75వేల కోట్ల రూపాయల విలువైన అన్‌‌ క్లెయిమ్డ్ డిపాజిట్ల వారసులు ఎవరు?

అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు, ఆర్బీఐ, రీఓపెన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

తన తండ్రి బ్యాంకులో పెద్ద ఎత్తున డిపాజిట్లు చేసి, ఆ విషయాలేవీ కుటుంబసభ్యులతో పంచుకోకుండానే మరణించారని సతీష్ చాలాకాలంగా భావిస్తున్నారు. అయితే ఏ బ్యాంకులో ఎంతమొత్తంలో ఇలాంటి డిపాజిట్లు చేశారనే విషయం ఎలా తెలుసుకోవాలో తెలియక ఆయన సతమతమవుతున్నారు.

ఒక్క సతీషే కాదు, చాలామంది ఇలాంటి సందిగ్ధంలో ఉంటారు. మరోవైపు తాము గతంలో చేసిన డిపాజిట్ల సంగతి మరిచిపోయినవారు కూడా ఉండవచ్చు.

దీర్ఘకాలంగా ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం విలువ సుమారు 75 వేలకోట్ల పైచిలుకే అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్-యూడీజీఏఎమ్ (అన్‌ క్లైమ్డ్ డిపాజిట్స్ – గేట్ వే టూ యాక్సిక్ ఇన్ఫర్మేషన్ ) పేరుతో ఆగస్ట్, 2023లో ఒక పోర్టల్‍ను ప్రారంభించింది. ప్రారంభదశలో ఈ పోర్టల్ కింద దేశంలోని 30 ప్రభుత్వరంగ, ప్రైవేట్ బ్యాంకులను తెచ్చింది. 90శాతం వరకు అన్ క్లైమ్డ్ డిపాజిట్లు ఈ బ్యాంకుల్లోనే ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఈ పోర్టల్ ద్వారా వివిధ బ్యాంకుల్లో తమవారి అన్‌‌క్లెయిమ్డ్ డిపాజిట్లను ఒకే వేదికపై వెతికే అవకాశం కలిగింది.

ఈ పోర్టల్ సహాయంతో అన్‌క్లైమ్డ్ డిపాజిట్లు, అకౌంట్లను శోధించడం, గుర్తించడం వరకు మాత్రమే చేయవచ్చు.

ఇలా గుర్తించిన వాటిని సంబంధిత బ్యాంకు శాఖల్లో క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. జులై, 2025 నాటికి 8.5 లక్షల మంది తమ అన్‌‌క్లెయిమ్డ్ డిపాజిట్లను వెతికేందుకు ఈ పోర్టల్‌లో నమోదయ్యారని సీఏ-అల్లె వెబ్ పోర్టల్ తెలిపింది.

ఆర్బీఐ నిబంధనలు

ఫొటో సోర్స్, AFP

డార్మంట్ అకౌంట్

చాలా కాలం ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు జరగని బ్యాంకు ఖాతాను డార్మంట్ అకౌంట్ అంటారు. అంటే.. నగదు జమ, ఉపసంహరణ లేకపోవడం లేదా ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ రూపంలో ఎలాంటి లావాదేవీలు నడపకపోవడం లాంటివి. నిర్దుష్ట కాలం తర్వాత ఇలాంటి అకౌంట్లను బ్యాంకులు ఆర్బీఐ ఆధ్వర్యంలోని డీఈఏ ( డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ )కు బదిలీ చేస్తాయి.

సాధారణంగా పదేళ్ళకు పైగా లావాదేవీలు లేని అకౌంట్లను డీఈఏ కు బదిలీచేస్తారు. ఇలా డీఈఏ కిందకు వెళ్లిన అన్‌క్లైమ్డ్ డిపాజిట్లు, అకౌంట్ల వివరాలను యూడీజీఏఎమ్ పోర్టల్‌లో వెతకవచ్చు. ఇందుకోసం యూడీజీఏఎమ్ పోర్టల్‌లో మీ పేరు, మొబైల్ నెంబర్‌తో నమోదవ్వాలి.

