ట్రిలియన్ డాలర్ కాయిన్: అమెరికా దివాలా నుంచి బయటపడాలంటే రూ. 82 లక్షల కోట్ల విలువైన ప్లాటినం నాణెం ముద్రించాలా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాను దివాలా నుంచి రక్షించేందుకు గాను దేశ రుణ పరిమితి పెంచే విషయంలో అంగీకారానికి రావడానికి రిపబ్లికన్‌లు, డెమొక్రాట్‌లకు గడువు సమీపిస్తోంది.
జూన్‌లోపు ఒప్పందం కుదరకుంటే అమెరికా ప్రభుత్వం తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడం కష్టమవుతుంది. అంతేకాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఈ ప్రభావం పడుతుంది.
ఇటీవల రోజుల్లో కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ సభ్యులు, వైట్ హౌస్ కూడా చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు సంకేతాలిచ్చాయి. అయినా, ఈ సంకేతాలు భయాందోళనలను ఏమాత్రం తగ్గించలేకపోయాయి.
ఈ పరిస్థితిపై విశ్లేషకులు, ఆర్థికవేత్తల చర్చలలో ఒక చిట్టచివరి అవకాశం ప్రస్తావనకు వస్తోంది. అది, 1 ట్రిలియన్ డాలర్(సుమారు రూ. 82 లక్షల కోట్ల) ప్లాటినం కాయిన్ జారీ చేయడం. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అదే చిట్టచివరి అవకాశంగా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
1997 నాటి కరెన్సీ చట్టం ప్రకారం ఏ కారణమైనా చూపించి ఎంత పెద్ద విలువతోనైనా ప్లాటినం కాయిన్ ముద్రించడానికి అమెరికా ఆర్థిక మంత్రికి అధికారం ఉంటుంది.
అమెరికన్ కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు లేకపోతే ప్రభుత్వ వ్యయానికి డబ్బు ఇబ్బంది లేకుండా ఇది పనిచేస్తుందని ఈ ప్లాటినం కాయిన్ ముద్రించాలన్న వాదనను సమర్థించేవారు అంటున్నారు.
ఈ ఆలోచనను అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ కొట్టిపారేశారు.
రుణ పరిమితి పెంచడానికి వీలు కానప్పుడు ప్రత్యామ్నాయంగా ఇలా భారీ విలువ ఉన్న నాణేలను ముద్రించడానికి ఆర్థిక మంత్రి తన అధికారాన్ని ఉపయోగించడమనేది మునుపెన్నడూ జరగలేదు.
నాణేలు సేకరించేవారు కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రత్యేక కాయిన్లు ముద్రించడమే ఈ ప్రత్యేక అధికారం లక్ష్యం.
కానీ ట్రిలియన్ డాలర్ కాయిన్‌ను నిజంగానే ముద్రిస్తే ఏం జరుగుతుంది?
‘‘నాణెంపై 1 ట్రిలియన్ డాలర్ అని ముద్రించి ఫెడరల్ రిజర్వ్‌కు పంపించాల్సి ఉంటుంది" అని అమెరికా మింట్ మాజీ అధిపతి ఫిలిప్ డీల్ చెప్పారు.
చాలా మంది ఊహాగానాలు చేస్తూ పరిహాసం చేస్తున్నట్లు ఇది భారీ పరిమాణంలో కాకుండా జేబులో పట్టే సాధారణ క్వార్టర్ డాలర్‌లా చిన్నగానే ఉండొచ్చు.
ట్రిలియన్ రాయడానికి అన్ని సున్నాలు ముద్రించకుండా అక్షరాలలో ట్రిలియన్ అని రాస్తే చాలు.

ఫొటో సోర్స్, Getty Images
లాయర్ ఇచ్చిన ఐడియా
అమెరికా ప్రభుత్వం దివాలా తీయకుండా ఆపడానికి 1 ట్రిలియన్ డాలర్ నాణెం ముద్రించే అవకాశం గురించి తొలుత 2010లో ఓ బ్లాగ్‌లో రాశారు. సంప్రదాయేతర ద్రవ్య విధానాల గురించి రాసే ఆ బ్లాగులో ఈ ప్రస్తావన తొలిసారి వచ్చింది.
