5,300 ఏళ్ల కిందటి మంచుమనిషి చివరిగా ఏం తిన్నాడు?

ఫొటో సోర్స్, SOUTH TYROL MUSEUM OF ARCHAEOLO
- రచయిత, హెలెన్ బ్రిగ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అడవి గొర్రె, ఎరుపు జింకల మాంసం, ముతక గోధుమలు, అడవి చెట్ల ఆకులు..
ఇదేమీ ఓ మాస్టర్ చెఫ్ తయారు చేసిన కొత్త ఆహారం కాదు. మన పూర్వికులలో కొందరు తీసుకున్న పుష్టికరమైన విందు భోజనం ఇది.
ఒట్జీగా పిలిచే ఓ మంచు మనిషి తన చివరి రోజు తీసుకున్న ఆహారం ఇది. అనేక పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనిపెట్టారు.
మంచు మనిషి సమతుల ఆహారాన్ని తీసుకున్నప్పటికీ అతని భోజనంలో ప్రమాదకర స్థాయిలో కొవ్వు పదార్థాలు ఉన్నాయని వారు నిర్ధారించారు.
5300 ఏళ్ల కిందటి ఈ మంచు మనిషి మంచు నదులు ఘనీభవించడంతో చనిపోయాడు. మంచులోనే వేల ఏళ్ల పాటు భద్రంగా ఉన్న అతని దేహం 1991లో బయట పడింది.
దాని ఆధారంగా మంచు మనిషి జీవితం, ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఇప్పటికే అనేక విషయాలు కనుగొన్నారు.
అయితే, అతను చివరి రోజు ఏం తిన్నాడు అనేది మాత్రం ఇటీవల పరిశోధనల్లోనే గుర్తించారు.
అతని పొట్టంతా కొవ్వుతో పేరుకుపోయిందని, ఎరుపు జింక, అడవి గొర్రెల మాంసం తిన్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు చెప్పారు. అలాగే, ఆ కాలం నాటి గోధుమలు, ఒక రకమైన మొక్క ఆకుల అవశేషాలు కూడా బయటపడినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, SOUTHTYROLARCHAEOLOGYMUSEUM\EURAC\M.SAMADELLI
కొవ్వు ఎంత ఉంది?
అతని పొట్టలో 50 శాతం కొవ్వు ఉంది. మనం సాధారణంగా తీసుకొనే ఆహారంలోని కొవ్వు కంటే ఇది 10 శాతం ఎక్కువ.
''మంచు మనిషి ఎంత ఎత్తులో వేటాడి ఉంటాడో పరిశీలిస్తే శక్తి కోసం అతనికి ఈ స్థాయి కొవ్వు అవసరమని తెలుస్తుంది'' అని యూరక్ రీసెర్చ్ ఇన్ట్సిట్యూట్ ఫర్ మమ్మీ స్టడీస్ ఇన్ బొల్జనోలో పరిశోధన చేస్తున్న డాక్టర్ ఫ్రాంక్ మాక్సినెర్ అన్నారు.
మన పూర్వీకుల తిండి గురించి ఇదేం చెబుతోంది?
వీరి పరిశోధన వివరాలు కరెంట్ బయోలజీలో ప్రచురితమయ్యాయి. కాంస్య యుగం నాటి మనుషులు ఎలాంటి ఆహారం తీసుకునేవారు అనేది వీరి పరిశోధనల్లో తేలింది.
ముఖ్యంగా మంచు మనిషి పొట్టను పరిశీలించి వీరు చాలా విషయాలను వెల్లడించారు.
మమ్మీల తరహాలో మంచు మనిషిని చుట్టచుట్టడం వల్ల అతని శరీరంలోని పొట్ట భాగం సాధారణ స్థానంలో లేదు. ఇటీవల అది బయటపడింది.
పాల ఉత్పత్తుల వల్ల మంచు మనిషి శరీరంలో కొవ్వు పేరుకుపోలేదని, యూరోపియన్ ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లో ఉండే ఒకరకమైన గొర్రె మాంసాన్ని తినడం వల్లే అతని శరీరంలో కొవ్వు ఉందని తేలింది
''అతని ఆహారం పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులతో కలసి సమతూకంగా ఉంది.'' అని డాక్టర్ మాక్సినర్ తెలిపారు.

ఫొటో సోర్స్, INSTITUTE FOR MUMMY STUDIES\EURAC RESEARCH\FRANK M
పోషకాలు సరే, రుచి ఎలా ఉండేది?
మంచు మనిషి జీవించడానికి ఆ ఆహారం సరిపోయేది. కానీ, అది అంత రుచిగా ఉండకపోవచ్చు.
''నాటి గొర్రె మాంసం రుచి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. కచ్చితంగా అది ఈ రోజుల్లో మనం తినే ఆహారం అంత రుచిగా మాత్రం ఉండదు'' అని '' అని మాక్సినర్ అన్నారు.
అప్పట్లో ఉప్పు లేదనే విషయం మనం గ్రహించాలి. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆ మాంసం మనం తినడం కష్టం అని పేర్కొన్నారు.
శుద్ధి చేసిన ఆహారాన్ని మంచు మనిషి తీసుకోలేదు. అతని ఆహారానికి సంబంధించి ఇది ఒక ప్రతికూల అంశం.
చనిపోయే ముందు అతని రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తులున్నాయి.
బహుశా యుద్ధంలో అతను చనిపోయి ఉండొచ్చు. అతని శరీరంపై చాలా గాయాల కనిపించాయి.
తనతో పాటు ఆయుధాలను తీసుకెళ్లిన జాడలు ఉన్నాయి. గొడ్డలి కూడా అతని వద్ద ఉంది.

ఫొటో సోర్స్, SOUTHTYROLARCHAEOLOGYMUSEUM\EURAC\M.SAMADELLI
మంచు మనిషి పసరుమందులు వాడాడా?
పసరు మందులు కూడా మంచు మనిషి వాడి ఉండొచ్చు. లేదంటే, వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని మంచుమనిషి చెట్ల ఆకుల్లో నిల్వ ఉంచి ఉండొచ్చు. అలా చెట్ల ఆకులతో సహా ఆహారాన్ని తినేసి ఉండొచ్చు.
అందుకే అతని పొట్టలో బ్రాకెన్ ఆకుల ఆనవాళ్లు కనిపించాయి.
ఇవి కూడా చదవండి:
- వీళ్లు స్మార్ట్ రైతులు.. యాప్స్‌తో లాభాలు పండిస్తున్నారు
- ఉత్తరప్రదేశ్ మహిళలకు పాలమూరు వనితల పాఠాలు
- BBC Special: కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటక ప్రాంతంగా ఎందుకు మారింది?
- సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?
- ప్రపంచం నుంచి చీకటిని మానస తరిమేయాలనుకుంటోంది. ఇలా..
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- హాలీవుడ్ సినిమాల రేంజ్లో జైళ్ల నుంచి తప్పించుకున్నారు వీళ్లంతా
- అమెరికా-బ్రిటన్ చారిత్రక సంబంధాలకు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలుకుతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








