ఫుట్‌బాల్ వర్సెస్ క్రికెట్: బ్రాండ్ వాల్యూలో కోహ్లి ఎక్కువా? పుట్‌బాలర్ మెస్సీ ఎక్కువా? కారణాలేంటి?

మెస్సీ

ఫొటో సోర్స్, ARUN CHANDRA BOSE

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలో ఎక్కువ మంది క్రీడాభిమానులు ఇష్టపడే ఆటలు ఫుట్‌బాల్, క్రికెట్.

భారత్‌లో క్రికెట్ పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడినట్లే ఫుట్‌బాల్‌ ఆటను ఆరాధించే అభిమానులూ భారత్‌లో ఉన్నారు.

కోల్‌కతా వంటి ప్రాంతంలో క్రికెట్ తరహాలోనే ఫుట్‌బాల్‌ను కూడా విపరీతంగా ఆదరిస్తారు. గోవా, బెంగాల్, కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఫుట్‌బాల్‌ను బాగా ఇష్టపడతారు.

భారత్‌లో ఫుట్‌బాల్ ఆటను ఇష్టపడే విషయాన్ని పక్కనపెట్టి ఆ ఆటను ఆడే విషయానికి వస్తే హైదరాబాద్ ఫుట్‌బాల్ ప్లేయర్లకు ఘన చరిత్ర ఉంది.

అప్పట్లో భారత ఒలింపిక్స్ జట్టులో సగానికి పైగా హైదరాబాద్ ఆటగాళ్లే ఉండేవాళ్లంటే ఫుట్‌బాల్ క్రీడలో హైదరాబాద్ ప్రాభవం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1950, 60 దశకాల్లో ఫుట్‌బాల్ ప్రపంచ ఫేవరెట్స్‌లో ఒకటిగా భారత్ నిలవడంలో హైదరాబాద్ ఆటగాళ్ల పాత్ర చాలా ఉంది.

అయితే, ఆ తర్వాతి కాలంలో భారత్‌లో ఫుట్‌బాల్ వైభవం తగ్గి క్రికెట్ ఫీవర్ పెరిగిపోయింది. రాన్రాను అది తారాస్థాయికి చేరింది.

మొన్నటివరకు ఐసీసీ టి20 క్రికెట్ ప్రపంచకప్‌ను ఆస్వాదించిన చాలామంది క్రీడాభిమానులు ఇప్పుడు ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మాయలో పడ్డారు.

ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ ఆటకు, క్రికెట్ ఆటకు మధ్య ఉన్న సారూప్యాలు, ఆటగాళ్ల బ్రాండ్ విలువ, టోర్నమెంట్‌ల నిర్వహణ వ్యయం, మెగా టోర్నీల్లో విజేతల ప్రైజ్‌మనీ, ప్రేక్షకాదరణ, లీగ్‌ల క్రేజ్ తదితర అంశాల గురించి తెలుసుకుందాం...

ఫిపా అధ్యక్షుడు

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌పాంటినో

ప్రజాదరణ, వీక్షకులు

ప్రపంచమంతటా ఆడే ఆటగా ఫుట్‌బాల్‌కు గుర్తింపు ఉంది. ‘ఫిఫా’ పరిధిలో 211 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో కనీసం 80 దేశాలు కనీసం ఒక్కసారైనా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. 13 దేశాలు ఫైనల్ వరకు చేరుకున్నాయి. అయితే 8 దేశాలు మాత్రమే ఇప్పటివరకు వరల్డ్ కప్ టైటిల్‌ను అందుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన గేమ్ సాకర్. ఫిఫా ఆధ్వర్యంలో జరిగే మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది అభిమానులు ఉన్నారని 2018లో అంచనా వేశారు. దాదాపు ప్రతీ దేశం ఫుట్‌బాల్ ఆడుతుంది.

ఫుట్‌బాల్ తర్వాత అత్యంత వీక్షకులు ఉన్న ఆట క్రికెట్. ఈ ఆటకు దాదాపు 250 కోట్ల మంది అభిమాన గణం ఉన్నట్లు అంచనా. 2019లో జరిగిన వరల్డ్ కప్‌ను 260 కోట్ల మంది చూశారని నివేదికలు తెలిపాయి.

