ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పరాగ్ పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐపీఎల్ 2023లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై టోర్నీ ప్రారంభానికి ముందే బాగా చర్చ జరిగింది.
క్రికెట్‌లో ఒక వైపు 11 మంది ఆటగాళ్లే ఆడాలి. కానీ బీసీసీఐ తీసుకొచ్చిన 'ఇంపాక్ట్ ప్లేయర్' వెసులుబాటు క్రికెట్‌ను కొత్తగా చూపిస్తోంది. ఇప్పుడు ఆయా జట్లు 12 మంది ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకుని వ్యూహరచన చేస్తున్నాయి.
మామూలుగా ఫాస్ట్ బౌలర్లకు గాయాల బెడద ఎక్కువ. చాలామంది ఫాస్ట్ బౌలర్లు బ్యాటింగ్‌లో ఎక్కువ రాణించలేరు.
కాబట్టి వారి బౌలింగ్ 4 ఓవర్ల కోటా పూర్తయ్యాక వారి స్థానంలో ఒక బ్యాట్స్‌మన్‌ను తీసుకునే వెసులుబాటు కల్పిస్తోందీ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ప్రకారం ఆటగాడు పూర్తిగా 40 ఓవర్లు ఆడాల్సిన అవసరం లేదు.
అంతర్జాతీయ క్రికెట్ కేలండర్‌లో ఒకదాని తర్వాత ఒకటి సిరీస్‌లు ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో ఆయా దేశాలు తమ ప్లేయర్స్‌కు పనిభారాన్ని తగ్గించాలని చూస్తున్నాయి.
ఐపీఎల్‌లో మాజీ ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన 40 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఆటగాళ్లకు వరంలా దొరికింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్ల సగటు వయసు 32 ఏళ్లు.
ఇంపాక్ట్ ప్లేయర్‌ని కలిగి ఉండటం కెప్టెన్‌కు ఎంతో సౌకర్యాన్ని ఇస్తుందని ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్‌తో కెప్టెన్ సమస్యలు పెరుగుతాయని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రిజర్వ్ ఆటగాళ్లకు చక్కటి అవకాశం
ఐపీఎల్‌లో పాల్గొనే ఒక్కో జట్టులో మొత్తంగా 20 మందికి పైగా ఆటగాళ్లు ఉంటారు. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎక్కువగా భారత జట్టుకు ఆడిన ఆటగాళ్లు, అంతర్జాతీయ ఆటగాళ్లు స్థానం దక్కించుకునేవారు.
యువ ఆటగాళ్లు ఎక్కువగా రిజర్వ్ ప్లేయర్‌లుగా ఉండాల్సి వచ్చేది. ఏదో ఒక మ్యాచ్‌లో మాత్రమే వారికి అవకాశం దక్కేది. చాలామంది ప్లేయర్స్‌కి టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాని సందర్భాలూ ఉన్నాయి.
ఇలా రిజర్వ్‌లో ఉన్నవాళ్లు ఆటగాళ్లకు ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడం, బ్యాట్-గ్లోవ్స్ వంటి వాటిని డెలివరీ చేయడం, గాయపడితే అతని స్థానంలో ఫీల్డింగ్ వంటివి చేస్తుండేవారు.
అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ బెంచ్‌పై కూర్చునే ఆటగాళ్లకు వరంలా మారింది.
రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ధృవ్ జురెల్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. రాజస్థాన్‌కు భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది.
వీరిలో ధృవ్‌కి అవకాశం రావడం కష్టమైంది. అయితే 'ఇంపాక్ట్' ఆప్షన్ ధ్రువ్‌ను ఆదుకొంది. ఏప్రిల్ 5న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధృవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా చేర్చారు.
రాజస్థాన్ జట్టు బౌలర్ యజువేంద్ర చాహల్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధృవ్‌ని తీసుకున్నారు.
ధ్రువ్ బ్యాటింగ్‌కు వచ్చేసరికి రాజస్థాన్ 30 బంతుల్లో 74 పరుగులు చేయాల్సి ఉంది.
లక్ష్యం కష్టమే. అనుభవజ్ఞుడైన షిమ్రోన్ హెట్మెయర్‌తో కలిసి ధృవ్ జురెల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.
