బ్రెట్ కావెనాపై ఎఫ్‌బీఐ దర్యాప్తుకు ట్రంప్ ఆదేశం.. ఎవరీ కావెనా? ఏమిటీ వివాదం?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తను నామినేట్ చేసిన జడ్జి బ్రెట్ కావెనా మీద వచ్చిన లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపట్టాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.
అంతకుముందు.. అత్యున్నత న్యాయస్థానానికి కావెనా నామినేషన్‌ను సెనేట్ (అమెరికా పార్లమెంటు ఎగువసభ) కమిటీ ఆమోదించింది.
అయితే.. ఆయనపై వచ్చిన ఆరోపణలపై అదనంగా ఎఫ్‌బీఐ దర్యాప్తు జరిగేట్లయితేనే అతడి నామినేషన్‌ను ఆమోదించాలన్న షరతు మీద రిపబ్లికన్ సభ్యుడు జెఫ్ ఫ్లేక్ తన మద్దతు తెలిపారు.
ఈ నేపథ్యంలో.. ఆయనతో కలిపి సెనేట్ కమిటీలోని 11 మంది రిపబ్లికన్ కమిటీ సభ్యులు జడ్జి కావెనాకు అనుకూలంగా ఓటు వేయగా.. కమిటీలోని 10 మంది డెమొక్రటిక్ సభ్యులు వ్యతిరేకించారు.
అనంతరం.. జడ్జి కావెనా మీద ప్రస్తుతం వచ్చిన ఆరోపణలకు పరిమితమయ్యేలా అదనంగా నేపథ్య తనిఖీ నిర్వహించాలని, దానిని వారం లోగా పూర్తి చేయాలని అధ్యక్షుడిని కోరుతున్నట్లు ఆ కమిటీ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
నియామకం వారం రోజులు జాప్యం...
ఫలితంగా.. జడ్జి కావెనా నియామకాన్ని నిర్ధారించే సెనేట్ పూర్తిస్థాయి ఓటింగ్ దాదాపు వారం రోజుల పాటు జాప్యం జరుగనుంది.
ఒక అప్పీల్ కోర్టు జడ్జి అయిన కావెనా.. తనపై ముగ్గురు మహిళలు చేసిన ఆరోపణలను తిరస్కరిస్తున్నారు.
సెనేట్ కమిటీ గురువారం నాడు.. కాలిఫోర్నియాలో సైకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న క్రిస్టీన్ బ్లాసీ ఫోర్డ్ వాంగ్మూలం విన్నది. 1980ల్లో తాము టీనేజర్లుగా ఉన్నపుడు కావెనా తనపై లైంగికంగా దాడి చేశాడని ఆమె చెప్తున్నారు.
జడ్జి కావెనా కూడా సెనేట్ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఆమెపై కానీ, మరెవరి పైన కానీ తాను దాడిచేశానన్న ఆరోపణలను ఆగ్రహంగా తిరస్కరించారు. డెమొక్రాట్లు ఈ ప్రక్రియను రాజకీయం చేస్తున్నారని, తన కుటుంబానికి, తనకు ఉన్న మంచి పేరుకు హాని చేస్తున్నారని ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎఫ్‌బీఐ ఏం దర్యాప్తు చేస్తుంది?
‘‘జడ్జి కావెనా ఫైల్‌ను అప్‌డేట్ చేయటానికి అనుబంధ దర్యాప్తు చేయాలని నేను ఎఫ్‌బీఐని ఆదేశించాను. సెనేట్ కోరినట్లుగా.. ఈ అప్‌డేట్ పరిధి పరిమితంగా ఉండాలి. వారం రోజుల లోపలే పూర్తిచేయాలి’’ అని ట్రంప్ చెప్పారు.
ఎఫ్‌బీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పటికీ కావెనాను ఆయన వెనకేసికొచ్చారు.
‘‘ఇప్పుడే, ఈ రోజు రాత్రి జడ్జి కావెనాపై ఎఫ్‌బీఐ విచారణ ప్రారభమైంది. ఏదో ఒక రోజు ఆయన అమెరికా సుప్రీంకోర్టు గొప్ప జడ్జిగా గుర్తింపు పొందుతారు’’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
జడ్జి కావెనా నేపథ్యం గురించి ఇంతకుముందే పూర్తిచేసిన తనిఖీని ఎఫ్‌బీఐ మళ్లీ మొదలుపెడుతుంది. పాత సాక్షుల దగ్గరికి మళ్లీ వెళ్లటం, కొత్త వారితో మాట్లాడటం ఈ ప్రక్రియలో జరగొచ్చు.