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహిస్తుంది. ఐసీసీలో 12 పూర్తి స్థాయి సభ్యదేశాలు, 94 అసోసియేటెడ్ సభ్యదేశాలుగా ఉన్నాయి.

ఇందులో 12 దేశాలు మాత్రమే టెస్టు ఫార్మాట్ ఆడుతుండగా, 20 దేశాలు వన్డే ఫార్మాట్‌లో పాల్గొంటాయి. టి20 ఫార్మాట్‌లో 85 దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.

డబ్బు

ఫొటో సోర్స్, Reuters

కాసుల పంట...

విశ్వవ్యాప్తంగా ఆదరణ ఉన్న ఫుట్‌బాల్‌లో డబ్బు ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. జాతీయ జట్ల తరఫున, ప్రైవేట్ లీగ్‌ల తరఫున ఆడే ఆటగాళ్లపై కనకవర్షం కురుస్తుంది. ఫుట్‌బాల్‌లో ప్రీమియర్ లీగ్, లాలిగా, చాంపియన్స్ లీగ్ వంటి ప్రఖ్యాత టోర్నీల్లో రాణించే ఆటగాళ్ల సంపాదన గురించి చెప్పక్కర్లేదు.

ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్-10 అథ్లెట్ల జాబితా-2022లో నలుగురు ఫుట్‌బాల్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. క్రికెటర్లకు ఇందులో చోటు దక్కలేదు. అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ ఏడాదికి రూ. 1061.78 కోట్లు (130 మిలియన్ డాలర్లు) ఆర్జనతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

12 నెలల కాలంలో 34 ఏళ్ల మెస్సీ అందుకున్న సంపద 130 మిలియన్ డాలర్లు. ఇందులో మైదానంలో ఆట (ఆన్ ఫీల్డ్) ద్వారా వచ్చిన ఫీజు 75 మిలియన్ డాలర్లు కాగా (రూ. 612 కోట్ల), ఆఫ్ ఫీల్డ్‌లో అంటే అడిడాస్, బడ్‌వైజర్, పెప్సీకో వంటి సంస్థలతో ఎండార్స్‌మెంట్‌లు, ఇతర పెట్టుబడుల ద్వారా 55 మిలియన్ డాలర్ల (రూ. 449 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించాడు.

పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రూ. 939 కోట్ల (115 మిలియన్ డాలర్లు) సంపాదనతో మూడో స్థానంలో, నెమార్ రూ. 775 కోట్లతో నాలుగో స్థానంలో, అమెరికా ప్లేయర్ టామ్ బ్రాండీ రూ. 685 కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు.

37.6 మిలియన్ డాలర్లను కటాఫ్‌గా పెట్టుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. ప్రపంచంలోని వివిధ క్రీడాంశాలకు చెందిన మొత్తం 50 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ టాప్-50లో క్రికెటర్లు ఎవరూ లేరు.

కోహ్లి

ఫొటో సోర్స్, Getty Images

బ్రాండ్ వాల్యూలో కోహ్లి టాప్

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు భారత్‌లో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. భారత సెలెబ్రిటీ బ్రాండ్ ర్యాంకింగ్స్‌లో వరుసగా ఐదో ఏడాది కోహ్లి నంబర్‌వన్ స్థానంలో నిలిచాడు.

డఫ్ అండ్ ఫెల్ఫ్- 2021 నివేదిక ప్రకారం ఈ జాబితాలో రూ 1,532 కోట్ల (185.7 మిలియన్ల డాలర్ల)తో కోహ్లి టాప్‌లో ఉన్నాడు. 2020లో కోహ్లి బ్రాండ్ విలువ రూ. 1,935 కోట్లు.

వన్డే, టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కోహ్లి బ్రాండింగ్స్ విలువ 2021 నాటికి 185.7 మిలియన్లకు పడిపోయింది. అయినప్పటికీ అగ్రస్థానంలోనే నిలిచాడు.

ఫోర్బ్స్ ప్రకారం విరాట్ కోహ్లి ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏడాదికి రూ. 165 కోట్లు (20 మిలియన్ డాలర్లు) సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ కోసం దాదాపు రూ. 8.9 కోట్లు అందుకుంటాడు.

