అడల్టరీ: ఇష్టపూర్వక వివాహేతర సంబంధాలు నేరం కాదని ప్రకటించిన సుప్రీం కోర్టు

వివాహేతర సంబంధాల చట్టం, సెక్షన్ 497, సుప్రీంకోర్టు

వివాహితులైన వారు ఇష్ట పూర్వకంగా వివాహేతర సంబంధం పెట్టుకుంటే.. అది నేరం కాదు అని సుప్రీం కోర్టు పేర్కొంది.

భార్యను భర్త ఆస్తిగా భావించడమనేది మహిళల హక్కులను నాశనం చేయడమేనని, కాలం చెల్లిన భావన అని సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టం చేసింది.

ఇష్ట పూర్వక సంబంధాలైనప్పటికీ దీన్ని విడాకులకు కారణంగా చూపించవచ్చని తెలిపింది.

ప్రస్తుతం బాధిత భార్య కేసు పెడితే ఆమె భర్తను అయిదేళ్లపాటు జైలుకు పంపే అవకాశముంది.

భార్య.. భర్త ఇద్దరూ ఇలాంటి చర్యకు పాల్పడినపుడు కేవలం భర్తను మాత్రమే శిక్షించడానికి వీలు కల్పించే ఐపీసీ సెక్షన్ 497ను పిటిషనర్ చాలెంజ్ చేశారు.

ఇద్దరికీ సమాన పాత్ర ఉన్నపుడు, ఇద్దరూ సమానమైనపుడు 497 సెక్షన్ చట్టబద్ధంకాదని కోర్టు వ్యాఖ్యానించింది.

అది కాలం చెల్లిన చట్టమని అభిప్రాయపడింది. ఈ చట్టం వల్ల మహిళల సమానత్వానికి భంగం వాటిల్లుతుందని పేర్కొంది.

ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ తీర్పును వెల్లడించారు.

మగవాళ్లు ఇక మోసగాళ్లు కాదు.. మహిళలు బాధితులూ కారు

పురుషుడి అనుమతితోనే లైంగిక చర్య జరిగినంత మాత్రాన దాన్ని నేరంగా పరిగణించలేమనడం అసంబద్ధమని అన్నారు.

లైంగిక నిర్ణయాల్లో మహిళల ఇష్టాయిష్టాల విషయంలో రాజీకి తావులేదు. ఇష్టపూర్వక శృంగారమనేది మహిళ హక్కు.. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి షరతులు పెట్టేందుకు వీలు లేదు.

ఇక పవిత్రత మాటకొస్తే అది కేవలం భార్యకే కాదు, భర్తకూ వర్తిస్తుందని అన్నారు.

ఈ కేసుల్లో కేవలం పురుషులనే శిక్షించలేరని జస్టిస్ ఇందు మల్హోత్ర అన్నారు.

ప్రభుత్వం ఏం చెప్పింది?

వివాహేతర సంబంధాలు అన్న పదం మరోసారి వార్తల్లోకెక్కింది. వివాహేతర సంబంధాల చట్టంలో సవరణలు చేస్తే దాని వల్ల వైవాహిక వ్యవస్థ పవిత్రత దెబ్బతింటుందని ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.

ఇటలీలో ఉంటున్న ప్రవాస భారతీయుడు జోసెఫ్ షైన్ ఈ చట్టంపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిలో ఆయన ఐపీసీలోని సెక్షన్ 497 క్రింద శిక్ష విధించే విషయంలో స్త్రీపురుషుల మధ్య వివక్ష ఎందుకని ప్రశ్నించారు.

ఈ పిటిషన్‌పై ప్రతిస్పందిస్తూ ప్రభుత్వం, ఈ మార్పు చేస్తే అది వివాహ వ్యవస్థ పవిత్రతను దెబ్బ తీస్తుందనీ, అది సమాజంపై దుష్ప్రభావం చూపిస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.

