మొదటిసారి క్రెడిట్ కార్డ్ వాడేవాళ్లు తెలుసుకోవాల్సిన అంశాలివే!

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
- హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం
క్రెడిట్ కార్డ్...20వ శతాబ్దం చివర్లో ఓ ఆర్థిక విప్లవం. ప్లాస్టిక్ మనీగా చెప్పుకునే ఈ క్రెడిట్ కార్డ్ సింపుల్‌గా చెప్పాలంటే ఓ కత్తి లాంటిది. 'వాడుకోవడం సరిగ్గా తెలిస్తే అద్భుతం. లేకపోతే చేతులు తెగిపోతాయి'.
అందుకే కార్డు పొందడం ఎంత ముఖ్యమో, దాన్ని సక్రమంగా వాడుకోవడం కూడా అంతకంటే ముఖ్యం.
ముఖ్యంగా మొదటిసారి కార్డు వాడేవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే క్రెడిట్ హిస్టరీ బిల్డ్ చేయడంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది.
హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్...ఇలా ఏ లోన్ కావాలనుకున్నా ఈ హిస్టరీనే మీకు ఆధారం. అందుకే మీ మొదటి కార్డ్ దగ్గరి నుంచి మీ క్రెడిట్ హిస్టరీని పెంచుకోవల్సిన అవసరం ఎంతో ఉంది. లేదంటే భవిష్యత్తులో అప్పు పుట్టడం గగనమైపోతుంది.
క్రెడిట్ కార్డ్.. ట్రాప్ కాదు
అప్పును మనలో చాలామంది ముప్పుగా చూస్తాం. అప్పుచేసి పప్పు కూడు అవసరమా అని పెద్దవాళ్లు అంటుంటారు. కానీ, ఇప్పుడు అప్పు లేనిదే ప్రపంచం నడిచే స్థితిలో లేదు.
అయితే, ఎంతవరకూ అవసరమో అంతవరకే పరిమితమైతే ఇబ్బంది లేదు. కానీ 40-50 రోజుల పాటు వడ్డీ లేని రుణం దొరుకుతోంది కదా అనే ఉద్దేశంతో ఉంటే మాత్రం ఇరుక్కుపోతాం.


ఫొటో సోర్స్, Getty Images
క్రెడిట్ కార్డ్ ఆవశ్యకతను గుర్తించండి
అత్యవసర పరిస్థితుల్లో చేబదులు తీసుకునే బదులు ఈ క్రెడిట్ కార్డులను స్టాండ్‌బైగా వాడుకోవచ్చు. కార్డును వాడిన దాదాపు నలభై రోజుల వరకూ ఎలాంటి వడ్డీ లేకుండా ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు.
గడువు లోపు అప్పు తీర్చేస్తే ఎలాంటి ముప్పూ ఉండదు.
రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్ ఆఫర్లు దీనికి బోనస్ లాంటివి. అయితే ఈ రుణం ట్రాప్‌లో ఇరుక్కుని, అనవసర ఖర్చుల జోలికి వెళ్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
వంద రూపాయల వస్తువుకు పది రూపాయల ఆఫర్ వస్తోంది కదా.. అని అవసరమున్నా లేకున్నా కొనడమన్నదే...ప్రధానంగా మనం ఇరుక్కునే ట్రాప్. కార్డ్ ఉంది కదా అని అనవసర కొనుగోళ్ల జోలికి వెళ్లొద్దు. అవసరం ఏదో, లగ్జరీ ఏదో గుర్తించాలి.

ఫొటో సోర్స్, Getty Images
మీకు ఏ కార్డ్ సరిపోతుంది?
రేట్లు, ఫీజు, చార్జీలు, కో-బ్రాండెడ్ కార్డులు...ఇలా వీటిలో తీసుకునే కార్డు మొదటిదే అయినా సరే.. మన అవసరానికి ఏది పనికొస్తుందో తెలుసుకోవాలి.