15 బంతుల్లో 32 పరుగులు చేసి చివరి వరకు పోరాడాడు. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ 5 పరుగుల తేడాతో ఓడిపోయి ఉండొచ్చు.
కానీ ధృవ్ రూపంలో రాజస్థాన్‌కు మంచి బ్యాట్స్‌మెన్ లభించాడు.

ఫొటో సోర్స్, ANI
బ్యాటర్, బౌలర్.. ఎవరికి ఎక్కువ ప్రయోజనం?
ఇంపాక్ట్ ప్లేయర్ నియమం లేకుంటే, ధ్రువ్ ఇప్పట్లో తుది ఎలెవన్‌లోకి వచ్చి ఉండేవాడు కాదేమో.
ఆ ఇన్నింగ్స్ ఫలితం తర్వాతి మ్యాచ్‌లో కనిపించింది. రాజస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ధ్రువ్‌ను చేర్చుకుంది.
కాగా, 'ఇంపాక్ట్ ప్లేయర్' ఆటను మరింత బ్యాట్స్‌మన్-కేంద్రంగా మారుస్తుందనే అభిప్రాయం కూడా ఉంది.
టీ20 క్రికెట్‌లో అదనపు బ్యాట్స్‌మెన్ జట్టులోకి రావడం వారి బలాన్ని పెంచుతుంది.
బౌలర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్ కింద చేర్చితే, అతను కేవలం 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలడు. బ్యాటింగ్ చేయలేడు.
అతని ఒక్క ఓవర్లో ప్రత్యర్థి బ్సాటర్ విరుచుకుపడినా జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నేషనల్ స్పోర్ట్స్ ఎడిటర్ సందీప్ ద్వివేది మాట్లాడుతూ.. ‘‘టీ20 పొట్టి ఫార్మాట్. జట్టును ఎంపిక చేసే సమయంలో అత్యుత్తమ జట్టును ఎంపిక చేస్తారు.
తప్పుడు నిర్ణయం తీసుకుంటే, దాని నుంచి నేర్చుకుని ముందుకు నడవాలి. ఐదు రోజుల పాటు టెస్ట్ క్రికెట్ ఆడతారు. తొలి రోజు పరిస్థితి ఐదో రోజు మారవచ్చు.
ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నియమం మంచిదని నిరూపించవచ్చు. ఫుట్‌బాల్‌లో, ఆటగాళ్లను ప్రత్యామ్నాయంగా చేర్చారు, అయితే ఇది చాలా తెలివైన నిర్ణయం.
క్రికెట్‌లో ఇది అంత సులభం కాదు. బ్యాట్స్‌మన్ తన పనిని పూర్తి చేశాక, అతని స్థానంలో బౌలర్ వస్తాడు. అదేవిధంగా బౌలర్ తన పని పూర్తి చేశాక, అతని స్థానంలో బ్యాటర్ వస్తాడు.
ఈ నియమం సీనియర్ (వయస్సు ఎక్కువున్న) ఆటగాళ్లకు మంచిదని రుజువు చేస్తుంది. వారి ఆట పూర్తయిన తర్వాత వారి స్థానంలో మరొక ప్లేయర్‌కి అవకాశం లభిస్తుంది.
దీంతో పాటు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశం లేని యువ ఆటగాళ్లకు, ఇంపాక్ట్ ప్లేయర్ మంచి ఆరంభం.

ఫొటో సోర్స్, Getty Images
ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఎవరెలా వాడుకున్నారు?
చెన్నై- గుజరాత్ మ్యాచ్ పరిశీలిస్తే..
గుజరాత్‌తో జరిగిన మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన అంబటి రాయుడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బెంచ్‌లో ఉన్న తుషార్ దేశ్‌పాండే వచ్చాడు. అయితే ఇది సీఎస్‌కేకు పెద్దగా కలిసిరాలేదు.
తుషార్ భారీగా పరుగులిచ్చాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది.
ఇక గుజరాత్‌కు మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఓ కొత్త బ్యాటర్‌ను వెలుగులోకి తీసుకొచ్చి, సక్సెస్ అయింది.
