మొఘల్ సైన్యం మీద విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ

ఫొటో సోర్స్, ANI
- రచయిత, అశోక్ కుమార్ పాండే
- హోదా, బీబీసీ కోసం
అసోం యోధుడు లచిత్ బార్పుకన్ 400వ జయంతి వేడుకలను నవంబర్ 24న నిర్వహిస్తున్నారు. 16వ శతాబ్దంలో మొఘల్ పాలకులకు అస్సాంలో లచిత్ అడ్డుకట్ట వేశారు. అస్సాంలో ఆయనను హీరోగా కొలుస్తుంటారు. 1930ల నుంచి ఆయన జయంతిని ‘‘లచిత్ డే’’గా అసోంలో నిర్వహిస్తున్నారు.
మరోవైపు 1999 నుంచి ఏటా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో ప్రతిభ కనబరిచిన వారికి ‘‘లచిత్ బార్పుకన్ స్వర్ణ పతకం’’ ప్రదానం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది.
అహోం చరిత్రకారుడు గోలప్ చంద్ర బరువా అనువదించిన ‘‘బురాంజీ’’లో లచిత్ బార్పుకన్ కథ సవివరంగా మనకు కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, ANI
అహోం సామ్రాజ్యం
‘‘అస్సాం ఇన్ అహోం ఏజ్’’ పుస్తకాన్ని 1970ల్లో చరిత్రకారుడు నిర్మల్ కుమార్ బాసు ప్రచురించారు. 13వ శతాబ్దంలోనే అస్సాంలో అహోం పాలకులు తమ సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేశారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అహోం యోధులు ‘‘తాయ్’’ వంశంలోని శాన్ వర్గానికి చెందినవారు. వీరు స్థానిక నాగాలను ఓడించి నేటి అస్సాం పరిధిలోని ప్రాంతాల్లో తమ రాజ్యం ఏర్పాటుచేశారు. వీరి ఆధిపత్యం 600 ఏళ్లపాటు కొనసాగింది.
అస్సాం పేరు కూడా అహోం పాలకుల పేరు మీదనే వచ్చిందని చెబుతారు. అహోం సామ్రాజ్య తొలి తరం పాలకులు బాంగ్పీ తాయ్, బౌద్ధం, స్థానిక మతాలను అనుసరించేవారు. అయితే, 18శ శతాబ్దంలో వీరు హిందూ మతానికి మారానని 2010లో కేంద్ర సమాచార ప్రసార శాఖ డాక్యుమెంటరీ ‘‘హిస్ మెజెస్టీ ద అహోమ్స్’’ డైరెక్టర్ తపన్ కుమార్ గోగోయి తెలిపారు.
అస్సాంలో 16వ శతాబ్దం నుంచే వైష్ణవం ప్రభావం పెరగడం మొదలైందని బాసు చెప్పారు. అయితే, అహోం పాలకులు ఇతర మతాల పట్ల కూడా చాలా సహనంతో ఉండేవారని వివరించారు.

ఫొటో సోర్స్, PENGUIN INDIA
17వ శతాబ్దం మొదట్లో అహోం పాలకుల హయాంలో అస్సాం చాలా స్వతంత్రంగా ఉండేది. ఈ రాజ్యం సరిహద్దులు పశ్చిమాన మనహా నది(మానస్)తో మొదలుపెట్టి తూర్పున సాదియా పర్వతాల వరకు.. అంటే దాదాపు 600 మైళ్ల పరిధిలో విస్తరించి ఉండేది.
టిబెట్‌కు వెళ్లే మార్గాలు ఈ సాదియా పర్వతాల గుండా వెళ్తాయి. మరోవైపు మనహా నది తూర్పు తీరం మొఘల్ రాజ్యంలో కలుస్తుంది.
అప్పట్లో అహోం రాజధాని గురగావ్‌గా ఉండేది. బార్పుకన్‌ల ప్రధాన కార్యాలయాలు మాత్రం గువాహటిలో ఉండేవి. అయితే, 1600ల్లో ఇక్కడ మొఘల్ రాజ్య ప్రభావం ఎక్కువైంది. 1639లో అహోం జనరల్ మోమయీ తామూలీ బరబరువా.. మొఘల్ జనరల్ అల్లా యార్ ఖాన్‌తో ఒక ఒప్పందం కుదరుర్చుకున్నారు. దీనిలో భాగంగానే గువాహటి సహా పశ్చిమ అస్సాంలోని కొన్ని ప్రాంతాలు మొఘల్ పాలకుల చేతుల్లోకి వెళ్లాయి.