అట్లాంటాకు చెందిన కార్లోస్ ముచా అనే లాయర్ 1 ట్రిలియన్ కాయిన్ గురించి ఆ బ్లాగులో రాశారు. అందుకే చాలామంది ఆయన్ను ‘ప్లాటినం కాయిన్ ఇంటలెక్చువల్ క్రియేటర్’ అంటారు.
ఆయన కూడా 1997 నాటి కరెన్సీ చట్టం ఆధారంగానే ఈ ప్రతిపాదన చేశారు.
"అమెరికన్ కాంగ్రెస్ ఇప్పటికే 1 ట్రిలియన్ కాయిన్ ముద్రణకు ప్రతిపాదించింది" అని ఆయన అప్పట్లో ఆ బ్లాగులో రాశారు.
ఆ తరువాత నుంచి 1 ట్రిలియన్ డాలర్ అనేది చర్చనీయంగా మారిపోయింది. బ్లాగులో తాను ఆ విషయం రాసిన తరువాత మింట్ మాజీ డైరెక్టర్ ఫిల్ డీల్ తనకు ఓ ఈమెయిల్ కూడా పంపించారని వాక్స్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్లోస్ ముచా చెప్పారు.
తన ప్రతిపాదన నిజంగానే ఉపయోగపడుతుందని ఫిల్ డీల్ ఆ మెయిల్‌లో చెప్పినట్లు కార్లోస్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బరాక్ ఒబామా హయాంలో ఏమైందంటే..
బ్లాగులో కార్లోస్ రాసింది చాలా మందికి చేరింది. 2011లో బరాక్ ఒబామా ప్రభుత్వ కాలంలో తలెత్తిన రుణ పరపతి సంక్షోభంతో ఇది మరింత చర్చనీయంగా మారింది.
అప్పట్లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత పాల్ క్రగ్‌మాన్, ఫిల్ డీల్ లాంటి ఆర్థికవేత్తలు సహా ఏడు వేల మంది సంతకాలతో ప్లాటినం కాయిన్ ఆలోచనకు మద్దతుగా ఒక లేఖ ప్రచురించారు.
#MintTheCoin వంటి హ్యాష్‌టాగ్‌లు కూడా అప్పట్లో ట్రెండయ్యాయి.
అప్పటి నుంచి రుణ పరిమితి విషయంలో రాజకీయ హడావుడి నెలకొనే ప్రతిసారీ ఈ 1 ట్రిలియన్ కాయిన్ ప్రస్తావన వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో జో బైడెన్ ప్రభుత్వం ఈ 1 ట్రిలియన్ కాయిన్ ముద్రణను ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా పరిగణించలేదు.
"ఇది ఒక ఉపాయం మాత్రమే అని నా అభిప్రాయం" అని ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్ కొద్దిరోజుల కిందట చెప్పారు.
రుణ పరిమితి పెంపుపై రిపబ్లికన్లతో జరుపుతున్న చర్చల్లో ప్రస్తావించిన అంశాల్లో డెమొక్రాట్లు ఈ నాణెం ప్రతిపాదన కూడా చేశారని కొందరు వాదిస్తున్నారు.
నాణెం ముద్రణ సంగతి పక్కన పెడితే జూన్ 1 నాటికి డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఒక ఒప్పందానికి రాలేకపోతే అమెరికా ప్రభుత్వం చెల్లింపులు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి:
- రూ. 2,000 నోట్ల వాడకాన్ని ఆపేసిన ఆర్బీఐ.. మీ దగ్గర ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
- జనసేన: పార్టీలకు ఎన్నికల గుర్తులను ఈసీ ఎలా కేటాయిస్తుంది?
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














