పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ

ఫొటో సోర్స్, Pushpa
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ న్యూస్
2007లో బెంగళూరులో రోడ్డు దాటించాలని పుష్పను ఒక అంధుడు అడిగారు. రోడ్డుకు అవతలి వైపుకు చేరుకున్న తర్వాత ఆమెను మరొక సాయం అడిగారు. అది ఆమె జీవితాన్నే మార్చేసింది.
‘‘నా ఫ్రెండ్‌కు పరీక్ష రాయడంలో సాయం చేయగలరా అని ఆయన అడిగారు’’ అని పుష్ప గుర్తుచేసుకున్నారు.
అయితే, పరీక్ష రాసే రోజు వచ్చినప్పుడు ఆమె ఆందోళన చెందారు. ఎందుకంటే అంధులకు సాయంచేసే ‘‘స్క్రైబ్’’గా ఆమె శిక్షణ తీసుకోలేదు. ఆ పరీక్ష ఎలా రాస్తారో ఆమెకు పెద్దగా అవగాహన లేదు.
‘‘ఆ మూడు గంటలపాటు కొంత ఆందోళన చెందాను. ఆమె కాస్త నెమ్మదిగా సమాధానాలు చెప్పేవారు. ప్రశ్నను మళ్లీ మళ్లీ చదవాలని ఆమె అడిగేవారు’’ అని కర్ణాటక బెంగళూరుకు చెందిన పుష్ప చెప్పారు.
19 ఏళ్ల హేమ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన సాయం పుష్ప చేయగలిగారు.
ఆ తర్వాత అంధుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల(ఎన్‌జీవోల) నుంచి పుష్పకు అభ్యర్థనలు వెల్లువెత్తాయి. గత 16 ఏళ్లలో ఆమె వెయ్యికి పైగా ఇలాంటి పరీక్షలు రాశారు. వీటి కోసం ఆమె ఎలాంటి డబ్బులూ తీసుకోలేదు.
‘‘పరీక్ష కేంద్రాలు నాకు రెండో ఇల్లులా మారిపోయాయి’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Pushpa
ఒక్కరి కోసం 47 పరీక్షలు రాశారు
స్కూలు, యూనివర్శిటీ పరీక్షలతోపాటు ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లోనూ పుష్ప సాయం చేస్తున్నారు.
‘‘ఇది నాకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఎలాంటి ఒత్తిడీ కలగడం లేదు’’ అని ఆమె చెప్పారు. చరిత్ర నుంచి స్టాటిస్టిక్స్ వరకు చాలా సబ్జెక్టులు నేర్చుకోవడానికి ఈ పరీక్షలు సాయం చేశాయని తెలిపారు.
అంధులతోపాటు సెరెబ్రల్ పాల్సీ, డౌన్స్ సిండ్రోమ్, ఆటిజం, డిస్లెక్సియా, రోడ్డు ప్రమాదాల వల్ల పరీక్షలు రాయలేనివారికి కూడా ఆమె పరీక్షలు రాసిపెడుతుంటారు.
మొదట్లో సెరెబ్రల్ పాల్సీ బాధితులు చెప్పేవి అర్థం చేసుకోవడంలో ఆమె ఇబ్బంది పడేవారు.
‘‘వారి విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. పెదాల కదలికలు చూసి వారు ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవాలి’’ అని ఆమె చెప్పారు.
మొదట్లో కొంత తడబడినప్పటికీ, వీల్‌చైర్ సాయంతో కదిలే కార్తీక్ కోసం ఆమె చాలా పరీక్షలు రాశారు.
‘‘స్కూల్‌లో చివరి పరీక్షలతో మొదలుపెట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్‌లో అన్ని పేపర్లూ, మొత్తంగా 47 పరీక్షలు తన కోసం రాశాను’’ అని పుష్ప చెప్పారు.

ఫొటో సోర్స్, Pushpa
కార్తీక్ కోసం అన్ని పరీక్షలు రాయడం వెనుక ఒక కథ ఉంది.
‘‘స్కూల్ పరీక్షల సమయంలో వేరొకరి కోసం పుష్ప పరీక్షలు రాయడానికి వచ్చారు. నాకు వేరొకరు సాయం చేస్తున్నారు. అయితే, ఆయన మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పుష్ప తన పని పూర్తిచేసుకొని నాకు సాయం చేయడానికి వచ్చారు’’ అని కార్తీక్ చెప్పారు.
ఇంత సాయం చేస్తున్న ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని 25 ఏళ్ల కార్తీక్ అన్నారు.
‘‘మేం చేతితో రాయలేం. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడమూ మాకు కష్టం. ఎందుకంటే మా చేతులు చాలా నెమ్మదిగా కదులుతాయి’’ అని ఆయన చెప్పారు.
‘‘పుష్ప లాంటి వ్యక్తి మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. మా కోసం పరీక్షలు రాసిపెట్టేవారు నిజంగా మాకు దేవుళ్లతో సమానం’’ అని ఆయన అన్నారు.
ఏళ్లపాటు కలిసి పనిచేయడంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కూడా పెనవేసుకుంది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన కార్తీక్ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారు.
‘‘నేను చాలా మంది విద్యార్థులకు చాలా పరీక్షలు రాశాను. ఒక్కొక్కరిది ఒక్కో కథ’’ అని పుష్ప చెప్పారు.

