
ఈ స్టాంపులు జులై 24న, సాధారణ ఎన్నికలకు ఒక రోజు ముందు, నూతన ప్రధాని ప్రమాణస్వీకారం చేయడానికి 25 రోజుల ముందు విడుదల చేశారు. యుద్ధోన్మాద అధికారులే ఇలాంటి ఆదేశాలు ఇచ్చి ఉంటారని పరిశీలకులు అనుమానిస్తున్నారు.
స్టాంపులు ఎలా అమ్ముడుపోతున్నాయి?
విదేశాలలో ఈ స్టాంపులు చాలా బాగా అమ్ముడుపోతున్నాయని పాకిస్తాన్ ఫిలాటసిస్టులు చెబుతున్నారు. 20 స్టాంపులను సుమారు రూ.440 కు విక్రయిస్తున్నారు.
స్టాంపుల వివాదం కారణంగా రెండు దేశాల మధ్య సమావేశం రద్దైన నాటి నుంచి వాటికి డిమాండ్ పెరిగి, వాటి విక్రయాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
- అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం: ఎవరీ బ్రెట్ కావెనా.. ఏమిటీ వివాదం.. ఎఫ్‌బీఐ దర్యాప్తు ఎందుకు?
- బిగ్ బాస్: ‘ఒక సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్’ –బాబు గోగినేని
- ఫేస్‌బుక్: ‘భద్రతాలోపం.. హ్యాకింగ్ బారిన 5 కోట్ల మంది యూజర్ల ఖాతాలు’
- ఆసియా కప్: విజేత భారత్, కానీ చాంపియన్ మెరుపులు ఎక్కడ?
- #HisChoice: నేను లేడీస్ బ్యూటీపార్లర్ నడుపుతున్నా.. తప్పేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