వ్యక్తిగత ఖాతాల వివరాల కోసం...

ఖాతాదారు పేరు, బ్యాంకు పేరు(ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు ఎంచుకోవచ్చు) ఎంచుకుని పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, పాస్ పోర్ట్, పుట్టిన తేదీల్లో ఏదో ఒక వివరాలను అందించాలి.

సంస్థల వివరాల కోసం...

సంస్థ పేరు, బ్యాంకుల వివరాలు, అధికృత ప్రతినిధి/చట్టబద్దమైన ప్రతినిధి ( ఆథరైజ్డ్ సిగ్నేటరీ), పాన్ కార్డ్, కార్పోరేట్ ఐడెంటిఫికేషన్ నెంబరు(సీఐఎన్), సంస్థ ఏర్పాటు తేదీ వివరాల్లో ఒకదాన్ని నమోదు చేయాలి.

ఈ వివరాలు కూడా తెలియకపోతే సదరు వ్యక్తి లేదా సంస్థ అడ్రస్‌‌ను నమోదు చేసి వివరాలు వెతకవచ్చు.

ఈ వెబ్ పోర్టల్ ద్వారా కేవలం అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు, అకౌంట్ల వివరాలు మాత్రమే పొందవచ్చు. వాటిని క్లెయిమ్ చేయడానికి సంబంధిత బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. డీఈఏ కు బదిలీ అయిన ప్రతి అన్ క్లెయిమ్డ్ డిపాజిట్/అకౌంట్‌కు యూడీఆర్ఎన్ నంబర్ కేటాయిస్తారు. (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ రెఫరెన్స్ నెంబర్)

యువర్ మనీ-యువర్ రైట్ నినాదంతో అక్టోబర్- డిసెంబర్ మాసాల్లో దేశవ్యాప్తంగా ఉద్గమ్ సేవలపై అవగాహన క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక క్యాంపుల్లో హాజరై కుటుంబ సభ్యులు తమ క్లెయిమ్‌లను సెటిల్ చేసుకోవాలని కోరుతున్నారు.

'అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు కేవలం కాగితాలపై ఉన్న సంఖ్యలు మాత్రమే కావు, అవి సాధారణ కుటుంబాలు కష్టపడి కూడబెట్టిన పొదుపును సూచిస్తాయి" అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

అవగాహన, సులభమైన విధానం, తదుపరి చర్యలు అనే మూడు అంశాల ఆధారంగా క్లెయిమ్స్‌ని త్వరితగతిన సెటిల్ చేయాలని ఆమె అధికారులకు సూచించారు.

ఆగస్ట్, 2025 నాటికి దేశవ్యాప్తంగా 75వేల కోట్ల డిపాజిట్లు డీఈఏ కు బదిలీ అయ్యాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్యదర్శి ఎం.నాగరాజు తెలిపారు. క్లెయిమ్ చేయని ఇన్సూరెన్స్‌లు 13,800 కోట్లు, 3వేల కోట్ల మ్యూచువల్ ఫండ్స్, 9వేలకోట్ల విలువైన చెల్లించని డివిడెండ్లు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు , వ్యక్తిగత అకౌంట్లు, క్లెయిమ్

ఫొటో సోర్స్, Getty Images

ఎలా క్లెయిమ్ చేయాలి?

పోర్టల్‌లో గుర్తించిన డిపాజిట్లను తిరిగి పొందడానికి ఏం చేయాలనే వివరాలను ఆర్బీఐ గుర్తింపుఉన్న ధనలక్ష్మీ బ్యాంక్ తన వెబ్ సైట్ లో వివరించింది.

వ్యక్తిగత అకౌంట్ల విషయంలో...