ఆట ద్వారా కూడా కోహ్లి భారీ మొత్తాన్నే అందుకుంటున్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు ప్రకారం కోహ్లి ‘ ఎ ప్లస్’ కేటగిరీలో ఉన్నాడు. క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు ఆడే కోహ్లికి ఏడాదికి రూ. 7 కోట్లు వేతనంగా చెల్లిస్తారు. టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షల చొప్పున అందుతుంది.

అంతేకాకుండా క్రికెట్‌లో అత్యంత ధనిక లీగ్‌గా పరిగణించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడటం ద్వారా కూడా కోహ్లి ఖాతాలో భారీగా ఆదాయం చేరుతోంది.

2008 నుంచి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో కోహ్లి ఉన్నాడు. అప్పుడు కోహ్లికి రూ. 12 లక్షలు చెల్లించిన ఆర్సీబీ... 2022 సీజన్ కోసం రూ. 15 కోట్లు ఇచ్చింది. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించడం ద్వారానే కోహ్లి ఇప్పటివరకు రూ. 158 కోట్లు సంపాదించాడు.

ప్రైజ్‌మనీ

ఫొటో సోర్స్, Getty Images

వందల కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ

ఎడారి దేశం ఖతార్‌లో ఫిఫా ప్రపంచ కప్ జరుగుతోంది. ఫుట్ బాల్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఈ టోర్నీలో 32 జట్లు పోటీ పడుతున్నాయి.

యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న ఈ టోర్నీని అట్టహాసంగా నిర్వహించేందుకు ఖతార్ దాదాపు 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

ఈ మెగా టోర్నీ ప్రైజ్‌మనీ విషయానికొస్తే బరిలోకి దిగుతున్న 32 జట్లకు ప్రైజ్‌మనీ అందించనున్నారు.

మొత్తం రూ. 3,593 కోట్ల (440 మిలియన్ డాలర్లు) ప్రైజ్‌మనీతో ఈ ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నారు.

విజేతకు రూ. 42 మిలియన్ డాలర్లు (రూ. 344 కోట్లు), రన్నరప్‌కు రూ. 30 మిలియన్ డాలర్లు (రూ. 245 కోట్లు), మూడో స్థానంలో నిలిచిన వారికి 27 మిలియన్ డాలర్లు (రూ. 220 కోట్లు), నాలుగో స్థానానికి 25 మిలియన్ డాలర్లు (రూ. 204 కోట్లు), 5-8 స్థానాల వారికి 17 మిలియన్ డాలర్ల (రూ.138 కోట్లు) చొప్పున, 9-16 స్థానాల్లో నిలిచిన వారికి 13 మిలియన్ డాలర్ల (రూ. 106 కోట్లు) చొప్పున, 17-32 స్థానాల్లో నిలిచిన వారికి 9 మిలియన్ డాలర్ల (రూ. 74 కోట్లు) చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు.

2018లో రష్యాలో జరిగిన ప్రపంచకప్ ప్రైజ్‌మనీ రూ. 3,266 కోట్లు.

ఇటీవల ముగిసిన టి20 ప్రపంచకప్ కోసం ఐసీసీ రూ. 45 కోట్ల (5.6 మిలియన్ డాలర్లు) నిధిని ప్రైజ్‌మనీ కోసం కేటాయించింది.

విజేతలకు రూ. 13 కోట్లు, రన్నరప్‌కు రూ. 6.5 కోట్లు అందాయి. సెమీస్‌లో ఓడిన రెండు జట్లకు 3.2 కోట్ల చొప్పున అందజేశారు.