అయితే, 1648లో అహోం రాజ్య పాలకుడిగా జయధ్వజ్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పుడే షాజహాన్‌కు కూడా అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. దీన్ని అవకాశంగా తీసుకొని మనహా నది పరిసరాల్లోని ప్రాంతాలతోపాటు ఢాకాకు సమీపంలోని మొఘల్ ఆధీనంలోని ప్రాంతాలను కూడా జయధ్వజ్ స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో కూచ్ బిహార్ స్వతంత్ర్య రాజ్యంగా ప్రకటించుకొంది.

ఫొటో సోర్స్, ASSAM GOVT
మీర్ జుమ్లా రాకతో
ఆ తర్వాత దిల్లీలో మొఘల్ చక్రవర్తిగా ఔరంజేబు బాధ్యతలు తీసుకున్నారు. దీంతో మళ్లీ తూర్పు భారతంపై పట్టు కోసం మీర్ జుమ్లాను ఆయన పంపించారు. 1662లో మీర్ జుమ్లా.. అస్సాం సరిహద్దులకు చేరుకున్నారు. ఆయనతో అహోం పాలకులు పోరాడారు. ఆ క్రమంలోనే మనహా నది నుంచి గువాహటి వరకు మధ్య ప్రాంతాలు మళ్లీ మొఘల్ పాలకుల చేతుల్లోకి వెళ్లాయి.
‘‘దిగువ అస్సాం పరిధిలోని ప్రాంతాలకు పాలకుడిగా కాయస్థను నియమించడంపై స్థానిక భూస్వాములు కోపంతో ఉండేవారు. వీరంతా మీర్‌తో చేతులు కలిపారు. దీంతో ఆయన విజయం నల్లేరు మీద నడకైంది’’అని చరిత్రకారుడు భూయాన్ చెప్పారు.
అయితే, మొఘల్ సైన్యం కాలయాబార్ వరకు చేరుకోవడంతో అహోం సైనికులు అప్రమత్తం అయ్యారు. కానీ, మీర్ జుమ్లా కమాండర్ ఖాన్ దావూద్‌జాయ్ 1622 ఫిబ్రవరి 26న సిమలూగఢ్ కోటను చేజిక్కించుకోగలిగారు. దీంతో మార్చి 17న రాజా జయధ్వజ్ పర్వతాల్లోకి పారిపోయారు. ఫలితంగా గురగావ్ కూడా మీర్ చేతుల్లోకి వెళ్లింది.
కానీ, అస్సాం ప్రజలు మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. వీరికి జయధ్వజ్ నేతృత్వం వహించేవారు. అయితే, ఇక్కడే ఉండటం మంచిదికాదని మీర్ జుమ్లా భావించారు. దీంతో 1633 జనవరిలో ఘిలాఝారీలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని తర్వాత పశ్చిమ అస్సాంలోని ప్రాంతాలను మొఘల్ పాలకులకు అహోం చక్రవర్తి అప్పగించారు. మూడు లక్షల రూపాయలతోపాటు 90 ఏనుగులను యుద్ధ పరిహారంగా చెల్లించాల్సి వచ్చింది.
మరోవైపు తన ఏకైక కుమార్తెతోపాటు మేనల్లుడును కూడా మొఘల్ పాలకులతో జయధ్వజ్ పంపించాల్సి వచ్చింది. ఫిబ్రవరి 1663లో 12,000 అస్సాం యుద్ధ ఖైదీలను తీసుకొని మీర్ జుమ్లా వెనక్కి వెళ్లిపోయారు. దిగువ అస్సాం ప్రాంతాల బాధ్యతను రషీద్ ఖాన్‌కు అప్పగించారు.

ఫొటో సోర్స్, Getty Images
లచిత్ అప్పుడే..
ఆ ఒప్పందంలో భాగంగా యుద్ధ భరణాన్ని జయధ్వజ్ చెల్లించారు. కానీ, మొఘల్ చక్రవర్తుల ఆధిపత్యం నుంచి ఎలాగైనా బయటకు రావాలని ఆయన భావించేవారు. దీనిలో భాగంగానే తన సైన్యాన్ని మరింత శక్తిమంతం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సరిహద్దుల్లోని రాజ్యాలను కూడా సాయం కోసం ఆయన అభ్యర్థించారు. కానీ, నవంబరు 1663లో రాజా జయధ్వజ్ సింగ్ మరణించారు. ఆ తర్వాత ఆయన సోదరుడు చక్రధ్వజ్ సింగ్ అధికారంలోకి వచ్చింది.
