‘మెదడు లేని బిడ్డ కడుపులో ఉందని తెలిసినా అబార్షన్‌కు ఒప్పుకోలేదు'... కూతురికి జరిగిన అన్యాయంపై ఓ తల్లి పోరాటం.

ఫొటో సోర్స్, VALENTINA OROPEZA, BBC
- రచయిత, వాలెంటినా ఒరోపెజా కోల్మెనారెస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీట్రిజ్‌కి 18 ఏళ్ల వయసులోనే లూపస్ వ్యాధి ఉందని నిర్థరణ అయింది. ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. దీనివల్ల 21 ఏళ్ల వయసులో బీట్రిజ్ గర్భం ధరించినప్పుడు క్లిష్టపరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
నెలలు నిండకుండానే బాబు పుట్టాడు. చాలారోజులు ఇంక్యుబేటర్‌లో ఉన్నాడు.
మళ్లీ ఏడాది తరువాత 2013లో బీట్రిజ్ గర్భం దాల్చారు. తల్లి డెల్మీతో పాటు డాక్టర్ దగ్గరకు వెళ్లారు.
వైద్య పరీక్షల అనంతరం, బీట్రిజ్ కడుపులో మెదడు లేని బిడ్డ పెరుగుతోందని తేలింది. రెండవసారి గర్భం బీట్రిజ్ ఆరోగ్యానికి మరింత ముప్పుగా మారింది.
అయితే, ఎల్ సాల్వడార్‌లో అబార్షన్‌పై ఆంక్షలు ఉన్నాయి. అందువల్ల, బీట్రిజ్‌కు గర్భస్రావం చేసేందుకు కోర్టు అనుమతివ్వలేదు.
కడుపులో బిడ్డ బతికే అవకాశం లేదని తెలిసినప్పటికీ అబార్షన్‌కు అధికారులు ఒప్పుకోలేదు. అప్పటికి ఆమెకు 22 ఏళ్లు.
ప్రసూతి ఆసుపత్రిలోని వైద్య కమిటీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హక్కుల సంఘాలు బీట్రిజ్‌కు అబార్షన్ చేయాలన్న అభ్యర్థనకు మద్దతు ఇచ్చాయి.
తల్లి ప్రాణాలకు ముప్పు అని కూడా చెప్పారు. కానీ కోర్టులో కేసు నిలవలేదు.
ఇది జరిగిన పదేళ్ల తరువాత, 2023 మార్చి 23న కోస్టారికాలో ఒక 'ఇంటర్-అమెరికన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్' ఈ కేసుపై జరిపిన విచారణకు డెల్మీ హాజరయ్యారు.
ఎల్ సాల్వడార్‌లో అబార్షన్‌కు కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. చట్టానికి వ్యతిరేకంగా గర్భస్రావానికి పాల్పడితే 30 నుంచి 50 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు.
ఈ కేసుతో బీట్రిజ్ ఎల్ సాల్వడార్‌లో ఫేమస్ అయ్యారు. ఇదే ఇంటర్-అమెరికన్ కోర్ట్‌లో విచారించిన మొదటి అబార్షన్ తిరస్కరణ కేసు.
ఈ కేసులో వచ్చే తీర్పు మానవ హక్కులపై అమెరికన్ కన్వెన్షన్ మీద సంతకం చేసిన ఈ ప్రాంతంలోని మిగిలిన దేశాలకు ఒక ఆదేశంలా నిలుస్తుంది.
ఈ నేపథ్యంలో, గత పదేళ్ల కాలంలో తన కుటుంబం పడిన వ్యథను డెల్మీ పంచుకున్నారు.
బీట్రిజ్ కొన్నాళ్లకు ఒక ప్రమాదంలో మరణించారు. ఆ కథ డెల్మీ మాటల్లోనే..

ఫొటో సోర్స్, Getty Images
అరచేతుల్లో పట్టేంత చిన్న బాబు
బీట్రిజ్ మొదటి ప్రెగ్నన్సీలో ప్రీక్లాంప్సియా కండిషన్‌తో బాధపడింది. కాన్పుకు ముందు ఆమెకు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. నా కూతురి పరిస్థితి ఏమీ బాలేదు. ఎలాగో కాన్పు జరిగింది.
నెలలు నిండకుండానే, చాలా తక్కువ బరువుతో బాబు పుట్టాడు. మొదటిసారి బాబుకు తొడిగిన చొక్కా ఇంకా నా దగ్గరుంది.
