అమెరికా: సుప్రీం కోర్టుకు ట్రంప్ అభ్యర్థిపై లైంగిక వేధింపుల ఆరోపణలు... సెనేట్‌లో భావోద్వేగాలతో వాంగ్మూలాలు

బ్రెట్ కావెనా అనే న్యాయమూర్తిని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్వయంగా ఆ దేశ సుప్రీంకోర్టుకు నామినేట్ చేశారు. కానీ ఆ ఎంపిక ప్రస్తుతం అమెరికాలో తీవ్ర వివాదాస్పమైంది. కావెనా మీద ఎదురవుతున్న లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి.
కావెనా తమతో లైంగికంగా తప్పుగా ప్రవర్తించారని ఏకంగా ముగ్గురు మహిళలు ఆరోపించారు. దాంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన ఎన్నిక ఆలస్యమైంది. ప్రస్తుతం ఆ వివాదంపై సెనేటర్ల మండలి విచారణ జరుపుతోంది.
ఆ విచారణకు కావెనాపై ప్రధానంగా ఆరోపణలు చేసిన ప్రొఫెసర్ క్రిస్టీన్ బ్లాసీ ఫోర్డ్ హాజరయ్యారు. గతంలో కెవనా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఆ ఘటన తన జీవితాన్ని సమూలంగా మార్చేసిందని, చాలాకాలం పాటు ఆ విషయాన్ని ఇతరులతో చెప్పడానికి భయపడ్డానని ఆమె తన వాంగ్మూలంలో తెలిపారు.
‘అమెరికా పౌరురాలిగా జరిగింది చెప్పడం నా బాధ్యత. అందుకే నేను ఇక్కడున్నా తప్ప మరో కారణం లేదు. ఆ రోజు నన్ను వేధించింది కావెనానే. నేను వందశాతం నమ్మకంగా ఉన్నా’, అని క్రిస్టీ కన్నీళ్లు పెడుతూ చెప్పారు. తొమ్మిది గంటలపాటు సాగిన ఆ విచారణలో చాలామంది పౌరులు ఆమెకు మద్దతుగా నిలిచారు.

క్రిస్టీ తరువాత ఆరోపణలు ఎదుర్కొంటోన్న న్యాయమూర్తి బ్రెట్ కావెనా కూడా విచారణలో పాల్గొన్నారు. అవన్నీ అసత్య ఆరోపణలనీ, తాను ఎప్పుడూ క్రిస్టీని వేధించలేదని ఆయన భావోద్వేగంతో సెనేట్ సభ్యులకు తెలిపారు.
‘ఈ విచారణ యావత్ జాతికే తలవంపులు తెస్తుంది. రాజ్యాంగం సెనేట్‌కు చాలా ఉన్నతాధికారాలను ఇస్తుంది. కానీ ఇప్పుడు అవి దుర్వినియోగం అవుతున్నాయి. జూలైలో ట్రంప్ నన్ను సుప్రీంకోర్టుకు ఎంపిక చేసినప్పటి నుంచి ఆ నియామకాన్ని అడ్డుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ, ఈ పరిణామాల వల్ల నేను బాధపడి నా నిర్ణయాన్ని మార్చుకోను.
నన్ను చివరి ఓటింగులో మీరు ఓడించవచ్చు. కానీ, నా అంతట నేను తప్పుకునేలా మీరు ఎప్పటికీ చేయలేరు’, అని కావెనా తన వాంగ్మూలంలో చెప్పారు.
క్రిస్టీ మీద దాడి జరగలేదని తాను చెప్పట్లేదనీ, కానీ తాను మాత్రం ఆమెను ఎప్పుడూ లైంగికంగా వేధించలేదని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ట్రంప్ ఏమంటున్నారు?
డెమాక్రాట్స్ కావెనా ఎంపికను అడ్డుకోవడానికి కావాలనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని డోనల్డ్ ట్రంప్ అన్నారు. తాను కలిసిన అత్యుత్తమ వ్యక్తుల్లో న్యాయమూర్తి కావెనా ఒకరని, ఆయన వ్యక్తిత్వం మీద తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన చెప్పారు.
విచారణ ముగిశాక ట్రంప్ స్పందిస్తూ, ‘కావెనా వాంగ్మూలం చాలా శక్తిమంతంగా, నిజాయతీగా ఉంది. ఆయన ఎంపికను అడ్డుకోవడానికి, ఆలస్యం చేయడానికి డెమాక్రాట్స్ ఇలా చేస్తున్నారు. కానీ సెనేటర్లు దీనిపై ఓటు వేయాల్సిందే’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కావెనాపై ఉన్న ఆరోపణలు ఏంటి?
1. 1982లో బ్రెట్ కావెనా ఓపార్టీలో మద్యం మత్తులో తనను మంచంపైకి నెట్టేసి, అసభ్యకరంగా తాకాడని, తన నోటిని గట్టిగా మూసేశాడని ప్రొఫెసర్ క్రిస్టీన్ బ్లాసీ ఫోర్డ్ ఆరోపించారు. ఆ రాత్రి తనపై అత్యాచారం జరుగుతుందని భయపడ్డానని, ఎలాగోలా ఆ గదిలోంచి తప్పించుకొని బయటపడినట్లు క్రిస్టీన్ చెప్పారు. అప్పుడు తన వయసు 15, కెవనా వయసు 17 అని ఆమె పేర్కొన్నారు.
2. యేల్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఓసారి కావెనా తన ప్యాంటును కిందకు లాగి ప్రదర్శిస్తూ, వెకిలిగా నవ్వాడని అతడి మాజీ క్లాస్‌మెట్ డెబోరా రామిరెజ్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
3. 1980ల్లో కావెనా అమ్మాయిలకు పార్టీల్లో డ్రగ్స్ ఇచ్చి లైంగికంగా వేధించేవారని జూలీ స్వెట్నిక్ అనే మరో మహిళ ఆరోపించారు. ఓ పార్టీలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆ పార్టీకి కావెనా కూడా హాజరయ్యారని ఆమె అన్నారు.
ఈ ఆరోపణలన్నీ 1980ల్లో కావెనా విద్యార్థి దశలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించినవే. ఈ ఆరోపణలన్నీ అసత్యమైనవే అంటూ కావెనా వీటిని ఖండిస్తున్నారు. జూలీ ఆరోపణలు హాస్యాస్పదమని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, MICHAEL AVENATTI
ఈ ఆరోపణలకు ఎందుకంత ప్రాధాన్యం?
అమెరికా న్యాయవ్యవస్థలో తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జిల స్థానం చాలా కీలకం. అమెరికా చట్టాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన నిర్ణయాలూ వాళ్ల మీదే ఆధారపడి ఉంటాయి.
ఆ న్యాయమూర్తులను అమెరికా అధ్యక్షుడే నియమిస్తారు. ఆపైన జీవితాంతం వారు ఆ స్థానంలోనే కొనసాగుతారు. అంటే, ఇప్పుడు కావెనా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైతే, కొన్ని దశాబ్దాలపాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది.
తరువాత ఏం జరుగుతుంది?
కావెనాను సుప్రీంకోర్టుకు నామినేట్ చేయాలా వద్దా అనే దానిపై అమెరికా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఓట్ వేస్తుంది. అది అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు లేదా మొత్తంగా ఎలాంటి సిఫార్సు చేయకపోవచ్చు.
కమిటీ ఓటింగ్ ముగిశాక, సెనేట్ దానిపై చర్చించి మొత్తం సెనేటర్లంతా దానిపై ఓటు వేస్తారు. ఈ ప్రక్రియ వచ్చే వారం జరుగుతుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








