నష్టాల్లో ఉన్న షేర్లను కొందరు ఎందుకు కొంటారు... వారిని నడిపించేది ఏమిటి?

పర్సనల్ ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

2023 జనవరిలో సెబీ విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, గత ఏడాది ఫ్యూచర్స్ & ఆప్షన్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వారిలో 89 శాతం మంది మదుపరులు నష్టాలను ఎదుర్కొన్నారు.

ఇదే మదుపు మార్గంలో వచ్చిన సగటు నష్టం సగటు లాభం కంటే 15 రెట్లు ఎక్కువగా ఉంది. మరోవైపు ఎప్పటికప్పుడు ఈ మార్గాలలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరుగుతూ ఉంది.

  • నష్టాలు ఎక్కువగా ఉన్న ఈ పెట్టుబడి మార్గాలలో ఎందుకు మదుపరులు పెరుగుతున్నారు?
  • రిస్క్ ఎక్కువగా ఉందని తెలిసి కూడా ఎందుకు మదుపరులు ఈ మార్గాలను ఎంపిక చేసుకుంటున్నారు?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే బిహేవియరల్ ఫైనాన్స్ (ఉద్వేగంతో చేసే ఖర్చులు) గురించి తెలుసుకోవాలి.

డబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

బిహేవియరల్ ఫైనాన్స్ అంటే అదే

స్టాక్ మార్కెట్లో జరిగే మార్పుల గురించి ఎన్నో అధ్యయనాలు ఉన్నాయి. ఎందరో నిపుణులు తాము చేసిన అధ్యయనాల ద్వారా స్టాక్ మార్కెట్ గమనాన్ని ఊహించడానికి ప్రయత్నించారు లేదా జరిగిన సంఘటనలకు ఒక హేతుబద్దమైన కారణాన్ని వివరించారు.

ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో మదుపరులకు ఊహించని నష్టాలు కలిగే అవకాశాన్ని తగ్గించారు. ఈ కోవలో వచ్చిన సిద్దాంతమే బిహేవియరల్ ఫైనాన్స్.

మదుపరులు అందుబాటులో ఉన్న సమాచారాన్ని వాడుకుని తమకు హేతుబద్దమైన నిర్ణయాలు తీసుకుంటారనే సిద్దాంతం 1970-80 దశకాలలో ప్రాచుర్యంలో ఉండేది.

ఈ సిద్దాంతం ప్రకారం ఎక్కువ ఆదాయం రావాలంటే ఎక్కువ రిస్క్ ఉన్న మదుపు మార్గాలలో పెట్టుబడి పెట్టక తప్పదు.

కానీ వారెన్ బఫెట్ లాంటి వారు తక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడి మార్గాల ద్వారా కూడా ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించారు.

ఇదెలా సాధ్యమైందనే సంఘర్షణ నుంచి పుట్టిన అంశమే బిహేవియరల్ ఫైనాన్స్.

ఎలాంటి హేతుబద్దత లేని మానవ ప్రవృత్తి స్టాక్ మార్కెట్ గమనానికి కారణం కావచ్చు. అలాగే అందుబాటులో ఉన్న సమాచారాన్ని మదుపరులు ఉపయోగించకుండా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని వివరించే ప్రయత్నమే ఈ బిహేవియరల్ ఫైనాన్స్.

బిహేవియరల్ ఫైనాన్స్

ఫొటో సోర్స్, Getty Images

పెట్టుబడిదారుల సైకాలజీ

వివిధ సంస్థల షేర్లకు డిమాండ్ పెరగడానికి ఆ సంస్థల పనితీరు మాత్రమే కాకుండా మదుపరుల సైకాలజీ కారణం కావచ్చని నోబెల్ గ్రహీత రాబర్ట్ షిల్లర్ ప్రతిపాదించారు.

ఈ విప్లవాత్మక ఆలోచన నుంచే బిహేవియరల్ ఫైనాన్స్ పరంగా అనేక అధ్యయనాలు వెలువడ్డాయి. వీటిలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం:

1. అందరిలా ఉండాలనే ఆలోచన: అందరూ చేసే పనే తాను కూడా చేయాలనే ఆలోచనతో మనుషులు ఎన్నో పనులు చేస్తుంటారు. మదుపు చేసే విషయంలో కూడా ఎలాంటి ఆలోచన లేకుండా కేవలం అందరూ చేస్తున్నారని, ఇతరులు చేసిన మదుపు మార్గాలలో పెట్టుబడి పెడతారు.

2. అర్థం లేని ఆశలు: ఏదో ఒక అద్భుతం జరిగి మనం మదుపు చేసిన మార్గాలలో లాభాలు వస్తాయి అనే ఆలోచన. ప్రస్తుతం నష్టాలలో ఉన్నా భవిష్యత్తులో లాభాలు వస్తాయని, ఎలాంటి కారణం లేకపోయినా ఎలాగోలా లాభాలు వస్తాయని ఎదురు చూడటం. ఇలా చేయడం వల్ల మదుపరుల నష్టాలు విపరీతంగా పెరుగుతాయి.

3. ఇతరుల కంటే తాను తెలివైనవాళ్లమనే అభిప్రాయం: చాలా మంది మదుపరులు ఏ సంస్థలో మదుపు చేయాలో నిర్ణయించే సమయంలో, తాము ఇతరులకంటే తెలివైనవాళ్లమని భావిస్తారు. ఈ విషయం అనేక అధ్యయనాల్లో రుజువైంది.