బిడ్డను నా చేతికిచ్చారు. నా అరచేతుల్లో పట్టినంతే ఉన్నాడు. నాకు ఏడుపొచ్చేసింది. బాబుకు అన్ని రకాల ట్యూబులు తగిలించారు. అది చూసి బీట్రిజ్ చాలా బాధపడింది. బాబుకు పాలివ్వలేకపోయింది. ఆస్పత్రిలో ఫార్ములా పాలే పట్టేవారు. బిడ్డ బతకడం కష్టమేననిపించింది. కానీ, బాబు కోలుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
రెండవ ప్రెగ్నెన్సీ.. 81 రోజులు ఆస్పత్రిలో
ఒకరోజు బీట్రిజ్‌కు ముఖంపై మశూచి లాంటి పొక్కులు వచ్చాయి. అవి చిదిగి రక్తం, చీము కారింది. మెల్లగా అది శరీరమంతా పాకింది. చాలా నొప్పి, బాధ ఉండేది.
బీట్రిజ్ తన భర్తతో కలిసి ఉండేది. ఈ సమస్య వచ్చాక నా దగ్గరకు వచ్చింది. పొక్కులు శరీరమంతా పాకేసరికి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను.
పరీక్షలు చేసేసరికి, బీట్రిజ్ కడుపుతో ఉందని తేలింది. అప్పటికి మొదటి బిడ్డ పుట్టి ఏడాదిన్నర కావొస్తోంది.
నాకు చాలా భయం వేసింది. రెండవసారి ప్రెగ్నెన్సీ అంటే నా కూతురు ఇంకా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆమె ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. బిడ్డ ఇంకా బాధపడుతుందని భయమేసింది.
బీట్రిజ్‌ను మా ప్రాంతంలో ఉన్న ఒక పెద్ద ఆస్పత్రిలో చేర్చాం. నేను రోజూ బస్సులో వెళుతూ, వస్తూ ఉండేదాన్ని.
పొక్కులకు చికిత్స చేశారు. బీట్రిజ్ రెండు చేతులకు బ్యాండేజీ వేశారు. నేను వెళ్లి తనకు అన్నం తినిపించేదాన్ని.
బాత్రూంకి కూడా వెళ్లలేకపోయేది. నర్సులను అడగడానికి మొహమాటపడి, నేను వెళ్లేదాక ఉగ్గబట్టుకునేది.
కొన్ని రోజుల తరువాత బీట్రిజ్‌ను ప్రసూతి ఆస్పత్రికి మార్చారు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. కానీ కోర్టు అబార్షన్‌కు అనుమతివ్వలేదు.
కోర్టులో లాయర్లు పోరాడారు. వైద్య సంఘాలు, హక్కుల సంఘాలు మద్దతిచ్చాయి. కానీ, ఫలితం లేకపోయింది.
చివరికి, 26 వారాలకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీసేందుకు అనుమతించింది. దాన్ని అబార్షన్ అని కాకుండా, నెలలు ‘నిండకుండా కాన్పు’ అని పేర్కొంది.
సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. పాప పుట్టిన 5 గంటల్లో చనిపోయింది. తరువాత బీట్రిజ్ 81 రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది.
అక్కడ చిన్న గదిలో బిక్కుబిక్కుమని ఉండేది. మొదటి బిడ్డను చూసే వీలు ఉండేది కాదు. బాబుకు దూరమై బాధను అనుభవించింది. బాబును చూసుకోవడం కోసం తన భర్త ఇంట్లో ఉండేవారు. నేను ఆస్పత్రికి తిరిగేదాన్ని.
81 రోజుల తరువాత నా కూతురు ఇంటికొచ్చింది. మెల్లగా కోలుకుంది. అప్పుడే తన గురించి వార్తల్లో వచ్చిన విషయాలను చూసింది. అబార్షన్‌కు అనుమతించకుండా తనపై వివక్ష చూపారని బాధపడింది.

ఫొటో సోర్స్, COURTESY THE LIGHTHOUSE
స్వర్గం నుంచి దిగివచ్చిన పాప
ఇంటర్-అమెరికన్ కోర్టులో బీట్రిజ్ పాపను చూసిందని చెప్పారు. కానీ, ఆమె పాపను చూడలేదు. నేనే చూశాను.
సిజేరియన్ చేసి పాపను బయటకు తీశాక, నాకు పాపను చూపించారు. చలనం లేకుండా ఉన్న పసిపాపను చూశాను. మెదడు ఎదగని పాప పుట్టింది.
బీట్రిజ్ తన పాపకు పేరు పెట్టాలనుకుంది. ఇంటర్నెట్‌లో వెతికి లెయ్‌లాని అని పేరు పెట్టింది. దానికి అర్థం "స్వర్గం నుంచి దిగివచ్చిన పాప".
పాపకు లెయ్‌లాని బీట్రిజ్ అని పేరు పెట్టాం.
ఇంటికొచ్చిన తరువాత బీట్రిజ్ మౌనం వహించింది. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా గడిపేది. బాగా కోప్పడేది. నవ్వడమే మర్చిపోయింది.
