పెన్నీ స్టాక్స్ అంటే ఏమిటి, వీటిల్లో పెట్టుబడి లాభాలు తెస్తుందా, లేక నష్టాలను మూటగడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
భారత షేర్ మార్కెట్‌లో ఒక్కో షేరు ధర కొన్ని పైసల నుంచి లక్షల్లో కూడా పలుకుతుంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే ఇన్వెస్టర్లు తరచూ ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో అత్యంత తక్కువ ధర కలిగిన కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడుతుంటారు.
స్టాక్ మార్కెట్ పరిభాషలో వీటినే పెన్నీ స్టాక్స్ అంటారు.
ప్రస్తుతం వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా షేర్ మార్కెట్‌లో తక్షణ లాభాలు సంపాదించవచ్చంటూ పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. దీని వల్ల పెట్టుబడిదారులు తక్కువ కాలంలోనే భారీ నష్టాన్ని చవిచూడాల్సిన ప్రమాదం ఉంటుంది.
ఇంతకీ పెన్నీ షేర్లు అంటే ఏమిటి, వాటి ప్రత్యేకతలు ఏమిటి, వాటిలో పెట్టుబడి పెట్టడంలో ఉన్న ప్రమాదాలు ఏమిటి?

పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి?
పెన్నీ స్టాక్స్ లేదా షేర్లకు ప్రత్యేకంగా ఎటువంటి నిర్వచనం లేదు. కానీ, భారత్‌లో పది రూపాయల కంటే తక్కువ ధర ఉన్న స్టాక్స్ లేదా షేర్లను ఈ కేటగిరీలో ఉంచుతారు.
భారత్‌లో సాధారణంగా పెన్నీ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.500 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రూ.100 కోట్ల కంటే తక్కువకూడా ఉంది.
ఈ కంపెనీలు తమ ఎదుగుదలకు సంబంధించి ప్రారంభ దశలో ఉంటాయి. అలాగే, వీటి ఆర్థిక స్థితి కూడా కాస్త బలహీనంగా ఉండొచ్చు.అందుకే, ఈ షేర్లు కొనేందుకు చౌకగా లభిస్తాయి. కానీ, నష్టాలు పాలయ్యే ప్రమాదం చాలా ఎక్కువ.
పెన్నీ స్టాక్స్‌ను స్టాక్ మార్కెట్ నిపుణులు హై రివార్డు.. హై రిస్క్ (అధిక లాభం-అధిక నష్టం) గల షేర్లుగా చెబుతుంటారు. అంటే.. ఇవి ఒకవేళ పెరిగితే, స్వల్ప వ్యవధిలోనే భారీ లాభాలను ఆర్జించవచ్చు. కానీ, అదే సమయంలో భారీ నష్టాల ప్రమాదమూ ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి ప్రమాదకరమా?
ఈ స్టాక్స్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కసారిగా భారీ లాభాలను, అలాగే భారీ నష్టాలను అందిస్తాయి.
''పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడంలో మరో ప్రమాదం.. వాటికి తక్కువ లిక్విడిటీ (నగదు లభ్యత) ఉంటుంది. వీటిని కొనేవాళ్లు కొంతమందే ఉంటారు. మీరు అమ్మాలనుకుంటే, కొనేవాళ్లు దొరకకపోవచ్చు. అందుకే, వీటిని వెంటనే అమ్మడం కష్టమవుతుంది'' అని అహ్మదాబాద్ కేంద్రంగా నడిచే ఓ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ హెడ్ గుంజన్ చోక్సి బీబీసీతో చెప్పారు.
''పైగా ఈ కంపెనీలు చాలా చిన్నవి. వీటి గురించి మార్కెట్లో కచ్చితమైన సమాచారం దొరకదు లేదా చాలా తప్పుడు సమాచారం,ఊహాగానాలు అందుబాటులో ఉంటాయి'' అని తెలిపారు.
పెన్నీ స్టాక్స్‌లో మీరు పెట్టుబడి పెట్టి, భారీ నష్టాలు ఎదుర్కొంటే.. ఆ స్టాక్ మళ్లీ రికవరీ అయ్యే గ్యారెంటీ ఉండదు.