చక్రధ్వజ్ సింగ్ అధికారంలోకి వస్తూనే.. వెంటనే మొఘల్ సైన్యాన్ని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ, మంత్రులు, ఇతర పాలకుల సూచనల మేరకు దీని కోసం ప్రత్యేకంగా సన్నద్ధం కావాలని భావించారు. దీనిలో భాగంగానే యుద్ధం కోసం సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ చేయడం, సైన్యాన్ని పునర్‌వ్యవస్థీకరించడం, నావికా దళాన్ని బలోపేతం చేయడం లాంటి చర్యలు మొదలుపెట్టారు.
అప్పుడే అహోం సైన్యానికి నాయకుడిగా ఎవరిని నియమించాలనే ప్రశ్న ఎదురైంది. దాదాపు రెండు వారాల మంతనాల తర్వాత ఆ బాధ్యలను లచిత్ బార్పుకన్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. మాజీ జనరల్ మోమయీ తామూలీ బరబరువా చిన్న కుమారుడే లచిత్. జహంగీర్, షాజహాన్‌ల హయాంలో మొఘల్ సైన్యంతో బరబురువా వీరోచితంగా పోరాడారు.
లచిత్ సోదరి పాఖరీ గభారూ.. రాజా జయధ్వజ్ సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరి కుమార్తె రమానీ గభారూను ఔరంగజేబు మూడో కుమారుడు సుల్తాన్ ఆజమ్ పెళ్లి చేసుకున్నారు.
ఇతర సైన్యాధిపతుల పిల్లల తరహాలానే లచిత్ విద్యాభ్యాసం కొనసాగింది. ఆయన నెమ్మదిగా ఉన్నత హోదాలకు చేరుకున్నారు. ఘోడా బరూవా (ఆశ్విక దళ అధిపతి), దులియా బరూవా (వంతెనల నిర్మాణ విభాగం అధిపతి), సిమల్‌గురియా ఫుకన్ (పన్నుల వసూలు విభాగం అధిపతి), డోలాకాశారిన్ బరూవా (పోలీసు విభాగం అధిపతి) లాంటి పదవులను ఆయన చేపట్టారు.
ఈ పదవులను చేపట్టినప్పుడు విశేష నైపుణ్యాలు ప్రదర్శించడంతో ఆయనకు సైన్యాధిపతి బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ఈ పదవి కోసం పోటీ చాలా ఎక్కువగా ఉండేది. దీన్ని చేరుకోవడం అంత తేలిక కాదు. అయితే, తన తెలివి, నైపుణ్యాలు, ధైర్యసాహసాలతో చరిత్రపుటల్లో తన కంటూ లచిత్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
యుద్ధం మొదలు..
1667 ఆగస్టు 20న తమ భూభాగాన్ని మొఘల్ చక్రవర్తుల నుంచి విడిపించుకోవడానికి అహోం సైన్యం పోరాటం మొదలుపెట్టింది. సుదీర్ఘ యుద్ధం తర్వాత, ఇటాఖులీ కోట అహోంల చేతుల్లోకి వచ్చింది. ఆ తర్వాత, అంటే 1667 నవంబరు 2న గువాహటి కూడా తమ నియంత్రణలోకి వచ్చింది. మీర్ జుమ్లా ఖైదీలుగా తీసుకెళ్లిన అహోం సైనికులను కూడా వీరు విడిపించుకోగలిగారు. మరోవైపు మొఘల్ అధికారులను కూడా వారు అరెస్టు చేశారు.
తాజాగా తమ ఆధీనంలోకి తీసుకున్న ప్రాంతాలను చాలా దుర్బేధ్యంగా అహోం సైన్యం మార్చింది. ఎలాంటి దాడికైనా తట్టుకునేలా వీటిని సిద్ధం చేసింది. మరోవైపు ఔరంగజేబు ఈ ప్రాంతాలను మళ్లీ తమ ఆధీనంలోకి తీసుకోవాలని రాజా జైసింగ్ కుమారుడు రాజా రామ్ సింగ్‌ను అస్సాంకు పంపించారు.
‘‘రామ్ సింగ్ పర్యవేక్షణలో ఉన్నప్పుడే శివాజీ, గురు తేజ్ బహాదుర్ తప్పించుకున్నారు. దీంతో రామ్ సింగ్ విషయంలో మొఘల్ సైన్యం కొంత ఆగ్రహంతో ఉండేది. ఆయన్ను అస్సాం పంపించడానికి ఇదీ కూడా ఒక కారణం’’అని చరిత్రకారుడు భూయాన్ చెప్పారు.