అప్పటికే జట్టులో ఉన్న గుజరాత్ 'కీ' బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయపడటంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటర్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
సాయి సుదర్శన్‌ను రంగంలోకి దించింది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆ మ్యాచ్‌లో సుదర్శన్ 17 బంతుల్లోనే 22 పరుగులు సాధించాడు. ఈ పరుగులు గుజరాత్ జట్టు గెలుపునకు బాటలు వేశాయి.
పంజాబ్ - కోల్‌కతా మ్యాచ్
పంజాబ్ కింగ్స్ జట్టులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రిషి ధావన్‌ని తీసుకున్నారు.
బ్యాటింగ్‌లో భానుక రాజపక్స అర్ధసెంచరీతో తన పాత్రను పోషించాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రిషి ధావన్‌కు ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం లభించింది.
మరోవైపు అదే మ్యాచ్‌లో కోల్‌కతా ఇంపాక్ట్ ప్లేయర్‌గా వెంకటేశ్ అయ్యర్‌ను తీసుకుంది.
ఈ మ్యాచ్‌లో కోల్‌కత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. 26 పరుగులకే ఒక వికెట్ కూడా తీశాడు.
ఇక అతని స్థానంలో కోల్‌కతా వెంకటేష్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చింది. అతను మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచింది.
లక్నో-దిల్లీ
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌ను చాలా తెలివిగా ఉపయోగించుకుంది. లక్నో ఇన్నింగ్స్ 20వ ఓవర్ ఐదో బంతికి ఆయుష్ బదోనీ ఔటయ్యాడు.
ఇన్నింగ్స్ చివరి బంతి మిగిలింది. లక్నో మేనేజ్‌మెంట్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా కృష్ణప్ప గౌతమ్‌ను దించింది. ఆ బంతికి గౌతమ్ భారీ సిక్సర్ బాదాడు. నిజానికి కృష్ణప్ప గౌతమ్ ఏళ్లుగా ఐపీఎల్ లో భాగమైన అతనికి తుది జట్టులో స్థానం దక్కడం లేదు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో 12వ ఆటగాడిగా జట్టులోకి వస్తున్నాడు.
అదే మ్యాచ్‌లో దిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ తన 4 ఓవర్ల కోటాను ముగించాడు. 30 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు సాధించాడు.
దీంతో దూకుడుగా బ్యాటింగ్ చేసే అమన్ ఖాన్‌ను దిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా రంగంలోకి దించింది.
అతనికి ఏడో నంబర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే అమన్‌కు అవకాశం లభించే సమయానికి దిల్లీ గెలుపుపై ఆశలు వదులుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
చెన్నై-లక్నో మ్యాచ్
మొదటి మ్యాచ్ మాదిరే అంబటి రాయుడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తుషార్ దేశ్ పాండే వచ్చాడు. అయితే ఈ సారి రెండు వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక రాజస్థాన్, హైదరాబాద్ మ్యాచ్ లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బెంచ్ పై ఉన్న నవదీప్ సైనీ జట్టులోకి వచ్చాడు.
కోల్‌కతా -బెంగళూరు మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ కేకేఆర్‌కు వరంలా మారింది. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో జట్టులోకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన యువ స్పిన్నర్ సూయజ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాడు. తన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.
పంజాబ్-రాజస్థాన్ మ్యాచ్‌లో చాహల్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ధ్రువ్ జురేల్ మరోసారి మంచి ప్రదర్శన కనబరిచాడు. 15 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు.
ఇక గుజరాత్, కేకేఆర్ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 83 పరుగులు చేసి కోల్‌కతాకు గెలుపు నల్లేరు మీద నడక చేశాడు.

ఫొటో సోర్స్, FACEBOOK/CHENNAI SUPER KINGS
ఇంపాక్ట్ ప్లేయర్: బీసీసీఐ షరతులు ఏమిటి?
'ఇంపాక్ట్ ప్లేయర్' ఆప్షన్ ప్రకారం ఒక ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవడానికి జట్టును అనుమతిస్తారు.