ఇక సూపర్-12 దశలో ఇంటిముఖం పట్టిన 8 జట్లకు రూ. 57 లక్షల చొప్పున, తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన 4 జట్లకు రూ. 32.66 లక్షల చొప్పున అందించింది. సూపర్ -12 దశలో మ్యాచ్ గెలిచిన ప్రతీ జట్టుకు 40 వేల డాలర్ల చొప్పున, తొలి రౌండ్‌లో విజయం సాధించిన జట్టుకు 40 వేల డాలర్ల చొప్పున ఇచ్చింది.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, Getty Images

ఆదాయం

ఉదాహరణకు మీరు ఏమీ ఖర్చుపెట్టకుండా ఒక ఉత్పత్తిని తయారు చేశారనుకోండి. దాని కొనుగోలు కోసం ప్రతీ ఒక్కరూ పోటీపడి ముందుకు వస్తుంటే మీరు ఎక్కువ మొత్తంలో సంపాదించడమే కాదు చాలా వేగంగా సంపాదిస్తారు కూడా.

క్లుప్తంగా చెప్పాలంటే ఫిఫా సంపాదిస్తున్నది ఇలాగే..

ఫిపా అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. 1904లో ఇది ఏర్పడింది. ఫిఫాకు లభించే ఆదాయంలో ఆట అభివృద్ధి కోసం ఎక్కువగా వినియోగిస్తుంటుంది.

అంతర్జాతీయంగా ఎంతో ప్రజాదరణ పొందిన వరల్డ్ కప్ టోర్నీలు, కాంటినెంటల్ చాంపియన్‌షిప్స్, ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్ వంటి టోర్నీల నిర్వహణ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతుంది.

2018లో రష్యా వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరిగింది. అప్పుడు ‘ఫిఫా’ పాలక మండలికి రూ. 37,567 కోట్ల (4.6 బిలియన్ డాలర్లు)కుపైగా ఆదాయం లభించింది.

ప్రపంచకప్ ముగిసిన తర్వాత వచ్చిన ఆదాయం నుంచి ఆతిథ్య దేశానికి చెందిన ఫుట్‌బాల్ నిర్వహణ కమిటీకి కొంత మొత్తం చెల్లిస్తుంది. ప్రైజ్‌మనీ, రవాణా, టోర్నీలో పాల్గొనే జట్లకు వసతి, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారుల ఖర్చులను భరించుకుంటుంది. ఆతిథ్య దేశంలో ఆట అభివృద్ధి కోసం, ఆటగాళ్లకు ఆర్థిక సహాకార కార్యక్రమం కింద కొంత డబ్బును కేటాయిస్తుంది.

ఫిఫా ప్రతీ వరల్డ్ కప్ నాలుగేళ్లను ఒక సైకిల్‌గా భావించి తన ఖాతాలను నిర్వహిస్తుంది. 2015-18 కాలానికి సంబంధించిన సైకిల్‌ను చూస్తే ఫిఫా ఓవరాల్‌గా రూ. 52,258 కోట్ల(6.4 బిలియన్ డాలర్లు)కు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. వరల్డ్ కప్ జరిగే ఏడాదిలో ఫిఫాకు భారీ ఆదాయం లభిస్తుంది. వరల్డ్ కప్ జరగని 2021 ఏడాదిలో ఫిఫాకు వచ్చిన ఆదాయం 766 మిలియన్ డాలర్లు (రూ. 6,254 కోట్లు).

పైన చెప్పినట్లు ఫిఫా ప్రధాన ఆదాయ వనరు వరల్డ్ కప్ టోర్నీలు. ఈ మెగా టోర్నీల టెలివిజన్ హక్కులు, మార్కెటింగ్ హక్కులు, లైసెన్స్ ఫీజులు, టికెట్ విక్రయాల రూపంలో ఫిఫాకు భారీ మొత్తంలో ఆదాయం లభిస్తుంది.

వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలే అక్కడి మౌలిక వసతుల ఏర్పాటు తదితర ఖర్చులన్నీ భరించుకుంటాయి. కాబట్టి ఫిఫాకు టోర్నీ నిర్వహణ విషయంలో పెద్దగా ఖర్చు ఉండదు.

ఆట అభివృద్ధి కోసం ఫుట్‌బాల్ నిర్వహణ కమిటీలకు ఫిఫా ఆర్థిక సహకారం అందిస్తుంది. అయితే, తనకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఫిఫా చేసే ఈ ఖర్చులు చాలా తక్కువే.

