సోషల్: అద్దె ఇంటికి ఎవరైనా అద్దె కట్టాల్సిందే కదా, మరి కులం అడగడం ఎందుకు?

#BeingDalit మరియు #BeingMuslim సిరీస్‌లో భాగంగా బీబీసీ న్యూస్ తెలుగు హైదరాబాద్‌లో అద్దె ఇల్లుకోసం కొన్ని సామాజిక వర్గాలవారు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై బీబీసీ న్యూస్ తెలుగు సోషల్ మీడియా పేజీల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది.
చాలామంది ‘అద్దె ఇంటి కోసం వెళ్లినపుడు కులం గురించి అడిగారని.. ఈ సమస్య ఎదుర్కొన్నామని, అది సరైన విధానం కాదు అని అభిప్రాయపడ్డారు. మరికొందరు అడిగితే తప్పేంటి అని అంటే, ఇంకొందరు ఈ సమస్య ఎప్పుడూ ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఆ చర్చ నుంచి కొన్ని ఆసక్తికరమైన, ఆలోచించదగిన కామెంట్లు...

ప్రభుత్వాలు కులాలు అడిగేది... కులాలపరంగా వివక్ష చూపించడానికి కాదు, అణగారిన వర్గాలని ఒక స్థాయికి తీసుకువచ్చి, వారిని అభివృద్ధి చేయడానికి. అలాగే ప్రభుత్వం కొన్ని పథకాల ఫలాలు వారికి ఉచితంగా అందించేందుకు కుల ప్రస్తావనను తీసుకువస్తుంది. కానీ ఇల్లు అద్దెకు ఎవరూ ఉచితంగా ఇవ్వరు కదా, ఏ కులంవారైనా అద్దె కట్టాల్సిందే కదా. మరి కులంతో పనేంటి? అని నవీన్ జల్లి అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

ఇది చాలా బాధాకరం, మన జనాలకు కులవృత్తులు వదిలేసినా కులం మాత్రం పోవడం లేదు. కులాల ఆధారంగా వ్యక్తులను సపోర్ట్ చేయడం అనేది పోవాలి... అని జ్ఞానం ఆరోగ్యం ప్రశాంతత సంతోషం అనే పేరుతో ఉన్న ఓ వ్యక్తి కామెంట్ చేశారు.

ఇల్లు అద్దెకు అడిగితే కుల ప్రస్తావన తీసుకురావడం అనేది హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం కాదని విశాఖపట్నంలో కూడా ఉందని జబీ షేక్ వ్యాఖ్యానించారు. మేము ముస్లింలకు ఇవ్వం అని అనడంతో చాలా బాధపడ్డాం, ఇప్పటికీ ఇలాంటి వాళ్లు ఉన్నారని ఆయన తన భావాలను వ్యక్తం చేశారు.

కులంతో పనేంటి, మనిషి గుణం ముఖ్యం అని కొందరు అభిప్రాయపడ్డారు.
మనిషి లోపల మానవత్వం ఉండాలి, లేదంటే ఎంత గొప్ప కులంలో పుట్టినా విలువ ఉండదు అని బుచ్చి రెడ్డి వ్యాఖ్యానించారు. కులం ముఖ్యం కాదు అని ఆయన పేర్కొన్నారు.

కొందరు మాత్రం ఈ సమస్యను తామెప్పుడూ ఎదుర్కోలేదని, వినలేదని అభిప్రాయపడ్డారు. ఆహారపు అలవాట్ల ఆధారంగా ఇళ్లను అద్దెకివ్వడం చూశాం కానీ కులంపేరుతో చూడలేదనేది మరికొందరి వాదన.
"శాకాహారం మాత్రమే తినేవారు మాంసం తినేవారికి, మద్యం సేవించేవారికి ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ కులంపేరుతో వెలివేయడాలు ఉండవు" అని లింగన్న సామ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు.

ఎక్కడో ఎవరో అడిగినంత మాత్రాన అందరూ అలాగే ఉండరనేది ఇంకొందరి అభిప్రాయం.
"అందరూ ఒకేలా ఉండరు. మా ఇంట్లో అద్దెకున్నవారిని మేమెప్పుడూ వారి కులం గురించి అడగలేదు" అని డీకే గీతారెడ్డి కామెంట్ పోస్ట్ చేశారు.

కులం అడిగినంత మాత్రాన కులవివక్ష ఎలా అవుతుందనేది సాయికృష్ణ కాల్వ అభిప్రాయం.
"ప్రభుత్వాలు కూడా కులం ఏంటి అని అడుగుతున్నాయి కదా, ఆ కులం వాళ్లకు అది, ఈ కులం వాళ్లకు ఇది అంటూ ప్రభుత్వాలు మాట్లాడితే అది కూడా కులవివక్షే కదా" అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- ఎమర్జెన్సీ: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- థాయ్లాండ్ గుహల్లో బాలురు అదృశ్యం: 1000 మంది గాలింపు.. 9 రోజుల తర్వాత గుర్తింపు.. బయటకు వచ్చేదెలా?
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
- దళితుడి హోటల్లో టీ తాగిన శివాజీ వారసుడు సాహూ మహరాజ్
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