వివాహేతర సంబంధాల చట్టం, సెక్షన్ 497, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ఇంతకూ వివాహేతర సంబంధాల చట్టం ఏమిటి?

ప్రస్తుత వివాహేతర సంబంధాల చట్టం 150 ఏళ్ల నాటిది. ఐపీసీ సెక్షన్ 497 దీనిని నిర్వచిస్తోంది.

ఎవరైనా పురుషుడు మరో వివాహిత అయిన మహిళతో, ఆమె అనుమతితో శారీరక సంబంధం పెట్టుకుంటే, దీనిపై ఆమె భర్త ఫిర్యాదు చేస్తే, ఈ చట్టం కింద ఆ పురుషుణ్ని దోషిగా పరిగణించి అతనికి ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు శిక్షలూ విధించవచ్చు.

అయితే, ఈ చట్టంలో ఉన్న ఒక మెలిక ఏమిటంటే, ఒక వివాహితుడు అవివాహితతో కానీ, వితంతువుతో కానీ శారీరక సంబంధం ఏర్పరచుకుంటే మాత్రం దానిని నేరంగా పరిగణించరు.

వివాహేతర సంబంధాల చట్టం, సెక్షన్ 497, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

చట్టంలో లైంగిక వివక్ష

వివాహేతర సంబంధాలతో ఇద్దరు స్త్రీపురుషుల మధ్య పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఏర్పడినపుడు దానిలో కేవలం ఒక్కరికే శిక్ష విధించడం ఏ మేరకు న్యాయమంటూ పలువురు పురుషులు ఈ చట్టంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

చండీగఢ్‌లోని పీజీఐ ఆసుపత్రిలో పని చేసే నవీన్ కుమార్.. ఈ చట్టం పూర్తిగా తప్పని అన్నారు. వివాహితులైన ఇద్దరు స్త్రీపురుషులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నపుడు, ఆ సంబంధం చట్ట వ్యతిరేకం అయినపుడు, శిక్షిస్తే వాళ్లిద్దరినీ శిక్షించాలని ఆయన అన్నారు.

''కేవలం మహిళ అనే కారణంతో ఆమెకు శిక్ష విధించకుండా ఉండడం చాలా తప్పు. ఎందుకంటే అలాంటి సంబంధం ఏర్పరచుకునే మహిళకు ఏది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకునే విచక్షణ ఉంటుంది. ఒకవేళ అది చట్ట వ్యతిరేకమైతే, ఆ తప్పునకు ఇద్దరికీ శిక్ష పడాలి'' అన్నారు నవీన్.

అయితే దీనిపై మహిళల వాదన మాత్రం వేరేగా ఉంది. బీబీసీ హిందీ గ్రూపులో ఉన్న తోషి శంకర్ దీనిపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఇలా రాశారు, ''దురదృష్టవశాత్తూ వివాహంలో ప్రేమ దొరక్క, బయట ప్రేమను అన్వేషించే మహిళలకు ఈ చట్టంలో మార్పులు చేస్తే చాలా నష్టం కలుగుతుంది.''

ఇలాంటి పరిస్థితి పురుషులకు కూడా ఎదురు కావచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలే ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నాని తోషి భావిస్తున్నారు.

వివాహేతర సంబంధాల చట్టం, సెక్షన్ 497, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Thinkstock

వివాహేతర సంబంధాల చట్టంపై ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం ఇదేమీ మొదటిసారి కాదు. 1954, 1985, 1988లో కూడా ఇలాంటి ప్రశ్నలే ఉత్నన్నం అయ్యాయి.

గత ఏడాది కూడా సుప్రీంకోర్టు - కేవలం పురుషుణ్ని మాత్రం దోషిని చేస్తున్న ఈ చట్టం కాలం చెల్లినది కాలేదా అని ప్రశ్నలు సంధించింది.

ప్రస్తుతం జోసెఫ్ షైన్ పిటిషిన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ తీర్పు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)