వీడియో క్యాప్షన్, 'నీళ్లు తాగండి' అన్న రొనాల్డో... 400 కోట్ల డాలర్లు నష్టపోయిన కోకాకోలా

టెలివిజన్ రైట్స్

2015-2018 మధ్య ‘ఫిఫా’కు వచ్చిన రూ. 52,258 కోట్ల ఆదాయంలో 49 శాతం (రూ. 25,557 కోట్లు) టెలివిజన్ హక్కుల ద్వారానే లభించింది.

ఫిఫా నిర్వహించే టోర్నీలను ప్రసారం చేయాలంటే టెలివిజన్ స్టేషన్లు, బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌స్టిట్యూషన్లు ఈ హక్కులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటికోసం బ్రాడ్‌కాస్టర్లు విపరీతంగా పోటీపడతారు.

2022 ఖతార్ ప్రపంచకప్ టెలివిజన్ హక్కుల కోసం ఈఎస్‌పీఎన్, ఫాక్స్ ఎన్‌కార్పొరేషన్ (ఎఫ్ఓఎక్స్‌ఏ) మధ్య బిడ్డింగ్ వార్ జరిగింది. అయితే ఈఎస్‌పీఎన్‌ను వెనక్కి నెట్టి ఫాక్స్ కంపెనీ ఈ హక్కులు దక్కించుకుంది. వీటికోసం ఫిఫాకు 400 మిలియన్ డాలర్లకు (రూ. 3,266 కోట్లు) పైగా ఫాక్స్ చెల్లించింది.

మార్కెటింగ్ రైట్స్

టెలివిజన్ హక్కుల తర్వాత ఫిఫాకు ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి మార్కెటింగ్ రైట్స్. ఈ హక్కుల ద్వారా 2018 వరల్డ్ కప్ సైకిల్‌లో ఫిఫా 1.66 బిలియన్ డాలర్ల (రూ. 13,066 కోట్లు) మొత్తాన్ని అందుకుంది. నాలుగు స్థాయిల్లో ఈ హక్కులను అందజేస్తుంది. ఫిఫా పార్ట్‌నర్స్, ఫిఫా వరల్డ్ కప్ స్పాన్సర్స్, రీజినల్ సపోర్టర్స్, నేషనల్ సపోర్టర్స్ పేరిట నాలుగు వరల్డ్ కప్ స్పాన్సర్‌షిప్ స్థాయిలను ఫిఫా రూపొందించింది.

లైసెన్స్ ఫీజులు

2015-2018 కాలంలో ఫిపాకు 600 మిలియన్ డాలర్లు (రూ. 4,899 కోట్లు) లైసెన్స్ ఫీజుల రూపంలో లభించాయి. గతం కంటే ఇది 114 శాతం ఎక్కువ. బ్రాండ్ లెసెన్స్ కాంట్రాక్టులు, రాయల్టీ పేమెంట్స్ ద్వారా ఫిఫాకు ఈ ఆదాయం అందుతుంది.

ఫుట్‌బాల్

ఫొటో సోర్స్, Getty Images

టికెట్ల ఆదాయం

ఫిఫాకు ఆదాయం తెచ్చిపెట్టే మరో అంశం టికెట్ల విక్రయాలు. ముఖ్యంగా టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 100 శాతం ఫిఫా అనుబంధ సంస్థలకే దక్కుతుంది. 2015-2018 సీజన్‌లో టికెట్ల విక్రయాల ద్వారా ఫిఫా 712 మిలియన్ డాలర్ల (రూ. 5,814 కోట్లు)ను ఆర్జించింది.

2021లో జరిగిన అరబ్ కప్ టోర్నీకి 6 లక్షల మంది అభిమానులు హాజరయ్యారు. వీటి ద్వారా 12 మిలియన్ డాలర్ల (రూ. 97 కోట్లు) ఆదాయం అందుకుంది.

రష్యాలో జరిగిన ప్రపంచకప్ కోసం కోటికి పైగా టిక్కెట్లను విక్రయించారు. ఖతార్ వరల్డ్ కప్ టోర్నీ టికెట్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఖతార్, యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, ఇంగ్లండ్, మెక్సికో, యూఏఈ, అర్జెంటీనా, ఫ్రాన్స్, బ్రెజిల్, జర్మనీ దేశాల ఫుట్‌బాల్ అభిమానులు టికెట్ల కోసం పోటీపడుతున్నారు.