తనను మాములు మనిషిని చేయడాని ఆమె సోదరులు ఏవేవో చేసేవారు. పాటలు పాడేవారు.
నన్ను విసిగించకండి అని వాళ్లను తిట్టేది. కానీ, ఒక మంచి విషయం ఏమిటంటే కొడుకు దగ్గర ఉన్నాడు. వాడిని చూస్తూ కాలం గడిపేది.

ఫొటో సోర్స్, Getty Images
బీట్రిజ్ మరణం, కొనసాగిన న్యాయ పోరాటం
2017లో బీట్రిజ్ ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి బీట్రిజ్ మొదటి బిడ్దను డెల్మీ సాకుతున్నారు. ఆ బాబుకు ఇప్పుడు 11 ఏళ్లు.
రెండవ బిడ్డ పుట్టి, పోయిన తరువాత నుంచి బీట్రిజ్ కోర్టులో న్యాయంకోసం పోరాడుతూనే ఉన్నారు. బతికున్న నాలుగేళ్లు పోరాటం చేశారు.
"ఇదంతా జరిగాక నేనుకోలుకోలేకపోయాను. నాకు బీపీ పెరిగింది. తిండి తినేదాన్ని కాదు. తినకపొతే ఆరోగ్యం మరింత పాడవుతుందని నా భర్త మందలించేవారు.
నా సహోద్యోగులు, బంధువులు సహకరించారు. మెల్లగా కోలుకున్నాను.
కానీ, కొందరు నాపై నిందలు వేశారు. ‘‘నువ్వు అబార్షన్‌కు మద్దతిస్తావా, బిడ్డ ప్రాణాలు తీయడానికి ఒప్పుకుంటావా, ఇది తప్పు, పాపం’’ అంటూ నాపై విమర్శలు గుప్పించారు.
నేను ఒకటే చెప్పేదాని. 'ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలీదు ' అనేదాన్ని. బీట్రిజ్ మీ కూతురో, మీ తోబుట్టువో అయ్యుంటే ఇలాగే మాట్లాడేవారా అని అడిగేదాన్ని. వాళ్లు జవాబు చెప్పలేకపోయేవారు.
బీట్రిజ్‌కు అన్యాయం జరిగింది. ఆమె పోరాటానికి ఫలితం దక్కలేదు. కోర్టులో పోరాడి అలిసిపోయింది.
కానీ, నా కూతురు చనిపోయాక కూడా పోరాటం కొనసాగించాలని నేను నిర్ణయించుకున్నాను. మళ్లీ ఈ దేశంలో ఇలాంటిది జరగకూడదు. అందుకు నా న్యాయ పోరాటాన్ని కొనసాగించాను.
నా కూతురు చనిపోయినప్పుడు నా మనవడికి అయిదేళ్లు. శవాన్ని చూసి 'ఎంతసేపు పడుకుంటావు లే' అన్నాడు. తల్లి శాశ్వత నిద్రలోకి వెళ్లిందని వాడికి తెలీదు. ఇప్పటికీ ఆమె సమాధి పక్క నుంచి వెళితే, వాడు చేయి ఊపుతాడు. అది చూస్తే మాకు కడుపు తరుక్కుపోతుంది.
నన్ను అమ్మా అని పిలుస్తాడు. వాళ్ల నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా అమ్మా అనే పిలుస్తాడు. అందరినీ వాడు అమ్మా అనే పిలుస్తాడు. వాడికి తల్లి దూరమైంది. అందుకే అందరిలోనూ అమ్మను చూసుకుంటాడు.
వాడికి ఇప్పుడు 11 ఏళ్లు. కానీ, ఇంకా మాట సరిగా రాలేదు. నాలుగో తరగతి చదువుతున్నాడు. కొన్ని పదాలు పలకడానికి ఇబ్బంది పడతాడు.
నా మనుమడు ఆరోగ్యంగా పెరిగి పెద్దవాడవ్వాలి. బలంగా నిలబడాలి. అప్పుడే బీట్రిజ్‌కు ఏమైందో నేను వాడికి చెప్పగలను.
నా మనుమరాలు కూడా అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది. స్వర్గం నుంచి వచ్చిన దేవత. ఇప్పుడు బీట్రిజ్‌తో కలిసి అక్కడే ఉండి ఉంటుంది."
ఇదీ డెల్మీ చెప్పిన కథ.
ఇవి కూడా చదవండి
- Abortion Rights: సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- ఇరాన్: 'నోరు మూసుకుని ఉండకపోతే మమ్మల్ని రేప్ చేస్తామన్నారు'
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- అబార్షన్ చేయించుకోవాలని కోవిడ్ సోకిన గర్భిణీలకు ఎందుకు చెబుతున్నారు..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