కొన్ని బ్యాంకులు వార్షిక ఫీజును వసూలు చేయవు. మరికొన్ని బ్యాంకులు ఒక లిమిట్ వరకూ వినియోగించిన తర్వాత వార్షిక ఫీజులు రద్దు చేస్తాయి. మరికొన్ని బ్యాంకులు వాడకంతో సంబంధం లేకుండా ఫీజు తీసుకుంటాయి.
అందుకే మీకు ఏది సరిపోతుందో ముందుగానే చెక్ చేసుకోండి. వార్షిక ఫీజు చార్జ్ చేసే సంస్థలు అధిక రివార్డ్ పాయింట్లతో పాటు ఆఫర్లూ ఇస్తుంటాయి. వాటిని ఏ మేరకు ఉపయోగించుకోగలరో చెక్ చేసుకోండి.
బాగా షాపింగ్ చేసే వాళ్లకు ఈ-కామర్స్ కంపెనీలు, ప్రయాణాలు చేసే వాళ్లకు ట్రావెల్ కంపెనీలతో కలిసి కో బ్రాండెడ్ కార్డులు లభిస్తూ ఉంటాయి. వీటిలో రివార్డ్ పాయింట్లు, ఆఫర్లు ఎక్కువగా ఉంటాయి.
ఒక్క కార్డుకే పరిమితమవ్వండి
మొదటి కార్డు తీసుకున్న తర్వాత మీ క్రెడిట్ హిస్టరీ పెంచుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీనికి కనీసం ఏడాది ఇవ్వండి. ఈలోపు ఏవైనా సంస్థలు కార్డులు లేదా రుణాలు ఇవ్వడానికి వస్తే వాటిని తిరస్కరించండి. ఎందుకంటే మీలో క్రెడిట్ కోరిక ఒకసారి మొదలైతే దాన్ని ఆపడం సులువు కాదు.
అందుకే కొద్దికాలం పాటు ఒక కార్డుకే పరిమితమవ్వండి. మెల్లిగా క్రెడిట్ స్కోర్ పెంచుకోండి. మీ పేమెంట్ సైకిల్ బాగుంటే సదరు బ్యాంకే మీ క్రెడిట్ లిమిట్ పెంచుకుంటూ వెళ్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
లిమిట్ మొత్తం వాడేయకండి
మనం ఇంతకు ముందు కథనాల్లో చెప్పుకున్నట్టు ఈ కార్డుల లోగుట్టుంతా క్రెడిట్ వాడకంలోనే ఉంది.
మీకు బ్యాంక్ రూ.100 క్రెడిట్ లిమిట్ ఇస్తే, గరిష్టంగా రూ.20-30 వరకూ మాత్రమే వినియోగించుకోండి. ఈ లిమిట్ ఎంత ఎక్కువగా వాడితే, అంతగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. మరింత సమాచారం కోసం ఈ కథనం చదవండి.

ఫొటో సోర్స్, Getty Images
బిల్లింగ్ సైకిల్‌లోపే మొత్తం చెల్లించండి
క్రెడిట్ కార్డులో చాలామందిని ఆకర్షించే మరో అంశం.. కనీస బకాయి (మినిమమ్ డ్యూ).
ఒక వేళ మన పేమెంట్ గడువు తేదీలోపు చెల్లించలేకపోతే, క్రెడిట్ కార్డు సంస్థ మనకో అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ కనీస పేమెంట్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ఎఫెక్ట్ కాదు, మిగిలిన క్రెడిట్ లిమిట్‌పై ప్రభావం పడదు.
మన క్రెడిట్ లిమిట్‌లో సుమారు ఐదు నుంచి పది శాతం వరకూ ఈ కనీస చెల్లింపు ఉంటుంది. ఉదాహరణకు మీకు క్రెడిట్ లిమిట్ రూ.50 వేలు ఉంటే, ఈ కనీస బకాయి రూ.2,500 వరకూ ఉంటుంది.