ఖర్చులు

2015-2018 సీజన్‌లో ఫిపా రూ. 43,854 కోట్ల (5.37 బిలియన్ డాలర్లు)ను ఖర్చు చేసింది. వీటిలో ఈవెంట్ సంబంధిత ఖర్చులు రూ. 20, 908 కోట్లు (2.56 బిలియన్ డాలర్లు)... ఫుట్‌బాల్ అభివృద్ధి, ఎడ్యుకేషన్ ప్రాజెక్టుల కోసం రూ. 13, 639 కోట్లు (1.67 బిలియన్ డాలర్లు).. పాలన, నిర్వహణ కోసం రూ. 6,509 కోట్లు (797 మిలియన్ డాలర్లు)ను ఖర్చు పెట్టింది.

ఇవే కాకుండా లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోసం 124 మిలియన్ డాలర్లు, మార్కెటింగ్ అండ్ టీవీ బ్రాడ్‌కాస్టింగ్ కోసం 211 మిలియన్ డాలర్లు కేటాయించింది.

భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఐసీసీ గ్లోబల్ ఫండింగ్ మోడల్

ఐసీసీ తన సభ్యదేశాలకు నిధులను కేటాయిస్తుంది. క్రికెట్ ప్రధాన దేశాలకు కాకుండా ఇతర దేశాలకు అందే పెద్ద మొత్తం నిధులు ఐసీసీ నుంచే పంపిణీ అవుతాయి.

2015-2023 వ్యవధిలో దాదాపు రూ. 14,700 కోట్ల (1.8 బిలియన్ డాలర్లు)ను ఐసీసీ 100కు పైగా అనుంబంధ సమాఖ్యలను ఇవ్వనుంది.

ఐసీసీకి వచ్చే ఆదాయంలో ప్రధాన భాగం పురుషుల, మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ వంటి గ్లోబల్ టోర్నీల నిర్వహణ ద్వారా లభిస్తుంది.

 ఫుట్‌బాల్ తరహాలోనే క్రికెట్‌కు కూడా మీడియా రైట్స్, స్పాన్సర్ షిప్‌లు, టికెట్ విక్రయాల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది.

2015-2023 కాలవ్యవధికి గానూ స్టార్ స్పోర్ట్స్ సంస్థ రూ. 16,334 కోట్లకు టీవీ, డిజిటల్ హక్కుల(ఇండియా, మిడిల్ ఈస్ట్)ను దక్కించుకుంది.

ఇదే కాల వ్యవధిలో స్పాన్సర్‌షిప్ హక్కుల రూపంలో ఐసీసీ రూ. 5,716 కోట్లు (700 మిలియన్ డాలర్లు) అందుకోనుంది. 2015-2023 వరకు గ్లోబల్ పార్ట్‌నర్స్‌గా నిస్సాన్, ఒప్పో, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, బుకింగ్.కామ్, బైజూస్, ఎమిరేట్స్ సంస్థలు ఉంటాయి. అఫీషియల్ పార్ట్‌నర్స్‌గా బిరా91, కోకా కోలా, అప్‌స్టాక్స్, పోస్ట్‌పే, ఎఫ్‌టీఎక్స్, ఎన్‌ఐఎంయూ వ్యవహరిస్తాయి. రాయల్ స్టాగ్, జాకబ్స్ క్రీక్, డ్రీమ్ ఎలెవన్ కేటగిరీ పార్ట్‌నర్స్‌గా ఉన్నాయి.

ఎన్ శ్రీనివాసన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సౌరవ్ గంగూలీ, ఎన్. శ్రీనివాసన్, రాజీవ్ శుక్లా, జైషా (వరుసగా ఎడమ నుంచి కుడికి

నిధుల పంపణీలో భారత్‌కు నష్టం

గత కొన్నేళ్లలో ఐసీసీ నిధుల పంపిణీ నమూనా (ఫండింగ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్)లో చాలా మార్పులు వచ్చాయి.