ఫొటో సోర్స్, Pushpa
జీవితాన్ని మార్చిన సాయం
మార్చి మూడో వారంలో 19 ఏళ్ల భూమికా వాల్మీకికి యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలో పుష్ప సాయం చేశారు.
భూమికకు దృష్టిలోపం ఉంది. దీంతో అక్షరాలను వాయిస్‌లోకి మార్చే టూల్స్, యాప్స్ సాయంతో ఆమె చదువుకున్నారు. అయితే, పరీక్షల్లో ఇలాంటి టూల్స్ ఉపయోగించడానికి వీల్లేదు.
‘‘పుష్ప పరీక్ష రాస్తేనే జీవితంలో నేను ముందుకు వెళ్లగలను’’ అని భావోద్వేగంతో భూమిక చెప్పారు.
‘‘ఆమెకు సహనం చాలా ఎక్కువ. అన్ని సమాధానాలు పూర్తయ్యేవరకు మాతోనే కూర్చుంటారు. ఆమె అసలు విసుక్కోరు. రాసేముందుగా సమాధానాన్ని నాకు ఒకసారి చదివి వినిపిస్తారు’’ అని భూమిక వివరించారు.

ఫొటో సోర్స్, Pushpa
వారు తప్పు చెప్పినా అలాగే రాయాలి
పుష్ప దగ్గరకు సాయం కోసం వచ్చేవారిలో చాలా మంది యూనివర్సిటీలో ప్రవేశం కోసం బాగా కష్టపడుతుంటారు. వారిని చూస్తే జాలి వేసినప్పటికీ, నిజాయతీతోనే తాను ముందుకు వెళ్తానని ఆమె చెప్పారు.
‘‘వారు చెప్పింది రాయడం నా విధి’’ అని పుష్ప అన్నారు.
‘‘వారు తప్పు సమాధానం చెప్పినప్పుడు లేదా వాక్య నిర్మాణ దోషాలు చెప్పినప్పుడు నేను అలానే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేను జోక్యం చేసుకోకూడదు’’ అని ఆమె చెప్పారు.
‘‘కొన్నిసార్లు పిల్లలు ఇంగ్లిష్ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. వారి కోసం నేను వారి మాతృభాషలో వివరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అది మాత్రమే నేను చేయగలిగే సాయం’’ అని ఆమె అన్నారు.
అక్కడ ఒక విద్యార్థి కోసం ఒక పరీక్ష నిర్వాహకుడు ఉంటారు. కెమెరాలు కూడా ఏర్పాటుచేస్తారు. యూనివర్సిటీలో అదే సబ్జెక్టు చదువుకున్న వారిని పరీక్షల్లో సాయం చేయడానికి అనుమతించరు.
పేద కుటుంబం నుంచి వచ్చిన పుష్ప
పుష్ప పేద కుటుంబం నుంచి వచ్చారు. పనిచేస్తున్నప్పుడు ఆమె తండ్రికి ప్రమాదం జరిగింది. పుష్ప, ఆమె సోదరుడి కడుపు నింపేందుకు ఆమె తల్లి చాలా కష్టపడ్డారు.
‘‘ఒకానొక సమయంలో ఫీజులు కట్టలేక బడి మానేయాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని పుష్ప గుర్తుచేసుకున్నారు.
ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఫీజు కట్టడంలో సాయం చేశారు. అందుకే తాను కూడా ఈ రూపంలో సేవ చేసి ఆ కృతజ్ఞతను తీర్చుకుంటున్నానని ఆమె చెప్పారు.
స్కూల్ చదువు పూర్తయిన తర్వాత, పుష్ప, ఆమె సోదరుడు కొరియర్ కంపెనీల్లో ఉద్యోగానికి చేరారు. దూర విద్య ద్వారానే పుష్ప డిగ్రీ పూర్తిచేశారు. కంప్యూటర్ సైన్స్‌లో ఆమెకు డిప్లొమా కూడా ఉంది.
ఇటీవల కాలంలో ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 2018లో తండ్రి చనిపోయారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పుడే సోదరుడిని కూడా ఆమె కోల్పోయారు.
సంవత్సరం తర్వాత పుష్ప ఉద్యోగం కూడా కోల్పోయారు. ఆ తర్వాత ఊహించని విధంగా తల్లి కూడా మరణించారు.
‘‘మే 2021లో అమ్మ చనిపోయారు. కొన్ని నెలల తర్వాత, అంటే ఆగస్టులో నేను 32 పరీక్షలు రాశాను. ఒక్కోసారి రోజుకు రెండు పరీక్షలు కూడా రాసేదాన్ని’’ అని ఆమె తెలిపారు.
తన కష్టాలు మరిచిపోవడానికి ఈ పరీక్షల్లో చేసిన సాయం చికిత్సలా పనిచేస్తుందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Pushpa
కన్నడ, తెలుగు సహా ఐదు భాషల విద్యార్థులకు సాయం
వికలాంగులకు ఇలా పరీక్షలు రాయడంతో పుష్పకు గుర్తింపు కూడా వచ్చింది. మహిళలకు సాధికారత కల్పిస్తున్నందుకు నేషనల్ అవార్డును ఆమె అందుకున్నారు.
‘‘2018 మార్చి 8న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆ అవార్డును నేను తీసుకున్నాను’’అని ఆమె చెప్పారు.
ఇతర అవార్డు విజేతలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా ఆమె కలిశారు.
ప్రస్తుతం ఒక స్టార్టప్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నారు. కార్పొరేట్ ఈవెంట్లలో మోటివేషన్ స్పీచ్‌లు కూడా ఇస్తుంటారు.
ఇప్పటికీ ఆమె పరీక్షలు రాయలేని వారికి సాయం చేస్తూనే ఉన్నారు. తమిళం, కన్నడ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ.. ఇలా ఐదు భాషల విద్యార్థులకు ఆమె సాయం చేస్తున్నారు.
‘‘నా సమయం, శక్తిని వారి కోసం కేటాయిస్తుంటాను. నేను ఒకరి కోసం పరీక్ష రాస్తున్నానంటే, వారి జీవితం మారుతుంది’’ అని ఆమె అంటారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