అయితే చాలామంది, కనీస బకాయి చెల్లింపు చేసి అలా నెలలు పాటు పూర్తి పేమెంట్‌ను వాయిదా వేస్తూ ఉంటారు. దీని వల్ల దీర్ఘకాలంలో మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. అందుకే బిల్లింగ్ సైకిల్‌లోపే మీ పేమెంట్స్ మొత్తం చెల్లించండి. లేదంటే ఆ బ్యాంక్ ఏదైనా ఈఎంఐ కన్వర్షన్ సౌకర్యం కల్పిస్తుందేమో చెక్ చేయండి. దీనివల్ల వడ్డీ రేట్ల భారం సగానికి పైగా తగ్గుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
వడ్డీ చెక్ చేయండి
బిల్లింగ్ సైకిల్‌ను బట్టి మన కొనుగోళ్లు ప్లాన్ చేసుకోవచ్చు.
బిల్లింగ్ తేదీ నుంచి చెల్లింపు తేదీ వరకూ సుమారు 40 నుంచి 50 రోజుల సమయం ఉంటుంది. అందుకే ఈ సైకిల్ మొదట్లో కార్డు వాడితే, ఎక్కువ రోజులు ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ (వడ్డీ లేని రుణం) లభిస్తుంది.
వీటితో పాటు మనకు కార్డ్ ఆఫర్ చేసే సంస్థ ఎంత వడ్డీ వసూలు చేస్తుంది? లేట్ పేమెంట్ చార్జీలు ఏ స్థాయిలో ఉన్నాయి? వంటివి చెక్ చేసుకోవాలి.
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ బ్యాంకులు ఆఫర్ చేసే క్రెడిట్ కార్డుల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్య రుసుంలు తక్కువగా ఉంటాయనేది ఓ సింపుల్ బండ గుర్తు.
ఎయిర్‌పోర్ట్ లాంజ్ ఆఫర్స్, ఫ్రీ టికెట్స్ చేయండి
క్రెడిట్ కార్డు సంస్థలు వడ్డీ రహిత క్రెడిట్‌తో పాటు ఇంకొన్ని సౌలభ్యాలు కూడా తమ కస్టమర్లకు కల్పిస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్రీ ఫ్లైట్ టికెట్ల వంటివి ఉంటాయి.
మన వాడకాన్ని బట్టి కొన్ని ఏవియేషన్ కో బ్రాండెడ్ కంపెనీలు ఏడాదికి రెండో, మూడో ఫ్రీ డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్లు ఇస్తాయి. ఇలాంటి ఆఫర్లు చెక్ చేయండి.
వార్షికంగా రెండు నుంచి ఆరుసార్లు డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ ఫ్రీ లాంజ్ యాక్సెస్ సౌకర్యం కల్పిస్తుంటాయి. ఇవే కాకుండా రివార్డ్ పాయింట్లు వాడుకుని షాపింగ్ కూపన్లు పొందొచ్చు.
అవసరం లేకుంటే మూలన పడేయొద్దు
క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత, దాన్ని వాడటం కూడా ముఖ్యం. ఆర్బీఐ తాజా గైడ్‌లైన్స్ ప్రకారం ఏడాది పాటు కార్డ్ వినియోగించకపోతే డీయాక్టివేట్ అవుతుంది.
అందుకే రెండు, మూడు నెలలకోసారి చిన్న మొత్తంలో అయినా కార్డు వాడి, వెంటనే పేమెంట్ పూర్తి చేయండి. దీనివల్ల కార్డ్ వినియోగంలో ఉంటుంది.
ఎంతో కొంత మొత్తమైనా వాడి, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేటట్లు చూసుకోండి.
ఏడాదికి కనీసం ఇంత మొత్తం ఉపయోగించకపోతే, వార్షిక ఫీజు చెల్లించాలనే నిబంధన కూడా కొన్ని బ్యాంకులు విధిస్తాయి. ఇది చెక్ చేసుకోవాలి.
కార్డు వాడకపోతే యాప్ ద్వారా స్వైపింగ్, డొమెస్టిక్, ఇంటర్నేషనల్.. ఇలా అన్నీ లావాదేవీలు నిలిపివేయండి. దీంతో కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలు తగ్గుతాయి.