ఎన్‌. శ్రీనివాసన్‌ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఐసీసీకి అత్యధిక ఆదాయం అందిస్తోన్న దేశాలకు దాని ఆదాయ పంపిణీలోనూ సింహభాగం వాటా దక్కాలని ‘బిగ్‌ త్రీ’ ఫార్ములా తీసుకొచ్చాడు శ్రీనివాసన్.

బిగ్‌ త్రీ విధానంలో ఐసీసీ ఆదాయంలో భారత్‌ భారీ వాటా దక్కించుకోగా.. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలు తమ వంతు సొమ్మును సొంతం చేసుకున్నాయి. ఈ విధానంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను అభివృద్ది చేయాలనే ఆలోచనకు అడ్డంకి ఏర్పడుతుందని, క్రికెట్‌కు మార్కెట్‌ లేని దేశాల్లో క్రీడాభివృద్ధి కష్టతరమని భావించింది ఐసీసీ. 

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ పీఠం ఎక్కగానే తానే స్వయంగా బిగ్‌ త్రీ సంస్కరణలను 2017లో రద్దు చేశాడు. ఐసీసీ సభ్య దేశాలకు దాని ఆదాయంలో సమాన హక్కు దక్కాలని కొత్త రాజ్యాంగం అమలుచేశాడు.

8 ఏళ్ల కాలవ్యవధికి ఐసీసీ ఆదాయ పంపిణీ నమూనాను రూపొందిస్తుంది. చివరగా 2016లో సిద్ధం చేసిన నమూనా 2023 వరకు అమల్లో ఉంటుంది.

ఈ కాల వ్యవధిలో తమ ఆదాయం రూ. 20,414 కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) నుంచి రూ. 22,047 కోట్లు (2.7 బిలియన్ డాలర్లు) మధ్య ఉండొచ్చని ఐసీసీ అంచనా వేసింది.

దీని ప్రకారం 2016-2023 కాలానికి గానూ బీసీసీఐకి రూ. 3,307 కోట్లు, ఇంగ్లాండ్‌కు రూ. 1,135 కోట్లు, ఇతర పూర్తి స్థాయి సభ్యదేశాలకు రూ. 1,045 కోట్ల చొప్పున, జింబాబ్వేకు రూ. 767 కోట్లు, అఫ్గానిస్తాన్‌తో కలిపి ఇతర అసోసియేట్ దేశాలన్నింటికీ కలిపి రూ. 1,959 కోట్లు ఇవ్వనుంది.

గతంలో బీసీసీఐకి ఐసీసీ నుంచి రూ. 4,654 కోట్లు వచ్చేవి. బిగ్ త్రీ ఫార్ములాను తీసివేయడంతో భారత్‌కు వెయ్యికిపైగా కోట్ల నష్టం వాటిల్లింది.

ఫుట్‌బాల్

సవాళ్లు

ఫుట్‌బాల్ ప్రపంచంలో ‘ఫిఫా’కు ఎంతో గొప్ప పేరున్నప్పటికీ అపవాదులూ లేకపోలేదు. వరల్డ్ కప్ బిడ్డింగ్ ప్రక్రియలో అవకతవకలు, నిర్వహణ లోపాలకు పాల్పడిందంటూ ఫిపాపై ఆరోపణలు వచ్చాయి. 2015లో తలెత్తిన ఇలాంటి వివాదంలో ఫిఫా అధ్యక్షుడితో పాటు ఇతర ఎగ్జిక్యూటివ్‌లను అవినీతి ఆరోపణల కింద అరెస్ట్ చేశారు.

110 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉన్న ఫిఫాకు ఇప్పటికి కేవలం 9 మంది మాత్రమే అధ్యక్షత వహించారు. ఇది సంస్థలోని పారదర్శకత, పాలన విధానంపై సందేహాలను రేకెత్తిస్తోంది.

ఏది ఏమైనప్పటికీ ఫిఫా తక్కువ నష్టపోయే వ్యూహాలను అనుసరిస్తూ ఎక్కువ లాభాలను ఆర్జిస్తోంది.

వీడియో క్యాప్షన్, ఫిఫా ప్రపంచ కప్ నిర్వహణకు గడువు దగ్గర పడుతుండగా వలస కూలీల భద్రతపై తలెత్తుతున్న సందేహాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)