క్లెయిమ్ కోసం సంబంధిత బ్యాంకుకు వెళ్లే వ్యక్తులు, వారసులు-కుటుంబ సభ్యులు పోర్టల్ ద్వారా పొందిన యూఆర్‌డీఎన్ నెంబర్‌ను బ్యాంకు అధికారులకు సమర్పించాలి.

బ్యాంకు కేవైసీ పాలసీ ప్రకారం తమ అడ్రస్ గుర్తింపును ఇవ్వాలి.

గతంలో డిపాజిట్లు చేసి మరిచిపోయిన వ్యక్తులు.. తమ క్లెయిమ్‌కు సరిపోయే ఆధారాలు అంటే పాస్ బుక్ కాపీ, అకౌంట్ స్టేట్ మెంట్ కాపీలు, మిగిలిన చెక్ బుక్‌లు సమర్పించాలి. ఆ తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్‌ను నింపాలి. అన్నీ పరిశీలించిన తర్వాత వడ్డీతో కలిపి సదరు నగదు మొత్తం ఖాతాదారుకు బ్యాంకు చెల్లిస్తుంది. ఖాతాదారు తిరిగి అక్కడే అకౌంట్ కొనసాగించాలనుకుంటే తిరిగి కేవైసీ చేయాల్సి ఉంటుంది.

చనిపోయిన ఖాతాదారు వారసులు లేదా నామినీలు క్లెయిమ్ చేయాలనుకుంటే.. సంబంధిత ఖాతాదారు మరణధృవీకరణ పత్రం సమర్పించి, బ్యాంకుకు సంబంధించిన ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి.

సంస్థలకు సంబంధించిన ఖాతాల సందర్భంలో...

ఫర్మ్ లు, కంపెనీలు, ట్రస్టులు వంటి వ్యక్తిగతంకాని సంస్థలకు సంబంధించిన ఖాతాలపై క్లెయిమ్ చేయాలంటే.. సంస్థ చట్టబద్ధమైన పేరు, వ్యాపారం, చిరునామా రుజువును చూపే అవసరమైన పత్రాలు సంస్థ లెటర్ హెడ్‌పై సమర్పించాలి. ఈ పత్రాలను అధికృత ప్రతినిధులు (Authorized Signatories) తమ సంతకాలు, కేవైసీ వివరాలతో పాటు క్లెయిమ్ అభ్యర్థనతో కలిపి సమర్పించాలి.

క్లెయిమ్ అభ్యర్థన అందిన తర్వాత సంబంధిత బ్యాంకుశాఖ అధికారులు అవసరమైతే తగిన దర్యాప్తు నిర్వహించే అధికారం కలిగి ఉంటారు.

క్లెయిమ్ మొత్తం విలువ 20వేల కంటే తక్కువగా ఉంటే నగదు రూపంలో, ఇతర సందర్భాల్లో డిమాండ్ డ్రాఫ్ట్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ రూపంలో నగదు బదిలీ చేస్తారు.

వడ్డీ సహా ఈ చెల్లింపులు ఉంటాయి.

బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు అన్ని వివరాలు పూర్తిగా నింపి.. నామినీ వివరాలు తప్పనిసరిగా రాయాలి. కానీ గతంలో పలువురు ఉద్యోగ, ఉపాధి రీత్య వివిధ ప్రాంతాల్లో నివసించినప్పుడు ఆ సమయంలో వివిధ ఆర్థిక సంస్థల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు.. క్లెయిమ్ చేయకుండా వదిలేశారని, దీంతో వారి అడ్రస్, కుటుంబసభ్యుల వివరాలు తెలియక ఖాతాల్లోనే సొమ్ము ఉండిపోయిందని అధికారులు అంటున్నారు. ఆధార్, ఫోన్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని తెలిపారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఉద్గమ్ పోర్టల్ ద్వారా కేవలం అన్ క్లెయిమ్డ్ బ్యాంకు అకౌంట్లు, డిపాజిట్లను మాత్రమే వెతికే అవకాశం ఉంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)