‘‘ఆ ఘటనల తర్వాత రామ్ సింగ్ విషయంలో జైసింగ్‌లో ఆందోళన పెరిగింది. తన మొఘల్ దర్బారులో తన హోదాలను కూడా జైసింగ్ వదిలిపెట్టారు. మళ్లీ ఆయన మరణం తర్వాత ఈ హోదాలు రామ్ సింగ్‌కు దక్కాయి’’అని ఆయన వివరించారు.
మరోవైపు మీర్ జుమ్లా మరణం తర్వాత, మొఘల్ చక్రవర్తులకు అస్సాంకు పంపేందుకు రామ్ సింగ్ మినహా ప్రత్యామ్నాయం కనిపించలేదు. అస్సాం దండయాత్రకు అధిపతిగా 1668 జనవరి 6న ఆయన్ను నియమించారు. నావికా దళ బాధ్యతలు మాత్రం ఇస్మాయిల్ సిద్దిఖీకి అప్పగించారు.
రామ్ సింగ్ సైన్యంలో 21 రాజ్‌పుత్ విభాగాలు, 30వేల పదాతి దళ సైనికులు, 18 వేల మంది ఆశ్విక దళ సైనికులు, 15 వేల మంది బాణాలు విసిరేవారు ఉండేవారు. మరోవైపు ఢాకాలో మరో రెండు వేల మంది వీరికి కలిశారు. అయితే, అస్సాంలో చేతబడి చేస్తారనే అనుమానంతో ఐదుగురు ముస్లిం పీర్లను కూడా పట్నా నుంచి తీసుకొచ్చారు.
రాజా రామ్ సింగ్‌తో పోరాటం అంత తేలికకాదని అహోం సైన్యానికి తెలుసు. గెరిల్లా పోరాట విధానాలతో అప్పుడే శివాజీ కూడా విజయం సాధించడం మొదలుపెట్టారు. మరోవైపు చక్రధ్వజ్ సింగ్‌కు కూడా దీని గురించి తెలుసు. ఈ విధానాన్నే తాము కూడా అనుసరించాలని లచిత్ కూడా నిర్ణయించారు.
అహోం సైన్యం విజయం
1969 ఫిబ్రవరిలో రాజా రామ్ సింగ్ భారీ సైన్యంతో రాంగామాటీ సరిహద్దుకు చేరుకున్నారు. అయితే, ఆ సైన్యంతో నేరుగా తలపడేందుకు బదులుగా లచిత్ గెరిల్లా విధానాన్ని ఎంచుకున్నారు. తేజ్‌పుర్ సమీపంలో మొదటి రెండు యుద్ధాల్లో రామ్ సింగ్ సైన్యం విజయం సాధించింది. కానీ, నావికా యుద్ధంలో అహోం సైన్యం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది.
సువాల్‌కుచీ సమీపంలో ఇటు నేలా, అటు నీరు రెండింపైనా అహోం సైన్యం దూకుడుగా ముందుకు వెళ్లింది. లచిత్ సైన్యం అర్ధరాత్రి వేళ కోటల నుంచి బయటకు వచ్చి మెరుపు వేగంతో దాడులు చేసి మొఘల్ సైన్యానికి భారీ నష్టాన్ని మిగిల్చేది.
యుద్ధంలో ఇలాంటి విధానాలు సరైనవికాదని లచిత్‌కు రామ్ సింగ్‌కు ఒక లేఖ రాశారు. ఇది దొంగలు, బందిపోట్లు అనుసరించే విధానమని వ్యాఖ్యానించారు. అయితే, తాము రాత్రిపూట మాత్రమే యుద్ధం చేయగలమని, ఎందుకంటే తమ సైన్యంలో లక్ష దెయ్యాలు మాత్రమే ఉన్నాయని ఒక బ్రాహ్మణ దూతతో లచిత్ సమాధానం పంపించారు.
ఈ మాటలను రుజువు చేసేందుకు అహోం సైన్యాన్ని దెయ్యాల బట్టలు వేసి అర్ధరాత్రి పంపించేవారు. మొత్తానికి తాము దెయ్యాలతోనే పోరాడుతున్నామని రామ్ సింగ్ కూడా అంగీకరించాల్సి వచ్చింది.
అయితే, నేరుగా యుద్ధానికి రావాలని లచిత్‌కు రామ్ సింగ్ చాలాసార్లు సవాల్ విసిరారు. కానీ, లచిత్ తమ విధానాలను మార్చుకోలేదు.
