ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్: లక్ష పెట్టుబడికి రూ.670 కోట్లు, ఏమిటీ షేర్ కథ...

ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నాగేంద్ర సాయి కుందవరం
    • హోదా, బిజినెస్ అనలిస్ట్, బీబీసీ కోసం

ఒక్క రోజులో 3 రూపాయల 50 పైసలు, 2 లక్షల 25వేలు కావడం ఏంటి?

మంగళవారం నుంచి చాలా మందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇది.

స్టాక్ మార్కెట్‌లో ఒకోసారి కళ్లు చెదిరే లాభాలు వస్తాయని తెలుసు కానీ ఇలా కళ్లు తిరిగే లాభాలు రావడం ఏంటి? అని చాలా మందికి అనిపిస్తూ ఉండొచ్చు.

175 రూపాయలు పెట్టి ఓ 50 షేర్లు కొనేసి ఉంటే దాని విలువ ఇప్పుడు కోటి రూపాయలకు పైనే. స్టాక్‌ మార్కెట్‌లో ఎప్పుడూ జరగని వింత, అద్భుతం, మహాద్భుతం అని ఇప్పుడు ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎవరూ ఊహించలేనంతగా దాదాపు 67 లక్షల శాతం పెరిగింది.

‘‘35 రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తే 23,62,500 రూపాయలు అయ్యాయా? అవునా.. నిజమా.. మాకు తెలిస్తే.. కనీసం అప్పు చేసైనా పాతిక లక్షలు తెచ్చిపడేసే వాళ్లం. లైఫ్‌ సెటిల్‌ అయిపోయేది” అని చాలా మంది అనుకొని కూడా ఉండొచ్చు.

మొత్తానికి 2.36 లక్షల రూపాయలతో అత్యంత ఖరీదైన కంపెనీ షేరుగా అవతరించిన ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఇంతకాల అగ్రస్థానంలో ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ను వెనక్కి నెట్టింది. 30వ తేదీ ఎంఆర్‌ఎఫ్ షేర్ 1,22,198 రూపాయల వద్ద ముగిసింది

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
bseindia

ఫొటో సోర్స్, bseindia.com/screenshot

ఫొటో క్యాప్షన్, ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ షేరు ధరను సూచిస్తున్న బీఎస్ఈ

ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చరిత్ర ఏంటి?

ముంబయికి చెందిన ఎల్సిడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అనేది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ. 1981లో ప్రారంభమైన ఈ కంపెనీ షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిలో పెట్టుబడులు పెడుతూ ఉంటుంది.

ప్రముఖ పెయింట్స్ సంస్థ ఏషియన్ పెయింట్స్‌లో ఎల్సిడ్‌, దాని అనుబంధ సంస్థలకు 2.95శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఆ వాటా విలువ సుమారు 8,500 కోట్ల రూపాయలు.

ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 75శాతం (1,50,000 షేర్లు) వాటా ప్రమోటర్ల చేతిలో ఉండగా 25శాతం (50,000 షేర్లు) వాటా పబ్లిక్ చేతిలో ఉంది. మొత్తం 2,00,000 షేర్లు ఉన్నాయి. 2024 సెప్టెంబరు నాటికి మొత్తం ప్రమోటర్లు ఆరుగురు కాగా పబ్లిక్ షేర్ హోల్డర్ల సంఖ్య 322.

స్క్రీన్ షాట్

ఫొటో సోర్స్, unlistedzone.com/ Screenshot

ఫొటో క్యాప్షన్, అన్‌లిస్టెడ్‌జోన్‌ సైట్‌లో ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రాఫ్

ఇది నిజమేనా?

సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. లాజిక్స్‌ పక్కన పెట్టి టెక్నికల్‌ పారామీటర్స్ ప్రకారం 3 రూపాయల 50 పైసలు 2 లక్షల 36 వేలు కావడమనేది నిజమే.

కానీ దీని వెనుక అర్థం చేసుకోవాల్సిన కథ ఒకటి ఉంది.