ట్రంప్ ప్రకటనకు జడ్జి కావెనా స్పందిస్తూ.. ‘‘నేను వాళ్లు కోరిన ప్రతీదీ చేశాను. ఇకపైనా సహకరిస్తాను’’ అని చెప్పారు.
అయితే.. ఎఫ్‌బీఐ దర్యాప్తుకు వారం రోజుల కాల పరిమితి నిర్ణయించటాన్ని డాక్టర్ క్రిస్టీన్ బ్లాసీ ఫోర్డ్ తరఫు న్యాయవాది డెరా కాట్జ్ ప్రశ్నించారు. ‘‘దీనికి సంబంధించిన వాస్తవాలన్నిటినీ సమీకరించటానికి ఎఫ్‌బీఐ కూలంకషంగా దర్యాప్తు చేయటం కీలకం. ఈ దర్యాప్తు మీద కాలం, పరిధి వంటి వాటిపై కృత్రిమ పరిమితులు విధించరాదు’’ అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఓటింగ్ ఎందుకంత ముఖ్యం?
అమెరికా న్యాయవ్యవస్థలో తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జిల స్థానం చాలా కీలకం. అమెరికా చట్టాల మీద వీరిదే తుది నిర్ణయం అవుతుంది. అబార్షన్ వంటి తీవ్ర వివాదాస్పదమైన సామాజిక అంశాలు, ప్రభుత్వ విధానాలను చేసే సవాళ్లు వంటివి ఇందులో ఉంటాయి.
ఈ న్యాయమూర్తులను అమెరికా అధ్యక్షుడే నియమిస్తారు. ఆపైన జీవితాంతం వీరు ఆ స్థానంలోనే కొనసాగుతారు. జడ్జి కావెనా నియామకంతో.. రాబోయే కొన్నేళ్ల పాటు ఈ త్రాసు సంప్రదాయవాదులవైపు మొగ్గవచ్చు.
అయితే.. 100 మంది సభ్యుల సెనేట్‌లో రిపబ్లికన్లకు 51 - 49 నిష్పత్తితో కేవలం సాధారణ మెజారిటీ మాత్రమే ఉంది. ఫ్లేక్ మద్దతు, మరొక రిపబ్లికన్ సెనేటర్ మద్దతు లేకుండా జడ్జి కావెనా నియామకం జరగదు.

ఫొటో సోర్స్, Getty Images
కావెనాపై ఉన్న ఆరోపణలు ఏంటి?
1. 1982లో బ్రెట్ కావెనా ఓపార్టీలో మద్యం మత్తులో తనను మంచంపైకి నెట్టేసి, అసభ్యకరంగా తాకాడని, తన నోటిని గట్టిగా మూసేశాడని ప్రొఫెసర్ క్రిస్టీన్ బ్లాసీ ఫోర్డ్ ఆరోపించారు. ఆ రాత్రి తనపై అత్యాచారం జరుగుతుందని భయపడ్డానని, ఎలాగోలా ఆ గదిలోంచి తప్పించుకొని బయటపడినట్లు క్రిస్టీన్ చెప్పారు. అప్పుడు తన వయసు 15, కెవనా వయసు 17 అని ఆమె పేర్కొన్నారు.
2. యేల్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఓసారి కావెనా తన ప్యాంటును కిందకు లాగి ప్రదర్శిస్తూ, వెకిలిగా నవ్వాడని అతడి మాజీ క్లాస్‌మెట్ డెబోరా రామిరెజ్ ఆరోపించారు.
3. 1980ల్లో కావెనా అమ్మాయిలకు పార్టీల్లో డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా వేధించేవారని జూలీ స్వెట్నిక్ అనే మరో మహిళ ఆరోపించారు. ఓ పార్టీలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆ పార్టీకి కావెనా కూడా హాజరయ్యారని ఆమె అన్నారు.
ఈ ఆరోపణలన్నీ 1980ల్లో కావెనా విద్యార్థి దశలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించినవే. ఈ ఆరోపణలన్నీ అసత్యమైనవే అంటూ కావెనా వీటిని ఖండిస్తున్నారు. జూలీ ఆరోపణలు హాస్యాస్పదమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








