పరిశోధన: 'రోజూ ఒక గుడ్డు తినండి.. ఇక డాక్టర్‌కు దూరంగా ఉండండి!'

ఫొటో సోర్స్, Getty Images
రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదని సామెత. అయితే, రోజుకొక గుడ్డు తిన్నా డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చని చైనా పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల గుండె నొప్పుల నుంచి బయటపడొచ్చని అంటున్నారు.
రోజూ గుడ్డును ఏ రూపంలోనైనా ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తున్నారు.
అయితే, అతిగా గుడ్లు తింటే శరీరాకృతి మారిపోతుందని కొందరు భయపడుతుంటారు.
‘చైనాలో చేసిన విస్తృత పరిశోధనల అనంతరం మేం చెప్పేదొక్కటే, రోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది’ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నిటా ఫొరోహి తెలిపారు.
ఎన్ని తినాలి?
ఆరోగ్యకర ఆహారంలో గుడ్డును కూడా భాగం చేసుకోవాలని చాలా మంది డాక్టర్లు సూచిస్తున్నారు.
అధికస్థాయిలో ప్రోటీన్లు, విటమిన్ ఏ, డీ, బీ, బీ12,లుటిన్, జియజాంతన్‌లు కూడా గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి.
ఇవి వయసు పైబడుతున్నప్పుడు వచ్చే కంటి సమస్యలను నిరోధించేందుకు సహాయపడుతాయి.
''రోజూ కాకున్నా, కనీసం రెండు రోజులకొకసారైనా గుడ్డు తినడం మంచిదే'' అంటారు బ్రిటీష్ పోషకాహార సంస్థ నిపుణులు డాక్టర్ ఫ్రాంకీ ఫిలిప్స్.
గుడ్లు ఎక్కువ తినేస్తున్నాం అని భయపడకూడదంటారు.
''ఒకే ఆహారాన్ని అధికంగా తీసుకుంటున్నామంటే మనం ఇతర ఆహారపదార్థాల్లో ఉండే పోషకాలను కోల్పోతున్నట్లే లెక్క. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రోజూ ఒక గుడ్డు తినడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు'' అని ఫిలిప్స్ తెలిపారు.
ప్రోటీన్ల భాండాగారంగా గుడ్లను పేర్కొనవచ్చు. కానీ, మనం రోజూ తినే ఆహార పదార్థంలో గుడ్డుతో పాటు బాగా ప్రోటీన్లు ఉండే వేరే ఆహార పదార్థాలు కూడా ఉంటే కాస్త ఆలోచించాలి. ఎందుకంటే విపరీతంగా ప్రోటీన్లున్న పదార్థాలు తింటే కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది అని ఆయన హెచ్చరించారు.
వారానికి మూడుసార్లు మాత్రమే గుడ్డు తినడం శ్రేయస్కరం అని 2007లో బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ (బీహెచ్ఎఫ్) సూచించింది. అయితే, ఈ పరిశోధన ఫలితాల తర్వాత తన సలహాను వెనక్కి తీసుకుంది.

ఫొటో సోర్స్, PA
కొలెస్ట్రాల్ ముప్పు ఉందా?
గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ ముప్పు ఏమీ లేదని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ పేర్కొంది.
''గుడ్డులో కాస్తంత కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. కానీ మనం భోజనంలో తీసుకునే సంతృప్త కొవ్వుతో మన రక్తంలోని కొలెస్ట్రాల్ పరిమాణంపై పడే ప్రభావంతో పోలిస్తే గుడ్లు తినడం వల్ల వచ్చే కొలెస్ట్రాల్‌తో పడే ప్రభావం తక్కువే'' అని నేషనల్ హెల్త్ సర్వీస్ తెలిపింది.
హార్ట్ యూకే పరిశోధన ప్రకారం సుమారు 58 గ్రాముల బరువుండే ఒక గుడ్డులో 4.6 గ్రాములు అంటే దాదాపు ఒక చెంచా కొవ్వు ఉంటుంది. ఇందులో పావు వంతు మాత్రమే సంతృప్త కొవ్వు. ఇది శరీరంలో కొవ్వుస్థాయిని పెంచుతుంది. ఇక వెన్నె కూడా కలిపితే మరింత కొవ్వు పెరుగుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా ఉడికిస్తే మంచిది?
పోషకాలు నశించేస్థాయిలో గుడ్డును ఉడికించవద్దు.
గుడ్డును వేయించడం సరికాదని చాలా మంది పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కొవ్వు పరిమాణం బాగా పెరుగుతుందని చెబుతున్నారు.
నిల్వ ఉంచడం ఎలా?
పగిలిన గుడ్లను కొనకపోవడమే మంచిది. ఎందుకంటే అందులో బాక్టీరియా చేరే అవకాశం ఉంది.
పగుళ్లు లేని గుడ్లను తీసుకొని ఫ్రిడ్జ్‌లో వాటికి ప్రత్యేకంగా రూపొందించిన బాక్స్‌లలో నిల్వ ఉంచడమే మంచి మార్గమని బీబీసీ గుడ్ ఫుడ్ సూచిస్తోంది.
డబ్బాల్లో ఉంచితే గుడ్డులోని తెల్లసొన మూడు వారాల వరకు ఉంటుంది. పచ్చసొన మాత్రం మూడు రోజులకు మించి ఉండదు. అయితే వీటిని నిల్వ ఉంచిన డబ్బాను కవర్‌తో చుట్టాలి.
గుడ్డు మంచిదా పాడైందా తెలుసుకునేందుకు ఒక చక్కని చిట్కా ఉంది. అది చాలా మందికి తెలిసిందే. చల్లటి నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో గుడ్డు వేయాలి. అది మునిగితే మంచి గుడ్డు. పైకి తేలితే పాడైన గుడ్డు అని తెలుసుకోవచ్చు.
సాధారణంగా 28 రోజుల వరకు గుడ్డు పాడవకుండా ఉంటుంది.

ఫొటో సోర్స్, Reuters
ఎగ్ అలర్జీ
కొందరికి గుడ్డు అంటే పడదు. ముఖ్యంగా ఐదేళ్ల చిన్నారుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
ఇలాంటి వారిలో ఎక్కువగా కనిపించే లక్షణాలు:
- మూతి వాచిపోవడం, ఎర్రబడటం
- కడుపునొప్పి
- వాంతులు
- విరోచనాలు
ఇలాంటివి కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
''అలర్జీ లేకుంటే గుడ్డును ఏ రూపంలో తిన్నా మంచిదే. అయితే దాన్ని ఎలా వండుతున్నామో చూడాలి. ఉప్పు వాడటం ఆపేయాలి'' అని డాక్టర్ ఫిలిప్స్ సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- లవ్ బ్యాంక్: ప్రేమ లేఖ నుంచి సినిమా టికెట్ వరకు.. ప్రతీ జ్ఞాపకం పదిలం
- కీటోడైట్ వివాదం: అసలేంటీ డైట్? అదెంత వరకు సురక్షితం?
- ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
- హిట్లర్ మరణించాడని ప్రపంచానికి బీబీసీ ఎలా చెప్పింది?
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకెళ్లి చైనాలో అమ్ముకుంటున్నారు
- ఉత్తర కొరియాలో ఎక్కువగా తినే స్నాక్స్ ఇవే!
- రంజాన్ నెలలో ఉపవాసం చేస్తే శరీరానికి ఏం జరుగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