చాలా పెన్నీ స్టాక్స్ తమ పాత ధరను ఎప్పటికీ చేరుకోవు. పైగా స్టాక్ పతనమయ్యేటప్పుడు అసలు కొనేవాళ్లే దొరకరు. మార్కెట్ ఒడిదుడుకుల సమయంలో.. వారం లేదా నెల వ్యవధిలోనే పెన్నీ స్టాక్ ధరలు 50 శాతం నుంచి 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ పడిపోతాయి.
అదేవిధంగా.. కొన్నిసార్లు నెలలోపే ఈ పెన్నీ స్టాక్స్ విలువ రెట్టింపవుతుంది.
''ఈ స్టాక్స్‌కు తక్కువ లిక్విడిటీ (నగదు లభ్యత) కారణంగా.. కొందరు పెద్ద మొత్తంలో ఈ స్టాక్స్‌ను కొని కృత్రిమంగా మార్కెట్లో స్టాక్ బూమ్‌ను, లేదా స్టాక్స్ కొరత సృష్టించి, ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఈ షేర్లను అమ్మి, ధర క్రాష్ అయ్యేలా చేస్తారు'' అని ఇన్వెస్ట్ అలైన్ సీఈఓ, ఫౌండర్ గుంజన్ చోక్సి చెప్పారు.
కొన్నిసార్లు పెన్నీ స్టాక్స్ అకస్మాత్తుగా మార్కెట్లో డీలిస్ట్ అవుతుంటాయి. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) ఈ పెన్నీ స్టాక్స్ కదలికలను నిత్యం పర్యవేక్షిస్తూ, తరచూ వాటిని పరిశీలిస్తూ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
లాభాలు కొన్నిసార్లే
కేవలం ప్రయోగం కోసం తప్ప సాధారణంగా పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టమని ప్రముఖ ఇన్వెస్టర్లు, సాధారణ ఇన్వెస్టర్లకు ఎప్పుడూ సలహా ఇవ్వరు.
''తెలివైన ఇన్వెస్టర్లు పెన్నీ స్టాక్స్‌కు దూరంగా ఉండాలి. పోర్టుఫోలియో విలువ రూ.5 వేలు అయినా, రూ.5 లక్షలు అయినా.. పెన్నీ స్టాక్స్‌ను యాడ్ చేసుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. తక్కువ ధర గల స్టాక్స్.. ఎక్కువ లాభాలు ఇస్తాయన్నది అపోహే. పెన్నీ స్టాక్స్‌కు బదులు.. మంచి క్వాలిటీ గల స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలి'' అని మోతిలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఈక్విటీ టెక్నికల్ రీసర్చ్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ రుచిత్ జైన్ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడికి ఏకైక కారణం.. మార్కెట్‌లో తక్కువ ధరకు ట్రేడయ్యే కంపెనీల (అండర్ వాల్యూడ్ కంపెనీలు) షేర్లను కొనుగోలు చేయడానికి అవకాశం లభించడమే. భవిష్యత్తులో ఇవి పదింతలవుతాయనే ఆలోచనతో పెట్టుబడి పెడతారు.
కానీ, మీ మొత్తం పెట్టుబడిలో ఇవి చాలా తక్కువ మొత్తంలో ఉండటమే బెటర్.
పెన్నీ స్టాక్స్ స్థిరంగా ఉండవు. తరచూ అనిశ్చితిలో ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
దివాళా తీసే ప్రమాదం
కంపెనీలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు, అవి దివాళా తీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఆ షేర్లకు ఎలాంటి విలువ ఉండదు.
గతంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, యూనిటెక్, సింటెక్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు.. తమ రంగాల్లో అగ్రస్థానం సాధించి .. ఆ తర్వాత పెద్ద మొత్తంలో ఉన్న తమ అప్పులను తిరిగి చెల్లించలేక, దివాళా తీశాయి.
ఇలాంటి కంపెనీల పెట్టుబడిదారులకు ఆ షేర్లు జీవితాంతం భారమే. ఆ నష్టాల నుంచి వారు ఎప్పటికీ కోలుకోలేరు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