సేసా సమీపంలో ఒకసారి మొఘల్ సైన్యంపై అహోం సైన్యం మెరుపుదాడి చేసింది. దీనికి రామ్ సింగ్ గట్టిగా ప్రతిస్పందించడంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది.
దీని తర్వాత రెండు వైపుల నుంచి శాంతి చర్చలు మొదలయ్యాయి. కొన్ని రోజులపాటు యుద్ధం వాయిదావేశారు. అదే సమయంలో చక్రధ్వజ్ సింగ్ మరణించారు. ఆయన సోదరుడు మాజూ గోహెన్ వచ్చారు. ఆయన పేరును ఉదయాదిత్యగా మార్చుకున్నారు. చక్రధ్వజ్ భార్యను ఆయన పెళ్లి చేసుకున్నారు.
అయితే, ఈ శాంతి చర్చలను పక్కన పెట్టేసి మళ్లీ యుద్ధం మొదలుపెట్టాలని ఉదయాదిత్య నిర్ణయించారు. ఆ తర్వాత ఈ యుద్ధం చాలా మలుపులు తిరిగింది. మొత్తంగా అలాబోయి సమీపంలోని సరాయ్‌ఘాట్ దగ్గర మొఘల్ సైన్యంపై అహోం సైన్యం విజయం సాధించింది. దీంతో 1671 మార్చిలో రాంగామాటీకి రామ్ సింగ్ తిరిగివచ్చేశారు.
ఈ యుద్ధంలో మొదట మొఘల్ సైన్యం విజయం సాధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, అనారోగ్యంతో ఉన్న లచిత్ బార్పుకన్ నేరుగా యుద్ధంలోకి వచ్చారు. ఆయనే నేరుగా పోరుడుతున్నారని అహోం సైనికుల్లో ధైర్యం పెరిగింది. దీంతో రామ్ సింగ్ వెనుదిరగాల్సిన పరిస్థితి వచ్చింది.
యుద్ధం తర్వాత లచిత్‌ను ‘‘మొత్తం సైన్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో నడిపించిన నాయకుడు’’గా రామ్ సింగ్ చెప్పారు. ‘‘ఈ యుద్ధంలో అహోం సైన్యం పైచేయి సాధించడానికి అహోం సైనికుల్లో అందరికీ పడవలు నడపడం రావడం, విలువిద్యా నైపుణ్యాలు, తుపాకులు-ఫిరంగులను ఉపయోగించడం లాంటి అన్ని నైపుణ్యాలు తెసుండటమే. ఇలా అన్ని నైపుణ్యాలు తెలిసిన సైనికులు దేశంలోని ఏ ప్రాంతంలోనూ నాకు కనిపించలేదు. ఈ యుద్ధంలో మేం చాలా కొత్త అంశాలు నేర్చుకున్నాం’’అని అప్పట్లోనే మొఘల్ పాలకులకు రామ్ సింగ్ చెప్పారు.
మొఘల్ సైన్యం అంత తేలిగ్గా వదిలిపెట్టనప్పటికీ, అహోం సైన్యం తీవ్రంగా ప్రయత్నించి 1681లో విజయం సాధించింది. ఆ తర్వాత అస్సాంను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి మొఘల్ పాలకులు ప్రయత్నించలేదు.
కానీ, 19వ శతాబ్దంలో బలహీనమైన అహోం రాజ్యం బ్రిటిష్ పాలకులకు తల వంచాల్సి వచ్చింది. 600 ఏళ్లపాటు స్వతంత్రంగా జీవించిన వీరు మళ్లీ బ్రిటిష్ వలస పాలనలోకి వచ్చారు.
ఇవి కూడా చదవండి:
- తమ దేశంలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు 15 లక్షల మందిని కెనడా ఎందుకు ఆహ్వానిస్తోంది
- డిజీహబ్: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా డీపీ ఎంతవరకు సేఫ్? సోషల్ మీడియాలో మీ ఫోటోల ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి
- ‘లావుగా ఉన్నావని గేలి చేశారు’ అంటూ కేరళ మంత్రి పోస్ట్, ‘బాడీ షేమింగ్’పై స్కూళ్ళలో పాఠాలు చేర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం
- ప్రపంచంలోనే బెస్ట్ క్లీనర్: 'ఇంట్లోని చెత్త నన్ను బర్గర్లా ఊరిస్తుంది'
- ఫేస్బుక్, ట్విటర్ల కథ ముగిసిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