ఇది గేమ్‌లో కొత్త వ్యూహాలకు అవకాశం కల్పిస్తుంది. మ్యాచ్‌ను రసవత్తరంగా మారుస్తుంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చే ఆటగాడు భారత ప్లేయర్ అయి ఉండాలని బీసీసీఐ నిబంధన పెట్టింది.
- జట్టు కెప్టెన్ మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్‌ను నామినేట్ చేస్తాడు.
- మైదానంలో ఉన్న అంపైర్‌కి గానీ, ఫోర్త్ అంపైర్‌కి గాని ఈ విషయం తెలియజేయాలి. అంపైర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎంట్రీని ఒక 'సిగ్నల్' ద్వారా తెలియజేస్తారు.
- జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందు ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు.
- ఓవర్ పూర్తయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. లేదా వికెట్ పడినప్పుడు, రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగినప్పుడు ప్లేయర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది.
- ఇన్సింగ్స్ అయిపోయాక కూడా ఆ ప్లేయర్‌ను ప్రకటించవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్ చేయవచ్చు. నాలుగు ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ కూడా చేయవచ్చు.
అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ ప్లేయింగ్-11 జాబితాతో పాటు ఐదుగురు సబ్‌స్టిట్యూట్ల పేర్లను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవాలంటే కచ్చితంగా ఆ మిగిలిన ఐదుగురిలోని భారత ఆటగాడినే తీసుకోవాలి.
ఇరు జట్లు ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌ను మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకొని తీరాల్సిందే అనే కచ్చితమైన నిబంధననేమీ లేదు.
'ఏ' అనే ఆటగాడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ వస్తే 'ఏ' ఇక ఆ మ్యాచ్‌లో పాల్గొనడానికి వీల్లేదు. ఫీల్డర్‌గా కూడా అతడిని తీసుకోకూడదు.
ఏ ఆటగాడైనా గాయపడినా ఆ ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. అయితే గాయపడిన ఆటగాడు మళ్లీ మ్యాచ్‌లో ఆడటానికి వీల్లేదు.
ఒకవేళ ప్లేయింగ్ ఎలెవన్‌లోని ఆటగాడు బ్యాటింగ్ చేసి ఔటైతే, అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే ఆటగాడు కూడా బ్యాటింగ్ చేయవచ్చు. అయితే ఒక ఇన్నింగ్స్‌లో పదకొండు మంది మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇంపాక్ట్ ప్లేయర్‌గా విదేశీ ఆటగాడిని తీసుకోవాలంటే..
అప్పటికే ప్లేయింగ్ ఎలెవన్‌లో నలుగుగు విదేశీ ఆటగాళ్లే ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా మరో విదేశీ ఆటగాడిని తీసుకోవాలనుకుంటే కుదరదు.
ఎందుకంటే టీం ప్లేయింగ్ ఎలెవన్‌లో కేవలం నలుగురు మాత్రమే విదేశీ ప్లేయర్ల నిబంధన ఉంది. అయితే బీసీసీఐ ఒక వెసులుబాటు ఇచ్చింది. దాని ప్రకారం- కెప్టెన్ మొదటగా 8 మంది భారత ఆటగాళ్లు, ముగ్గురు విదేశీ ప్లేయర్లతో మైదానంలోకి దిగాలి. అపుడు మ్యాచ్ మధ్యలో మిగతా ఐదుగురు సబ్‌స్టిట్యూట్లలో భాగమైన విదేశీ ఆటగాళ్లలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు.
అప్పటికే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్న మిగతా 8 మంది భారత ఆటగాళ్లలో ఒకరిని బెంచ్‌లో కూర్చోబెట్టొచ్చు.
ఇవి కూడా చదవండి
- 18మంది మహిళలపై 2 రోజులపాటు అత్యాచారం...30ఏళ్లకు పైగా సాగిన విచారణ
- ఆర్ఈఈ: చైనాలో ఈ ఖనిజం ఉత్పత్తి నిలిచిపోతే అనంతపురం, చిత్తూరు జిల్లాలే కీలకం అవుతాయా?
- 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- సికింద్రాబాద్- తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఏంటి, టికెట్ ధర ఎంత, ఎక్కడెక్కడ ఆగుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