ఇప్పుడు ఈ అంశాలు పర్సనల్ ఫైనాన్స్ విషయంలో ఎలా అన్వయించుకోవాలో చూద్దాం.

జీవిత, ఆరోగ్య బీమా

ఫొటో సోర్స్, Getty Images

1. జీవిత & ఆరోగ్య బీమా

బీమా అనే అంశం గురించి ఆలోచించడానికి కూడా చాలామంది ఇష్టపడరు. అనారోగ్యం లేదా విపత్తులు కలిగే అవకాశం అందరికీ ఒకే విధంగా ఉంటుంది. కానీ చాలా మంది తమకు బీమా అవసరం లేదనే భావనలో ఉంటారు.

హేతుబద్దత లేని ఇలాంటి ఆలోచనల వల్ల ఏదైన అత్యవసరమైన పరిస్థితి ఎదురైనప్పుడు కలిగే ఖర్చులతో ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. ఇది మదుపరుల ఆలోచన విధానంలో ఉండే లోపాలను ఎత్తిచూపుతుంది.

అలాగే పెద్దగా ఉపయోగం లేని ఎండోమెంట్ పాలసీలను కొన్న వారి సంఖ్య భారత దేశంలో చాలా ఎక్కువ. కచ్చితమైన లెక్కలు వేస్తే ఎండోమెంట్ పాలసీల కంటే ఉపయోగకరమైన పాలసీలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.

కానీ ఎండోమెంట్ పాలసీలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి.

స్టాక్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

2. పుకార్లు, అర్ధ సత్యాల ప్రభావం

సెక్యూరిటీల మార్కెట్ నుంచి ప్రముఖ నటుడు అర్షద్ వార్సీని సెబీ నిషేధించింది. దీనికి కారణం ఆయన చేసిన వీడియోల వల్ల ఎందరో మదుపరులు నష్టాల పాలయ్యారు.

అలాగే పీఆర్ సుందర్ అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ మీద సెబీ రూ. 6 కోట్ల జరిమానా విధించింది. దానికి కారణం సెబీ నిబంధనలను ఆయన అతిక్రమించారు.

కొన్నేళ్ళుగా ట్విటర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల ఆయన చాలా ప్రాచుర్యం పొందారు.

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎంతో సమాచారం మనకు అందుబాటులో ఉంది.

ఈ సమాచారంలో మనల్ని తప్పుదోవ పట్టించే అంశాలు కూడా మెండుగా ఉన్నాయి.

ఫలానా సంస్థలో ఎక్కువ మంది మదుపు చేస్తున్నారనే వార్తల ఆధారంగా పెట్టుబడి పెట్టడం తరచుగా చూస్తుంటాం.

ఇవన్నీ కూడా బిహేవియర్ సైకాలజీ సూచిస్తున్న లోటుపాట్లు.

3. భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోవడం

సొంత ఇల్లు అనేది మన సమాజంలో ఒక భావోద్వేగపూరితమైన నిర్ణయం. కానీ, పర్సనల్ ఫైనాన్స్ పరంగా ఇది ఒక ఆర్థిక లక్ష్యం మాత్రమే.

అన్ని ఆర్థిక లక్ష్యాలకు సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలనే పర్సనల్ ఫైనాన్స్ సూత్రాలలో ఒకటి.

కానీ చాలా మంది సొంత ఇంటి కోసం మరొక ఆర్థిక లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.

ఇది సరైన పద్దతి కాదు. బిహేవియరల్ ఫైనాన్స్ చెబుతున్న ‘అర్థం లేని ఆశ’తో చేసే పనికి ఇది చక్కటి ఉదాహరణ.

భవిష్యత్తులో అవసరం అయితే ఇంటిని అమ్మే అవకాశం ఉందనే వాదన వినిపిస్తూ ఉంటుంది. కానీ మనకు అవసరం అయిన సమయంలో మనకు కావలసిన మొత్తం వస్తుందనే స్పష్టత ఉండదు.

ఇలా స్పష్టత లేని పెట్టుబడి మార్గాలలో ఉన్న రిస్క్, ఇతర మదుపు మార్గాల కంటే చాలా ఎక్కువ.

4. దీర్ఘకాలిక దృక్పథం లేకపోవడం

దీర్ఘకాలిక దృక్పథంతో మదుపు చేయడం ద్వారా కలిగే లాభాల గురించి ఎన్నో అధ్యయనాలు జరిగాయి.

అయినప్పటికీ చాలా మంది మదుపరులు అలాంటి ఆలోచన విధానాన్ని పాటించకుండా పెట్టుబడి పెడుతుంటారు. ఇది కూడా బిహేవియరల్ ఫైనాన్స్ చెబుతున్న సమస్యలలో ఒకటి.

డబ్బులు

ఫొటో సోర్స్, Getty Images

5. సులభంగా ఆదాయం రావాలని మోసపోవడం

సులభంగా ఆదాయం వచ్చే మార్గాలు ఉండవు అనేది అందరికీ తెలిసిన నిజం. కానీ చాలా మంది మదుపరులు తమకు సులభంగా ఆదాయం ఇచ్చే మార్గాలు ఎన్నో ఉన్నాయని నమ్ముతారు.

అలా తప్పుడు మదుపు మార్గాలలో పెట్టుబడి పెట్టి నష్టాల పాలవుతున్నారు. ఇది అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలనే తపన వల్ల కలుగుతున్న దుష్పరిణామం.

(నోట్: ఈ కథనం నిర్దిష్టమైన అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారులను సంప్రదించి తీసుకోవాలి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)