పొరపాటున కార్డు పోగొట్టుకున్నా నష్టం పెద్దగా ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
అప్పు.. ఎప్పటికైనా ముప్పే..
మనం చేసేది అప్పు. బ్యాంకులు చేసేది వ్యాపారం. జాలి, దయకు ఆస్కారమే లేదు.
అప్పు తీసుకున్నాం, వాళ్లు చెప్పిన సమయానికి మనం కట్టేయాలి. లేకపోతే మాత్రం వడ్డీ బాదుడు గట్టిగానే ఉంటుంది. గరిష్టంగా 36-48 శాతం వరకూ వడ్డీ రేట్లు ఉంటాయి. అంటే రూ.100కు 3 నుంచి 4 రూపాయల వరకూ వడ్డీ రేటు ఉంటుంది.
దీనికి తోడు లేటెంట్ పేమెంట్ చార్జీలు, వాటిపై ట్యాక్స్, పెనాల్టీ అధికం.
ఇవన్నీ ఒక ఎత్తైతే, మీరు డిఫాల్ట్ (సమయంలోగా చెల్లించకపోవడం) అయితే మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది.
ఇది మీ మొదటి క్రెడిట్ కార్డ్ అయితే, దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. తర్వాత అప్పు పుట్టడం కూడా కష్టమైపోతుంది.
మొదటి కార్డే కీలకం
ఎప్పుడైనా సరే, మన మొదటి క్రెడిట్ కార్డ్ మన మొత్తం క్రెడిట్ హిస్టరీకి మూలం. ఎందుకంటే హిస్టరీ ఎంత పాతగా ఉంటే, మన క్రెడిట్ ప్రొఫైల్ అంత పటిష్టంగా ఉంటుంది.
ఒకవేళ కార్డు రద్దు చేయాల్సి వచ్చినా, మొదటి కార్డును మాత్రం చేయకండి. తప్పనిసరైతే కొత్తది ఏదైనా రద్దు చేసుకోండి.
మీ ఓవరాల్ క్రెడిట్ హిస్టరీలో ఫస్ట్ క్రెడిట్ కార్డ్ లేదా ఫస్ట్ లోన్ అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని బట్టే మీ రిపోర్ట్ తయారవుతుంది.
ఇది బాగోకపోతే రేపు ఎప్పుడైనా హౌసింగ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ తీసుకోవడానికి ఇబ్బంది కావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి గుర్తుంచుకోండి
- పేమెంట్ రిమైండర్స్ పెట్టుకోండి. క్రెడ్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇందుకోసం ఉపయోగపడతాయేమో చూడండి.
- మీ పేమెంట్స్ సాధ్యమైనంత వరకూ ఆటోమేట్ చేసుకోండి. బ్యాంక్ నుంచి ఆటోపేమెంట్ ఫెసిలిటీ పెట్టుకుంటే రీపేమెంట్ చింత ఉండదు. కొన్ని సంస్థలు కనీస బకాయి, మరికొన్ని పూర్తి పేమెంట్‌ను మీ అకౌంట్ నుంచి డిడక్ట్ చేసుకునే సౌలభ్యాన్ని ఇస్తున్నాయి. వాటిని వినియోగించుకోండి.
- ఎలక్ట్రానిక్ క్లియరింగ్ ఫెసిలిటీ వాడుకోండి. ఆటోమేటిక్ పేమెంట్ క్లియరెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోండి.
- ఆలస్య చెల్లింపులకు దూరంగా ఉండండి, కనీస చెల్లింపు ట్రాప్‌లో పడొద్దు.
- అవసరానికి మాత్రమే క్రెడిట్ కార్డ్ వినియోగించుకోండి.
- మీ ఖర్చులపై స్పష్టత అవసరం. దేనికి ఎందుకు, ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్కాపత్రం ఉండేలా చూసుకోండి.
(గమనిక: ఇది అవగాహన కోసం మాత్రమే. నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక నిపుణులను సంప్రదించండి)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