బీఎస్‌ఈలో ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్ షేరు సరళిని చూస్తే 2016 నుంచి మొన్నటి దాకా దాదాపు లావాదేవీలు జరగలేదు. ఒకవేళ జరిగినా అదీ చాలా కొద్ది మొత్తంలో అంటే 10, 100, 1000 ఇలా చాలా తక్కువ మొత్తంలోనే షేర్లను అమ్మడం కొనడం చేశారు. అందువల్ల షేర్ ధర ఎప్పుడూ 3 రూపాయలకు కాస్త అటుఇటుగా ఉంటూ వచ్చింది. అతి కొద్ది సార్లు మాత్రమే 10 రూపాయలు దాటింది.

మొత్తానికి ఆ కంపెనీలోని షేర్లను షేర్ హోల్డర్లు అమ్మడానికి ఇష్టపడటం లేదు. మరి వాళ్లు ఎందుకు అమ్మడం లేదు?

వాస్తవానికి ఈ కంపెనీ ఒక్కో షేరు బుక్‌ వాల్యూ మాత్రం 5,85,225 రూపాయలకు చేరింది. కంపెనీకి ఉన్న మొత్తం నికర ఆస్తుల విలువను మొత్తం షేర్లతో భాగిస్తే వచ్చేదానిని షేరు బుక్ వాల్యూ అంటారు. అంటే ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక్కో షేరు సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేస్తుందని షేర్ హోల్డర్లు నమ్ముతున్నారు. కానీ మార్కెట్‌లో దాని ధర సుమారు 3 రూపాయలు మాత్రమే.

కాబట్టి సుమారు 6 లక్షల విలువైన షేరును 3 రూపాయల 50 పైసలకు అమ్మడానికి వాళ్లు సిద్ధంగా లేరు. అందువల్ల చాలా సంవత్సరాలుగా నామమాత్రపు ట్రేడింగ్ మాత్రమే జరుగుతోంది.

ఇప్పుడు ఏం జరిగింది?

బుక్ వాల్యూ కంటే మార్కెట్ వాల్యూ తక్కువగా ఉన్న ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల మీద ఇటీవల స్టాక్ మార్కెట్‌ను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) దృష్టి పెట్టింది. కాబట్టి బుక్ వాల్యూ, మార్కెట్ వాల్యూ మధ్య ఉన్న ఆ గ్యాప్‌ను పూడ్చేందుకు ఒకరోజు ప్రత్యేకంగా కాల్ ఆక్షన్ నిర్వహించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ కోరింది. ఒక రోజు సంబంధిత కంపెనీల షేర్ల ట్రేడింగ్ మీద ఎలాంటి ఆంక్షలు, నియంత్రణలు ఉంచకూడదని నిర్దేశించింది. ఇది షేర్‌కు ఫెయిర్ వాల్యూ రావడానికి తోడ్పడుతుందనేది సెబీ ఉద్దేశం.

అలా బీఎస్‌ఈ 29న షేర్ ధర ట్రేడింగ్ మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా కాల్ ఆక్షన్ నిర్వహించింది. దాంతో 3 రూపాయల 50 పైసలుగా ఉన్న షేరు ధర కాస్త ఒక్కరోజులోనే సుమారు 2 లక్షల 25 వేలకు పెరిగింది. ఆ రోజు ట్రేడ్‌ అయిన షేర్ల సంఖ్య కేవలం 241. అక్టోబర్‌ 30న అదే స్టాక్‌ 2,36,000కు చేరింది.

ఎక్స్సేంజీల్లో లిస్ట్‌ కాని పబ్లిక్‌ లిమిడెట్‌ కంపెనీలు అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ట్రేడ్‌ అవుతూ ఉంటాయి. అలాంటివి సుమారు 500 స్టాక్స్‌ ఉన్నాయి. వాటిలో ఎన్‌ఎస్‌ఈ, ఎన్‌ఎస్‌డీఎల్‌, ఓయో, స్విగ్గీ వంటి షేర్లు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ధరలు పూర్తిగా డిమాండ్‌ - సప్లై మీదనే ఆధారపడి ఉంటాయి. ఎటువంటి నియంత్రణా ఉండదు.

అలాంటి అన్‌లిస్టెడ్ సెగ్మెంట్‌లో కూడా ఎల్సిడ్‌ స్టాక్‌ చాలా ఏళ్ల నుంచి 1.65 లక్షల రూపాయల నుంచి 1.90 లక్షల మధ్య ట్రేడవుతోంది. 2022 మార్చిలోనే స్టాక్ మార్కెట్ నుంచి షేర్లను డీలిస్ట్ చేయడానికి ఒక్కో షేరుకు సుమారు 1.61 లక్షలను కంపెనీ ఆఫర్ చేసింది. కానీ నాడు మార్కెట్ ధర 17 రూపాయలు మాత్రమే. అయినా పబ్లిక్ షేర్ హోల్డర్లు ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే దాని బుక్ వాల్యూ కంటే కంపెనీ ఆఫర్ చాలా తక్కువ కాబట్టి.

అన్‌లిస్టెడ్ విభాగంలో ప్రైస్‌ డిస్కవరీ ఇన్వెస్టర్లు - ట్రేడర్ల మధ్య ఉంది. కాకపోతే ఇవి ట్రేడ్‌ అయ్యేందుకు ఒక ప్లాట్‌ఫాం ఏదీ అథెంటిక్‌గా లేకపోవడం వల్ల ఎల్సిడ్‌ స్టాక్‌ ఇలా పరుగులు తీసింది. అంతే కానీ.. రూ.3.5 స్టాక్‌ రూ.2.35 లక్షలు అయిపోయింది అనేది మాత్రమే సరైంది కాదు. కేవలం మెకానిజంలో మార్పు అంతే.

స్టాక్ మార్కెట్ ధరలు

ఫొటో సోర్స్, Getty Images

ధర ఇలానే పరుగులు తీస్తుందా ?

ఒక్కసారి మార్కెట్‌లోకి స్టాక్‌ అడుగుపెట్టిన తర్వాత ఇక పూర్తిగా స్టాక్‌ ధర డిమాండ్‌ - సప్లై - మార్కెట్‌ ఫోర్సెస్‌పైనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బాగా తక్కువగా (ఇల్లిక్విడ్‌) ట్రేడ్‌ అయ్యే స్టాక్‌ ఇది. టెక్నికల్‌గా మాట్లాడుకుంటే బుక్‌ వేల్యూ ప్రకారం సుమారు రూ.5.8 లక్షలు కానీ షేర్ ధర రూ.2.3 లక్షలకు లభిస్తోంది. అంటే ఇంకా షేర్ చీప్‌గా వస్తోందనే అనుకోవాలి.

కాకపోతే ఇంతవరకూ దేశంలో ఇంత ఎక్కువ ధరతో ఏ స్టాక్‌ కూడా లేదు. ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ స్టాక్‌ కూడా. రూ.1.22 లక్షలు. బుక్‌ వేల్యూ ప్రకారం చూస్తే స్టాక్‌ ఇంకా పెరిగే ఛాన్స్‌ ఉన్నా, రిస్కీ బెట్‌ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎంత ట్రేడింగ్‌ కంపెనీ అయినప్పటికీ, బుక్ వేల్యూ ఒక్కటే ప్రాతిపదికగా చూడలేం. అలాగే లిక్విడిటీ కూడా మరొక సమస్య. ఇలాంటి షేర్లలో అమ్మేవాళ్లు కొనే వాళ్లు పెద్దగా ఉండరు.

ఇలాంటి అద్భుతాలు ఇంకా ఏమేం ఉన్నాయ్‌?

సాధారణంగా ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. కానీ ఇలాంటివన్నీ వన్‌టైమ్‌ వండర్స్. వాస్తవానికి ఇది కూడా వండర్‌ ఏం కాదు. కానీ వివిధ కారణాల వల్ల లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

స్టాక్‌ మార్కెట్లో ఎప్పుడూ చూడాల్సిన ఏకైక సూత్రం.. ఫండమెంటల్స్‌.

సేల్స్‌ గ్రోత్‌, ప్రాఫిట్‌ గ్రోత్‌, మార్జిన్స్‌ ఇంప్రూవ్మెంట్‌ ఒక కోణమైతే పీఈ, క్యాష్‌ ఫ్లోస్‌, బెంచ్‌మార్క్‌ రిటర్న్‌ కంపేరిజన్‌ మరో కోణం. ఇలాంటి పారామీటర్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేయాలే కానీ, స్పెక్యులేషన్‌ కోసం మాత్రం కాదని గమనించండి.

(గమనిక: రచయిత ఆర్థికరంగ నిపుణులు. ఆర్థికపరమైన అంశాలపై అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. మీ వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలు ఏవైనా నిపుణులతో సంప్రదించి మాత్రమే తీసుకోగలరు.)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)